Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
బహుముఖాముఖి!

ఇంటర్వ్యూ (ముఖాముఖి) ట్రెండ్‌ మారింది. ఇన్‌షర్ట్‌ వేసుకొని, ఫైల్‌ పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరిగే పాత కాలానికి దాదాపు తెరపడింది. ఎక్కడున్నా.. ఎంత దూరంలో ఉన్నా ఇప్పుడు ఇంటర్వ్యూ చేసేస్తారు. ఎదురుగా కూర్చొబెట్టి ఎంటర్‌టెయిన్‌ చేస్తారు. ఫోన్‌లో పలకరిస్తారు. వీడియోలో విశ్లేషిస్తారు. గుంపులో నుంచీ గుట్టు పట్టేస్తారు. అన్నివైపులా చేరి అదరగొడతారు. ఆత్మవిశ్వాసంతో ధీమాగా ఉంటే సంస్థలోకి ఆహ్వానిస్తారు.

‘కం గ్రాట్స్‌.. మీ రెజ్యూమె ఎంపికైంది. మీకు ఫలానా రోజు ఇంటర్వ్యూ’.. ఇలాంటి కాల్‌ వస్తే ఎఫ్‌బీలో మన పోస్టింగ్‌కి గంటలో వంద లైక్‌లు వచ్చినంత ఆనందం వస్తుంది. తర్వాత ఏంటి? ఇంటర్వ్యూ. మళ్లీ టెన్షన్‌ మొదలు. ఏం అడుగుతారో.. ఏం చెప్పాలో? అంత ఒత్తిడి అవసరం లేదు. మనకేం తెలుసు, మన వ్యక్తిత్వం ఏమిటి, ఉద్యోగానికి సరిపోతారా లేదా... ఇంతే ఇంటర్వ్యూ లక్ష్యం. సంస్థ అవసరాలను బట్టి నాయకత్వ లక్షణాలు, కస్టమర్‌ సర్వీస్‌, సమస్య సాధన నైపుణ్యాలు, నిజాయతీ తదితరాలను అంచనా వేస్తారు. కాకపోతే సంస్థ, దరఖాస్తు చేసుకున్న ఉద్యోగాన్ని బట్టి ఇంటర్వ్యూల తీరు మారుతుంటుంది. సమాచారం ఇచ్చేటప్పుడే ఎలాంటి ఇంటర్వ్యూ నిర్వహిస్తారో రిక్రూటర్లు చెబుతారు. ఒకవేళ చెప్పకపోయినా అభ్యర్థులే నేరుగా అడగొచ్చు.

ఫోన్‌ - ఒత్తిడి తక్కువ
సాధారణంగా ఈ ఇంటర్వ్యూను అభ్యర్థి సంస్థకు దూరంగా వేరే ప్రాంతాల్లో ఉన్నప్పుడు నిర్వహిస్తారు. ఒక్కోసారి ప్రత్యక్ష ముఖాముఖికి ఎంచుకోవచ్చో లేదో నిర్ణయించడానికి కూడా ఫోన్‌లో మాట్లాడతారు. ఇందులో ప్రధానంగా అభ్యర్థి సమాధానాలు చెప్పేటపుడు గొంతు ఏ స్థాయిలో ఉందో పరిశీలిస్తారు. ఫోనులో అభ్యర్థి ప్రవర్తన గమనించి వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు. రిక్రూటర్‌ నేరుగా లేకపోవడంతో కొంత ఒత్తిడి తగ్గుతుంది. సాధారణ ఇంటర్వ్యూ కంటే ఇది తక్కువ సమయంలో అయిపోతుంది. ఫోన్‌ ఇంటర్వ్యూ సుమారు 20-30 నిమిషాలు ఉంటుంది. మీకు వీలుకాని సమయంలో రిక్రూటర్‌ ఫోన్‌ చేస్తే కంగారు పడాల్సిన పనిలేదు. ఫలానా టైమ్‌కి చేయమని అడగవచ్చు. దాని వల్ల ఎలాంటి నష్టం ఉండదు. ఇంటర్వ్యూ షెడ్యూల్‌ ముందుగానే తెలిస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నిశ్శబ్దంగా ఉండే స్థలాన్ని ఎంచుకోవాలి. సిగ్నల్స్‌ సరిగా ఉండే చోటును చూసుకోవాలి. కాల్‌ వెయిటింగ్‌ రాకుండా జాగ్రత్త పడాలి. ఫోన్‌ ఛార్జింగ్‌ పెట్టుకోవాలి.
* ఆత్మవిశ్వాసంతో, ఆనందంగా మాట్లాడాలి. దీనికి ముందు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. ఆ సంస్థలో పనిచేయడానికి ఉత్సాహంగా ఉన్నారని తెలియజేయాలి.
* టీవీ చూడటం, అనాసక్తిగా మాట్లాడటం, తినడం, తాగడం లాంటివి చేయకూడదు. ఇంటర్వ్యూ చేసేవారికి తగిన గౌరవాన్ని ఇవ్వాలి.
* ముఖ్యమైన కాగితాలు, రెజ్యూమెతోపాటు ఒక నోట్‌ప్యాడ్‌, పెన్నునూ దగ్గరుంచుకోవాలి.
* ఏమైనా అడుగుతుంటే మధ్యలో జోక్యం చేసుకుని ఆపకూడదు. ప్రశ్న పూర్తిచేసేంత వరకూ ఆగి, సమాధానం ఇవ్వాలి. మీలోని లిసనింగ్‌ స్కిల్స్‌ను అంచనా వేయడానికి ఇది తోడ్పడుతుంది.
* ఇంటర్వ్యూ పూర్తయ్యాక ‘థాంక్స్‌’ చెప్పాలి.

వీడియో - చూస్తూ.. నవ్వుతూ!
ఇప్పుడు ఇంటర్నెట్‌ అందరికీ అందుబాటులో ఉంది. టెలిఫోన్‌కు ప్రత్యామ్నాయంగా కూడా వీడియో ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. ఎక్కువ దరఖాస్తులు లేదా అభ్యర్థి అందుబాటులో లేనపుడు ఇలాంటివి జరుపుతారు. ఇది దాదాపు ఫేస్‌ టూ ఫేస్‌ ఇంటర్వ్యూలాగే ఉంటుంది. సమయం, డబ్బు వృథాను అరికట్టడానికి కూడా సంస్థలు ఈ విధానాన్ని ఎంచుకుంటున్నాయి. అయితే ఈ తరహా ఇంటర్వ్యూల్లో అభ్యర్థిని నేరుగా ప్రశ్నలు అడగడంపై దృష్టిపెడతారు. వ్యక్తిగత ఇంటర్వ్యూల్లోలా చుట్టూ పరిస్థితులకు అభ్యర్థి అలవాటుపడే అవకాశం ఇవ్వరు. సిగ్నల్స్‌ సరిగా ఉండే, ఆటంకాలు లేని స్థలాన్ని ఇంటర్వ్యూకి ముందే ఎంచుకోవాలి. వాయిస్‌ సరిగా వినిపించే ఏర్పాటు చేసుకోవాలి. మధ్యలో వేరే కాల్స్‌, నోటిఫికేషన్లు రాకుండా జాగ్రత్తపడాలి. చక్కని వెలుతురు ఉండేలా చూడాలి. ఇది సాధారణంగా 30 నిమిషాల్లో ముగుస్తుంది.
* ఫార్మల్‌ దుస్తులనే ఎంచుకోవాలి. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.
* ఇంటర్వ్యూ పూర్తయ్యేవరకూ కెమెరా వైపే చూస్తుండాలి. నవ్వు ముఖంతో ఉండాలి. కాళ్లు ఊపడం, పెన్నుతో ఆడటం వంటివి చేయకూడదు. మైక్రోఫోన్‌లో చిన్న శబ్దాలు కూడా వినిపిస్తాయి.
* ఏదైనా వినపడకపోతే మళ్లీ అడగవచ్చు. అంతేకానీ తోచిన సమాధానాన్ని చెప్పకూడదు.
* సమాధానాల్లో ఆత్మవిశ్వాసం ఉండాలి. ఇంటర్వ్యూ పూర్తయ్యాక ‘థాంక్యూ’ చెప్పాలి. ఎదుటివారు కాల్‌ కట్‌ చేసేవరకూ వేచి ఉండాలి.

వన్‌ టు వన్‌ - ధీమాగా
సంప్రదాయ పద్ధతిలో ‘ఫేÆస్‌ టూ ఫేస్‌’ ఇంటర్వ్యూ ఇది. ఉద్యోగానికి సంబంధించి మేనేజర్‌ స్థాయి వ్యక్తి ఇంటర్వ్యూ చేస్తారు. ఎంపికైతే వారితోనే పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి, తగిన నైపుణ్యాలు ఉన్నాయో లేదో చూస్తారు. సాధారణంగా తర్వాత హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అయితే వీరు సబ్జెక్టు పరిజ్ఞానాన్ని పరిశీలించరు. సంస్థకు తగిన విలువలు అభ్యర్థిలో ఉన్నాయో లేదో చూస్తారు. రెజ్యూమెలో అభ్యర్థి పేర్కొన్న నైపుణ్యాలను పరీక్షిస్తారు. ఇందులో అభ్యర్థి మాటలనే కాదు, శరీర భాషనూ గమనిస్తారు. సాధారణంగా 30 నిమిషాల నుంచి గంట వరకూ ఉంటుంది.
* ఫార్మల్‌ దుస్తులనే వేసుకోవాలి.
* ఇంటర్వ్యూ గదిలోకి వెళ్లే ముందూ, బయటకు వచ్చేటపుడూ అనుమతి తీసుకోవాలి. ఎదుటివారిని చూస్తూ మాట్లాడాలి. మాటల్లో ఆత్మవిశ్వాసం, ఉత్సుకత కనిపించాలి.
* ప్రారంభం నుంచే ఇంటర్వ్యూ చేసే వ్యక్తి నేరుగానో, పరోక్షంగానో సమాచారం ఇస్తుంటారు. అది శ్రద్ధగా వింటేనే అర్థమవుతుంది. చెప్పేది మీరు పూర్తిగా విన్నారన్న అభిప్రాయాన్నీ వారికి కలిగించగలగాలి.
* ఈ తరహా ఇంటర్వ్యూలో అభ్యర్థి ఎక్కువగా మాట్లాడాలని ఇంటర్వ్యూయర్‌ ఆశిస్తారు. ఎంతవరకూ మాట్లాడాలనేదానిపై స్పష్టత ఉండాలి. ధీమాగా ఉండాలి. స్వీయ లోపాలను బయటపెట్టే విధంగా ఉండకూడదు. అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వగలిగితే చాలు.
* భాష విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాదనకు దిగకూడదు. ‘నేను ఇలా భావిస్తున్నాను’ అని చెప్పొచ్చు. ఒకవేళ వాళ్లు చెప్పిన కోణం సబబు అనిపిస్తే.. ఒప్పుకోవడానికి వెనకాడకూడదు.
* తెలియకపోతే తెలియదని చెప్పడం మంచిది. ‌
* రిక్రూటర్‌ నుంచి మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా అని అభ్యర్థిని ప్రశ్నిస్తే ‘లేవు’ అని చెప్పొద్దు. ఇది అభ్యర్థిలోని అనాసక్తిని సూచిస్తుంది. సంస్థ, ఉద్యోగ బాధ్యతల గురించి అడగొచ్చు.

గ్రూప్‌ ఇంటర్వ్యూ - బృంద స్ఫూర్తి
ఈ రకం ఇంటర్వ్యూలను చాలా తక్కువగా నిర్వహిస్తారు. కానీ ఆధునిక రిక్రూట్‌మెంట్లలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. కొద్దిగా గ్రూప్‌ డిస్కషన్‌ తరహాలో ఉంటుంది. ఇద్దరు లేదా అంతకుమించి అభ్యర్థులు పాల్గొంటారు. ఒకే సమయంలో వీరందరికీ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ నిర్వహించేవారు కూడా ఒకరు లేదా అంతకుమించి ఉంటారు. ఈ తరహా ఇంటర్వ్యూల్లో అభ్యర్థి ధోరణి, ప్రొఫెషనలిజం, నాయకత్వ నైపుణ్యాలు, ఒత్తిడిలో బృందంలో ఎలా నిలదొక్కుకుంటారో పరిశీలిస్తారు. సాధారణంగా ఇది పూర్తవడానికి కనీసం 40 నిమిషాల సమయం పడుతుంది.
* ముందుగానే ‘స్వీయ పరిచయం’ (సెల్ఫ్‌ ఇంట్రడక్షన్‌)ను కొంత సృజనాత్మకంగా సిద్ధం చేసుకోవాలి.
* అందరూ అడిగేది, చెప్పేది జాగ్రత్తగా వినాలి. తోటివారి పేర్లను గుర్తుంచుకోవాలి.
* కొన్నిసార్లయినా మొదటగా సమాధానం చెప్పడానికి ప్రయత్నించాలి. ఆ ప్రయత్నం వేరే వాళ్లకి అవకాశం లేకుండా చేస్తున్నట్టుగా కూడా ఉండకూడదు.
* మీ వంతు వచ్చినపుడు మీకు అనుకూలంగా ఉన్న పాయింట్లను వేరేవాళ్లు చెబితే వాటిని కోట్‌ చేయొచ్చు.
* చిరునవ్వుతో ఉండాలి. తోటివారి సమాధానాలను వింటూ తలాడించడం వంటివి చేయాలి. అసహనం, కోపం లాంటివి ప్రదర్శించకూడదు.
* ‘ఏవైనా ప్రశ్నలు ఉన్నాయా?’ అని ఇంటర్వ్యూ నిర్వహించేవారు అడిగితే అందరికంటే సృజనాత్మకంగా ప్రశ్నలు అడగాలి. అందరి మాటలూ శ్రద్ధగా విన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది.
* ఇంటర్వ్యూ ముగిశాక నిర్వహించిన వారితోపాటు తోటివారికీ ‘థాంక్స్‌’ చెప్పాలి.

ప్యానెల్‌ ఇంటర్వ్యూ - సహనానికి పరీక్ష
ఇది కూడా ఫేస్‌ టూ ఫేస్‌ ఇంటర్వ్యూ లాగానే ఉంటుంది. అయితే ఇంటర్వ్యూ చేసేవారి సంఖ్యలోనే మార్పు ఉంటుంది. సాధారణంగా ముగ్గురు నుంచి అయిదుగురు వరకూ ఉంటారు. వివిధ విభాగాలకు చెందినవారు.. మేనేజర్లు, హెచ్‌ఆర్‌, పై అధికారులు ఇందులో పాల్గొంటారు. సమయం వృథా కాకుండా ఉండటానికి సంస్థలు ప్యానెల్‌ ఇంటర్వ్యూను ఎంచుకుంటాయి. సాధారణంగా ఇవి 45 నిమిషాల నుంచి గంట వరకూ సాగుతాయి. అభ్యర్థిలో ఒత్తిడిని తట్టుకునే గుణం ఎంతవరకూ ఉందో పరీక్షిస్తారు. భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనపుడు దాన్ని ఎంతవరకూ సానుకూలంగా తీసుకోగలుగుతున్నాడో చూస్తారు.
* గదిలో ఉన్న ప్రతి ఒక్కరినీ విష్‌ చేయాలి. మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవాలి. ఎక్కువమంది ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికీ పేరుపేరునా చెప్పడం కుదరదు కాబట్టి, మధ్యలో ఉన్నవారికి విష్‌ చేసినా, అందరినీ నవ్వుతూ కళ్లతో పలకరించాలి.
* ఎవరైనా ప్రశ్న అడిగినపుడు అడిగినవారికే సమాధానం ఇస్తున్నట్టు ఉండకూడదు. అందరివైపూ చూస్తుండాలి. మాటల్లో ఆత్మవిశ్వాసం తప్పనిసరి.
* ప్యానెల్‌ ఇంటర్వ్యూలో ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. ఒక్కోసారి మీ సమాధానానికి కొందరు సానుకూలంగానూ మరికొంతమంది ప్రతికూలంగా ఉండొచ్చు. అంతమాత్రాన అనుకూలంగా ఉన్నవారికే ప్రాధాన్యం ఇవ్వొద్దు. ఇక్కడ ప్రధాన అభిప్రాయం ఎవరిదో చెప్పగలిగే అవకాశం తక్కువ. కొందరు మీ వ్యక్తిత్వాన్ని పరీక్షించడానికి కావాలనే మీ అభిప్రాయాన్ని వ్యతిరేకించే అవకాశం ఉంది.
* ఇంటర్వ్యూ సమయంలో ప్యానెల్‌ కూడా తమను తాము పరిచయం చేసుకుంటుంది. వారి పేర్లను గుర్తుంచుకోవాలి.
* ఒక్కోసారి ప్యానెల్‌ సభ్యులు ఒకరు అడిగిన ప్రశ్ననే ఇంకొకరు అడుగుతుంటారు. అది మీలోని సహనాన్ని పరీక్షించడానికే! చిరాకు, అసహనం వ్యక్తం చేయకుండా అంతకుముందు ఇదే ప్రశ్నను అడిగినవారి పేరును ఉదహరిస్తూ.. ఆ సమాధానాన్ని మళ్లీ చెప్పాలి.
* అలాగే ప్యానెల్‌ ఇంటర్వ్యూ అనగానే సమాధానం చెబుతుండగానే దానికి సంబంధించిన వేరే ప్రశ్నలను ఇతర సభ్యులు అడిగే అవకాశం ఉంది. దానికి కంగారు పడకుండా వేగంగా సమాధానం ఇవ్వాలి.

Back..

Posted on 17-10-2018