Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
అదిగో.. బంగారు లోకం

* కొత్త విద్యార్థులకు ఏయూ ఆహ్వానం
* అందుబాటులో ఎన్నో సౌకర్యాలు
* సద్వినియోగం చేసుకొంటే ఉన్నతి

సిరిపురం, న్యూస్‌టుడే: ఎందరో విద్యార్థులను మేధావులుగా తీర్చిదిద్ది ప్రపంచానికి అందించిన చదువుల నిలయం ఆంధ్ర విశ్వవిద్యాలయం. తన 90 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో సాధించిన విజయాలెన్నో. ఎన్నో రికార్డులు, మరెన్నో అవార్డులు పొందిన ఈ సరస్వతి నిలయం తనలో నిక్షిప్తం చేసుకున్న విద్యా ఫలాలను నేటికీ విద్యార్థులకు అందిస్తూనే ఉంది. ఇలాంటి గుడిలో విద్యార్థులు తమను తాము తీర్చిదిద్దుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి.. వాటి ఉపయోగాలు గుర్తించి సద్వినియోగం చేసుకొంటే బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చు. ప్రస్తుతం నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది. కొత్త విద్యార్థులు కొంగొత్త ఆశలతో విశ్వవిద్యాలయంలోకి అడుగుపెడుతున్నారు..కోర్సు పూర్తయ్యే సరికి ఒక సంపూర్ణ విద్యార్థిగా బయటి ప్రపంచంలోకి అడుగు పెట్టాలంటే ఏమి చేయాలి.. వారికి విశ్వవిద్యాలయంలో ఎటువంటి అవకాశాలు ఉన్నాయి.. ఈ వివరాలు ఇలా..
ఆసక్తిని పెంచే వేదిక
ప్రభుత్వ కొలువులే ధ్యేయంగా చదివే విద్యార్థులకు ఏయూ మంచి వేదిక. ఇక్కడ వీఎస్ కృష్ణ సెంట్రల్ లైబ్రరీని అనుకొని ఉన్న రీడింగ్‌రూమ్‌కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఏయూలో చదివేందుకు వచ్చిన విద్యార్థుల్లో ఈ రీడింగ్ రూమ్ వాతావరణం కొత్త ఉత్సాహం నింపుతుంది. ఇక్కడ నిరంతరం పుస్తకాలతో కుస్తీలు పడుతున్న సీనియర్ విద్యార్థులను చూసి జూనియర్లు ఎంతగానో ప్రేరణ పొందుతారు. చదువంటే కేవలం డిగ్రీలు, పీజీలు పూర్తి చేసి సంబరపడటం కాదని, ఉద్యోగ వేటలో గెలుపు సాధించినప్పుడే ఆ చదువుకు సార్థకత చేకూరుతుందని రీడింగ్‌రూమ్ కొత్త విద్యార్థులకు చెబుతుంది.
మహాత్ముని అడుగుజాడల్లో..
అహింసామార్గంలో దేశానికి స్వాతంత్య్రం తెచ్చారు పూజ్య బాపూజీ. సాతంత్య్ర సమరంలో ఆయన జాతిని నడిపించతీరు నిరుపమానం. శాంతి.. అహింస.. సహనం వంటి విలువలను ప్రపంచానికి చాటిన ఆయన సందేశం నేటి యువతకు అవసరం. గాంధీ మార్గాన్ని విద్యార్థులు అలవరుచుకొనేందుకు ఏయూలో ఒక ప్రత్యేక విభాగం పని చేస్తోంది. ఏయూ గాంధీయన్ స్టడీస్ పేరుతో సేవలందిస్తున్న ఈ విభాగంలో గాంధేయ మార్గంపై ఆసక్తిగల విద్యార్థులు చేరవచ్చు.
యూజీసీ ప్రోత్సాహం ఇలా..
శాస్త్ర సాంకేతిక అభివృద్ధిని సాధించడంలో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పోటీ దృష్ట్యా దేశం నూతన ఆవిష్కరణల దిశగా అడుగులు వేస్తోంది. అందుకు అనుగుణంగా పరిశోధనల్లో నాణ్యత, పారదర్శకత పెంచేందుకు యువ పరిశోధకులను యూజీసీ ప్రోత్సహిస్తోంది. పలు ఫెలోషిప్‌ల ద్వారా ఆర్థిక తోడ్పాటు అందిస్తోంది.
ఇతర కోర్సులనూ అభ్యసించవచ్చు
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఒక పక్క పూర్తిస్థాయి విద్యార్థిగా కొనసాగుతూనే ఇతర కోర్సులు చేసేందుకు వీలుంది. వర్సిటీ అందిస్తున్న డిప్లమా కోర్సులను అభ్యసించవచ్చు. నృత్యం, సంగీతం, నటన రంగాలపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఇది చక్కని అవకాశం. ఏయూ ఆర్ట్స్ కళాశాల ఆధ్వర్యంలో నృత్య, సంగీత, యోగ, రంగస్థల విభాగాలు ఈ కోర్సులు అందిస్తున్నాయి. ఆయా విభాగాలు విడుదల చేసే నోటిఫికేషన్ల ఆధారంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు దూరవిద్యా కేంద్రం ద్వారా వర్సిటీ అందిస్తున్న పీజీ డిప్లమా కోర్సులు పూర్తి చేయవచ్చు. ఈ కేంద్రం సంవత్సరానికి రెండుసార్లు నోటిఫికేషన్లు విడుదల చేస్తుంది.
ఇది రీడింగ్‌రూమ్ ప్రత్యేకత
రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ గ్రంథాలయాలు అందుబాటులో ఉన్నాయి. అయితే 24 గంటల పాటు విద్యార్థులు చదువుకొనేందుకు వీలుగా ప్రత్యేకంగా రీడింగ్‌రూమ్ ఎక్కడా ఏర్పాటు చేసిన దాఖలాలులేవు. ఈ ఘనత కేవలం ఏయూకే దక్కుతుంది. ఇక్కడ రీడింగ్‌రూమ్‌తో పాటు ప్రధాన గ్రంథాలయంలో సైతం విద్యార్థులు రాత్రి 10 గంటల వరకు చదువుకొనేందుకు అవకాశం ఉంటుంది. ఏయూ విద్యార్థులతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అనేక మంది బయట కళాశాలల విద్యార్థులకు ఈ గ్రంథాలయం వేదికగా నిలుస్తోంది. ఇందులో సుమారు 200 మంది చదువు కొనేందుకు వీలుగా ఫర్నీచర్, విద్యుత్తు సౌకర్యం కల్పించారు.
విదేశీ విద్యార్థులతో పరిచయం
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు దేశాల విద్యార్థులు ఏయూలో ఉన్నత విద్యనభ్యసించేందుకు ఇష్టపడుతున్నారు. 2003లో 10మంది విద్యార్థులతో ప్రారంభమైన విదేశీ విద్యార్థుల ప్రస్థానం ప్రస్తుతం కొన్ని వందల మందికి చేరింది. ఇథియోపియా, ఇరాన్, ఆప్ఘనిస్థాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, దక్షిణ అమెరికా, నైజీరియా, శ్రీలంక తదితర దేశాలకు చెందిన విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్సిటీలోని స్థానిక విద్యార్థులకు వీరితో స్నేహం పెంపొందించుకొనేందుకు వీలుంది. తద్వారా ఇక్కడి విద్యార్థులకు అంతర్జాతీయ విశేషాలు తెలుసుకోవడంతోపాటు భాషా పరిజ్ఞానం పెంచుకొనేందుకు వీలుంటుంది.
అందిస్తున్న ఫెలోషిప్‌లు ఇవీ..
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పరిశోధక విద్యార్థుల కోసం పలు జాతీయ స్థాయి ఫెలోషిప్‌లు అందిస్తోంది. చాలా వరకు సంవత్సరం ఆరంభంలోనే నోటిఫికేషన్స్ వెలువడతాయి. ఫెలోషిప్ వివరాలు ఇలా..
* రాజీవ్ గాంధీ ఫెలోషిప్ (ఎస్సీ, ఎస్టీ)
* మౌలానా అబుల్‌కలామ్ అజాద్ ఫెలోషిప్
* ఇందిరాగాంధీ సింగిల్ గర్ల్ ఛైల్డ్ ఫెలోషిప్
* పోస్టు డాక్టోరియల్ ఫెలోషిప్ (మహిళలు)
* పోస్టు డాక్టోరియల్ ఫెలోషిప్ (ఎస్సీ, ఎస్టీ)
* యూజీసీ నెట్ ఉత్తీర్ణులైన వారికి జేఆర్ఎఫ్ ఫెలోషిప్
* ఇమెరైటర్స్ ఫెలోషిప్
సాంకేతిక పరిజ్ఞానం పెంచుకొనేందుకు..
విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచేందుకే వర్సిటీ పలు రకాల సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చింది. ప్రపంచీకరణ నేపథ్యంలో అంతర్జాల అవసరాన్ని గుర్తించిన వర్సిటీ 24 గంటలు అంతర్జాల సేవలను విద్యార్థులకు అందుబాటులో ఉంచింది. వర్సిటీలోని దాదాపు అన్ని చోట్ల వైఫై సౌకర్యం ఉంది. ఎగ్జామినేషన్స్, గ్రంథాలయం, విద్యార్థిని, విద్యార్థుల వసతిగృహాలతో పాటు వర్సిటీలోని ప్రధానమైన విభాగాల్లో ఈ వైఫై సౌకర్యం అందుబాటులో ఉంటుంది. దీన్ని వినియోగించుకొని విద్యార్థులు అంతర్జాలంపై అవగాహన పెంచుకోవడంతో పాటు సాంకేతిక నైపుణ్యాన్ని ఒడిసిపట్టుకోవచ్చు. కొత్తగా చేరే విద్యార్థులు వసతిగృహాల చీఫ్ వార్డెన్స్ నుంచి అనుమతులు పొంది కంప్యూటర్ సెంటర్ ద్వారా ఈ సౌకర్యాన్ని పొందవచ్చు.
గాంధీ అధ్యయన కేంద్రంలో ఇదీ ప్రత్యేకత
గాంధీ అధ్యయన కేంద్రాలు దేశవ్యాప్తంగా 24 ఉండగా అందులో ఏయూ కేంద్రం ఒకటి. విద్యార్థులకు గాంధీ వ్యక్తిత్వం, రచనలు, జీవన విధానంపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తూ ఈ కేంద్రం దేశంలో అగ్రగామిగా నిలుస్తోంది. మహాత్మునిపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు వేసవిలో ఈ కేంద్రం ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహిస్తోంది. విద్యార్థులకే కాకుండా, ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తోంది. దీంతోపాటు మూడు నెలల సర్టిఫికెట్ కోర్సులు అందిస్తోంది. గాంధీపై పరిశోధనలు చేసిన వారికి రూ.10వేల వరకు నగదు బహుమతి కూడా అందిస్తున్నారు. ఇక్కడ సుమారు 1300 వందల పుస్తకాలు విద్యార్థులకు అందుబాటులో ఉంచారు.
వికాసానికి.. యోగా గ్రామం
యువతకు ఉన్నత విద్యతో పాటు శారీరక, మానసిక వికాసం చాలా అవసరం. ఇందు కోసం ఆంధ్రవిశ్వవిద్యాలయం విద్యార్థులకు ప్రత్యేక సౌకర్యం కల్పించింది. యువత అవసరాలకు అనుగుణంగా 1985లోనే యోగా గ్రామాన్ని నిర్మించింది. ఇక్కడ డిగ్రీ విద్యార్హతతో ఒక సంవత్సరం పీజీ డిప్లమా కోర్సును, ఇంటర్ విద్యార్హతతో 6నెలల డిప్లమా కోర్సులను అందిస్తున్నారు. 10వ తరగతి విద్యార్హతతో 3నెలల యోగా కమ్యూనికేషన్ కోర్సును అందిస్తున్నారు. ఈ కోర్సులు పూర్తి చేసిన అనంతరం ధ్రవపత్రాలను అందజేస్తారు. జనవరి, జూన్ నెలల్లో విడుదలయ్యే నోటిఫికేషన్లను గమనించి దరఖాస్తు చేసుకోవచ్చు.
సామాజిక సేవకు వేదిక
విద్యతో పాటు యువతలో సమాజ సేవ, దేశ భక్తిని పెంచేందుకు ఏయూ ఎన్ఎస్ఎస్, ఎన్‌సీసీ విభాగాలు పని చేస్తున్నాయి. వర్సిటీ ఎన్‌సీసీ విభాగంలో ఇంజినీరింగ్ విద్యార్థులతో పాటు పలు ఇంటిగ్రేటెడ్ కోర్సుల విద్యార్థులు చేరేందుకు అవకాశం ఉంటుంది. ఈ ప్రవేశానికి సంబంధించి వర్సిటీలోని అన్ని విభాగాలకు ఉత్తర్వులు విడుదలవుతాయి. వీటి ఆధారంగా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఎంపికలు నిర్వహిస్తారు. ఏయూ ఎన్ఎస్ఎస్ విభాగానికి దేశంలోనే అత్యధిక యూనిట్లు ఉన్న విభాగంగా పేరుంది. సమాజ సేవపై ఆసక్తి ఉన్న విద్యార్థులు ఎన్ఎస్ఎస్‌లో చేరవచ్చు.
మీ కోసం.. వ్యాయామశాల
విశ్వవిద్యాలయంలో అధునాతన వ్యాయామశాల అందుబాటులో ఉంది. యువతకు విజ్ఞానంతో పాటు శరీర సౌష్టవం అవసరమని భావించిన వర్సిటీ ఉన్నతాధికారులు దశాబ్దాల కిందటే దీన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే వందలాది వర్సిటీ విద్యార్థులు, ఉద్యోగులు ఈ వ్యాయామశాలను వినియోగించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఇక్కడ అధునాతన సామగ్రిని అందుబాటులో ఉంచుతారు. విద్యార్థులు ఉచితంగా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. అయితే తొలుత తమ అలాట్‌మెంట్ కార్డు నకలును సిబ్బందికి అందజేయాల్సి ఉంటుంది. ఆదివారం మినహా అన్ని రోజుల్లో ఈ వ్యాయామశాల తెరిచే ఉంటుంది. మహిళల వసతిగృహం (మహారాణిపేట)లోను వ్యాయామశాలను అందుబాటులో ఉంచారు.

Posted on 22.06.2015