Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
పాఠ్యపుస్తకాల సారం ఆకళించుకునేదెలా?

హైస్కూల్‌, జూనియర్‌ కళాశాల స్థాయిలోకన్నా డిగ్రీ స్థాయిలో చదువుకోవాల్సిన మోతాదు ఎక్కువగానే ఉంటుంది. విద్యార్థులు డిగ్రీలో చేరిన కొద్దికాలంలోనే దీన్ని గ్రహిస్తారు. ఇంజినీరింగ్‌, మెడికల్‌ వంటి వృత్తి విద్యాకోర్సుల్లో ఈ అవసరం ఇంకా ఎక్కువ. పైగా చాలావరకు తామే సొంతంగా నేర్చుకోవాల్సి ఉంటుంది!
చాలామంది విద్యార్థులకు సిలబస్‌, అసైన్‌మెంట్లకు సరిపోయేంతగా చదవడమంటే అదనపు సమయం, శక్తి వెచ్చించటమే. తరగతిలో అధ్యాపకులు చెప్పిన విషయాన్ని ఆకళించుకోవడానికి అదనపు సమాచార సేకరణ చేసుకుని చదవవలసి వస్తుంది.
ఇంటర్మీడియట్‌ వరకు ముందస్తుగా తయారుచేసిన పుస్తకాలను చదవడానికి అలవాటుపడి ఉన్నవారికి డిగ్రీలో పాఠ్యపుస్తకాలను (టెక్ట్స్‌ బుక్స్‌) చదివి సారాంశాన్ని సొంతంగా తయారుచేసుకోవడం కష్టంగా అనిపిస్తుంటుంది. అందుకని అదనపు విషయసేకరణ పద్ధతులను త్వరగా అలవరచుకోవడం అవసరం. పాఠ్యపుస్తకాలు సమర్థంగా చదివి, అర్థం చేసుకునే సామర్థ్యం పెంచుకోవాలి. ఈ క్రమంలో జటిల అంశాలను సమగ్రంగా అర్థం చేసుకోగలుగుతారు.
అయితే చాలామంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను చదివే విషయంలో కొన్ని అపోహలుంటాయి.
* డిగ్రీ స్థాయిలో కూడా అధ్యాపకులు నోట్సు ఇస్తారు.
* వినోదం కోసం చదవడం, పాఠ్యపుస్తకం చదవడం మధ్య పెద్ద వ్యత్యాసం లేదు.
* పుస్తకంలోని ప్రతి పదమూ తప్పకుండా చదవాలి.
* ఒక్కసారి చదివితే చాలు.
* ఏ ఒక్క పేజీ వదలకుండా చదవాలి.
* యాంత్రిక పద్ధతుల్లో ఎక్కువ గతిని చదవవచ్చు.
* వేగంగా చదవడం అంటే తక్కువ గ్రహించుకోవడం.
* ప్రతి వాక్యాన్ని బట్టీ వేయాలి.
* పరీక్షల్లో పుస్తకాల్లో ఉన్నది ఉన్నట్టు రాయాలి.
* ప్రతిపాదిత పాఠ్యపుస్తకాన్ని తప్ప వేరే పుస్తకాలు చదివే అవసరం లేదు.
ఇవన్నీ అవగాహన లోపం వల్లనో అపరిపక్వతతోనో ఏర్పరచుకున్న అభిప్రాయాలు. పైపెచ్చు ప్రణాళిక చేసుకుని, పద్ధతి ప్రకారం పాఠ్యపుస్తకాలు చదవడం అలవాటు చేసుకుంటే ఎక్కువ జ్ఞానాన్ని తక్కువ కష్టంతో అర్థం చేసుకోవచ్చు.
ముఖ్య విషయాల సేకరణ
మొదటగా చదివే సబ్జెక్టుకు సంబంధించి అందుబాటులో ఉన్న పుస్తకాలు, వీడియోలు, అంతర్జాలం వంటి వనరుల గురించి పూర్తి సమాచారాన్ని సేకరించాలి. పాఠ్యపుస్తకం చదవడమంటే శ్రద్ధగా, ఏకాగ్రతతో ఆ అంశం కంఠతా వచ్చేవరకూ మాటిమాటికీ చదవడం కానే కాదు. తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు తమ పిల్లలను గట్టిగా వల్లె వేస్తూ చదవమని చెబుతుంటారు. ఈ పద్ధతి విద్యార్థి ఉత్సాహాన్ని నష్టపరిచే చర్య. ఎంత సమర్థంగా చదివే అలవాటు ఉన్నవారైనా కొత్త విషయం గురించి చదివేటపుడు శ్రమపడాల్సిందే. నిరంతరం చదివే అలవాటు ద్వారా మేథ త్వరితగతిన ఆకళింపు చేసుకునే సామర్థ్యాన్ని నేర్చుకుంటుంది.
భిన్న వనరుల ద్వారా సేకరించిన విషయాలను క్రోడీకరించి, సొంత ప్రయోగాల ద్వారా తెలుసుకున్న విషయాలను జోడించి పాఠ్యాంశాలుగా రాస్తారు. విద్యార్థులు వీటిని చదివి అర్థం చేసుకుని, అదే విషయాన్ని సొంత పదాల్లో తిరిగి రాయడం అలవాటు చేసుకోవాలి. అంతా రాశామని నమ్మకం కుదిరాక పుస్తకంలోవి ఏమైనా వదిలేశారేమో గమనించాలి.
ఇలా చేయాలంటే పాఠం మొత్తం ఒకేసారి చదవడం కాకుండా మొదట్లో పేరా వారీగా ఈ అభ్యాసం చేయాలి. అంటే ఒక పేరా చదివి, పుస్తకాన్ని మూసి పక్కన పెట్టి, ఆ పేరా సారాంశాన్ని సొంత వాక్యాల్లో రాయాలి. పుస్తకంలో రచయిత ఉపయోగించిన పదాలకన్నా తక్కువ పదాల్లో అదే అర్థాన్ని తెప్పించడం అలవాటు చేసుకోవాలి.
ఒక మేరకు వేగాన్ని పుంజుకున్న తరువాత ఇదే అభ్యాసాన్ని ఒక పేజీలోని అన్ని పేరాలకూ అన్వయించాలి. సాధారణంగా ఒక పేరా పది వాక్యాలకు మించి ఉండదు. దీనిని నిత్య అభ్యాసం ద్వారా ఐదు కన్నా తక్కువ వాక్యాల్లో అదేభావం వచ్చేట్టుగా రాయాలి. అప్పుడు గ్రాహ్యశక్తి పెరిగినట్టు. ఒక పేజీలో మూడు- నాలుగు పేరాలు ఉండవచ్చు. ఈ నాలుగు పేరాలను కుదించి సారాంశాన్ని ఒక పేరాలోకి మార్చుకునే అలవాటు చేసుకోవాలి. దీనివల్ల పాఠ్యపుస్తకం చదవడమే కాకుండా తెలిసిన విషయాన్ని సూటిగా, స్పష్టంగా చెప్పడమనే కళ సులువుగా వస్తుంది.
గ్రాహ్యశక్తి పెరగాలంటే...
పాఠ్యపుస్తకంలోని విషయసూచిక, పీఠికలను తప్పకుండా చదవాలి. పీఠికలో రచయిత అనుభవాలను, అభిప్రాయాలను, ఆ పుస్తకం చదవవలసిన పద్ధతులను విశదీకరిస్తారు. ఇవి పుస్తకం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి.
* ఒక పాఠం చదవడానికి ముందు... శీర్షిక, ఉపోద్ఘాతం, వివిధ ఉపశీర్షికలను చదివి అంచనా వేయాలి. దీనివల్ల రచయిత ఆ పాఠంలోని వివిధ విషయాలను ఏ క్రమంలో, ఎలా చెప్పబోతున్నారో ముందస్తుగా తెలుసుకోవచ్చు. అప్పుడు చదివిన పాఠ్యభాగం కొత్తదిగా కాకుండా తెలిసిన విషయంపై సమగ్ర సమాచారాన్ని ఇచ్చేదిగా అనిపిస్తుంది. సులభంగా నేర్చుకోవడానికి వీలు కల్పిస్తుంది.
* నిడివి ఎక్కువగా ఉన్న అంశాలను చిన్న భాగాలుగా చేసి నేర్చుకోవాలి. అప్పుడా పాఠ్యభాగం కష్టంగా కాకుండా ఇష్టంగా చదవాలనిపిస్తుంది.
* కొన్ని పాఠాలు చదువుతున్నపుడు ఎక్కువ ఉత్సాహమనిస్తుండవచ్చు. అదే కొన్ని చదువుతున్నపుడు ఏకాగ్రత కుదరక మనసు ఇతర విషయాలవైపునకు ఆకర్షితమవుతుండవచ్చు. అటువంటి సమయాల్లో ఇలా ఎందుకు జరుగుతోందో విశ్లేషించుకోవాలి. కారణాలను గుర్తించి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో సొంతంగా గుర్తించడంలో విఫలమవుతుంటే తల్లిదండ్రుల/ అధ్యాకుపల సలహాలు తీసుకోవాలి.
* గంటల తరబడి ఏకబిగిన చదవడం కన్నా మధ్యమధ్యలో చిన్న విరామం తీసుకోవాలి. దీనివల్ల శ్రమ, అలసట తగ్గి సామర్థ్యం పెరుగుతుంది. అయితే ఈ విరామ సమయం సాగదీయకుండా జాగ్రత్త వహించాలి.
* ప్రతి సబ్జెక్టునూ ఒకేవిధంగా నేర్చుకోలేమని గుర్తించాలి. ప్రతి సబ్జెక్టునూ ఎలా నేర్చుకోవాలి, ఎలా నేర్చుకుంటే సులువుగానే కాకుండా ఆసక్తికరంగా కూడా ఉంటుందనే విషయంలో అధ్యాపకులూ, సీనియర్లూ సాయమందించగలరు.
* అలసిపోయి ఉన్నపుడు కష్టమనిపించే సబ్జెక్టులు చదవకూడదు.
* శ్రద్ధగా, పరధ్యానానికి అవకాశం లేని పరిస్థితుల్లో చదవాలి. అటువంటి వాతావరణం కల్పించుకోవాలి.
* నియంత్రణతోకూడిన అధ్యయన అలవాట్లు పెంపొందించుకోవాలి. ఈ విధానం గ్రాహ్యశక్తిని పెంపొందించి, జ్ఞప్తికి తెచ్చుకుని మదింపు చేసుకోగలిగిన విధంగా అమలుపరచాలి.
* అవలోకనం చేసుకోవడం, ప్రశ్నించడం, చదవడం, జ్ఞాపకం చేసుకోవడం, మదింపు చేసుకోవడం... ఇవి ఫలవంతంగా చదవడానికి ఉపకరిస్తాయి.
మూడు దశల్లో...
పాఠ్యపుస్తకాలు చదివేటప్పుడు కొన్ని పద్ధతులు పాటిస్తే మేలు.
1. చదవడానికి ముందు ప్రణాళిక
* సంకల్పాన్ని సంఘటితపరచుకోవాలి.
* చదవడానికి అనుకూల వాతావరణాన్ని కల్పించుకోవాలి.
* ఒత్తిడి లేని మనస్థితిలో ఉండాలి.
* ఆలోచనలను క్రమంలో పెట్టుకోవాలి.
* ఈ చదువు నుంచి ఆశిస్తున్నదేమిటన్న విషయంలో స్పష్టత ఏర్పరచుకోవాలి.
2. చదివేటపుడు చేయాల్సినవి
* చురుకుగా పాల్గొనాలి.
* చదువుతున్నపుడు గ్రాహ్యశక్తిని పరీక్షించుకోవాలి.
* వల్లెవేయడం కాకుండా నేర్చుకున్నదాన్ని సొంత వాక్యాల్లో తిరగరాయాలి.
* చదువుతున్న విషయానికీ, దాని గురించి ముందే తెలిసిన అంశాలకూ మధ్య తులనాత్మక పరిశీలన చేసుకోవాలి.
* చదవడం మొదలుపెట్టకముందు ఏవైనా ప్రశ్నలు తయారుచేసుకుని ఉంటే వాటికి సమాధానాలు వెతుక్కోవాలి.
* కష్టంగా అనిపిస్తే... అర్థం కాని పదాలకు సరైన నిర్వచనం తెలుసుకోవాలి.
* ఏదైనా ప్రశ్నకు సమాధానం దొరక్కపోతే, అప్పటికి దాన్ని వదిలి, ముందుకు చదవాలి. ఆ ప్రశ్నకు తర్వాత సమాధానం దొరుకుతుందనుకోవాలి. కానీ చదవడం మాత్రం మానకూడదు. కొన్నిసార్లు అప్పుడే దొరకని సమాధానాలు మున్ముందు వాటంతటవే దొరుకుతాయి.
* అర్థంకాని అంశాన్ని తిరిగి చదవాలి.
* ఆ అంశం గురించి నోట్సులోకానీ, ఇతర వనరుల్లో గానీ వెతికి పోల్చుకోవాలి.
* తమకన్నా ఎక్కువ తెలిసినవారి సాయం తీసుకోవాలి.
3. మదింపు: చదివిన తరువాత..
* వివిధ వనరుల నుంచి సేకరించిన అంశాలను క్రోడీకరించి స్థూల సారాంశాన్ని తయారు చేసుకోవాలి.
* ప్రశ్నలకు సమాధానాలు రూపొందించుకోవాలి.
* సొంతంగా పరీక్షించుకోవాలి.
* ఇతర బృందాలతో చర్చల్లో పాల్గొనాలి.
* అదనంగా తెలుసుకోవాల్సిన విషయాన్ని గుర్తించాలి.
ఈ చర్యలన్నీ ఒకసారి కాకుండా ఒక చక్రంలా తరచూ పాటిస్తే ఎంతో ఉపయోగం.

Posted on 14-10-.2015

BACK