Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
శ్రమిస్తే సైన్యంలోకి...

* దేశ రక్షణే లక్ష్యం
* 18 నుంచి 27 వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

           
దేశ రక్షణలో సైన్యం పాత్ర కీలకమైంది. విదేశీ శక్తులు సంఘ విద్రోహ శక్తుల నుంచి పొంచి ఉన్న ప్రమాదాలను పసిగడుతూ రాబోయే ప్రమాదాన్ని నివారించి దేశానికి భద్రత కల్పించడమే సైనిక వ్యవస్థ లక్ష్యం. దేశానికి వెన్నెముక వంటి రక్షణ రంగంలో చేరండి.. యువకులారా కదలిరండి.. దేశానికి సేవ చేయండి అంటూ భారత పదాతి దళం (ఆర్మీ) స్వాగతం పలుకుతోంది.
ఒంగోలు: ఆగస్టు 18 నుంచి 27వ తేదీ వరకు తిరుపతి జిల్లా ఎస్వీ విశ్వవిద్యాలయం రోడ్డులోని తారకరామ క్రీడా మైదానంలో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల అభ్యర్థుల కోసం ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఆర్మీలో ఉద్యోగాలు, ఎంపిక విధానం ఎలా ఉంటుంది.. ఎలా సన్నద్ధం కావాలి.. ఏ విధంగా సాధన చేస్తే విజయం సొంతమవుతుంది.. ఉద్యోగాల విధులు తదితర అంశాలపై 'న్యూస్‌టుడే' కథనం.
* నేరుగా దరఖాస్తు
ఆర్మీలో చేరడానికి ముందుగా అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. నిర్ణీత తేదీల్లో అభ్యర్థులు నేరుగా తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయం రోడ్డులోని తారకరామ క్రీడా మైదానం చేరుకుంటే సరిపోతుంది.
* ఎంపిక ఇలా..
చెన్నైలోని జోనల్ ఆర్మీ, గుంటూరు రిక్రూట్‌మెంట్ కార్యాలయాల ఆధ్వర్యంలో అధికారులు ఎంపిక ప్రక్రియ చేపడతారు. శారీరక పరీక్షలు, విద్యార్హత ధ్రువీకరణ పత్రాల పరిశీలన అనంతరం అర్హులైన అభ్యర్థులకు వారి కేటగిరిల ప్రకారం రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో మార్కులు సాధిస్తే ఎంపికైనట్లు ప్రకటిస్తారు.
* ధ్రువపత్రాలు..
> అభ్యర్థుల విద్యార్హత ధ్రువపత్రాలు ఒరిజనల్ కాపీలు, మూడు సెట్ల జిరాక్స్ ప్రతులపై గెజిటెడ్ అధికారి ధ్రువపరిచినవి జతచేయాలి.
> నివాస ధ్రువపత్రం, అభ్యర్థి ప్రవర్తనా పత్రం, జనన ధ్రువీకరణపత్రం తహసీల్దార్ సంతకం, కార్యాలయం సీలుతో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎస్ఎస్ఐడీ బార్‌కోడ్ తప్పనిసరి.
* మాజీ సైనికుల పిల్లలకు
సైనికులు, మాజీ సైనికులు, యుద్ధ వితంతువుల పిల్లలు విద్యార్హత పత్రాలతోపాటు తప్పనిసరిగా బంధుత్వ పత్రాన్ని జిల్లా సైనిక సంక్షేమశాఖ అధికారి ధ్రువీకరణతో మూడు ప్రతులు వెంట తీసుకెళ్లాలి.
ఇతర వివరాలకు: జిల్లా సైనిక సంక్షేమ శాఖ కార్యాలయం, ప్రభుత్వ కార్యాలయ భవన సముదాయం, ఒంగోలు, ఫోన్ నంబరు: 08592-234687 సంప్రదించవచ్చు.
> గుంటూరు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ఏఆర్‌వో కార్యాలయం, ఫోన్ నంబరు 0863-2230008 సంప్రదించవచ్చు.
* సామ‌ర్థ్యం..
> ప‌రుగు పందెం: 1.6 కి.మీ. గ‌మ్యాన్ని 6.20 నిమిషాల్లో చేరుకోవాలి.
> పుల్అప్స్: కనీసం ఆరు బస్కీలు తీయాలి.
> లాంగ్ జంపింగ్: తొమ్మిది అడుగుల కందకం (గొయ్యి) దూకాలి.
> ఒక కడ్డీపై నిలబడి చేతులు చాచి బ్యాలెన్స్‌గా న‌డ‌వాలి. దేహ దారుఢ్య కొల‌త‌లు, శారీర‌క ప‌రీక్షల్లో అర్హత సాధిస్తే వైద్య‌పరీక్షలు, అందులోనూ ఉత్తీర్ణులైతే రాత ప‌రీక్షల్లో ప్రతిభ చూపాల్సి ఉంది.
* అవకాశం అందుకోండిలా..
> సైన్యంలో కొలువు సాధించాలంటే అభ్యర్థులు గమనించాల్సిన అనేక అంశాలున్నాయి. అభ్యర్థుల్లో అత్యధికులు పరుగుపై శ్రద్ధ పెట్టి మిగిలిన అంశాలైన బస్కీలు, హైజంప్, లాంగ్‌జంప్‌లను విస్మరించడం అవకాశాన్ని కోల్పోయే చేస్తోంది.
> బస్కీలు తీయడంలో 60 శాతం మంది వెనుకబడుతున్నారు. రోజుకు 25 చొప్పున కనీసం నెలరోజుల సాధన అవసరం.
> హైజంప్, లాంగ్‌జంప్ విషయంలో శ్రద్ధ పెట్టాలి. హైజంప్‌లో అత్యధికులు లక్ష్యాన్ని అందుకోవడం లేదు. సరైన ప్రదేశంలో సరైన సాధన చేయకపోవడం వల్ల భవిష్యత్తులో వెన్నెముక సమస్యలు తలెత్తుతాయి. ఇందుకు మెత్తని ఇసుక ప్రాంతాన్ని ఎంచుకోవాలి. నిపుణుల సూచనలు పాటిస్తే మరీ మంచిది.
* సాధనతోనే..
> ఈ పరీక్షలన్నింటికీ అభ్యర్థులు ఒకేరోజు హాజరు కావాల్సి ఉంటుంది. కాబట్టి కఠోర సాధన.. సంయమనం అలవరచుకోవాలి.
> తెల్లవారక ముందే అభ్యర్థులు వరుసలో నిలబడాల్సి ఉంటుంది. పరీక్షల్లో సమయం అధికమైనా ఆమేరకు సామర్థ్యం కలిగి ఉండాలి. అలాంటప్పుడు ఒత్తిడి, అసహనానికి లోను కాకూడదు. ఈ విషయాన్ని గుర్తించే ఆమేరకు సంసిద్ధులు కావాలి.
> అధికంగా మాట్లాడడం, జాప్యమైందని గొడవ చేసినా శక్తి జనకాలు కోల్పోయే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు అవసరమైన నీరు, ఆహార పదార్థాలు తీసుకెళ్లడం ఉత్తమం.
> తన శక్తి సామర్థ్యాలను అభ్యర్థులు ముందుగానే అంచనా వేసుకొని ఎంపికలో పాల్గొనడం ఉత్తమం.
* వేతనాలు
ఆర్మీలో ఎంపికైన అభ్యర్థికి నెలసరి వేతనంగా రూ.11వేలు చెల్లిస్తారు. ఇక కేటగిరిలను బట్టి వేతనాలు అధికంగానే ఉంటాయి. భోజనం, దుస్తులు, వైద్యం, రైల్వే ప్రయోజనాలతోపాటు తనపై ఆధారపడిన వారికి రూ.25 లక్షల బృంద బీమా వర్తిస్తుంది. వేతనంతోపాటు భత్యాలు చెల్లిస్తారు.
* ముందస్తు జాగ్రత్తలతో మేలు - డాక్టర్ బి.రవి, ముఖ్య కార్యనిర్వాహణ అధికారి, స్టెప్, జిల్లా యువజన సంక్షేమ శాఖ.
రాష్ట్రంలో అత్యధికంగా ప్రకాశం జిల్లా నుంచే యువకులు సైన్యంలో చేరుతున్నారు. జిల్లాలో మొత్తంగా 22 వేల మంది సైన్యంలో సేవలందిస్తున్నారు. దేశానికి సేవలందించే గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ర్యాలీకి హాజరయ్యే అభ్యర్థులు మాత్రం ముందుస్తు జాగ్రత్తలు ఉంటే విజయాలు సాధించవచ్చు.
* కొలువులు.. అర్హతలు
> సోల్జర్ టెక్నికల్, ఏవియేషన్: ఫిట్టర్, ఎలక్ట్రికల్, డ్రాఫ్ట్‌మెన్, వెల్డర్, ఇంజినీరింగ్ తదితర విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి.
విద్యార్హత: ఇంటర్ సైన్స్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మాథమెటిక్స్, ఇంగ్లిషు, మూడేళ్ల డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్, ఆటో మొబైల్, కంప్యూటర్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టులలో మంచి మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
ఎత్తు: 165 సెంటి మీటర్లు, బరువు : 50 కిలోలు
ఛాతి: 77 సెంటీ మీటర్లు(గాలి పీల్చినప్పుడు 5 సెంటిమీటర్ల వ్యాకోచించాలి).
వయస్సు: 17 సంవత్సరాల ఆరు నెలల నుంచి 23 సంవత్సరాలు
> సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్: వైద్య విభాగంలో సేవలందించాల్సి ఉంటుంది.
విద్యార్హత: ఇంటర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వంటి సబ్జెక్టులో 40 శాతం మార్కులతో మొత్తంగా 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ వారైతే బోటని, జువాలజీ, బయోసైన్స్, ఇంగ్లిషులో ఉత్తీర్ణత ఉంటేచాలు.
ఎత్తు: 165
బరువు : 50 కిలోలు, ఛాతి: 77 సెంటిమీటర్లు
వయస్సు: పదిహేడున్నర నుంచి 23 ఏళ్లు
> సోల్జర్ జనరల్ డ్యూటీ:
విద్యార్హత: పదో తరగతిలో ప్రతి సబ్జెక్టులో 33 శాతం మార్కులతో సీ 2 గ్రేడ్ 4.75 పాయింట్స్ గ్రేడ్‌తో ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్ ఆపై అర్హతలకు మార్కుల శాతం అవసరం లేదు.
ఎత్తు: 166 సెం.మీ., బరువు : 50 కిలోలు
ఛాతి: 77 సెం.మీ.
వయస్సు: పదిహేడున్నర నుంచి 21 ఏళ్లు
విద్యార్హత: సోల్జర్ ట్రేడ్‌మెన్: హౌస్ కీపర్, మెస్ కీపర్ సైస్ విభాగాలకు 8వ తరగతి; టైలర్, వాషర్‌మెన్, ఆర్టిషాన్(చెక్కపని), ఆర్టిషాన్(మెటాలజీ), చెఫ్, స్టీవార్డు, డ్రసరర్, సపోర్టు స్టాఫ్(ఇ.ఆర్), పెయింటర్ విభాగాలకు పదో, తరగతి, ఐటీఐ ఉత్తీర్ణత.
ఎత్తు: 166 సెం.మీ.
బరువు : 48 కిలోలు
ఛాతి : 76 సెం.మీ.
వయస్సు: పదిహేడున్నర నుంచి 23 ఏళ్లు
> సోల్జర్ క్లర్స్, స్టోర్ కీపర్ టెక్నికల్:
విద్యార్హత: ఇంటర్ ఆర్ట్స్, కామర్స్, సైన్స్, ఇంగ్లిషు, లెక్కలు, ఎకౌంట్స్‌లో 40 శాతం మార్కులు, మొత్తంగా 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. గ్రాడ్యుయేషన్ వారైతే కేవలం ఉత్తీర్ణత.
ఎత్తు: 162 సెం.మీ., బరువు : 50 కిలోలు
ఛాతి: 77 సెం.మీ.
వయస్సు: పదిహేడున్నర నుంచి 23 ఏళ్లు
* జిల్లాల వారీగా ఎంపికల తేదీలు..
> సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ ట్రేడ్స్‌మెన్, సోల్జర్ టెక్నికల్, నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్ క్లర్క్, స్టోర్ కీపర్ టెక్నికల్
- నెల్లూరు, కర్నూలు(ఆగస్టు 18); కడప, అనంతపురం (ఆగస్టు 19); గుంటూరు(ఆగస్టు 20); ప్రకాశం( ఆగస్టు 21)
> ఆగస్టు 22(చిత్తూరు): సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ ట్రేడ్స్‌మెన్
> ఆగస్టు 23(చిత్తూరు): సోల్జర్ క్లర్క్, స్టోర్ కపర్ టెక్నికల్, సోల్జర్ టెక్నికల్, నర్సింగ్ అసిస్టెంట్ కేటగిరిలో అభ్యర్థులకు ప్రాక్టికల్ పరీక్ష ఇఎస్ఎం అప్లయింగ్ ఫర్ డీఎస్సీ(డీఎస్‌సీ అభ్యర్థులకు రికార్డ్సు ద్వారా విచారణ, ప్రి మెడికల్ ఎంహెచ్ మెడికల్ వారు నిర్వహిస్తారు.)
> ఆగస్టు 24: ట్రేడ్‌మెన్ కేటగిరిలో ప్రాక్టికల్ పరీక్షకు ఏడు జిల్లాల అభ్యర్థులు హాజరుకావాలి.
> ఆగస్టు 18 నుంచి 27: ఫిజికల్ ఎంపికైన అభ్యర్థులకు నిర్వహించే వైద్య పరీక్షల తేదీని ప్రకటిస్తారు.

Posted on 06.08.2015