Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఐహెచ్ఎంల్లో ప్రవేశానికి ఉమ్మడి ప‌రీక్ష

     ఇంజినీరింగ్ పేరెత్తగానే ఐఐటీలు, మేనేజ్‌మెంట్ కోర్సుల‌న‌గానే ఐఐఎంలు, ఫ్యాష‌న్ ఊసెత్తగానే నిఫ్ట్ సంస్థలు గుర్తుకొస్తాయి. మ‌రి హోట‌ల్ మేనేజ్‌మెంట్ కోర్సుల గురించి మాట్లాడాలంటే? ఐఐటీలు, ఐఐఎంల మాదిరిగానే వీటి కోస‌మూ జాతీయ స్థాయి సంస్థలు ఉన్నాయి. అవే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోట‌ల్ మేనేజ్‌మెంట్ (ఐహెచ్ఎం)లు. దేశ‌వ్యాప్తంగా 21 ఐహెచ్ఎంలు ఉన్నాయి. ఇవి కేంద్ర ప‌ర్యాట‌క శాఖ ఆధ్వర్యంలో న‌డుస్తున్నాయి. ఈ సంస్థల‌ను నేష‌న‌ల్ కౌన్సిల్ ఆఫ్ హోట‌ల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాట‌రింగ్ టెక్నాల‌జీ (ఎన్‌సీహెచ్ఎంసీటీ) ప‌ర్యవేక్షిస్తుంది. మూడేళ్ల వ్యవ‌ధితో బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోట‌ల్ అడ్మినిస్ట్రేష‌న్‌ కోర్సు‌ను ఐహెచ్ఎంలు అందిస్తున్నాయి. ఉమ్మడి ప‌రీక్ష ద్వారా వీటిలో ప్రవేశం ల‌భిస్తుంది. నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాట‌రింగ్ టెక్నాల‌జీ (ఎన్‌సీహెచ్ఎంసీటీ), ఇందిరాగాంధీ నేష‌న‌ల్ ఓపెన్ యూనివ‌ర్సిటీ సంయుక్తంగా అందిస్తున్న హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సుల్లో ప్రవేశానికి ప్రక‌ట‌న వెలువ‌డింది. ఆ వివ‌రాలు చూద్దాం.

ఈ ప‌రీక్ష ద్వారా ప‌లు సంస్థల్లో ప్రవేశం ల‌భిస్తుంది. వీటిలో 21 జాతీయ సంస్థ(ఐహెచ్ఎం)లు, 19 రాష్ట్రీయ, 14 ప్రైవేట్ సంస్థలు, 9 ఫుడ్ క్రాఫ్ట్ ఇన్‌స్టిట్యూట్‌లు, ఒక ప‌బ్లిక్ సెక్టార్ అండ‌ర్‌టేకింగ్ సంస్థ ఉన్నాయి. అన్నింట్లోనూ క‌లిపి 8124 సీట్లు ఉన్నాయి. ప‌రీక్ష ద్వారా ప్రవేశం క‌ల్పిస్తున్న జాతీయ సంస్థల్లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోట‌ల్ మేనేజ్‌మెంట్ (ఐహెచ్ఎం), హైద‌రాబాద్ ఒక‌టి. అలాగే రాష్ట్రీయ సంస్థ అయిన వైఎస్ఆర్ నిథ‌మ్‌- హైద‌రాబాద్ లోనూ ఈ ప‌రీక్ష ద్వారా ప్రవేశం పొంద‌వ‌చ్చు.

అర్హత‌: ఇంట‌ర్ ఉత్తీర్ణత‌. (ద్వితీయ సంవ‌త్సరం చ‌దువుతున్న వాళ్లు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు)

ప‌రీక్ష ఇలా...
200 ప్రశ్నలు ఉంటాయి. వ్యవ‌ధి 3 గంట‌లు. ప్రశ్నప‌త్రం ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. న్యూమ‌రిక‌ల్ ఎబిలిటీ అండ్ ఎన‌లిటిక‌ల్‌ ఆప్టిట్యూడ్ 30, రీజ‌నింగ్ అండ్ లాజిక‌ల్ డిడ‌క్షన్ 30, జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ అండ్ క‌రెంట్ అఫైర్స్ 30, ఇంగ్లిష్ 60, ఆప్టిట్యూడ్ ఫర్ స‌ర్వీస్ సెక్టార్ నుంచి 50 ప్రశ్నలొస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. త‌ప్పుగా గుర్తించిన స‌మాధానానికి పావు మార్కు చొప్పున త‌గ్గిస్తారు. రాత ప‌రీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా మెరిట్ ప్రాతిప‌దిక‌న సీట్లు కేటాయిస్తారు.

కోర్సులు...క‌రిక్యుల‌మ్‌...
ఆతిథ్య రంగంలోకి అడుగెట్టాలంటే హోట‌ల్ మేనేజ్‌మెంట్ కోర్సులు పూర్తిచేయ‌డం త‌ప్పనిస‌రి. ఈ కోర్సులు సాధార‌ణంగా ప‌దో త‌ర‌గ‌తి త‌ర్వాత ప్రారంభ‌మ‌వుతాయి. అయితే ఇంట‌ర్ పూర్తిచేసుకుని మూడేళ్ల డిగ్రీ లేదా ఏదైనా డిప్లొమా కోర్సు చేసిన‌వారికి ఆతిథ్య రంగంపై పూర్తిస్థాయి అవ‌గాహ‌న క‌లుగుతుంది. ఇలాంటివారికి అవ‌కాశాలూ ఎక్కువ‌గా ఉంటాయి. మూడేళ్ల కోర్సులో మొద‌టి ఏడాది ఆతిథ్య రంగంలోని అన్ని అంశాల‌పై అవ‌గాహ‌న క‌ల్గిస్తారు. హౌస్ కీపింగ్‌, ఫ్రంట్ అఫీస్, ఫుడ్ అండ్ బేవ‌రేజెస్‌, ప్రొడ‌క్షన్‌/స‌ర్వీసెస్ త‌దిత‌ర విభాగాల్లో ప్రాథ‌మికాంశాలపై ప‌రిజ్ఞానం క‌ల్పిస్తారు. ఇవేకాకుండా వివిధ కొల‌త‌లు (టీ స్పూన్‌, టేబుల్ స్పూన్‌), ఏవి ఎంత మొత్తంలో వాడాలి, డైనింగ్ టేబుల్ ఎటిక్వెట్స్‌, అతిథితో ఎలా వ్యవ‌హ‌రించాలి...ఇలా ప్రతి అంశం గురించి సూక్ష్మస్థాయితో మొద‌లు పెట్టి, పూర్తిగా అవ‌గాహ‌న క‌ల్పిస్తారు. కోర్సు రెండో సంవ‌త్సరంలో క్షేత్రస్థాయిలో శిక్షణ ఉంటుంది. అంటే విద్యార్థులు ప‌నిచేస్తూ నేర్చుకుంటారు ( లెర్నింగ్ బై డూయింగ్). దీనికోసం ఏదైనా హోట‌ల్ లేదా క్యాట‌రింగ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని త‌ర్ఫీదు అందిస్తారు. మూడో సంవ‌త్సరంలో ఫైనాన్స్‌, బిజినెస్ ఎన్విరాన్‌మెంట్‌, స్ట్రాట‌జిక్ మేనేజ్‌మెంట్ అంశాల గురించి చ‌దువుకుంటారు. హోట‌ల్ అకౌంటెన్సీ, ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ, హ్యూమ‌న్ రీసోర్స్ మేనేజ్‌మెంట్‌, ఫెసిలిటీ ప్లానింగ్‌, ఫైనాన్షియ‌ల్ మేనేజ్‌మెంట్‌, టూరిజం మార్కెటింగ్ అండ్ టూరిజం మేనేజ్‌మెంట్ అంశాల‌నూ పూర్తిస్థాయిలో బోధిస్తారు.

అవ‌కాశాలు అమోఘం...
జిహ్వకో రుచి అనేది నానుడి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో వంట‌కం ప్రసిద్ధి. ప‌నిమీదో, ప‌ర్యట‌న కార‌ణంగానో కొత్త ప్రాంతాల‌కు వెళ్లిన‌ప్పుడు అక్కడి ఘుమ‌ఘుమ‌ల‌ను ఆస్వాదించ‌డం స‌ర్వ సాధార‌ణం. రుచి, వెరైటీ రెండింటికీ ప్రాధాన్యం పెరిగింది. వివిధ రంగాల్లో ఆదాయ వ‌న‌రులు ఆశాజ‌న‌కంగా ఉండ‌డంతో తిండికోసం ఖ‌ర్చుకెవ‌రూ వెన‌కాడ‌డం లేదు. ప‌ర్యాట‌క రంగం కూడా విస్తరించ‌డంతో ఆతిథ్యంలో అవ‌కాశాలు విస్త్రృత‌మ‌య్యాయి. ఈ ప‌రీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగావ‌కాశాల‌కు ఢోకాలేద‌నే చెప్పుకోవ‌చ్చు. ఎందుకంటే ఈ సంస్థల‌న్నీ జాతీయ స్థాయిలో పేరున్నవే. కోర్సును విజ‌య‌వంతంగా పూర్తిచేసుకున్నవాళ్లు మేనేజ్‌మెంట్ ట్రెయినీ హోదాతో హోట‌ళ్లు, రిసార్ట్స్‌ల్లో కెరీర్ ప్రారంభించొచ్చు. చ‌దువుకున్న కోర్సును బ‌ట్టి కిచెన్ మేనేజ్‌మెంట్‌, హౌస్ కీపింగ్ మేనేజ్‌మెంట్‌, ఫ్లైట్ కిచెన్స్‌/ ఆన్‌బోర్డ్ ఫ్లైట్ సర్వీసెస్‌, వివిధ సేవా ప‌రిశ్రమ‌ల్లో గెస్ట్‌/ క‌స్టమ‌ర్ రిలేష‌న్ ఎగ్జిక్యూటివ్‌, ఫాస్ట్‌ఫుడ్ చెయిన్స్‌లో ఎగ్జిక్యూటివ్‌, క్యాట‌రింగ్ సంస్థలు, షిప్పుల్లో స‌ప్లై, కిచెన్ సెక్షన్ ఉద్యోగాలు; ప‌ర్యాట‌క సంస్థలు, కేంద్రాల్లో వివిధ ర‌కాల సేవ‌లు, బ‌హుళ‌జాతి కంపెనీల క్యాంటీన్లు, హౌస్ కీపింగ్‌ నిర్వహ‌ణ‌, హోట‌ల్ మేనేజ్‌మెంట్ క‌ళాశాల‌ల్లో ఫ్యాక‌ల్టీ, సొంతంగా ఫుడ్ చెయిన్ ప్రారంభించ‌డం...త‌దిత‌ర అవ‌కాశాలు ద‌క్కుతాయి. చాలా సంస్థల్లో క్యాంప‌స్ నియామ‌కాలు జ‌రుగుతున్నాయి. ఆతిథ్య, సేవారంగాల‌కు చెందిన సంస్థలు/ కంపెనీల్లో హోట‌ల్ మేనేజ్‌మెంట్ విద్యార్థుల‌కు అవ‌కాశాలు ల‌భిస్తున్నాయి.