Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
మీలోని శక్తిని.. నిద్రలేపండి

* భయంతోనే ఇంటర్వ్యూల్లో అభ్యర్థుల విఫలం
* ఆత్మవిశ్వాసమే విజయం మార్గం
* ముందస్తు జాగ్రత్తలు, సూచనలు పాటించాలి

ఈనాడు, హైదరాబాద్‌: ''గత విద్యాసంవత్సరంలో చదువు ముగిసింది. ఈ మధ్యనే కళాశాల నుంచి ధ్రువపత్రాలు పొందాను. కానీ ఉద్యోగం కోసం వెళ్లాలంటే కాళ్లన్నీ వణికిపోతున్నాయి. ఇంటర్వూలో ఏం అడుగుతారు.. వాటికి సమాధానాలు ఇవ్వగలనా.. ఉద్యోగం వస్తుందా.. వస్తే చేయగలనా.. ఆ కంపెనీలో నేను ఇమడగలనా..'' అంటూ రకరకాల ప్రశ్నలను తనకు తానే వేసుకుంటూ మధనపడుతున్నాడు ఎంసీఏ విద్యార్థి అరవింద్‌. చదువుకునే సమయంలో ఉద్యోగ అవకాశాలు పొందే విధానం గురించి కళాశాలలు అవగాహన కల్పించకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని మానసిక నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు.
ఉద్యోగానికి కావాల్సిన అర్హత మీ దగ్గరుంది. గడించిన అనుభవమూ తోడుంది. సాధించే సత్తా, సహనం, పట్టుదల అన్నీ ఉన్నాయి. అయినా ఉద్యోగం లభించట్లేదు. లేదా ఎదుర్కొన్న ప్రతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, మౌఖిక పరీక్షలో వెనకబడుతున్నారు. అయితే మానసిక నిపుణులు వీటికి పలురకాల పరిష్కార మార్గాలను సూచిస్తున్నారు. ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా నిలబడేందుకు నగర యువత సిద్ధమవ్వాలని పిలుపునిస్తున్నారు. మనిషి జీవితం 20శాతమని, మిగిలిన 80శాతం జీవితాన్ని మనం చక్కదిద్దుకునే మార్గంపై ఆధారపడి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
1. నాకే వస్తుందనే ఆత్మవిశ్వాసం..
పేద, మధ్య తరగతులకు చెందినవారు చిన్నప్పట్నుంచి పెరిగిన వాతావరణంతో నూతనత్వాన్ని ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఉద్యోగం కోసం వెళ్లే సంస్థల ప్రాంగణాలను చూస్తే తెలియని ప్రపంచాన్ని చూస్తున్నట్లు అనిపిస్తుంది. దాంతో సహజంగానే ఆందోళన మొదలవుతుంది. ఒక్కసారిగా పెద్ద భవంతుల్లోకి వెళ్లగానే.. కుటుంబ పరిస్థితులు, సామాజిక కారణాలు పిరికితనాన్ని పెంపొందిస్తాయి. వాటివల్లే ప్రతిభ ఉండీ వెనక్కి వెళ్తుంటారని హెచ్‌ఆర్‌ మేనేజర్లు చెబుతున్నారు. అలాంటి అనారోగ్యకర ఒత్తిడులను దూరం చేసుకోవాలని, అవకాశం కోసం ప్రయత్నించే స్థాయికి ఎదిగనప్పుడు.. అందుకునే శక్తి లేదా.. అని అంతరాత్మను ప్రశ్నించుకుంటే ఆత్మవిశ్వాసం వస్తుందని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.
2. లోపలి వేదన బయటకెళ్లాలి..
గెలుపోటముల గురించి మనసులో అనుకునే మాటలు ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. అది మనల్ని చాలా పనులు చేయనివ్వదు. అందుకే ప్రశ్నలకు సమాధానం చెబుతున్నప్పుడు మెదడులోని వేర్వేరు ఆలోచనలను కప్పేసి అడిగే ప్రశ్నలకు జవాబులను చెప్పడంపైనే దృష్టిపెట్టాల్సి ఉంటుంది.
3. అచేతన శక్తిని వెలికి తీయాలి..
మనిషి మెదడులో నిత్యం పనిచేసే చేతనశక్తితో పాటు అచేతన స్థితిలో నిరుపయోగంగా ఉండే బ్రహ్మాండమైన జ్ఞానగని ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. దానిని నిద్రలేపడం దృఢ సంకల్పంతోనే సాధ్యమంటున్నారు. అనుకున్న లక్ష్యాన్ని అలవోకగా చేరుకోగలనని గట్టిగా నిర్ణయించుకుంటే అభ్యర్థి విజయం తప్పక సాధిస్తారు.
4. భాషా పరిజ్ఞానం..
మారుమూల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు మాధ్యమం చదివిన వారికి ఆంగ్లం, హిందీ భాషాల్లో ప్రావీణ్యం తక్కువ ఉంటుంది. కానీ దాదాపు ప్రతి ఉద్యోగానికి వీటిలో ఏదో ఒక భాష వచ్చి ఉండాల్సిన పరిస్థితి. దాంతో భాష బాగా రాదనే భయం ఉన్న నమ్మకాన్ని నీరుగారుస్తుందని, దాన్ని అధిగమిస్తే నత్తినత్తిగా మాట్లాడడం, చెప్పిందే చెప్పడం లేదా పూర్తిగా చేతులెత్తేయడం వంటి అవాంతరాలను సులభంగా అధిగమించొచ్చు. తరచుగా పత్రికలు, పుస్తకాలు చదవడం, వర్తమాన అంశాలపై పట్టు సాధించడం వల్ల భాషా లోపాలు దూరం అవుతాయి.
5. మేథస్సును సంపాదించాలి..
ప్రపంచ ప్రఖ్యాత శాస్రవేత్త అబ్దుల్‌కలాం బ్రాండెడ్‌ దుస్తులు ధరించడం వల్ల ప్రతిభావంతుడు కాలేదు. అద్భుతమైన జ్ఞానాన్ని సముపార్జించి, దానిని దేశసేవకు ఉపయోగించడం వల్లే ఆయన ఆదర్శ పురుషుడయ్యారు. సరిహద్దుల్లేని జ్ఞానసాగరాన్ని లంఘించేందుకు ప్రతి ఒక్కరు ప్రయత్నించాలి. ఉద్యోగానికి వెళ్లే సంస్థ గురించి ముందుగానే అవగాహన పెంచుకోవడం, ఆ రంగం గురించి సమాచారం తెలుసుకోవడం మంచిది. అందులో రాణించేందుకు అభ్యర్థిగా తనకున్న దృష్టిని మెరుగు పరచుకోవాలి.
6. ఎదుర్కొనే ముందు విశ్రాంతి..
ఇంటర్వూ చేసేవారిని కలిసేముందు అభ్యర్థికున్న అదనపు సమయాన్ని విశ్రాంతి తీసుకునేందుకు ఉపయోగించాలి. మనసులో ఎలాంటి ఆందోళన, ఒత్తిడి లేకుండా జాగ్రత్తపడాలంటున్నారు.
7. ఆ స్థలం మీదే..
ఇంటర్వూకి వెళ్లినప్పుడు కొత్త ప్రదేశంలో ఉన్నామనే భావన మంచిది కాదు. సాధారణంగా తిరుగుతూ అందరినీ చూస్తూ నవ్వులు చిందిస్తూ.. ఆ సంస్థ ఉద్యోగిలా ప్రశాంతంగా గడపాలి. గదిలోకి వెళ్లినప్పుడు భుజాల సమానంగా ఉంచి, హుందాగా నవ్వుతూ కూర్చోవాలి.
8. కళ్లను కనిపెడతారు..
అభ్యర్థిలోని శక్తిసామర్థ్యాలు అంచనా వేసేందుకు ఇంటర్వూ చేసేవారు కళ్లలోని భావాలను గమనిస్తుంటారు. మనలోని భయం, బలహీనతలు వాటిలో కనిస్తాయి. చూపు తిప్పుకోవడం, పదేపదే రెప్పలు వాల్చడం, కనుబొమ్మలను దగ్గరగా చేయడమే ప్రధాన లోపాలు. వీటిని అధిగమించేందుకు ఎదుటివారిని తదేకంగా చూస్తూ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. మాటల్లో ధైర్యం, నమ్మకం కొట్టొచ్చినట్లు కనిపించాలి.
9. చక్కగా కూర్చో..
ఇంటర్వూ చేసే గదిలో మెత్తటి సోఫాలు, వెనుకకు వాలిపోయే, చుట్టూ తిరిగే కుర్చీలుంటాయి. అభ్యర్థి వాటిలో కూర్చునే ముందు వెనుకవైపు గట్టి సపోర్ట్‌ ఉండే దాన్ని ఎంచుకుంటే కచ్చితమైన పట్టు దొరుకుతుంది. కుర్చీలో నిటారుగా, ధైర్యంగా, బిడియం లేకుండా సౌకర్యవంతంగా కూర్చోవాలి. ముఖాన్ని నిమురుకోవడం, బంగారు ఆభరణాలను సరిచూసుకోవడం, తల వెంట్రుకలను సరిచేసుకోవడం చేయకూడదు. ఎదుటివారు అడిగినప్పుడే వెంట తీసుకొచ్చిన ఫైల్‌ తెరచి ధ్రువపత్రాలను చూపించాలి.

Posted on 04.08.2015