Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
సృజన ‘పది’లం సమగ్ర వికాసం

* ప్రతిభతో పదికి చేరేట్టు..!
* ఇక నుంచి 9వ తరగతికీ రాష్ట్రస్థాయి పరీక్షలు

ఉదయం నిద్రలేవడం.. పాఠశాలకు వెళ్లడం.. పాఠ్యాంశాలను చదివేయడం.. బట్టీపట్టి పరీక్షలు రాయడం.. ఇదీ ఇప్పటి వరకు ఉన్న మన ప్రాథమిక విద్యావ్యవస్థ విధానం. 60 ఏళ్లకు పైగా కొనసాగుతన్న ఈ విధానం విద్యార్థి సమగ్ర వికాసానికి బాటలు వేయడం లేదని విద్యారంగ నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. ప్రపంచస్థాయిలో మన విద్యార్థులు సత్తాచాటాలంటే సృజనకు పట్టం కట్టే నూతన విద్యా విధానం ఉండాలని వివిధ విద్యారంగ కమిషన్లు సూచించాయి. అయినా మన ప్రభుత్వాలు ఆయా సిఫార్సులను పక్కన పెట్టాయి. ఫలితంగా విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగే వివిధ పోటీ పరీక్షల్లో చతికల పడుతున్నారు. నైపుణ్యాలు కొరవడి ఉద్యోగాలు పొందలేకపోతున్నారు.. ఎట్టకేలకు కళ్లు తెరిచిన ప్రభుత్వం ఇలాంటి పద్ధతికి అడ్డుకట్ట వేసేలా ప్రస్తుతం నూతన విద్యావిధానానికి శ్రీకారం చుట్టింది.
గ్రామీణ పిడుగురాళ్ల, న్యూస్‌టుడే: విద్యార్థుల్లో బోధనా సామర్థ్యాల గుర్తింపు, ప్రతి అంశంపై పూర్తి పట్టు సాధించటానికి వీలుగా ఈ విద్యాసంవత్సరం నుంచి 6,7,8,9 తరగతులు చదివే విద్యార్థులకు అంతర్గత మూల్యాంకన మార్కులు (ఇంటర్నల్‌ మార్స్‌) కేటాయించాలని పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నూతన విధానాన్ని ఈ ఏడాది నుంచే 9వ తరగతి విద్యార్థులకు అమలు చేయాలని సూచిస్తూ తాజాగా జీవో నెం 17ను జారీ చేసింది. ఇది ఉపాధ్యాయుల్లో మరింత బాధ్యతను పెంచనుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది.
మారిన విద్యావిధానం
నూతన విద్యా విధానంలో భాగంగా తొమ్మిదో తరగతి విద్యార్థులకు నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానం అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థుల్లో సృజనాత్మకత వెతికి తీసేందుకు ఇది ఉపయోగపడుతుందని పలువురు ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. ఈ విధానంలో ఉపాధ్యాయులు బోధించే పాఠ్యాంశాలను విద్యార్థులు శ్రద్ధగావిని సొంతంగా నోట్స్‌ రాయాల్సి ఉంటుంది. విద్యార్థి ప్రతిభను మూల్యాకనం చేసే విధానం కూడా మారుతుంది. మార్కులే కొలమానం కాకుండా ఆటలు, ప్రయోగాలు, క్షేత్రపర్యటనలు, నాయకత్వ లక్షణాలు ఇలా విభిన్న మార్గాల్లో మూల్యాంకనం చేపట్టి విద్యార్థి ప్రతిభను అంచనా వేస్తారు.ఈ విధానం వల్ల ముఖ్యంగా విద్యార్థుల ఆలోచన విధానం మెరుగుపడుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. వచ్చే ఏడాది పదో తరగతిలో కూడా ఈ విద్యావిధానం అమల్లోకి రానుంది.
సబ్జెక్టుకు రెండు పరీక్షలు
పదో తరగతి మాదరిగా ప్రతి సబ్జెక్టుకీ రెండేసి పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఒక్కో పేపరుకు 40 మార్కుల చొప్పున కేటాయించడంతో మొత్తం 80 మార్కులకు థియరీలో వార్షిక పరీక్ష నిర్వహిస్తారు. నిర్మాణాత్మక మూల్యాంకనం కోసం 20 మార్కులు కేటాయించారు. హిందీ మినహాయించి మిగతా సబ్జెక్టులకు రెండేసి పేపర్లు ఉంటాయి. మొత్తం 11 పేపర్లు పరీక్ష రాసి 35 శాతం మార్కులు సాధిస్తేనే పదో తరగతికి అర్హత లభిస్తుంది.
పొరుగు పాఠశాలల్లో మూల్యాంకనం
సమాధాన పత్రాలను పొరుగు పాఠశాలల్లో మూల్యాంకనం చేయాల్సి ఉండటంతో పదో తరగతి మాదిరిగానే పరీక్షలకు సమాయత్తం చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుంది. సాధారణ చదువుల మాదరిగా వ్యవహరిస్తే భవిష్యత్తులో కొత్త ఇబ్బందులు తలెత్తే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అంతర్గత మూల్యాంకనంలో ఎన్ని మార్కులు సాధించినపన్పటికీ థియరీ పరీక్షలో 27 మార్కులు సాధిస్తే తప్ప సంబంధిత సబ్జెక్టులో ఉత్తీర్ణత చెందే అవకాశం లేకపోవడంతో ప్రతి సబ్జెక్టు ఉపాధ్యాయునిపై ప్రత్యేక బాధ్యత ఉంటుంది.జిల్లాలో 6,7,8, 9 తరగతుల్లో చదివే విద్యార్థులు 2.80లక్షల మంది ఉన్నారు. 9వ తరగతి సుమారు 55వేల మంది చదువుతున్నారు.
రాత పరీక్షకు ఇరవై మార్కులు
నెలవారీగా నిర్వహించే రాత పరీక్షకు 20 మార్కులు ఉంటాయి. విద్యాసంవత్సరంలో నాలుగు సార్లు నిర్వహించే నిర్మాణాత్మక మూల్యాంకనాల్లో భాగంగా అప్పటి వరకు పూర్తి చేసిన పాఠ్యాంశాలపై పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలను జులై, అగస్టు, డిసెంబర్‌, ఫిబ్రవరి నెలల్లో నిర్వహించి విద్యార్థుల ప్రతిభ, అంతర్గత మూల్యాంకన అంశాలను గుర్తించి నిర్మాణాత్మక మూల్యాంకన పరీక్షలకు 50 మార్కులు కేటాయించారు. నిర్మాణాత్మక మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.
పిల్లల భాగస్వామ్యానికి పది మార్కులు
తెలుగు, హిందీ ఆంగ్ల బాషలకు చెందిన పుస్తకాలను గ్రంథాలయాల్లో చదివి సమీక్షలు, నివేదిక తయారు చేయాల్సి ఉంటుంది. సైన్స్‌ అంశాలపై ప్రయోగాలు చేయడం, సాంఘీకశాస్త్రానికి సంబంధించి సమకాలీన అంశాలపై చర్చావేదికలు, సమీక్షలు, నివేదికలు ఇందులో ప్రధానాంశాలు. దీనికిగాను విద్యార్థి ప్రతిభను గుర్తించి పది మార్కులు కేటాయిస్తారు. కొత్త విధానంలో సబ్జెక్టులవారీగా ప్రాజెక్టు పనులను రూపొందించి ప్రత్యేక నివేదికలు తయారు చేయాలి. ఉపాధ్యాయుల సహకారంతో తెలుగు, ఆంగ్లం, హిందీ, సైన్సు, సాంఘిక, గణితం సబ్జెక్టుల పరంగా వివిధ ప్రాజెక్టుల రూపకల్పన, నివేదికలకు పది మార్కులు కేటాయించడం జరిగింది.రాష్ట్రస్థాయిలో పరీక్ష పత్రం
పాఠ్యపుస్తకాల్లో ఇచ్చిన సమాచార పట్టికలు నిపండం, ప్రశ్నలకు సొంతగా సమాధానాలు రాయడంతోపాటు సొంతంగా కథలు, కవితలు, గేయాలు ఇతర సృజనాత్మక అంశాలకు పది మార్కులు కేటాయించారు. ప్రస్తుతం వార్షిక పరీక్షల కోసం జిల్లా స్థాయిలో ప్రశ్నపత్రం తయారు చేస్తున్నారు. మారిన విధానంలో రాష్ట్రస్థాయిలో ప్రశ్నపత్రం తయారు చేసి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించే పరిస్థితి ఉంటుంది. దీంతో పదో తరగతి మాదరిగానే అన్ని పాఠ్యాంశాలపై అవగాహన పెంచుకోవడంతో పాటు నిరంతర అభ్యసనం, ఇతర కార్యకలాపాలపై శ్రద్ధ పెంచుకుంటే తప్ప మంచి గ్రేడింగ్‌ పాయింట్లు సాధించే అవకాశం ఉండదు.
వచ్చే ఏడాది నుంచి పదికి ఇదే
వచ్చే విద్యాసంవత్సరం నుంచి పదో తరగతి (ప్రస్తుతం 9 చదివే విద్యార్థులు వచ్చే ఏడాది 10కి వస్తారు)కి ఇదే విధానం అమలు చేస్తారు. సంగ్రహణాత్మక మూల్యాంకనం 80 మార్కులకు ఉండేలా పరీక్ష విధానం రూపొందించారు. ప్రతి సబ్జెక్టుక¹ు రెండు పేపర్లు ఉండగా 20 మార్కులు అంతర్గత మూల్యాంకనానికి కేటాయించారు. విద్యార్థులు పుస్తకాలకే పరిమితం కాకుండా సమగ్ర అంశాలతో తర్పీదు పొందాల్సి ఉంటుంది. ప్రశ్నలు, జవాబుల విధానంలో కాకుండా సృజనాత్మకత, సొంతంగా సమాధానాలు సిద్ధం చేసుకోవడంలాంటి అంశాలతో పాటు బట్టీ విధానంలో కాకుండా ప్రతిభకే ప్రాధాన్యత ఉంటుంది.
ఇంత వరకు ప్రశ్నలకు సమాధానాలు బట్టీ పట్టేవాళ్లం. పరీక్షలు రాసి మంచి మార్కులు వస్తే చాలనుకునేవాళ్లం. పాఠం మొత్తం చదివే అవకాశం ఉండేదికాదు. ఈ విధానంలో ఉపాధ్యాయులు పాఠ్యాంశాలను చెప్పినప్పుడు శ్రద్ధగా వినాలి. పరీక్షల్లో సొంతంగా ఆలోచించి సమాధానాలు రాయాలి.
                        - నరసింహారావు, 9వ తరగతి,విద్యార్థి
ఏకాగ్రతకు మార్గం
ఈ పద్ధతిలో విద్యార్థులు బట్టీ పట్టాల్సిన అవసరం ఉండదు. పాఠ్యాంశం మొత్తం చదివి అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. ఒకరకంగా అతనికి అతనే ఉపాధ్యాయుడిగా మారతాడు. శ్రద్ధగా వినడం వల్ల మాలో ఏకాగ్రత పెరుగుతుంది. విద్య మొత్తం ప్రాజెక్టు పద్ధతిలో ఉంది. కళాశాల చదువుకి వెళ్లినప్పుడు ఇది ఎంతోగాను ఉపయోగపడుతుంది.
                        - తేజస్విని, 9వ తరగతి, విద్యార్థిని
తరగతి గదులే చర్చావేదికలు
ఈ విధానంలో ప్రతి విద్యార్థి పాఠ్యాంశాన్ని తప్పకుండా పూర్తిగా వినాల్సి వస్తుంది. అప్పుడు అతనికి వచ్చే సందేహాలు తీర్చడానికి తరగతి గదులు చర్చావేదికలుగా మారతాయి. ఇవి విద్యార్థి సమగ్ర వికాసానికి దారితీస్తుంది. వారిలో మాట్లాడే నైపుణ్యం, రాసే నైపుణ్యం పెరుగుతాయి.
                        - కె.కోటేశ్వరరావు, సాంఘికశాస్త్రం ఉపాధ్యాయుడు
మోడరేషన్‌ కమిటీల ద్వారా ఇంటర్నల్‌ మార్కులు
ఇప్పటికే జిల్లాలో రెండు సమ్మిటివ్‌ పరీక్షలు, మూడు యూనిట్‌ పరీక్షలు జరిగాయి. ప్రస్తుతం ఎంఈఓ లేదా ప్రధానోపాధ్యాయుడు, ఇద్దరు ఉపాధ్యాయులతో మోడరేషన్‌ కమిటీలను ఏర్పాటు చేశాం. ఈ కమిటీల ద్వారా ఇప్పటికే నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ప్రొగ్రెస్‌ రికార్డులు చేసి ఇంటర్నల్‌ మార్కులను కేటాయించాల్సి ఉంది. వచ్చే ఏడాది పదోతరగతిలో కూడా ఈ విధానం అమలు కానుంది

Posted on 04-01-.2016