Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలివీ....

యువ‌త‌రానికెంతో ఇష్టమైన ఉద్యోగాల్లో ఎయిర్‌ఫోర్స్ ఒక‌టి. పైల‌ట్ కావాల‌ని ఎంద‌రో క‌ల‌లు కంటారు. కానీ శిక్షణ కోసం పాతిక ల‌క్షల రూపాయ‌లు ఫీజుగా చెల్లించాలి. దీంతో ఎక్కువ‌ మంది విష‌యంలో పైల‌ట్ క‌ల‌గానే మిగిలిపోతుంది. అయితే ఎయిర్‌ఫోర్సులో పైసా ఖ‌ర్చు లేకుండా పైల‌ట్ కావ‌డానికి ఎన్నో అవ‌కాశాలున్నాయి. ఇదొక్కటే కాదు ఇంట‌ర్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌, పీజీ కోర్సులు చ‌దివిన‌వాళ్లకోసం వాయుసేన‌లో వైట్ కాల‌ర్ ఉద్యోగాలెన్నో ఉన్నాయి. అవేంటో చూద్దాం...

ఇంట‌ర్ అర్హత‌తో...
ఉద్యోగం: ఎయిర్‌ఫోర్స్‌లో పైల‌ట్‌
ఇంట‌ర్ అర్హత‌తో పైసా ఖ‌ర్చు లేకుండా పైల‌ట్ అయ్యే అవ‌కాశాన్ని ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ యూపీఎస్సీ నిర్వహించే ఎన్‌డీఏ ప‌రీక్ష ద్వారా క‌ల్పిస్తోంది.
అర్హత‌: ఫిజిక్స్‌, మ్యాథ్స్‌తో ఇంట‌ర్ ఉత్తీర్ణత (ద్వితీయ సంవ‌త్సరం చ‌దువుతున్నవాళ్లూ ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు)
ఎంపిక విధానం: రాత ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ, మెడిక‌ల్ టెస్టుల ద్వారా
వ‌యోప‌రిమితి: 16 1/2-19 ఏళ్లు (పురుషులు మాత్రమే అర్హులు)
ప్రక‌ట‌న‌: ఏడాదికి రెండుసార్లు

గ్రూప్ ఎక్స్‌, వై పోస్టులు
గ్రూప్ ఎక్స్ పోస్టుల‌కు ఎంపికైన‌వాళ్లు టెక్నిక‌ల్ ట్రేడ్‌ల్లోనూ, గ్రూప్ వై పోస్టుల‌కు ఎంపికైన‌వాళ్లు మెడిక‌ల్ ట్రేడ్‌ల్లోనూ విధులు నిర్వర్తిస్తారు.

గ్రూప్ ఎక్స్ పోస్టులు: ఇంట‌ర్‌లో 50 శాతం మార్కుల‌తో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, ఇంగ్లిష్‌ల‌తో ఉత్తీర్ణులు అర్హులు లేదా మెకానిక‌ల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, ఎల‌క్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేష‌న్ టెక్నాల‌జీ, ఆటో మొబైల్‌, కంప్యూట‌ర్ సైన్స్‌, ఇన్‌స్ట్రుమెంటేష‌న్ టెక్నాల‌జీ బ్రాంచ్‌ల్లో ఎందులోనైనా 50 శాతం మార్కుల‌తో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

గ్రూప్ వై పోస్టులు: ఎంపీసీ లేదా బైపీసీ గ్రూప్‌తో క‌నీసం 50 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణత (ఇంగ్లిష్‌లోనూ 50 శాతం మార్కులు త‌ప్పనిస‌రి)
గ్రూప్ వైలో ఆటోమొబైల్ టెక్నీషియ‌న్‌, గ్రౌండ్ ట్రయినింగ్ ఇన్‌స్ట్రక్టర్‌, ఎయిర్‌ఫోర్స్ పోలీస్ పోస్టుల‌కు ఇంట‌ర్‌లో అన్ని గ్రూప్‌ల‌వాళ్లూ అర్హులే.

డిగ్రీ (బీఏ, బీకాం, బీఎస్సీ, బీటెక్‌) అర్హత‌తో...
డిగ్రీ అర్హత‌తో ఎయిర్‌ఫోర్స్‌లో ఫ్లైయింగ్ బ్రాంచ్‌, గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్‌, టెక్నిక‌ల్ బ్రాంచ్‌ల్లో యూపీఎస్సీ నిర్వహించే సీడీఎస్ఈ ప‌రీక్ష ద్వారా ఉద్యోగం పొందొచ్చు. ఇంట‌ర్ అర్హత‌తో ఎన్‌డీఏ ప‌రీక్ష ద్వారా పైల‌ట్ అవ‌కాశం కోల్పోయిన‌వాళ్లు డిగ్రీ అర్హత‌తోనూ ప్రయ‌త్నించ‌వ‌చ్చు. ఫ్లైయింగ్ బ్రాంచ్‌లో చేర‌డం ద్వారా పైల‌ట్‌గా శిక్షణ పొంద‌వ‌చ్చు. ఈ విభాగంలో ఎంపికైన‌వాళ్లు ఫైట‌ర్ పైల‌ట్‌, హెలికాప్టర్ పైల‌ట్‌, ట్రాన్స్‌పోర్ట్ పైల‌ట్ హోదాతో కెరీర్ ప్రారంభించ‌వ‌చ్చు.
ఎంపిక‌: యూపీఎస్సీ నిర్వహించే సీడీఎస్ఈ ప‌రీక్ష ద్వారా
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత‌. అయితే ఇంట‌ర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ త‌ప్పనిస‌రి
ప్రక‌ట‌న‌: ఏడాదికి రెండుసార్లు

ఎయిర్‌ఫోర్స్ కామ‌న్ అడ్మిష‌న్ టెస్ట్ (ఏఎఫ్‌ క్యాట్‌)
ఈ ప‌రీక్షతో ఎయిర్‌ఫోర్స్‌లోని ఫ్లయింగ్ బ్రాంచ్‌, టెక్నిక‌ల్ బ్రాంచ్, గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తారు. ఫ్లైయింగ్ బ్రాంచ్‌లో చేర‌డం ద్వారా పైల‌ట్‌గా శిక్షణ పొంద‌వ‌చ్చు
అర్హత‌: 60 శాతం మార్కుల‌తో మూడేళ్ల డిగ్రీ లేదా ఇంజినీరింగ్ ఉత్తీర్ణత‌.
ప్రక‌ట‌న‌: ఏడాదికి రెండుసార్లు వెలువ‌డుతుంది.

ఎయిర్ ఫోర్సులో గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్ ఉద్యోగాల‌కోసం ప్రత్యేకంగా ప్రక‌ట‌న వెలువ‌డుతుంది.
గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్‌: ఇందులో ముఖ్యంగా మూడు విభాగాలున్నాయి. అవి అడ్మినిస్ట్రేటివ్ బ్రాంచ్‌, అకౌంట్స్ బ్రాంచ్‌, లాజిస్టిక్స్ బ్రాంచ్‌. ఎయిర్‌ఫోర్స్ మెకానిజాన్ని గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్ స్టాఫ్ నిర్వహిస్తారు.
అడ్మినిస్ట్రేటివ్ బ్రాంచ్‌: ఈ బ్రాంచ్ ఉద్యోగాల‌ను ప‌ర్మనెంట్ క‌మిష‌న్‌, షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ రెండు విధానాల్లోనూ భ‌ర్తీ చేస్తారు. ప‌ర్మనెంట్ క‌మిష‌న్ ఉద్యోగాల‌కు పురుషులే అర్హులు. షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ పోస్టుల‌కు మ‌హిళ‌లు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఈ విధానంలో ఎంపికైన‌వాళ్లు ఎయిర్‌ ట్రాఫిక్ కంట్రోల‌ర్‌, ఫైట‌ర్ కంట్రోల‌ర్‌గా విధులు నిర్వహిస్తారు.
అర్హత‌: 60 శాతం మార్కుల‌తో ఏదైనా డిగ్రీ లేదా 50 శాతం మార్కుల‌తో పీజీ
ప్రక‌ట‌న‌: ఏటా వెలువ‌డుతుంది.

అకౌంట్స్ బ్రాంచ్‌: ఈ బ్రాంచ్‌లోని ఉద్యోగాల‌ను ప‌ర్మనెంట్ క‌మిష‌న్‌, షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ రెండు విధానాల్లోనూ భ‌ర్తీ చేస్తారు. ప‌ర్మనెంట్ క‌మిష‌న్ ఉద్యోగాల‌కు పురుషులు మాత్రమే అర్హులు. షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఉద్యోగాల‌కు మాత్రం మ‌హిళ‌లు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఈ విధానంలో ఎంపికైన‌వాళ్లు ఫైనాన్షియ‌ల్ మేనేజ్‌మెంట్‌, ఇంట‌ర్నల్ ఆడిటింగ్‌ విధులు నిర్వర్తిస్తారు.
అర్హత‌: 60 శాతం మార్కుల‌తో బీకాం ఉత్తీర్ణత లేదా 50 శాతం మార్కుల‌తో ఎంకాం, సీఏ, ఐసీడ‌బ్ల్యుఏ ఉత్తీర్ణత‌
ప్రక‌ట‌న‌: ఏటా వెలువ‌డుతుంది.

లాజిస్టిక్స్ బ్రాంచ్‌: ఈ బ్రాంచ్‌ ఉద్యోగాల‌ను ప‌ర్మనెంట్ క‌మిష‌న్‌, షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ రెండు విధానాల్లోనూ భ‌ర్తీ చేస్తారు. ప‌ర్మనెంట్ క‌మిష‌న్ ఉద్యోగాల‌కు పురుషులు మాత్రమే అర్హులు. షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఉద్యోగాల‌కు మాత్రం మ‌హిళ‌లు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఈ విధానంలో ఎంపికైన‌వాళ్లు మెటీరియ‌ల్ మేనేజ్‌మెంట్ బాధ్యత‌లు నిర్వర్తిస్తారు.
అర్హత‌: 60 శాతం మార్కుల‌తో డిగ్రీ లేదా 50 శాతం మార్కుల‌తో పీజీ ఉత్తీర్ణత‌
ప్రక‌ట‌న‌: ఏటా వెలువ‌డుతుంది.

ఇంజినీరింగ్ అర్హత‌తో...
టెక్నిక‌ల్ బ్రాంచ్‌: ఇందులో పోస్టుల‌ను యూనివ‌ర్సిటీ ఎంట్రీ స్కీం, ఏరోనాటిక‌ల్ ఇంజినీరింగ్ కోర్సుల ద్వారా భ‌ర్తీ చేస్తారు.

యూనివ‌ర్సిటీ ఎంట్రీ స్కీం: ప‌్రీ/ ఫైన‌ల్ బీటెక్ చ‌దువుతున్న విద్యార్థుల (పురుషులు మాత్రమే) ను యూనివ‌ర్సిటీ ఎంట్రీ స్కీం (యూఈఎస్‌) విధానంలో భ‌ర్తీ చేస్తారు. దీనికోసం ఎంపిక చేసిన క‌ళాశాల‌ల్లో క్యాంప‌స్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ చేప‌డ‌తారు. ఇంజినీరింగ్ పూర్తయ్యేనాటికి క‌నీసం 60 శాతం మార్కులు పొంద‌డం త‌ప్పనిస‌రి. బ్యాక్‌లాగ్స్ ఉండ‌రాదు.
ప్రక‌ట‌న‌: ఏడాదికి ఒక‌సారి డిసెంబ‌రులో వ‌స్తుంది.

ఏరోనాటిక‌ల్ ఇంజినీరింగ్ బ్రాంచ్‌: ఇందులో పోస్టుల‌ను ప‌ర్మనెంట్ క‌మిష‌న్ (పురుషులు), షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ (పురుషులు, స్త్రీలు) విధానంలో భ‌ర్తీ చేస్తారు. ఇంజినీరింగ్ ఆఖ‌రు సంవ‌త్సరం చ‌దువుతున్న లేదా పూర్తయిన వాళ్లు ఈ పోస్టుల‌కు అర్హులు.
అర్హత‌: నిర్దేశిత ఇంజినీరింగ్ బ్రాంచ్‌లో క‌నీసం 60 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణత సాధించాలి. బీటెక్ ఆఖ‌రు సంవ‌త్సరం కోర్సు చ‌దువుతున్న విద్యార్థులైతే అప్పటికి బ్యాక్‌లాగ్స్ ఉండ‌రాదు.
ప్రక‌ట‌న‌: ఏడాదికి రెండుసార్లు (జూన్‌, డిసెంబ‌రులో) వెలువ‌డుతుంది.

పీజీ అర్హత‌తో...
పీజీ చ‌దివిన‌వాళ్లకు ఎయిర్‌ఫోర్సులో ఎడ్యుకేష‌న్ బ్రాంచ్‌, మెటీరియాల‌జీ బ్రాంచ్‌లో అవ‌కాశాలుంటాయి. వీటిలో ప‌ర్మనెంట్‌, షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఉద్యోగాలుంటాయి. ప‌ర్మనెంట్ క‌మిష‌న్ ఉద్యోగాల‌కు పురుషులు మాత్రమే అర్హులు. షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఉద్యోగాల‌కు మ‌హిళ‌లు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

ఎడ్యుకేష‌న్ బ్రాంచ్‌: ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఇంట‌ర్నేష‌న‌ల్ రిలేష‌న్స్‌, ఇంట‌ర్నేష‌న‌ల్ స్టడీస్‌, డిఫెన్స్ స్టడీస్‌, సైకాల‌జీ, కంప్యూట‌ర్ సైన్స్‌, ఐటీ, మేనేజ్‌మెంట్‌, మాస్ క‌మ్యూనికేష‌న్, జ‌ర్నలిజం, ప‌బ్లిక్ రిలేష‌న్స్‌, కంప్యూట‌ర్ అప్లికేష‌న్స్ వీటిలో ఎందులోనైనా పీజీ కోర్సులు చ‌దివిన‌వాళ్లు ఎడ్యుకేష‌న్ బ్రాంచ్ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. పీజీలో 50 శాతం, డిగ్రీలో 60 శాతం మార్కులు సాధించ‌డం త‌ప్పనిస‌రి.
ప్రక‌ట‌న: ఏటా వెలువ‌డుతుంది.

మెటీరియాల‌జీ బ్రాంచ్‌: సైన్స్ కోర్సులు, మ్యాథ్స్‌, జాగ్రఫీ, స్టాటిస్టిక్స్, కంప్యూట‌ర్ అప్లికేష‌న్స్‌, ఎన్విరాన్‌మెంట‌ల్ సైన్స్‌, అప్లైడ్ ఫిజిక్స్‌, ఓష‌నోగ్రఫీ, అగ్రిక‌ల్చర‌ల్ మెటీరియాల‌జీ, ఎకాల‌జీ అండ్ ఎన్విరాన్‌మెంట్‌, జియో ఫిజిక్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ బ‌యాల‌జీ వీటిలో ఎందులోనైనా పీజీ చ‌దివిన‌వాళ్లు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. పీజీలో 50 శాతం మార్కులు త‌ప్పనిస‌రి. దీంతోపాటు డిగ్రీలో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ల్లో 55 శాతం మార్కులు సాధించి ఉండాలి.

ఎన్‌సీసీ స్పెష‌ల్ ఎంట్రీ:
ఎన్‌సీసీలో సి స‌ర్టిఫికెట్ ఉన్నవాళ్లకోసం ఎయిర్‌ఫోర్స్‌లో ఫ్లయింగ్ బ్రాంచ్ ఉద్యోగానికి ఎన్‌సీసీ స్పెష‌ల్ ఎంట్రీ ప‌రీక్ష ద్వారా అవ‌కాశం క‌ల్పిస్తున్నారు. పురుషులు మాత్రమే అర్హులు.
విద్యార్హత‌: 60 శాతం మార్కుల‌తో డిగ్రీ ఉత్తీర్ణత‌
వ‌యోప‌రిమితి: 20-24 ఏళ్లు
ప్రక‌ట‌న‌: ఏటా వెలువ‌డుతంది.

ఎయిర్‌ఫోర్సులో ఆఫీస‌ర్ పోస్టుల‌కు ఎంపికైన‌వాళ్లు ఏడాది శిక్షణ కాలంలో నెల‌కు రూ.21,000 స్టైపెండ్‌గా అందుకోవ‌చ్చు. ఆ త‌ర్వాత ఫ్లైయింగ్ బ్రాంచ్ ఉద్యోగులైతే నెల‌కు రూ. 80250, టెక్నిక‌ల్ బ్రాంచ్ వాళ్లైతే రూ.71550, గ్రౌండ్ డ్యూటీ ఉద్యోగులైతే రూ.68550 వేత‌న‌రూపంలో పొంద‌వ‌చ్చు. వీటితోపాటు ప‌లు సౌక‌ర్యాలు ఉంటాయి.

డిఫెన్స్‌లో ఉద్యోగాలు ఆశించేవాళ్లు కావాల్సిన శారీర‌క‌, ఆరోగ్య ప్రమాణాలు క‌లిగి ఉండ‌డం త‌ప్పనిస‌రి. వ‌య‌సుకు త‌గ్గ ఎత్తు, ఎత్తుకు ద‌గ్గ బ‌రువు, స్పష్టమైన కంటిచూపు, వినికిడి స‌మ‌స్య లేకుండా ఉండ‌డం లాంటివ‌న్నీ ఉండాలి. అడ్మినిస్ట్రేష‌న్ ఉద్యోగాల‌కు ఈ నిబంధ‌న‌ల్లో కొంత వ‌ర‌కు స‌డ‌లింపులు ఉంటాయి. ఆయా నోటిఫికేష‌న్ల వారీ కావాల్సిన ప్రమాణాలు మారుతుంటాయి.

వెబ్‌సైట్లు: http://careerairforce.nic.in, www.upsc.gov.in


Back..

Posted on 03-06-2016