Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ మోజు!

* అవగాహనలేకున్నా సాంకేతిక విద్యపై తల్లిదండ్రుల మోజు
* ప్రైవేట్‌ కళాశాలలు చెప్పింది నమ్మేస్తున్న వైనం
* రూ.లక్షల్లో ఫీజుల చెల్లింపులు
* విశ్లేషణ సామర్థ్యం లేకుంటే విద్యార్థులు రాణించలేరంటున్న నిపుణులు

ఈనాడు, అమరావతి, హైదరాబాద్‌: పదో తరగతి ఫలితాలు తేలిపోయాయి. ఉత్తీర్ణులైన విద్యార్థులను ఏం చదివించాలనే విషయంలో తల్లిదండ్రులు ప్రైవేటు కళాశాలల ఒత్తిళ్లకు లొంగిపోతున్నారు. మీ అబ్బాయి/అమ్మాయికి కాస్త శిక్షణిస్తే చాలు ఐఐటీ, ఎన్‌ఐటీ సీటు గ్యారెంటీ అనే కళాశాల యాజమాన్యాల మాయమాటలను గుడ్డిగా నమ్మేస్తున్నారు. తమ పిల్లల శక్తిసామర్థ్యాలను వారు సాధించిన మార్కుల్లోనే చూస్తూ శాస్త్రీయ దృక్పథాన్ని విస్మరిస్తున్నారు. దీంతో రూ.లక్షల్లో ఫీజులు కట్టి ప్రైవేటు జూనియర్‌ కళాశాలల్లో తమ పిల్లలను చేర్పిస్తున్నారు. పదో తరగతిలో 7-8 గ్రేడ్‌ వచ్చినవారు కూడా ఐఐటీ లక్ష్యంగా ప్రవేశాల్ని పొందుతున్నారు. ఫలితంగా వారు చదువులో రాణించలేక మానసికంగా కుంగిపోతున్నారు.

వాస్తవంగా చూస్తే...!
దేశంలో ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర మరికొన్ని కేంద్ర ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యా సంస్థల్లో మొత్తం సీట్లు సుమారు 34,895. వాటి కోసం జేఈఈ మెయిన్‌, అడ్వాన్సుడ్‌ పరీక్షలకు 11.50 లక్షల మంది పోటీ పడుతున్నారు. అంటే సీట్ల కంటే పోటీపడే వారు దాదాపు 33 రెట్లు అధికంగా ఉండటం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో 1.70 లక్షల మంది శిక్షణ పొంది పరీక్ష రాస్తుంటే చివరకు 6,700 మందే ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలు పొందుతున్నారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలని, పిల్లల సామర్థ్యాలను పరిగణనలోనికి తీసుకోవాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు.

ఇంజినీరింగ్‌ లేదా మెడిసిన్‌!
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇంజినీరింగ్‌ అన్నది పలు కోర్సుల్లో అదొకటి.... తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అదొక్కటే కోర్సుగా మారిపోయిందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ పరిస్థితిని ప్రైవేట్‌ కళాశాలలు, శిక్షణ సంస్థలు వ్యాపారంగా మార్చుకుంటున్నాయి. తమ పిల్లలు...ముఖ్యంగా బాలురు ఇంజినీరింగ్‌ కాకుండా ఇతర కోర్సుల్లో చేరితే చిన్నచూపు చూసే పరిస్థితి. అందుకే తమ పిల్లల విద్యా సామర్థ్యం చూడకుండానే ఇంటర్‌లో జేఈఈ మెయిన్‌, అడ్వాన్సుడ్‌కు సమీకృత(ఇంటర్‌ + శిక్షణ) శిక్షణ ఇచ్చే కళాశాలల్లో చేర్పిస్తున్నారు. ఇంజినీరింగ్‌లో ఉన్నంత ధోరణి వైద్య విద్యపై లేదు. వైద్య విద్యలో సీటు కోసం శిక్షణ పొందేవారు ఆలోచించే ముందుకువస్తున్నారు.

శాస్త్రీయత లేదు!
పదో తరగతిలో పాసైతే చాలు ఇంటర్‌లో ఏ గ్రూపు అయినా తీసుకోవడానికి అడ్డేమీ లేదు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, కామర్స్‌, సీఈసీ, ఇతర కోర్సులు ఇంటర్‌ విద్యలో ఉన్నాయి. విద్యార్థి ఆప్టిట్యూడ్‌ను పరీక్షించి (విద్యార్థి ఏ తరహా కోర్సునకు తగినవారవుతారో పరీక్షించడం) ప్రవేశాలు కల్పించే విధానం లేదు. తల్లిదండ్రులు అడగడం...కళాశాలలు చేర్చుకోవడం ఆనవాయితీగా మారింది. ఐఐటీ శిక్షణ తీసుకుంటే కనీసం ఎంసెట్‌లో మంచి ర్యాంకు వస్తుందని చాలా మంది తల్లిదండ్రులు భావిస్తున్నారు. కళాశాలలు విద్యార్థులను గ్రేడ్లు చేసి కొందరికి ఐఐటీలో మంచి ర్యాంకులొస్తాయని ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నారు. విచిత్రమేందంటే వారిలో కూడా చాలా మందికి ర్యాంకులు రావడం లేదు. అంటే అంచనా వేయడంలో శాస్త్రీయత లోపించడం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారు. కొద్ది నెలల క్రితం దేశంలోని పబ్లిక్‌ స్కూళ్ల వార్షిక సమావేశం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఆ సందర్భంగా పదో తరగతి పూర్తయిన తర్వాత ఏదో ఒక శాస్త్రీయ పరీక్ష నిర్వహించి విద్యార్థి ఏ రంగంలో రాణిస్తాడో తెలుసుకుని అలాంటి కోర్సుల్లో చేర్చేలా విద్యా వ్యవస్థల్లో మార్పులు చేయాలని పలువురు నిపుణులు సూచించారు.

పది, ఇంటర్‌ మార్కుల్లో ఛాయిస్‌
పది, ఇంటర్‌ మార్కులను బట్టి ఈ విద్యార్థికి ఐఐటీ, మరో విద్యార్థి ఎన్‌ఐటీ స్థాయి ఉందని అంచనా వేయలేమని శిక్షణ నిపుణులు చెబుతున్నారు. పది, ఇంటర్‌ పరీక్షల్లో ఛాయిస్‌ ఉంటుంది. అప్పుడు విద్యార్థులు బాగా వచ్చిన ప్రశ్నలను ఎంచుకొని సమాధానాలు రాస్తారు. అంతేకాకుండా సగం జవాబు రాసినా కొన్ని మార్కులు వేస్తారు. ప్రవేశ పరీక్షల్లో అలాంటి ఛాయిస్‌గానీ...సగం ఒప్పు అనేవి ఉండదు. అన్ని పాఠ్యాంశాలపై పట్టు ఉంటేనే సమాధానాలు గుర్తించగలుగుతారు.

ప్రధానంగా ఇదీ తేడా...
ఐఐటీ, ఎంసెట్‌ ఓరియంటేషన్‌ వేర్వేరుగా ఉండటం వల్ల విద్యార్థులపై తీవ్ర మానసిక ఒత్తిడి తప్పడం లేదు. దానివల్ల ఇటు ఎంసెట్‌లో కూడా మంచి ర్యాంకులు రావడం లేదు. అంటే ఐఐటీకి, ఎంసెట్‌ చాలా తేడా ఉంది. సిలబస్‌ ఒకటే అయినా ప్రశ్నల స్థాయిలోనే తేడా ఉంటుంది.
ఎంసెట్‌: 3గంటల సమయం. 160 ప్రశ్నలు. మైనస్‌ మార్కులు లేవు. ఓసీలు, బీసీలకు 40 మార్కులు వస్తే ఉత్తీర్ణులైనట్లు లెక్క. అంటే 25 శాతం మార్కులు తెచ్చుకోవాలి. చాలా ప్రశ్నలు నేరుగా ఉంటాయి. అంటే ఒకసారి చదివి జవాబు గుర్తించవచ్చు. మైనస్‌ మార్కులు లేవు కాబట్టి గుడ్డిగా ఏ, బీ, సీ, డీల్లో ఏదో ఒకటి మొత్తం ప్రశ్నలకు పెట్టినా 40 మార్కులు వస్తాయని కొందరు నిపుణులే చెబుతున్నారు. ఇక ఇంటర్‌లో మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉండనే ఉంది.

జేఈఈ మెయిన్‌: 3 గంటల పరీక్ష. మొత్తం 90 ప్రశ్నలు. ఒక్కో ప్రశ్న పరిష్కారానికి 2 నిమిషాల సమయం ఉంటుంది. ఒక్కో దానికి 4 మార్కులు చొప్పున 360 మార్కులకు ప్రశ్నపత్రం ఇస్తారు. తప్పుగా గుర్తిస్తే 1 మార్కు తగ్గిస్తారు. చదివి జవాబు గుర్తించేలా ఉండే ప్రశ్నలు చాలా స్వల్పం. ఎంసెట్‌తో పోల్చుకుంటే 50 శాతం కఠినంగా ప్రశ్నలు ఉంటాయి. ఇక్కడ జ్ఞాపకశక్తి కంటే విశ్లేషణ, పరిష్కార నైపుణ్యాన్ని పరీక్షిస్తారు.
జేఈఈ అడ్వాన్సుడ్‌: ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షల్లో ప్రపంచంలోని కఠినమైన వాటిల్లో ఇదొకటి. ప్రశ్నలు తక్కువ ఉంటాయి. అసలు ఎన్ని మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది? వేటికి రుణాత్మక మార్కులుంటాయో కూడా తెలియదు. అంటే అకస్మాత్తుగా...వూహించని విధంగా ఏ సమస్య వచ్చినా పరిష్కరించేలా ఉండాలన్నది పరీక్ష లక్ష్యం. రెండు మూడు కాన్సెఫ్ట్‌లతో కూడిన ప్రశ్నలు అధికంగా ఉంటాయి. ఒక సమస్యకు పలు పరిష్కారాలు ఉండేలా...ఒక ప్రశ్నకు ఒకటికి మించి జవాబులు ఉండే ప్రశ్నలు ఇస్తారు.

సీటు రావచ్చుగానీ.. వెనకబడతారు
మనిషి ఎదుగుదలకు పలు రకాల పరిజ్ఞానాలు అవసరం. అందులో సబ్జెకు పరిజ్ఞానం ఒకటి. కష్టపడటంగానీ...బట్టీ విధానం వల్లగానీ.. కఠిన శిక్షణ ద్వారా కొందరు ఐఐటీల్లో సీట్లు సంపాదిస్తున్నారు. లోతైన ఆలోచన(క్రిటికల్‌ థింకింగ్‌), విశ్లేషణ సామర్థ్యం లేని వారు తర్వాత రాణించలేరు. కేవలం పరీక్షలను దృష్టిలో పెట్టుకొని సబ్జెక్టు పరిజ్ఞానం కోసం చదవడం వల్ల సీటు రావొచ్చు గానీ...భవిష్యత్తులో కెరీర్‌లో వెనుకబడతారు. 8వ తరగతి నుంచి ఐఐటీకి సిద్ధం కావడంలో తప్పులేదు. కాకపోతే అందులో సమతుల్యత ఉండాలి. తల్లిదండ్రులు కూడా పిల్లల సామర్థ్యాలపై పదో తరగతి వరకు పాఠాల్ని చెప్పిన ఉపాధ్యాయుల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది.
- ఆచార్య రాజ్‌కుమార్‌, సంచాలకుడు, ఐఐటీ భువనేశ్వర్‌


Back..

Posted on 19-06-2017