Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
కళాశాలల్లో కొత్త పద్ధతి... ఏ రీతి?

     వచ్చే విద్యాసంవత్సరం నుంచి అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో 'చాయిస్‌ బేస్‌డ్‌ క్రెడిట్‌ సిస్టమ్‌' (సీబీసీఎస్‌)ను అమలుచేయాలని యూజీసీ అన్ని విశ్వవిద్యాలయాలనూ, కళాశాలలనూ కోరుతోంది. కొద్దికాలంగా చర్చనీయాంశమైన ఈ వ్యవస్థ స్వరూపమేమిటి? దీని ప్రత్యేకతలేమిటి?
నేటి ఉన్నత విద్యావ్యవస్థలో లోపాలున్నాయని అందరూ అంగీకరించే విషయమే. పాఠాలను బలవంతంగా కంఠోపాఠం చేయించడం వల్ల గ్రహించినదాన్ని ఆకళింపు చేసుకోలేకపోవడం, విషయ పరిగ్రహణలో నైపుణ్యాలు లేకపోవడం, జ్ఞానాన్ని సరైన పద్ధతిలో అనువర్తింపజేయలేకపోవడం మొదలైనవి వాటిలో కొన్ని. ఈ నేపథ్యంలో విద్యార్థుల సామర్థ్యాన్నీ, నైపుణ్యాన్నీ, గుణాత్మక విద్యనూ అందించడంలో భాగంగానే చాయిస్‌ బేస్‌డ్‌ క్రెడిట్‌ సిస్టమ్‌ అమలుకు సిద్ధమవుతున్నారు.
పాఠ్యప్రణాళికలో సరళత్వం- ఈ సీబీసీఎస్‌ కీలకాంశం. విద్యార్థులు ఒక విద్యాసంస్థ నుంచి మరోదానికి వెళ్లడానికి ఈ విధానం వెసులుబాటునిస్తుంది. ప్రతి కోర్సు బోధనా అంశాలనూ క్రెడిట్‌ (1 క్రెడిట్‌= 3- 4 గంటలు)కు అనుగుణంగా మార్చడం వల్ల ఈనాటి కమ్యూనికేషన్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీని ఉపయోగించుకుని సమర్థంగా విద్యార్థులను తీర్చిదిద్దడానికి ఈ విధానం దోహదపడుతుందని భావిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత నాణ్యతతోకూడిన ఉన్నత విద్యనందించే ముఖ్యదేశాలైన యూకే, యూఎస్‌, జపాన్‌, ఆస్ట్రేలియా మొదలైన దేశాలు సీబీసీఎస్‌ విధానాన్ని అమలుచేస్తున్నాయి.
పాత పద్ధతిలో సమస్యలు
దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలూ, కళాశాలలూ విభిన్న మూల్యాంకన విధానాలను అనుసరిస్తున్నాయి. దీనివల్ల విద్యార్థులు పొందిన క్రెడెన్షియల్స్‌ను వివిధ విశ్వవిద్యాలయాలు అంగీకరించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉపాధి అవకాశాలను పొందడంలో సమస్య ఏర్పడుతోంది. ఈ సీబీసీఎస్‌ మూలంగా అన్ని విశ్వవిద్యాలయాలూ, కళాశాలలూ ఒక నిర్దిష్టమైన ఫ్రేమ్‌వర్క్‌ను అనుసరించే వీలు కలుగుతుంది. దీనివల్ల ఎన్నో చిక్కులను తొలగించవచ్చని యూజీసీ భావిస్తోంది.
కొత్త పద్ధతిలో ప్రయోజనాలు
* జ్ఞాన సముపార్జన, నైపుణ్యానికి సంబంధించిన కోర్సులను ఎన్నుకోవటం
* అదనంగా చదివే కోర్సులను అభ్యసించడం ద్వారా ఎక్కువ క్రెడిట్స్‌ పొందడం
* అంతర విభాగపు కోర్సులను ఎన్నుకుని, నైపుణ్యం సంపాదించడం
* ఒక కోర్సును ఒక విద్యాసంస్థలో, మరొక ప్రయోజనకర కోర్సును మరో సంస్థలో అభ్యసించడం
* ఉపాధి అవకాశాలకు పనికొచ్చే నైపుణ్యాలను నేర్చుకోవడం
* పరిశోధన, సామాజిక బాధ్యతతోకూడిన అంశాలను ప్రాజెక్టుల ద్వారా అలవరచుకోవడం
* క్షేత్రస్థాయి సామర్థ్యాలను పెంపొందించుకోవడం
* సమగ్ర మూల్యాంకన విధానం ద్వారా గణించే క్రెడిట్‌లను పొందడం
* ఈ విధానంలో బోధనకు సంబంధించిన అనేక పద్ధతులను అవలంబిస్తారు. దీంతో సాంకేతిక సామర్థ్యాన్నీ, జీవన నైపుణ్యాలనూ, ఉపాధి, కార్పొరేట్‌ నైపుణ్యాలనూ అలవరచుకోవడం
ఈ విధానంలో అనుసరించే ముఖ్యాంశాలు
* ఉపాధి అవకాశాల రీత్యా, ఆధునిక పరిజ్ఞానానికి అనుగుణంగా తరచూ పాఠ్యాంశాల్లో మార్పులు
* సమగ్ర మూల్యాంకన పద్ధతిలో అర్ధసంవత్సర పరీక్షల నిర్వహణ
* విద్యార్థుల్లో పరిశోధనశక్తిని పెంపొందించడం
* విద్యాసంస్థల్లో పాలనాపరమైన మార్పులు
* బోధనలో విద్యార్థి కేంద్రీకృత విధానాలను అవలంబించడం
* విషయ పరిజ్ఞానం, నైపుణ్యాలతో కూడిన సాధారణ, సబ్జెక్టుకు సంబంధించిన ఎలెక్టివ్‌లను ఎన్నుకోవడం
* విలువలతో కూడిన విద్యనూ, వాతావరణ శాస్త్రాన్నీ తప్పనిసరిగా అభ్యసించడం
* గరిష్ఠంగా 140 క్రెడిట్‌లను, కనిష్ఠంగా 120 క్రెడిట్‌లను పొందడం
* పాఠ్యాంశాలను సులభంగా, సమర్థంగా అభ్యసించడానికి మాడ్యూళ్ల రూపంలో విభజించడం
* 7 పాయింట్‌ గ్రేడ్స్‌ (P, C, B, B+, A, A+, O (outstanding) ద్వారా స్కోరు షీటును తయారుచేసి ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొందిన సీజీపీఏ (క్యుములేటివ్‌ గ్రేడ్‌ పాయింట్‌ యావరేజ్‌) పద్ధతిలో విద్యార్థుల ఫలితాలను వెల్లడించడం.
గ్రేడ్లు.. మార్కులు కాదు
* మార్కులకు బదులు గ్రేడ్లుంటాయి.
* సెమిస్టర్‌ చివర్లో ఎస్‌జీపీఏ సెమిస్టర్‌ గ్రేడ్‌ పాయింట్‌ ఏవరేజ్‌ లెక్కిస్తారు.
* మూడు సంవత్సరాలకు కలిపి క్యుములేటివ్‌ గ్రేడ్‌ పాయింట్‌ ఏవరేజ్‌ లెక్కిస్తారు. అంటే ఆరు సెమిస్టర్ల మొత్తం.
* సీజీపీఏ 4 తక్కువ కాకుండా వస్తే ఉత్తీర్ణత సాధించినట్టు.
* యూజీసీ 10 పాయింట్‌ గ్రేడ్‌ స్కేల్‌ను పరిమాణంగా తీసుకుంది. దీన్ని లెటర్‌ గ్రేడ్‌లో సూచిస్తుంది.

posted on 1.6.2015