Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
బీటెక్‌లో 9 కొత్త సబ్జెక్టులు

* కృత్రిమ మేధ సహా కొత్తగా తొమ్మిదింటికి ఆమోదం
* ఒక సెమిస్టర్‌లో ఒక పేపర్‌గా ప్రవేశపెట్టేందుకు సిలబస్‌ తయారు
* మోడల్‌ పాఠ్య ప్రణాళికను విడుదల చేసిన ఏఐసీటీఈ

ఈనాడు, హైదరాబాద్‌: పరిశ్రమల అవసరాలకు తగ్గట్లు విద్యార్థులను తయారు చేసేందుకు బీటెక్‌ స్థాయిలోనే కొత్త కోర్సులతో పాటు డిమాండ్‌ ఉన్న సబ్జెక్టులపై శిక్షణ ఇవ్వాలని పలువురు కోరుతున్న నేపథ్యంలో అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) తొమ్మిది నూతన సబ్జెక్టులకు పచ్చజెండా ఊపింది. వాటికి ఆదర్శ పాఠ్య ప్రణాళికను కూడా ఖరారు చేసింది. సాఫ్ట్‌వేర్‌ రంగంలో దూసుకొస్తున్న కొత్త సాంకేతికతలకు పెద్దపీట వేస్తూ బీటెక్‌ కోర్సులను రూపొందించాలని ఐఐటీ హైదరాబాద్‌ పాలకమండలి ఛైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి ఛైర్మన్‌గా నియమించిన కమిటీ సిఫారసు చేసిన రెండు నెలల్లోపే మొత్తం 9 సబ్జెక్టుల్లో పాఠ్య ప్రణాళికలను ఏఐసీటీఈ ఖరారు చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8 లక్షల మంది బీటెక్‌ విద్యార్థులు ఏటా బయటకు వస్తున్నా ఐటీ రంగం కోరుకున్న నైపుణ్యాలు ఉండటం లేదని కమిటీ అభిప్రాయపడింది. బీటెక్‌ స్థాయిలోనే రోబోటిక్స్‌, కృత్రిమ మేధ, బిగ్‌ డేటా లాంటి వాటిపై ప్రధాన దృష్టి ఉండే కోర్సులను ప్రవేశపెట్టాలని ఆ కమిటీ డిసెంబరులో సిఫారసు చేసింది. ఏఐసీటీఈ వైస్‌ ఛైర్మన్‌ పూనియా సూచన మేరకు చండీగఢ్‌లోని జాతీయ సాంకేతిక ఉపాధ్యాయుల శిక్షణ, పరిశోధన సంస్థ (ఎన్‌ఐటీటీటీఆర్‌) ఈ సిలబస్‌ను రూపొందించింది. అందులో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆచార్యుడు సి.రామకృష్ణ సైతం కీలకంగా వ్యవహరించారు. ఒక్కో సబ్జెక్టును ఒక సెమిస్టర్‌లో ఒక పేపర్‌గా అందించేలా సిలబస్‌ను రూపొందించారు. వాటిని తప్పనిసరి సబ్జెక్టుగా లేదా ఐచ్ఛికం(ఎలెక్టివ్‌) సబ్జెక్టుగా ఎంచుకోవచ్చు. మొత్తం 45 గంటల పాటు పాఠాలు(థియరీ) బోధిస్తారు. వాటితో పాటు ప్రయోగాలు ఏం చేయాలో ఇచ్చారు. ఏ పుస్తకాలు చదువుకోవచ్చో సూచించారు.

కొత్త కోర్సులివీ
1. కృత్రిమ మేధ
2. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింక్స్‌
3. బ్లాక్‌ చైన్‌
4. రోబోటిక్స్‌
5. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌
6. డేటా సైన్సెస్‌
7. సైబర్‌ సెక్యూరిటీ
8. 3డీ ప్రింటింగ్‌ అండ్‌ డిజైన్‌
9. వర్చువల్‌ రియాలటీ

డిమాండ్‌ ఉన్నాయని ఎంపిక చేశాం
ఏఐసీటీఈ సూచనల మేరకు 9 రకాల సబ్జెక్టుల్లో సిలబస్‌ తయారు చేశాం. వాస్తవానికి మోహన్‌రెడ్డి కమిటీ ఏడు సబ్జెక్టులను సూచించింది. మరో రెండు కలిపి మొత్తం తొమ్మిదింటికి సిలబస్‌ తయారు చేశాం. వీటికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ ఉంది. ఈ రంగాల్లో భారత్‌ అగ్రస్థానంలో ఉండాలన్నది లక్ష్యం. ఇప్పుడు భారత్‌కు అవసరమైన నిపుణులు ఈ రంగాల్లో లేరు. అందుకే మనదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 9 రంగాల్లో నిపుణులైన మానవ వనరులను అందించేందుకు ఏఐసీటీఈ పూనుకుంది. ప్రస్తుతం ఒక సబ్జెక్టు(పేపర్‌)గా మాత్రమే సిలబస్‌ ఇచ్చాం. మరో ఏడాదిలో వీటిపై బీటెక్‌లో కొత్త కోర్సులు తీసుకొచ్చేందుకు సిలబస్‌ తయారు చేస్తున్నాం.

- ఆచార్య సి.రామకృష్ణ, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగం, ఎన్‌ఐటీటీఆర్‌


Back..

Posted on 24-02-2019