Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ప్రయోగాల విద్య నైపుణ్యాల పంట

* 'క్రియా లెర్నింగ్‌'తో బోధనలో కొత్త ఒరవడి
* విద్యార్థుల్లో సృజన పెంచటమే లక్ష్యం

ఈనాడు, హైదరాబాద్‌: 'కాలంతోపాటు నగరాలు, నాగరికతలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. రవాణా, నిర్మాణాలు, వ్యవసాయం, వాణిజ్యం, సంస్కృతి, జీవనశైలి ఇలా ప్రతి అంశంలో కొత్తదనం ఆవిష్కృత మవుతోంది. దూర ప్రాంతాల్లోని బంధు వులకు ఉత్తరాలు రాసే పరిస్థితి నుంచి వీడియో కాన్ఫరెన్సులో చూస్తూ మాట్లాడే దశకు చేరుకు న్నాం. ఒకప్పుడు నాటు మందులతో వైద్యం.. నేడు డిజిటల్‌ శస్త్రచికిత్సలు. కానీ వందల సంవత్సరాల నుంచి అదే తరగతి గది, పాఠశాల ప్రాంగణం, బ్లాక్‌బోర్డు, చాక్‌పీస్‌, డస్టర్‌, కుర్చీ. బ్రిటీష్‌ వారు తీసుకొచ్చిన విద్యావిధానంలో మాత్రం మార్పులు రాలేదు' అంటున్నారు హరి, వెంకట్‌, ప్రవీణ్‌. విదేశాల్లో లక్షల జీతం వచ్చే ఉద్యోగాలు మానేసి 'క్రియా లెర్నింగ్‌' సంస్థ ద్వారా దేశంలో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రయత్నిస్తున్నారు.
* ప్రాంతాల వారీగా పాఠ్యాంశాలు...
పిల్లల్లో ఆలోచనా శక్తి, తెలివితేటలు పెంచేలా స్టూడియో లెర్నింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టాం. ఋషి సంస్కృతి విద్యావిధానం అంతరించిపోయాక విద్యార్థుల్లో ఆలోచన, విశ్లేషణ, పరిశోధన, ప్రయో గాత్మక మెలకువలు మరు గున పడ్డాయి. వాటిని తిరిగి మేల్కొలిపేలా క్రియ లెర్నింగ్‌ 21వ శతాబ్దపు సాంకేతిక అవసరాలను గుర్తించింది. సంస్థను స్థాపించే ముందు నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అధ్యయనం చేసి పిల్లల్లోని లోపాలను గుర్తించాం. ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలను పరిశీలించి పలు ఆసక్తి కర అంశాలను తెలుసు కొన్నాం. నగరం, పట్టణం, గ్రామీణ చిన్నారుల్లో జ్ఞాపక శక్తి, విషయ సంగ్రహణశక్తుల్లో భారీ వ్యత్యాసం ఉంది. దానికి పరిష్కారం ఆయా ప్రాంతాలకనుగుణంగా పాఠ్యప్రణాళిక తయారు చేయడం. అప్పుడే పదో తరగతి పూర్తయ్యేలోపు అందరినీ నైపుణ్యమున్న విద్యార్థులుగా చేయగలం. సంస్థ తరఫున అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర, స్థాయి సిలబస్‌లలో వేర్వేరు అంశాలు రూపొందించాం. విద్యార్థుల్లో నానాటికీ తగ్గిపోతున్న తెలివితేటలు, కొత్తగా ఆలోచించే తీరును చిన్నవయసు నుంచే అభివృద్ధి చేస్తున్నాం.. ఇప్పటికే దిల్లీ, హైదరాబాద్‌, పుణె నగరాల్లో.. కర్ణాటక, రాజస్థాన్‌ వంటి పలు రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టు విజయవంతంగా కొనసాగుతోందని వ్యవస్థాపక సభ్యుడు వెంకట్‌ చెబుతున్నారు.
* ఇది సులువైన ప్రయోగశాల..
పిల్లలకి ఆడుకోవడం ఇష్టం. ఆట వస్తువులతో చెప్పే చదువు వారికి చాలాకాలం గుర్తుంటుంది. అందుకే అలాంటి ఉపకరణాలను ఇస్తాం. గణితం, సాంకేతికత, భౌతిక, సామాజిక శాస్త్రాలకు సంబంధించిన అంశాలతో కూడిన ప్రయోగాల పుస్తకాలను తరగతుల వారీగా తయారుచేశాం. యంత్రాలు, భవనాలు, నిర్మాణాలు, ఇతర వస్తువులు తయారు చేసేందుకు అవసరమైన టూల్‌ కిట్లను పాఠశాలల్లో అందుబాటులో ఉంచుతాం. సుశిక్షితులైన అధ్యాపకులను నియమించి ప్రతి విద్యార్థిని వ్యక్తిగతంగా అధ్యయనం చేస్తాం. ఉదాహరణకు క్రేన్‌తో భారీ కార్గో ఓడ నుంచి వస్తువులను అన్‌లోడ్‌ చేయాలి... ఈ ప్రయోగంలో క్రేన్‌, ఓడ, కంటైనర్లు, లారీలు, నిల్వ కేంద్రాలు అవసరం. ఇలాంటి నిజమైన వీడియో దృశ్యాన్ని ముందుగా పిల్లలకు చూపిస్తాం. తర్వాత ఆయా వాహనాలు, అవసర మైన వస్తువులను వారి ముందు ఉంచితే.. వాటిలోంచి ఉపయోగపడే వాటిని ఎంచుకునేందుకు మేధో మథనం చేస్తారు.ఆలోచన మొదలై.. నిర్మాణాత్మక ప్రయోగంతో ఫలితం సాధిస్తారు. చేసిన ప్రయోగాన్ని పుస్తకంలో రాసి తోటివారికి వివరించాలి. విద్యార్థులంతా సమూహంలా పనిచేయడం వల్ల సందేహాలను ఒకరితో ఒకరు పంచుకొని పరిష్కరించుకునే వాతావరణం ఏర్పడుతుందని సంస్థ భావిస్తోంది.ఫొటోగ్రఫీ, సామాజిక అంశాలు, కళలూ అభ్యాసంలో ఉంటాయి.
* ఆలోచనలు కలవటంతో..
అమెరికాలోని 'నాలెడ్జ్‌ యూనివర్స్‌' సంస్థలో విధులు నిర్వర్తిస్తున్న వీరిలో కె.హరివర్మ ముంబయిలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ ఇంజినీ రింగ్‌లో పరిశ్రమల నిర్వహణ కోర్సు చేశారు. కొంతకాలం టాటా కంపెనీలో చేరి సింగపూర్‌ వెళ్లారు. 2001లో అమెరికాలోని నాలెడ్జ్‌ యూనివర్స్‌ సంస్థకు మారారు. అదే సంస్థలో పనిచేస్తున్న ప్రవీణ్‌ కన్సల్టెన్సీలో, వెంకట్‌ మార్కెటింగ్‌లో ప్రావీణ్యులు. ముగ్గురి ఆలోచనలు కలవటంతో రూ.80 లక్షలతో 'క్రియా లెర్నింగ్‌' సంస్థను స్థాపించారు. వీరి ప్రాజెక్టు గురించి తెలుసుకున్న ముంబయి వ్యక్తి రూ.20 కోట్ల పెట్టుబడి పెట్టారు. దీంతో సంస్థ విస్తరించి.. 2014 సంవత్సరానికి రూ.14 కోట్ల టర్నోవర్‌ సాధించారు.
* పాఠశాలలతో అనుబంధం..
క్రియ లెర్నింగ్‌ హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా అన్ని రాష్ట్రాల్లో పని చేస్తోంది. దేశవ్యాప్తంగా కార్పొరేట్‌ స్కూళ్లలో ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్న ఈ సంస్థ 2011లో పురుడు పోసుకుంది. నగరంలోనూ నాలుగు పాఠశాలల్లో వీరి స్టూడియో నిర్వహిస్తున్నారు. సుమారు 30వేల మంది పిల్లలను ఈ స్టూడియోతో ఏకం చేశారు. అవసరాన్ని బట్టి ఆయా విద్యా సంస్థలు వీరికి 30 గంటల నుంచి 300 గంటల వరకు సమయం కేటాయిస్తాయి. దానికి తగ్గట్టుగా ప్రాజెక్టు డిజైన్‌ ఉంటుంది. వారానికి రెండు, మూడు రోజులు తరగతులు నిర్వహిస్తారు. ప్రతి విద్యార్థిపై పర్యవేక్షణ ఉంచి వేర్వేరు నైపుణ్య వివరాలను నమోదు చేస్తారు. ఎలాగంటే.. ఆంగ్లంలో పిల్లాడు వెనకబడి ఉన్నాడని గుడ్డిగా చెప్పకుండా.. ఆంగ్లంలో వ్యాకరణం, అక్షర దోషాలు, ముఖ్యమైన పదాలు.. ఇలా లోపాల్ని లోతుగా అధ్యయనం చేసేలా ప్రణాళిక ఉంటుంది.

posted on 31.3.2015