Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
పరీక్షల నిర్వహణే అసలు సవాల్

* సాంకేతిక పరిజ్ఞానంత కాపీయింగ్‌పై కలవరం
* పరీక్ష కేంద్రంలోకి తలపిన్నులు, చెవి ఆభరణాలు వద్దు
* సమీప భవిష్యత్తులో మరిన్ని మార్పులు

ఈనాడు, హైదరాబాద్: పోటీ, ఉద్యోగ పరీక్షకు వెళుతున్నారా.. కలం, పెన్సిల్ నిషేధం... ఆశ్చర్యపోకండి! ఇప్పటి వరకు అది విచిత్రం కావొచ్చుగానీ... భవిష్యత్తులో అదీ జరగొచ్చు. ఇటీవల పరీక్షల్లో వెలుగు చూస్తున్న అక్రమాలు గమనిస్తుంటే పరీక్ష నిర్వహణ అదే దిశలో వెళ్తోంది. ఒక్కొక్క అక్రమం బయట పడేకొద్దీ అభ్యర్థులు తెచ్చుకొనే వస్తువులపై నిషేధం పెరుగుతూ వస్తోంది.
ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశానికి ఎన్నో పరీక్షలు... వైద్య కోర్సునకు ఇంకెన్నో. వైద్య విద్య సీట్లకు భారీ పోటీ ఉంటుంది. వందల్లో సీట్లు ఉండటం... పోటీ పడేవారి సంఖ్య లక్షల్లో ఉంటుండడంతో తరచూ దేశంలో ఏదో ఒక పరీక్షలో అక్రమాలు, అవకతవకలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. వాటి నిరోధానికి అధికారులు ఒక ఎత్తు వేస్తే... కొందరు విద్యార్థులు మరో రకమైన అక్రమానికి తెర తీస్తున్నారు. ఒకప్పుడు ఎలక్ట్రానిక్ కాలిక్యులేటర్లు మాత్రమే నిషేధమనే వారు. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్కు సంబంధించిన ప్రతి వస్తువునూ అనుమతించడం లేదు. వాటితోపాటు ఇతర వస్తువుల్లో ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు పెట్టి హైటెక్ కాపీయింగ్కు పాల్పడతారోనని తలపిన్నులు, చెవి ఆభరణాలూ, చేతి గడియారాలు కూడా నిషేధిత జాబితాలో చేర్చారు.
* కాపీయింగ్ ఇలా...
అత్యాధునిక ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను హైటెక్ కాపీయింగ్కు అక్రమార్కులు వినియోగిస్తున్నారు. వైర్లెస్ ఇయర్ ఫోన్లు, వాటిల్లో సిమ్ కార్డు ద్వారా...మైక్రో ఫోన్లు, స్కాన్ చేసి సమాచారాన్ని వేరొక చోటుకు బదిలీ చేసేందుకు అవకాశమున్న ఎన్నో చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలు మార్కెట్లో వస్తున్నాయి. హైటెక్ కాపీయింగ్కు పాల్పడేందుకు ఎలాంటి పరికరాలు కావాలో కూడా అంతర్జాలంలో వివరంగా ఉంచుతున్నారు. రాసే కలంతోనే కాపీయింగ్కు పాల్పడే అవకాశం లేకపోలేదు. మున్ముందు కళ్లలో లెన్సు పెట్టుకొని ప్రశ్నాపత్రాన్ని చూస్తూ బయటకు ప్రశ్నలను చేరవేసేవి రావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. సమీప భవిష్యత్తులో పరీక్ష రాసేందుకు కలాలూ తామే సమకూరుస్తామని ప్రకటించే రోజు రావచ్చని జేఎన్టీయూహెచ్ ఆచార్యులు కొందరు అభిప్రాయ పడుతున్నారు.
* వస్తువుల నిషేధం...
ఎంసెట్ పరీక్ష: గత మేలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఎంసెట్కు చేతి గడియారాలనూ నిషేధించారు. ఎన్నో రకాల ఆధునిక చేతి గడియారాలు వచ్చాయి. వాటి ద్వారా ప్రశ్నపత్రాన్ని స్కాన్ చేసి బయట ఉన్న వారికి పంపించే అవకాశం ఉన్న చేతి గడియారాలు మార్కెట్లోకి వచ్చాయి. దాంతో అసలు చేతి గడియారాలే వద్దని నిబంధన విధించారు.
ఏపీపీఎంటీ పరీక్ష: ఈ పరీక్షలో అక్రమాలు చోటుచేసుకున్నాయని న్యాయస్థానం నిర్ధరించి మళ్లీ పరీక్ష పెట్టాలని ఆదేశించింది. దీనిని జులై 25న నిర్వహించారు. అక్రమాలు వెలుగు చూసిన నేపథ్యంలో సీబీఎస్ఈ అధికారులు అభ్యర్థులకు పలు నిబంధనలు విధించారు. పరీక్షా కేంద్రంలోకి ఏఏ వస్తువులు తీసుకు రాకూడదో తేల్చిచెప్పారు. ఉంగరాలు, బ్రాస్లెట్లు, పెద్ద పెద్ద బొత్తాలు, పొడుగు చేతులు ఉన్న దుస్తులు వేసుకొని రావొద్దని స్పష్టం చేశారు.పెద్దగా ఉండే తలపిన్నులు, చెవి ఆభరణాలూ ధరించకూడదని పేర్కొన్నారు..
గేట్ పరీక్ష: బీటెక్, బీఫార్మసీ, ఎంఎస్సీ, ఎంసీఏ తదితర విద్యార్హత ఉన్నవారు తర్వాత ఎంటెక్ కోర్సులో చేరేందుకు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగానికి అర్హత సంపాదించేందుకు ఏటా లక్షలాదిమంది గేట్ పరీక్ష రాస్తుంటారు. ఐఐటీలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) పరీక్ష నిర్వహిస్తాయి. ఈ పరీక్షను ఈసారి వచ్చే జనవరి 30 నుంచి ఫిబ్రవరి 7 వరకు ఆన్లైన్ ద్వారా జరుపుతారు. గత ఏడాది వరకు కాలిక్యులేటర్ను అనుమతించే వారు. ఈసారి అధికారులే వర్చువల్ కాలుక్యులేటర్ను అందించబోతున్నారు.
సివిల్ సర్వీసెస్: ఆగస్టు 23న నిర్వహిస్తున్న ఈ పరీక్షకు యూపీఎస్సీ పలు నిబంధనలు విధించింది. పరీక్షా కేంద్రంలోకి ఐటీ గ్యాడ్జెట్లు, మొబైల్ ఫోన్లు నిషేధించింది వాటితో కంటపడితే మరోసారి సివిల్స్ రాయనివ్వబోమంది. కేంద్రాల వద్దకు బ్యాగులనూ తీసుకురావొద్దంది. వికలాంగ అభ్యర్థులు పరీక్ష రాయడానికి సహకరించే వారికి సరైనఅనుమతి పత్రాలు ఉంటేనే లోపలికి రానిస్తామంది.
* ఎన్నో గుణపాఠాలు
2008లో తిరుపతిలో, 2010లో కడపలో ఎంసెట్ మెడికల్లో అక్రమాలకు పాల్పడుతూ ఓ ముఠా పట్టుపడింది. గత ఏడాది డిసెంబరులో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(ఆర్ఆర్బీ) పరీక్షలో ఇయర్ఫోన్లో సిమ్కార్డు పెట్టి దానినుంచి బ్లూటూత్ ద్వారా బయట వ్యక్తులకు ప్రశ్నలు పంపిస్తూ ముఠా దొరికిపోయింది. ఇక దేశంలో వివిధ ప్రాంతాల్లో వెలుగు చూస్తున్నవి ఎన్నో ఉన్నాయి.
* ఆ ఒక్కరిద్దరు కోసం సన్నద్ధమవ్వాల్సిందే - ఆచార్య వి.కామాక్షి ప్రసాద్, సీఎస్ఈ విభాగాధిపతి, జేఎన్టీయూహెచ్
లక్షల్లో విద్యార్థులు పరీక్షలు రాస్తుంటే అక్రమ మార్గాన ర్యాంకులు సాధిద్దామనే ఆలోచన చేసేవారు 0.5 శాతం కంటే తక్కువే ఉంటారు. అలాంటి వారికి అవకాశం ఇవ్వకుండా కనిపెట్టడం అధికారులకు సవాల్. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోతున్న నేపథ్యంలో కాపీయింగ్కు ఏవస్తువులో ఏముందో తెలియని పరిస్థితి. వైద్యపరంగా అకస్మాత్తుగా కొత్తగా ఓ వైరస్ లేదా బ్యాక్టీరియా ప్రబలుతుంది. దానికి సాధ్యమైనంత త్వరగా టీకాలు తయారుచేసి ఎదుర్కొంటాం. పరీక్షల విషయంలోనూ అదేపంథా. కాపీయింగ్కు వీలున్న మార్గాలను మూసేయాలి. ఒక్కో ఘటన వెలుగు చూసేకొద్దీ మరిన్ని మార్గాలను మూసేయాల్సిందే.

Posted on 12.08.2015