Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
సమాధానాల నాణ్యతే ప్రధానం!

సీఏలకు ఉపాధి అవకాశాలను విస్తృతం చేసే లక్ష్యంతో గత ఏడాది ఈ కోర్సులో కొన్ని కొత్త విధానాలను అమలు చేశారు. వాటి తర్వాత మొదటిసారిగా మేలో సీఏ ఇంటర్‌ పరీక్షలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో పేపర్ల వారీగా సన్నద్ధత ఎలా ఉండాలో తగిన అవగాహన అవసరం.

సీఏ కోర్సులోని అన్ని దశల్లోనూ సీఏ ఇంటర్‌ కీలకం. ఈ దశలో విద్యార్థి అనవసర విషయాలకు తావివ్వకుండా నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం శ్రమిస్తే అనుకూల ఫలితాలుంటాయి. తుది పరీక్ష ముగిసేవరకూ అనుసరించే విద్యా ప్రణాళికను ముందుగానే సిద్ధం చేసుకుని, దానికే కట్టుబడి ఉండాలి.
సీఏ కోర్సులో సమయస్ఫూర్తి, తార్కిక ఆలోచనావిధానం చాలా అవసరం. అలా ఆలోచిస్తేనే పరీక్షల్లో అడిగిన ఎలాంటి ప్రశ్నకైనా సరైన సమాధానం రాసే వీలుంటుంది. సబ్జెక్టుపై పూర్తి అవగాహనతో చదవాలి తప్ప బట్టీ పట్టకూడదు. పరీక్షలో ప్రశ్నలను ఒకటికి రెండుసార్లు చదివి, సమాధానాలను డొంకతిరుగుడు లేకుండా సూటిగా రాయాలి.
పేపర్‌-1 అకౌంటింగ్‌ (100 మార్కులు)
‌* వెయిటేజీ బాగా ఉన్న అకౌంటింగ్‌ స్టాండర్డ్స్‌కు ప్రాముఖ్యం ఇవ్వాలి. పరీక్ష సన్నద్ధత దశలో వేర్వేరు టెక్ట్స్‌ పుస్తకాలను చదవడం, సాధన చేయడం మంచిది కాదు. ముందు నుంచీ చదువుతున్న మెటీరియల్‌ సాధన మేలు.
పేపర్‌-2 కార్పొరేట్‌ లాస్‌ అండ్‌ అదర్‌ లాస్‌ (100 మార్కులు)
* ఇటీవల కొత్తగా కలిపిన చాప్టర్లు, కొత్త సవరణలపై ప్రత్యేకంగా శ్రద్ధవహించాలి. ‌
* కంపెనీల చట్టంలో ఇంతకు పూర్వం సరళమైన ప్రశ్నలను నేరుగా అడిగేవారు. కష్టతరమైన, ఆచరణాత్మకమైన ప్రశ్నలు చాలా తక్కువగా ఉండేవి. కంపెనీల చట్టానికి ప్రాముఖ్యం పెరిగింది. కాబట్టి థియరీలో ఆచరణాత్మక ప్రశ్నలు అడిగే అవకాశం ఎక్కువ. కాబట్టి కొత్త సిలబస్‌ ప్రకారం కంపెనీ లాపై ఎక్కువ దృష్టి సారించాలి.
పేపర్‌-3 కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటింగ్‌ (100 మార్కులు)
‌‌* కనీసం గత 5 పరీక్షల ప్రశ్నపత్రాల్లోని థియరీ ప్రశ్నలను చదవడం వల్ల మంచి మార్కులు సాధించవచ్చు.
* ప్రతి చాప్టర్‌లోని ఫార్ములాలను గుర్తుంచుకోవాలి. అన్నింటినీ ఒక పుస్తకంలో రాసుకుని చదవాలి. ‌
* కొత్తగా కలిపిన చాప్టర్లు- యూనిట్‌ కాస్టింగ్‌, ఏబీసీ కాస్టింగ్‌, సర్వీస్‌ కాస్టింగ్‌, మార్జినల్‌ కాస్టింగ్‌ వంటి వాటిపై ఎక్కువ దృష్టిపెట్టాలి.
పేపర్‌-4 టాక్సేషన్‌ (100 మార్కులు) ఇన్‌కంటాక్స్‌ (60 మార్కులు)
‌‌* ఇటీవలి సవరణలను (ఫైనాన్స్‌ యాక్ట్‌ 2016+ ఫైనాన్స్‌ యాక్ట్‌ 2017) బాగా చదవాలి. వీటి నుంచి 10-15 మార్కుల వరకూ ప్రశ్నలు అడిగే అవకాశముంది.
ఇన్‌డైరెక్ట్‌ టాక్సెస్‌ (40 మార్కులు)
‌‌* సీఏ-ఐపీసీసీ పాత సిలబస్‌, సీఏ ఇంటర్‌ కొత్త సిలబస్‌ ప్రకారం పరీక్ష రాసే విద్యార్థులందరికీ మే 2018 పరీక్షలకు వస్తు సేవా పన్ను (జీఎస్‌టీ) వర్తిస్తుంది. కాబట్టి పాత, కొత్త సిలబస్‌ల విద్యార్థులందరూ జీఎస్‌టీని తప్పక చదవాలి.
పేపర్‌-5 అడ్వాన్స్‌డ్‌ అకౌంటింగ్‌ (100 మార్కులు)
‌‌* అకౌంటింగ్‌ స్టాండర్డ్స్‌ను తప్పనిసరిగా చదవాలి.‌
* ఫార్మాట్స్‌ ఉన్న చాప్టర్లను బాగా సాధన చేయాలి. ‌
* సాధ్యమైనన్ని ఎక్కువ లెక్కలు చేయటం మేలు.
పేపర్‌-6 ఆడిటింగ్‌ అండ్‌ అస్యూరెన్స్‌ (100 మార్కులు)
‌‌* ఆడిటింగ్‌ సబ్జెక్టులో అన్ని చాప్టర్లలో ప్రాక్టికల్‌ ప్రశ్నలను చదవాల్సిన అవసరం లేదు. కంపెనీ ఆడిట్‌ చాప్టర్‌లోని ప్రాక్టికల్‌ ప్రశ్నలను చదివితే సరిపోతుంది. ర్యాంకు లక్ష్యంగా ఉన్న విద్యార్థులైతే అన్ని చాప్టర్లలో ప్రాక్టికల్‌ ప్రశ్నలను చదవాల్సి ఉంటుంది. ‌ ఇటీవలి పరీక్షల్లో ఆడిటింగ్‌పై తప్పు, ఒప్పు (ట్రూ/ ఫాల్స్‌) ప్రశ్నలను 20 మార్కుల వరకూ ఇచ్చారు. కాబట్టి విద్యార్థులు ఇటువంటి ప్రశ్నలపై కూడా దృష్టిపెట్టాలి.
పేపర్‌-7 ఎంటర్‌ప్రైజ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌ (100 మార్కులు)
‌‌* ఈ రెండు సబ్జెక్టులు కూడా సాధ్యమైనన్ని ఎక్కువసార్లు పునశ్చరణ చేయాలి. వీలైతే ఈ రెండు సబ్జెక్టులకు ఫాస్ట్‌ ట్రాక్‌ మెటీరియల్‌ను తయారుచేసుకుని చదివితే మంచిది.
‌‌* ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు, డెఫినిషన్లు, వ్యత్యాసాలు, తప్పు, ఒప్పుల ప్రశ్నలు వంటి వాటి పట్ల శ్రద్ధవహిస్తే సులువుగా మార్కులను పొందొచ్చు.
ఎంటర్‌ప్రైజ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం (50 మార్కులు)
* ఈ పేపర్‌లో చాలా అంశాలు సీఏ ఫైనల్‌లోని ఐఎస్‌సీఏ అనే సబ్జెక్టు నుంచి తీసుకున్నారు. ఐఎస్‌సీఏ అంటే విద్యార్థులు సహజంగా కొంచెం కష్టంగా భావిస్తారు. ఈ సబ్జెక్టులోనూ మంచి మార్కులు సాధించాలంటే ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు, డెఫినిషన్లు, వ్యత్యాసాలు, తప్పు, ఒప్పుల ప్రశ్నలను బాగా చదవాల్సి ఉంటుంది. పాత సిలబస్‌లో ఇలాంటి ప్రశ్నలకు పెద్దగా అవకాశం ఉండేది కాదు. కానీ కొత్త సిలబస్‌ ప్రకారం ఇటువంటి ప్రశ్నలు వస్తాయని భావిస్తున్నారు.
స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌ (50 మార్కులు)
‌* ఈ సబ్జెక్టులో ప్రశ్నలను నేరుగా కాకుండా రకరకాలుగా అడుగుతారు. సన్నద్ధత సమయంలో అలాంటి ప్రశ్నలు వీలైనన్ని ఎక్కువ చదవాలి. ‌
* ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు, డెఫినిషన్లు, వ్యత్యాసాలు, తప్పొప్పుల ప్రశ్నలను బాగా చదవాలి.
పేపర్‌-8 ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ (60 మార్కులు)

‌‌* 25-30 మార్కుల వరకూ థియరీ ప్రశ్నలను అడిగే అవకాశముంది. కనీసం గత అయిదేళ్ల ప్రశ్నపత్రాల్లోని థియరీ ప్రశ్నలు.. ప్రత్యేకించి సోర్సెస్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌, స్కోప్‌ అండ్‌ ఆబ్జెక్టివ్స్‌ ఆఫ్‌ ఎఫ్‌ఎం వంటి చాప్టర్లకు సంబంధించిన థియరీ ప్రశ్నలను చదవాలి.
* కొత్తగా కలిపిన రిస్క్‌ అనాలిసిస్‌, లీజింగ్‌ అండ్‌ డెసిషన్స్‌ వంటి చాప్టర్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
ఎకనామిక్స్‌ ఫర్‌ ఫైనాన్స్‌ (40 మార్కులు)
* నేషనల్‌ ఇన్‌కం అకౌంటింగ్‌: సూత్రాలు, కాన్సెప్ట్‌, జాతీయాదాయం లెక్కించడం వంటి అంశాలు బాగా చదవాలి.

Back..

Posted on 26-04-2018