Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
వాయుసేనలో.. అందుకోండి అవకాశం

* ఆగస్టు 8 నుంచి ఉద్యోగ నియామక ర్యాలీ
* పది జిల్లాల యువతకు సంగారెడ్డి వేదిక

మెదక్‌: దేశ సేవకు సన్నద్ధమవ్వాలనుకునే యువతకు సువర్ణావకాశం.. గగనవీధిలో వాయుసేన అందించే సేవల్లో భాగమయ్యే భాగ్యం ఉద్యోగం రూపంలో అందనుంది. ఎయిర్‌మెన్‌ నియామక ర్యాలీని ఆగస్టు 8వ తేదీ నుంచి సంగారెడ్డిలో నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 10 జిల్లాల యువకుల ప్రతిభకు ఈ నియామక ర్యాలీ వేదిక కానుంది. సంగారెడ్డిలోని పోలీసు పరేడ్‌ మైదానం వేదికగా వాయిసేనలో కొలువుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఇప్పటికే వాయుసేన అధికారులతో పాటు జిల్లా కలెక్టరు రోనాల్డ్‌రోస్‌ పర్యవేక్షణలో అన్నిశాఖల అధికారులు ఇందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ఇంతమంది అని కాకుండా ఎంపికైన అందరికీ ఉద్యోగాలు కల్పించనున్నారు. ర్యాలీ నిర్వహిస్తున్న రెండు విభాగాలలో దేశవ్యాప్తంగా 5 వేలకుపైగా ఉద్యోగుల అవసరం ఉందని అంచనా.
* రెండు రకాల ఉద్యోగాలు.. అర్హతలు
వాయుసేనలో ఎయిర్‌మెన్‌ విభాగంలో రెండు పోస్టులకు గాను సంగారెడ్డిలో ర్యాలీ నిర్వహిస్తున్నారు. అందులో మొదటిది విద్యా శిక్షకుడు, రెండోది ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ సెక్యూరిటీ.
* విద్యా శిక్షకుడు(ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్ట్రక్టర్‌)
విద్యార్హత: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ, బీఈడీ పూర్తిచేసిన వారు అర్హులు. దీంతో పాటు రెండేళ్ల బోధన అనుభవం ఉండాలి. అదే విధంగా ఎంఏ(ఆంగ్లం), ఎమ్మెస్సీ(గణితం, భౌతికశాస్త్రం, కంప్యూటర్‌ సైన్స్‌)తో పాటు బీఈడీ పూర్తయినవారికి రెండేళ్ల పాటు విద్యాబోధనలో అనుభవం ఉండాలి. ఇలాంటి వారు ఈ ఉద్యోగానికి సిద్ధమవ్వొచ్చు.
* వయసు: డిగ్రీ, బీఈడీతో ఈ ఉద్యోగాన్ని ఆశించేవారి వయసు కచ్చితంగా 25 ఏళ్లకు మించకూడదు. తేదీ 01-08-1991 నుంచి 31-05-1996 మధ్య జన్మించినవాళ్లే అర్హులుగా పరిగణిస్తారు. అదే పీజీ, బీఈడీ వారైతే 01-08-1988 నుంచి 31-05-1996 మధ్య జన్మించి 28 ఏళ్ల వయసున్నవారే అర్హులు.
* శారీరక ప్రమాణాలు: 152.5 సెంటీ మీటర్ల ఎత్తుతో పాటు ఛాతీ విస్తరణ వూపిరి తీసుకున్నప్పుడు 5.సెం.మీ పెరగాలి. ఇక ఎత్తు, వయసుకు తగిన బరువుండాలి.
* రాత పరీక్ష...
విద్యాశిక్షకుడు కావాలనుకునే అభ్యర్థులకు తొలుత 30 నిమిషాల వ్యవధిలో ఆబ్జెక్టివ్‌ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. జనరల్‌ ఇంగ్లిష్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, కరంట్‌ అఫైర్స్‌లో ప్రశ్నలుంటాయి. తర్వాత 45 నిమిషాలు భాష అవగాహన(లాంగ్వేజ్‌ కంప్రెన్సన్‌), భావపు శక్తి(పవర్‌ ఆఫ్‌ ఎక్స్‌ప్రెసన్‌) కోసం వర్ణనాంశం(డిస్క్రిప్టివ్‌ టైపు) విధానంతో పరీక్ష నిర్వహిస్తారు. అలాగే ఐఏఎఫ్‌ ఉద్యోగం కోసం ఆబ్జెక్టివ్‌ విధానంలో 45 నిమిషాలు రాత పరీక్ష ఉంటుంది. ఇందులో సిలబస్‌గా జనరల్‌ ఇంగ్లిష్‌, రీజనింగ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ అంశాలకు ప్రాధాన్యమిస్తారు.
* దేహదారుఢ్య పరీక్షలిలా..
విద్యాశిక్షకుడి ఉద్యోగం నెగ్గాలనుకునేవారు 8 నిమిషాల వ్యవధిలోనే 1.6 కి.మీ పరుగు పూర్తి చేసుకోవాలి. దీంతో పాటు 10 పుషప్స్‌, 10 సిటప్స్‌, 20 స్క్వాట్స్‌లను అవలీలగా చేయాల్సి ఉంటుంది. అదే ఐఏఎఫ్‌పై ఆసక్తి ఉన్న అభ్యర్థులు మొదటి దశలో 2.4 కి.మీ పరుగుపందెం 15 నిమిషాల్లో పూర్తిచేయాలి. వీరు కూడా 10 పుషప్స్‌, 10 సిటప్స్‌, 20 స్క్వాట్స్‌లను సులభంగా పూర్తిచేయాలి. వీటిల్లో అర్హత సాధించినవారు చివరగా కచ్చితంగా 5 కి.మీ పరుగును 30 నిమిషాలలో పూర్తిచేస్తే ఉద్యోగానికి చేరువైనట్లే.
* ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ సెక్యూరిటీ (ఐఏఎఫ్‌)
విద్యార్హత: 50 శాతం మార్కులతో ఏదైనా ఇంటరు కోర్సులో ఉత్తీర్ణత ఉండాలి. దీంతోపాటు తప్పనిసరిగా ఆంగ్లం సబ్జెక్ట్‌లో 50 శాతంకుపైగా మార్కులు సాధించి ఉండాలి. ఇంటర్మీడియట్‌ వృత్తివిద్య(వొకేషనల్‌ ఎడ్యుకేషన్‌)లోనూ 50 శాతం మార్కులున్నవారు ఉద్యోగం కోసం బరిలో నిలవొచ్చు.
* వయసు: ఇంటర్మీడియట్‌ పూర్తయి ఉండి 21 ఏళ్లలోపు వయసున్నవారు ఈ కేటగిరీకి అర్హులు. 01-2-1996 నుంచి 31-05-1999 మధ్య పుట్టినవారు ఈ ఉద్యోగాన్ని ఆశించొచ్చు.
* శారీరక ప్రమాణాలు: ఈ విభాగంలోను కచ్చితంగా అభ్యర్థి 152.5 సెం.మీ ఎత్తు ఉండటంతో పాటు వూపిరి తీసుకున్నప్పుడు ఛాతీ విస్తరణ 5 సెం.మీ మేర పెరగాలి. ఇక ఎత్తు, వయసుకు తగిన బరువు ఉండాలి.
* ఈ ధ్రువపత్రాలు ఉండాలి
అభ్యర్థులు కచ్చితంగా తమ విద్యార్హతలకు సంబంధించిన అన్ని ఒరిజినల్‌ ధ్రువపత్రాలు వెంట తెచ్చుకోవాలి. పదో తరగతి నుంచి డిగ్రీ, పీజీ, బీఈడీ.. ఇలా ఏ విద్యార్హతలుంటే వాటికి సంబంధించిన మార్కుల జాబితా సహా ఉత్తీర్ణతను తెలియజెప్పే పత్రాలు మొత్తం నాలుగు సెట్ల నకళ్లు తీసుకురావాలి. దీంతో పాటు రెండేళ్ల బోధనకు సంబంధించి ప్రభుత్వ లేదా గుర్తింపు ఉన్న పాఠశాలలో పనిచేసినట్లు ధ్రువీకరణ పత్రాన్ని(ఒరిజినల్‌) ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే 7 పాస్‌పోర్టు సైజ్‌ కలరు ఫోటోలు(5 x 4), కుల, నివాస ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలి.
* తెచ్చుకోవాల్సినవి..
హెచ్‌.బి. పెన్సిల్‌తో పాటు రబ్బరు, షార్ప్‌నర్‌, గమ్‌టేప్‌, స్టాప్లర్లు దగ్గర ఉంచుకోవాలి. బ్లూ లేదా బ్లాక్‌ పెన్ను దగ్గర ఉంచుకోవాలి. వేలాదిమంది పరీక్ష రాసే అవకాశమున్నందున అంతమందికి సౌకర్యాల్ని కల్పించలేమన్న ఉద్దేశంతో ఈ తరహాలో అభ్యర్థులే సమకూర్చుకోవాలని ప్రకటించారు.
* పరీక్షల తేదీలు ఇవీ..
విద్యా శిక్షకుడు
* ఆగస్టు 8వ తేదీ: తెలంగాణలోని అన్ని జిల్లాల వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు. స్వీకృత పరీక్ష(ఆఫ్టిట్యూడ్‌ టెస్ట్‌), ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌ ఉంటుంది. పది జిల్లాల యువకులు రావొచ్చు.
* 9వ తేదీ: మొదటిరోజు పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి ఈరోజు ముఖాముఖిలు నిర్వహిస్తారు. రెండో రోజున కొత్తగా వచ్చేవారికి అవకాశమివ్వరు.
ఎయిర్‌ఫోర్స్‌ సెక్యూరిటీ (ఐఏఎఫ్‌)
* ఆగస్టు 10వ తేదీ: ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల వారికి రాతపరీక్ష నిర్వహిస్తారు. స్వీకృతి పరీక్షతో పాటు, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ పరీక్ష ఉంటుంది.
* 11వ తేదీ: మొదటి రోజు పరీక్షల్లో నెగ్గినవారికి 5 కి.మీ పరుగుతో పాటు ముఖాముఖిలు నిర్వహిస్తారు. రెండో రోజున కొత్తగా వచ్చే యువకులకు అవకాశం ఉండదు.
* 12వ తేదీ: హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాల వారికి రాతపరీక్ష నిర్వహిస్తారు. స్వీకృతి పరీక్ష(ఆఫ్టిట్యూడ్‌ టెస్ట్‌)తో పాటు, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌ జరిపిస్తారు.
* 13వ తేదీ: ముందురోజు పరీక్షల్లో నెగ్గినవారికి 5 కి.మీ పరుగుతో పాటు ముఖాముఖిలు ఉంటాయి.
* 14వ తేదీ: ఎంపికకు అవసరమైన పనుల కోసం ముందస్తుగా ఈ రోజును రిజర్వుడేగా కేటాయించారు.
* విజయోస్తు..
విద్యాశిక్షకుడి పోస్టుకు వచ్చే వారు శారీరక శ్రమతో పాటు మానసికంగా సన్నద్ధమవ్వాలి. రాత పరీక్షలో అర్హత పొందడంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలి. ఇందుకోసం సాధన చేయడం అవసరం. ఇప్పటికే పోలీసు నియామకాల కోసం శ్రమించిన వారు ఐఏఎఫ్‌ ఉద్యోగానికి ప్రయత్నించొచ్చు.
* అభ్యర్థులకు వసతి ఏర్పాట్లు
వివిధ జిల్లాల నుంచి వాయసేన ర్యాలీకి వచ్చే నిరుద్యోగ యువతకు అవసరమైన ఏర్పాట్లను మెదక్‌ జిల్లా అధికారులు చేస్తున్నారు. ఇప్పటికే కలెక్టరు ఆధ్వర్యంలో పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. ఆరు రోజుల పాటు వచ్చే అభ్యర్థులకు వసతి కల్పించేందుకు సంగారెడ్డి పట్టణంలోని పలు ఫంక్షన్‌హాళ్లని సిద్ధంగా ఉంచాలని నిర్ణయించారు. జిల్లాల వారీగా అభ్యర్థులు ఉండే ప్రాంతాల్ని ప్రయాణప్రాంగణాలు సహా పలుచోట్ల ఫ్లెక్సీల ఏర్పాటుతో తెలియజేయనున్నారు. అభ్యర్థులంతా నిర్ణీత సమయానికి హాజరవ్వాల్సి ఉంటుంది. ఉదయం 7 నుంచే ప్రక్రియ ప్రారంభమవనున్నట్లు చెబుతున్నారు.
* ఎక్కువమంది అర్హులవ్వాలి - దిలీప్‌కుమార్‌ చౌదరి, ఎయిర్‌మెన్‌ సెలక్షన్‌ సెంటర్‌ కమాండింగ్‌ అధికారి
తెలంగాణ వ్యాప్తంగా ఎక్కువ మంది ఈ ర్యాలీలో అర్హులవ్వాలి. అన్ని విభాగాల్లో అర్హత సాధించిన వారికి ఉద్యోగం వచ్చినట్లే. మంచి వేతనం ఉంటుంది. వాయుసేనలో చేరే వారికి ఉజ్వల భవిత ఉంటుంది. ప్రతిభ ఉన్నవారు తప్పకుండా ఎంపికవుతారు.
* సందేహాల నివృత్తికి..
నియామక ప్రక్రియకు సంబంధించిన వివరాల కోసం ఎయిర్‌ఫోర్స్‌ నియామక కేంద్రం ఆధ్వర్యంలో ఫోన్‌ నంబరు అందుబాటులో ఉంచారు. ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్యలో సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. నంబరు- 040-2775 8212.

Posted on 4-09-.2015