Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
బైపీసీ తర్వాత ఏ కోర్సులు?

ఇంటర్మీడియట్‌ పూర్తయ్యాక ఏ మార్గంలో చదువు కొనసాగిస్తే భవితకు మెరుగో తేల్చుకోవటం విద్యార్థులకు తప్పనిసరి. ముఖ్యంగా ఎంపీసీ వారితో పోలిస్తే... బైపీసీ గ్రూపువారిలో ఈ ఆలోచనలు ఎక్కువ. తమకు ఉన్న అవకాశాలు తెలుసుకుని, వాటిపై అవగాహన పెంచుకోవటం తొలిమెట్టుగా భావించాలి.
బైపీసీ విద్యార్థులకు వైద్యవృత్తి, మరో రెండు మూడు ఇతర అవకాశాల గురించి మాత్రమే ఎక్కువగా తెలుసు. ఇంకా వైవిధ్యమైన వివిధ రకాల కోర్సులు సైన్స్‌ విద్యార్థుల కోసం ఎదురుచూస్తున్నాయి. తమ ఆసక్తి ప్రమాణంగా తగిన నిర్ణయం తీసుకుంటే చదువులో, తర్వాత సంబంధిత వృత్తిలో రాణించటానికి ఎక్కువ అవకాశాలుంటాయి.
వైద్యవృత్తిలో చేరాలనే ఆశయం ఉంటే సీబీఎస్సీ నిర్వహిస్తున్న నీట్‌ ద్వారా ఎమ్‌బీబీఎస్‌/ బీడిఎస్‌ లాంటి కోర్సులు చదవవచ్చు. ఈ అఖిలభారత ప్రవేశ పరీక్ష ఇటీవలే జరిగింది. మన తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించే ఎంసెట్‌ ద్వారా కూడా వివిధ కోర్సులు చేయవచ్చు. బీవీఎస్సీ (బ్యాచిలర్‌ ఆఫ్‌ వెటరినరీ సైన్స్‌), బీఫార్మసీ (బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫార్మసీ), బీఎఫ్‌ఎస్సీ (బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ సైన్స్‌), బీఎస్సీ (అగ్రికల్చర్‌), బీఎస్సీ (హార్టీకల్చర్‌), ఫార్మా-డీ (డాక్టర్‌ ఆఫ్‌ ఫార్మసీ), బీటెక్‌ (బయోటెక్నాలజీ) లాంటివాటిలో చేరవచ్చు.

బీఎస్‌సీలోనూ...
ఇంటర్మీడియట్‌ తర్వాత డిగ్రీ చదవాలనుకుంటే బీఎస్సీలో వివిధ ప్రత్యేకాంశాలున్నాయి. బయో కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, మైక్రో బయాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్‌ లాంటివి. వీటిని పూర్తిచేసినవారికి పరిశోధన రంగంలో కూడా ఉద్యోగావకాశాలుంటాయి. ఈ కోర్సులు చదివితే ఐటీ, ఫార్మాస్యూటికల్‌ రంగాల్లో, ఆహారోత్పత్తి పరిశ్రమల్లో, రసాయన, వ్యవసాయ రంగాల్లో ఉపాధికి ఆస్కారం ఉంటుంది.
హెల్త్‌కేర్‌, డైరీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ లాంటి వాటిలో ఆసక్తి ఉన్నవారు జెనెటిక్స్‌లో చేరవచ్చు. నేర విచారణ సంస్థలు సీబీఐ, ఐబీ (ఇన్వెస్టిగేషన్‌) లాంటి వాటిలో అభిరుచి ఉన్నవారికి ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాంటివి మేలు. ఈ పట్టా ఉంటే ప్రభుత్వ రంగంలోనే కాకుండా, ప్రైవేటు డిటెక్టివ్‌ ఏజెన్సీలలోనూ ఉపాధికి ఢోకా ఉండదు.
ఈ డిగ్రీ కోర్సులతో పాటు ఇతర బీఎస్సీ (బాచిలర్‌ ఆర్‌ సైన్స్‌) కోర్సులు కూడా ఉన్నాయి. ఉదాహరణకు నర్సింగ్‌, ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్‌ థెరపీ, ఇంకా పాథాలజీ, రేడియాలజీ, స్పీచ్‌థెరపీ, హెల్త్‌సైన్స్‌ అండ్‌ న్యూట్రిషన్‌, స్పోర్ట్స్‌ సైన్స్‌ మొదలైనవి.

అగ్రికల్చర్‌, జియాలజీ...
మనదేశంలో వ్యవసాయ రంగానికి ఎంత ప్రాముఖ్యం ఉందో అందరికీ తెలిసిందే. ప్రత్యేకంగా ఈ రంగంపై ఆసక్తి ఉన్నవారు ఈ కోర్సులను చదవవచ్చు. బీఎస్‌సీ (అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌), బీఎస్సీ (బయోకెమ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ కెమిస్ట్రీ), బీఎస్‌సీలోనే ఇంకా... క్రాప్‌ సైకాలజీ, ఎంటమాలజీ, ఆగ్రోనమి, అగ్రికల్చరల్‌ బయోటెక్నాలజీ, అగ్రికల్చర్‌ స్టాటిస్టిక్స్‌ ... ఇవన్నీ ఉన్నాయి.
భూగర్భ శాస్త్రంపై ఆసక్తి ఉన్నవారికి బీఎస్సీ (జియాలజీ) సరైనది. ఇది చదవడానికి ఫిజిక్స్‌పై పట్టు పెంచుకోవాలి. వీటితో పాటు మేనేజ్‌మెంట్‌ కోర్సులైన బీబీఏ (బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌), బీఎమ్మెస్‌ (బ్యాచిలర్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌), బీహెచ్‌ఎమ్‌ (బ్యాచిలర్‌ ఆఫ్‌ హోటర్‌ మేనేజ్‌మెంట్‌) కూడా చెప్పుకోదగ్గవే. ఇవి చదివితే సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో, మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీల్లో, మార్కెటింగ్‌ ఆర్గనైజేషన్లలో ఉద్యోగం చేయవచ్చు.

ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు
ఇంటిగ్రేటెడ్‌ కోర్సులైన బీఎస్సీ+ఎల్‌ఎల్‌బీ, బీకాం+ఎల్‌ఎల్‌బీ, బీబీఏ+ఎల్‌ఎల్‌బీ, బీబీఏ+ఎంబీఏ లాంటివి కూడా అందుబాటులో ఉన్నాయి. మన దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు ఈ కోర్సులను అందిస్తున్నాయి. కొన్ని ఇతర డిగ్రీ, డిప్లొమా కోర్సులు ఆర్ట్స్‌, సామాజిక శాస్త్రాలకు సంబంధించినవి ఉన్నాయి. వీటిలోనూ, తమ ఆసక్తిని బట్టి చేరవచ్చు. డిప్లొమా ఇన్‌ (డెయిరీ టెక్నాలజీ), డిప్లొమా ఇన్‌ యోగా ఎడ్యుకేషన్‌, డిప్లొమా ఇన్‌ షుగర్‌ టెక్నాలజీ కోర్సులు కూడా ఉన్నాయి.
ఫ్యాషన్‌ రంగంలో ఆసక్తి ఉన్నవారు బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ కమ్యునికేషన్‌ లాంటి కోర్సులు చదవవచ్చు.
ఒకవేళ విమానయాన రంగంలో ఆసక్తి ఉంటే ఏర్‌ హోస్టెస్‌ లేదా క్యాబిన్‌ క్రూ శిక్షణ తీసుకోవచ్చు.
క్లినికల్‌ లాబొరేటరీ సైన్స్‌పై ఆసక్తి ఉన్నవారు మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌ లేదా డిప్లొమా ఇన్‌ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌ లాంటివి చేయడం ద్వారా వ్యాధి నిర్థారణ చేసే ల్యాబ్‌లలో, ఆస్పత్రుల్లో ఉద్యోగావకాశాలు పొందవచ్చు. వీటితో పాటు డిప్లొమా ఇన్‌ ఎలెక్ట్రో కార్డియోగ్రామ్‌ టెక్నాలజీ, డిప్లొమా ఇన్‌ మెడికల్‌ రేడియో గ్రఫిక్‌, (X-రే) టెక్నాలజీ లాంటి అడ్వాన్స్‌డ్‌ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.
డిప్లొమా ఇన్‌ ఫస్ట్‌ఎయిడ్‌, డిప్లొమా ఇన్‌ ఫ్యామిలీ వెల్‌ఫేర్‌ అండ్‌ పాపులేషన్‌ ఎడ్యుకేషన్‌, డిప్లొమా ఇన్‌ హైజీన్‌ అండ్‌ శానిటేషన్‌, డిప్లొమా ఇన్‌ హోమ్‌ నర్సింగ్‌లాంటివి పరిశీలించదగ్గవి.
పైన తెలిపిన కోర్సుల్లో కొన్నిటికి ప్రవేశ పరీక్ష ద్వారా అంటే జాతీయస్థాయి ప్రవేశ పరీక్ష/ రాష్ట్రస్థాయి ప్రవేశ పరీక్షల (ఎంసెట్‌) ర్యాంకుల ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. బీఎస్సీ లాంటి కోర్సులకు (బీఎస్సీ అగ్రికల్చర్‌ తప్ప) నేరుగా ప్రవేశాలుంటాయి. కొన్ని యూనివర్సిటీల్లో ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఎంబీబీఎస్‌ లాంటి కోర్సులు 5 సంవత్సరాలు లేదా ఆ పైన కాలవ్యవధి ఉంటుంది. మిగిలిన కోర్సులు 4 సంవత్సరాలు, కొన్ని 3 సంవత్సరాల కాలవ్యవధి ఉన్నవి. డిప్లొమాలాంటి కోర్సులు 1-2 సంవత్సరాల కాలవ్యవధితో ఉంటాయి.
ఈ కోర్సులు పూర్తి అయిన తర్వాత ఉన్నత విద్యను కొనసాగించాలనుకుంటే దానికి సంబంధించిన ప్రవేశపరీక్ష ద్వారా పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చదవవచ్చు. పీజీ పూర్తయిన తర్వాత పీహెచ్‌డీ (డాక్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ), ఆసక్తి ఉన్నట్లయితే పరిశోధన రంగంలోకి అడుగుపెట్టవచ్చు.

ఆసక్తి ప్రధానం
విద్యార్థులు తమకు దేనిపై ఆసక్తి ఉందో ఆ రంగానికి సంబంధించిన కోర్సు చదవటం సరైనది. ఒకరు చదువుతున్నారనో, మరొకరు ఫలానా కోర్సు చదవమని బలవంత పెడుతున్నారనో... ఇలాంటి కారణాలతో దేన్నీ ఎంచుకోకూడదు.
తల్లిదండ్రుల, బంధుమిత్రుల ఒత్తిడి వల్ల విద్యార్థులు తమకు ఆసక్తిలేని కోర్సు తీసుకుంటే తర్వాత చదవలేక బాధపడాల్సివస్తుంది. అభిరుచీ, ఆసక్తీ ఉన్న కోర్సుల్లోనే ఎవరైనా మెరుగ్గా రాణించగలుగుతారు.

సుప్రసిద్ధ సంస్థల్లో...
ఇంటర్‌ బైపీసీ విద్యార్థులకు మెరుగైన ప్రత్యామ్నాయాలు ఎన్నో ఉన్నాయి. సాధారణ బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సులు సైతం పేరొందిన విశ్వవిద్యాలయాల క్యాంపసుల్లో చదువుకోవచ్చు. కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, మేటి సంస్థల్లో ప్రపంచస్థాయి పరిజ్ఞానాన్ని సొంతం చేసుకోవచ్చు. మంచి బోధన, మెరుగైన వసతులు వీటి ప్రత్యేకత. ఉన్నత ప్రమాణాలు, అత్యున్నత బోధనా సిబ్బంది ఇక్కడ ఉంటారు. రాతపరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా ఆయా కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది.
అజీం ప్రేమ్‌జీ వర్సిటీ
దీనిలో రెసిడెన్షియల్‌ విధానంలో మూడేళ్ల బీఏ, బీఎస్‌సీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఎంపికైన విద్యార్థులు ఫిజిక్స్‌, బయాలజీ, ఎకనామిక్స్‌, హ్యూమానిటీస్‌ల్లో ఏదైనా స్పెషలైజేషన్‌ను ఎంచుకోవచ్చు. ఇంటర్‌లో 50% మార్కులతో ఉత్తీర్ణులు అయినవారు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
http://azimpremjiuniversity.edu.in

ఐఐఎస్‌సీ
బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ (రిసర్చ్‌) పేరుతో నాలుగేళ్ల కోర్సును ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌, బెంగళూరు నిర్వహిస్తోంది. కోర్సులో 8 సెమిస్టర్లు ఉంటాయి. బయాలజీ, కెమిస్ట్రీ, ఎర్త్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌, మెటీరియల్స్‌, మేథమేటిక్స్‌, ఫిజిక్స్‌ కోర్సులను అభ్యర్థులు నేర్చుకుంటారు. ఇంటర్‌లో ఎంపీసీ గ్రూపు లేదా బయాలజీ, స్టాటిస్టిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ సబ్జెక్టులు చదివినవాళ్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కేవీపీవై, ఐఐటీ-జేఈఈ, ఏఐపీఎంటీ స్కోరు ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
www.iisc.ernet.in

నెస్ట్‌ పరీక్ష
పరిశోధనా రంగంలో రాణించాలనుకునే ఇంటర్‌ సైన్స్‌ విద్యార్థులకు నేషనల్‌ ఎంట్రన్స్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ (నెస్ట్‌)ని మించిన అవకాశం లేదనే చెప్పుకోవచ్చు. ఈ పరీక్ష ద్వారా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసర్చ్‌, భువనేశ్వర్‌; యూనివర్సిటీ ఆఫ్‌ ముంబయి, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ విభాగానికి చెందిన సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ బేసిక్‌ సైన్సెస్‌ (సీబీఎస్‌)ల్లో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్‌సీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. బయాలజీ, మేథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో కోర్సులు నిర్వహిస్తున్నారు. ఈ సంస్థల్లో ప్రవేశం లభిస్తే అయిదేళ్లపాటు నెలకు రూ.5000 చొప్పున ఉపకారవేతనం పొందవచ్చు. వేసవి ప్రాజెక్టు కోసం ఏడాదికి రూ.20,000 చొప్పున చెల్లిస్తారు. అన్ని సెమిస్టర్లలోనూ మంచి ప్రతిభ కనబరిచినవారికి బాబా అటామిక్‌ రిసర్చ్‌ సెంటర్‌ (బార్క్‌) ట్రెయినింగ్‌ స్కూల్‌లో ప్రవేశపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశం కల్పిస్తారు.
www.nestexam.in

ఐఐఎస్‌ఈఆర్
ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసర్చ్‌ పేరుతో దేశవ్యాప్తంగా ఏడు కేంద్రాలు ఉన్నాయి. వీటిని బ్రహ్మపుర, భోపాల్‌, కోల్‌కతా, మొహాలీ, పుణె, తిరువనంతపురం, తిరుపతిల్లో ఏర్పాటుచేశారు. ఈ కేంద్రాల్లో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఎస్‌ఎంఎస్‌ డ్యూయల్‌ డిగ్రీ కోర్సులు ఉన్నాయి. బీఎస్‌ఎంఎస్‌లో బయలాజికల్‌ సైన్సెస్‌, కెమిస్ట్రీ, మేథమేటిక్స్‌, ఫిజిక్స్‌ కోర్సులను బోధిస్తున్నారు. వీటికి ఎంపికైనవారు కేవీపీవై లేదా ఇన్‌స్పైర్‌ స్కాలర్‌షిప్‌లకు అర్హులు.
iiseradmission.in

ఎయిమ్స్‌
ఈ విద్యాసంస్థ అందించే కోర్సుల్లో ఆప్టోమెట్రీ, మెడికల్‌ టెక్నాలజీ ఇన్‌ రేడియోగ్రఫీ, నర్సింగ్‌ ఉన్నాయి. బీఎస్‌సీ నర్సింగ్‌ (పోస్ట్‌ బేసిక్‌) కోర్సు ఎయిమ్స్‌ న్యూదిల్లీలో నిర్వహిస్తున్నారు. బీఎస్‌సీ నర్సింగ్‌ (ఆనర్స్‌)ను ఎయిమ్స్‌ న్యూదిల్లీతోపాటు ఇతర ఆరు కేంద్రాలైన భోపాల్‌, భువనేశ్వర్‌, జోధ్‌పూర్‌, పట్నా, రాయ్‌పూర్‌, రిషికేష్‌ల్లోనూ అందిస్తున్నారు. వ్యవధి: నాలుగేళ్లు. ఇంటర్‌ (సైన్స్‌ గ్రూప్‌) ఉత్తీర్ణులై ఉంటే ఈ కోర్సులో చేరవచ్చు.
www.aiimsexams.org


Back..

Posted on 17-05-2017