Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
చేద్దామా ఐఐటీల్లో డిజైన్‌

అన్ని చ‌దువుల‌కూ ఉన్న‌ట్లుగానే డిజైన్ కోర్సుల్లోనూ ప్ర‌సిద్ధ సంస్థ‌లు వెలిశాయి. యూజీ నుంచి పీజీ వ‌ర‌కు ఈ సంస్థ‌ల్లో ప‌లు కోర్సులు ఉన్నాయి. ప్ర‌త్యేక ప‌రీక్ష‌ల ద్వారా వీటిలో ప్ర‌వేశం ల‌భిస్తుంది. వాటిలో ముఖ్య‌మైంది సీడ్‌. కామ‌న్ ఎంట్ర‌న్స్ ఎగ్జామినేష‌న్ ఫ‌ర్ డిజైన్ కు సూక్ష్మాక్ష‌ర‌మే సీడ్‌. ఎంపికైన విద్యార్థులు ఐఐటీలు స‌హా ఐఐఎస్సీలో నాణ్యమైన డిజైన్ చదువుల‌కు శ్రీకారం చుట్ట‌వ‌చ్చు. కోర్సు పూర్తయిన వెంటనే సృజ‌నాత్మ‌క ప్ర‌పంచంలో ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిపోవ‌చ్చు. సొంతంగానూ రాణించ‌వ‌చ్చు. ప్రకటనలు వెలువడిన నేపథ్యంలో యూసీడ్, సీడ్‌ ల గురించి తెలుసుకుందాం.
బ్యాచిలర్ కోర్సులకు యూసీడ్
డిజైన్ కోర్సుల్లో రాణించాలనుకునే ఇంటర్ విద్యార్థులు తప్పక రాయాల్సిన పరీక్ష యూసీడ్. అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ డిజైన్కు సంక్షిప్త రూపమే... యూసీడ్. ఈ పరీక్ష ద్వారా ఐఐటీ-బాంబే, గువాహటితోపాటు మరికొన్ని పేరొందిన సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. ఇంటర్ అన్ని గ్రూప్‌ల విద్యార్థుల‌తోపాటు రెండేళ్ల ఒకేషనల్ కోర్సు లేదా మూడేళ్ల డిప్లొమా చదివినవారు సైతం ఈ పరీక్షను రాయవచ్చు. కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేసి బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (బి.డిస్) కోర్సులో ప్రవేశం కల్పిస్తారు.
అర్హత:
2018లో ఇంట‌ర్ పూర్తిచేసుకున్న‌వారు, ప్రస్తుతం ఇంట‌ర్ ద్వితీయ సంవత్సరం కోర్సులు చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సైన్స్, కామర్స్, ఆర్ట్స్, హ్యుమానిటీస్.. ఏ బ్రాంచీ విద్యార్థులైనా అర్హులే. 2018 కంటే ముందు ఇంటర్ పూర్తిచేసినవాళ్లు అనర్హులు. మూడేళ్ల డిప్లొమా, రెండేళ్ల ఒకేషనల్ కోర్సులు చదివిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. (ఐఐటీ-గువాహటిలో ప్రవేశానికి ఇంటర్ ఎంపీసీ తప్పనిసరి. మిగిలిన సంస్థల్లో సీట్లకు ఇంటర్/ ఒకేషనల్/ డిప్లొమా విద్యార్థులు పోటీ పడవచ్చు)
వయసు:
అక్టోబరు 1, 1994 తర్వాత జన్మించినవాళ్లే అర్హులు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే అక్టోబరు 1, 1989 తర్వాత జన్మించినవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష ఇలా...
పరీక్షను కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్ మాధ్యమంలోనే ఉంటుంది. మొత్తం 85 ప్రశ్నలు వస్తాయి. వీటికి 300 మార్కులు. ఇందులో 3 సెక్షన్లు ఉంటాయి. అవి...
సెక్షన్ ఎ (న్యూమరికల్ ఆన్సర్ టైప్) : 20 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 80 మార్కులు కేటాయించారు. ఈ తరహా ప్రశ్నలకు జవాబును నేరుగా ఖాళీపై పూరించాలి. ఆప్షన్లు ఉండవు. ఆన్‌లైన్‌ కీబోర్డు ఉపయోగించి సమస్యను సాధించుకోవచ్చు. సరైన సమాధానం రాస్తే 4 మార్కులు. ఈ సెక్షన్కు రుణాత్మక మార్కులు లేవు.
సెక్షన్ బి (మల్టిపుల్ సెలక్ట్ టైప్): ఈ విభాగానికి వంద మార్కులు కేటాయించారు. మొత్తం 25 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 4 ఆప్షన్లు ఉంటాయి. వాటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సరైన జవాబులు ఉండవచ్చు. అభ్యర్థులు సరైన ఆప్షన్లు గుర్తిస్తే 4 మార్కులు సొంతమవుతాయి. ఆ ప్రశ్నకు ఉన్న సరైన సమాధానాలన్నీ గుర్తిస్తేనే మార్కులు ఉంటాయి. సరైన సమాధానాల్లో ఒక ఆప్షన్‌ విడిచిపెట్టినా, సరైన సమాధానాలతోపాటు ఒక సరికాని సమాధానాన్ని గుర్తించినా మార్కులు కేటాయించరు. గుర్తించిన ఆప్షన్లలో కొన్ని సరైనవి ఉన్నప్పటికీ పాక్షిక మార్కులు కేటాయింపు విధానం ఉండదు. అలాగే ఈ సెక్షన్ లోనూ రుణాత్మక మార్కులు లేవు.
సెక్షన్ సి (మల్టిపుల్ ఛాయిస్ టైప్): ఈ విభాగానికి 120 మార్కులు కేటాయించారు. ఇందులో 40 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకూ 4 ఆప్షన్లు ఉంటాయి. అయితే వీటిలో ఒక ఆప్షన్ మాత్రమే సరైనది. మిగిలినవి సరికానివి. అందువల్ల ఈ విభాగానికి రుణాత్మక మార్కులు ఉన్నాయి. ప్రతి సరైన జవాబుకు 3 మార్కులు ఉంటాయి. అలాగే తప్పు సమాధానం గుర్తిస్తే ఒక మార్కు తగ్గిస్తారు.
ఈ అంశాల్లో ప్రశ్నలు...
విజువలైజేషన్ అండ్ స్పేషియల్ ఎబిలిటీ, అబ్జర్వేషన్ అండ్ డిజైన్ సెన్సిటివిటీ, ఎన్విరాన్మెంటల్ అండ్ సోషల్ అవేర్‌నెస్, ఎనలిటికల్ అండ్ లాజికల్ రీజనింగ్, లాంగ్వేజ్ అండ్ క్రియేటివిటీ, డిజైన్ థింకింగ్ అండ్ ప్రోబ్లమ్ సాల్వింగ్ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. పాత ప్రశ్నపత్రాలు-జవాబులు యూసీడ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. వాటిని పరిశీలించడం ద్వారా పరీక్ష విధానం, ప్రశ్నల స్వరూపంపై అవగాహనకు రావచ్చు. సృజన, ఆలోచన, తార్కికతలపై ముడిపడి ఎక్కువ ప్రశ్నలు సంధిస్తారు.
ప్రవేశం కల్పించే సంస్థలు
ఐఐబీ-బాంబే, గువాహటి
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ - జబల్‌పూర్‌
సీట్లు:
ఐఐటీ-బాంబేలో 30, ఐఐటీ-గువాహటిలో 45, ఐఐఐటీడీఎం-జబల్ పూర్ లో 30 చొప్పున సీట్లు ఉన్నాయి. ఐఐటీ-బాంబేలో చేరినవాళ్లు కావాలనుకుంటే బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ అనంతరం మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సులో చేరవచ్చు. కోర్సు మూడో సంవత్సరంలో ఈ ఐచ్ఛికాన్ని ఎంచుకోవాలి. ఇలా చేరినవారికి బీడిస్ + ఎండిస్ డ్యూయ‌ల్ డిగ్రీ కోర్సు అయిదేళ్లలో పూర్తవుతుంది. యుసీడ్ స్కోర్ తో ప‌లు ఇత‌ర సంస్థ‌లు సైతం ప్ర‌వేశం క‌ల్పిస్తున్నాయి. వాటిలో ముఖ్య‌మైన‌వి... యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్, సెంట్ర‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ, విట్, లవ్ లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, శ్రేష్ఠ, ఇంద్రప్రస్థ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, చండీగఢ్ యూనివర్సిటీ, మిట్, యూపీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌.
పీజీ, పీహెచ్‌డీల‌కు సీడ్
డిజైన్‌లో యూజీ కోర్సులు చ‌దువుతున్న విద్యార్థులు పీజీలో ప్ర‌వేశానికి సీడ్ ద్వారా అవ‌కాశం క‌లుగుతుంది. అలాగే ఈ ప‌రీక్ష ద్వారా పీజీ విద్యార్థులు పీహెచ్‌డీ కోర్సులో చేర‌వ‌చ్చు. ఈ పరీక్ష ద్వారా ఐఐఎస్సీ బెంగళూరు, ఐఐటీ-బాంబే, దిల్లీ, గువాహటి, హైదరాబాద్, కాన్పూర్, ఐఐటీడీఎం జ‌బ‌ల్‌పూర్‌ లో డిజైన్ కు సంబంధించి పీజీ, పీహెచ్ డీ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది.
సంస్థలవారీ కోర్సులు / స్పెషలైజేషన్లు
ఐఐఎస్సీ బెంగళూరు: ఎండిజైన్- ప్రొడక్ట్ డిజైన్ అండ్ ఇంజినీరింగ్, పీహెచ్ డీ- డిజైన్
ఐఐటీ బాంబే: ఎండిజైన్- ఇండస్ట్రియల్ డిజైన్, కమ్యూనికేషన్ డిజైన్, యానిమేషన్, ఇంటరాక్షన్ డిజైన్, మొబిలిటీ అండ్ వెహికల్ డిజైన్; పీహెచ్ డీ- డిజైన్
ఐఐటీ దిల్లీ: ఎండిజైన్- ఇండస్ట్రియల్ డిజైన్
ఐఐటీ గువాహటి: ఎండిజైన్- డిజైన్, పీహెచ్‌డీ- డిజైన్
ఐఐటీ హైదరాబాద్: ఎండిజైన్- విజువల్ డిజైన్, పీహెచ్ డీ- డిజైన్
ఐఐటీ కాన్పూర్: ఎండిజైన్- డిజైన్, పీహెచ్ డీ- డిజైన్
ఐఐఐటీడీఎం జ‌బ‌ల్‌పూర్‌: ఎండిజైన్-ప్రొడక్ట్ డిజైన్, విజువ‌ల్ డిజైన్‌. పీహెచ్ డీ- డిజైన్
ప్ర‌శ్న‌ప‌త్రం ఇలా...
ప్రశ్నపత్రం ఇంగ్లిష్ లో ఉంటుంది. ఇందులో 2 విభాగాలు ఉంటాయి. అవి పార్ట్ ఎ, బి. పార్ట్ - ఎ ఆన్‌లైన్ లో ఉంటుంది. ఈ విభాగంలో న్యూమ‌రిక‌ల్ ఆన్స‌ర్ టైప్‌, మ‌ల్టిపుల్ సెల‌క్ట్‌, మ‌ల్టిపుల్ ఛాయిస్ ప్ర‌శ్న‌లు వ‌స్తాయి. అయిదు సెక్ష‌న్ల‌తో వంద మార్కుల‌కు ప్ర‌శ్న‌ప‌త్రం ఉంటుంది. న్యూమ‌రిక‌ల్ ప్ర‌శ్న‌ల‌కు ఆప్ష‌న్లు, రుణాత్మ‌క మార్కులు ఉండ‌వు. మ‌ల్టిపుల్ సెలెక్ట్ ప్ర‌శ్న‌ల‌కు ఒక‌టి కంటే ఎక్కువ ఆప్ష‌న్లు స‌మాధానాలుగా ఉండ‌వ‌చ్చు. అన్ని స‌రైన ఆప్ష‌న్లూ గుర్తిస్తేనే మార్కులు కేటాయిస్తారు. రుణాత్మ‌క మార్కులు లేవు. మ‌ల్టిపుల్ ఛాయిస్ ప్ర‌శ్న‌ల‌కు రుణాత్మ‌క మార్కులు ఉన్నాయి. పార్ట్ ఎ వ్యవధి ఒక గంట. పార్ట్-ఎలో విజువ‌లైజేష‌న్ అండ్ స్పేషియ‌ల్ ఎబిలిటీ, ఎన్విరాన్మెంటల్, సోషల్ అవేర్ నెస్, ఎనలిటికల్ అండ్‌ లాజికల్ రీజనింగ్, లాంగ్వేజ్ అండ్ క్రియేటివిటీ, అబ్జర్వేషన్ అండ్ డిజైన్ సెన్సిటివిటీ అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. పార్ట్-బి ప్రశ్నలు కంప్యూటర్లో ఉంటాయి. అయితే వీటికి సమాధానాలు (డ్రాయింగ్స్) మాత్రం బుక్ లెట్ లో రాయాలి. వంద మార్కులకు 8 ప్ర‌శ్న‌లు ఉంటాయి. మొద‌టి అయిదు ప్ర‌శ్న‌ల్లో ఒక‌దానికి జ‌వాబురాస్తే స‌రిపోతుంది. 6,7,8 ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు రాయాలి. పార్ట్ బిలో డిజైన్లు, డ్రాయింగ్, రైటింగ్ స్కిల్స్ ల్లో వివరణాత్మక ప్రశ్నలు ఉంటాయి. పార్ట్ బి వ్యవధి 2 గంటలు. పార్ట్ ఎ ను స్క్రీనింగ్ టెస్టుగా పరిగణిస్తారు. పార్ట్ ఎ పరీక్షలోని ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎంపికైన‌వారి పార్ట్ బి సమాధానాలు మూల్యాంకనం చేస్తారు. పార్ట్‌-బిలో డ్రాయింగ్‌, క్రియేటివిటీ, క‌మ్యూనికేష‌న్ స్కిల్స్‌, ఎన‌లిటిక‌ల్, ప్రాబ్ల‌మ్ సాల్వింగ్ స్కిల్స్‌..త‌దిత‌ర అంశాల్లో ప‌రీక్షిస్తారు. పార్ట్ ఎకు 25, పార్ట్ బికి 75 శాతం వెయిటేజీ ల‌భిస్తుంది.
అర్హత: బీటెక్, బీఆర్క్, డిజైన్, ఇంటీరియర్ డిజైన్, బీఎఫ్ఏ వీటిలో ఏదైనా నాలుగేళ్ల కోర్సు లేదా జీడీ ఆర్ట్స్ డిప్లొమా ప్రొగ్రాం (10+5 ఇయర్స్) చదివినవాళ్లు సీడ్ పరీక్షకు అర్హులు. ప్ర‌వేశం క‌ల్పించే సంస్థ‌ల వారీ స్వ‌ల్ప వ్య‌త్యాసాలు ఉంటాయి. వ‌య‌సు ప‌రిమితి లేదు. అభ్య‌ర్థులు ఎన్నిసార్లైనా ప‌రీక్ష రాసుకోవ‌చ్చు.
ముఖ్య‌మైన తేదీలు (యూసీడ్‌, సీడ్‌)
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల ప్రారంభం: అక్టోబ‌రు 9
చివ‌రి తేదీ: న‌వంబ‌రు 9
రూ.500 ఫైన్ తో: న‌వంబ‌రు 16
ప‌రీక్ష: జ‌న‌వ‌రి 19న ఉద‌యం 10 నుంచి మ‌ధ్యాహ్నం 1 వ‌ర‌కు నిర్వ‌హిస్తారు
తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్ష కేంద్రాలు: హైద‌రాబాద్‌, విశాఖ‌ప‌ట్నం
నోటిఫికేష‌న్‌
వెబ్ సైట్లు: http://www.uceed.iitb.ac.in, http://www.ceed.iitb.ac.in/2019/

Posted on 27-9-2018

Back..