Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
చదువుల కొమ్మపై కన్నీటి చెమ్మ

* విద్యాలయాల ఒత్తిడీ కారణం
* బిగుసుకుంటున్న ఆత్మన్యూనతా చట్రం
* ప్రాణాలు కోల్పోతున్న పసిమొగ్గలెన్నెన్నో!
* ఆత్మవిశ్వాసం పెంచడమే సమస్యకు పరిష్కారం
* అభిరుచి, ఆసక్తులను గమనిస్తేనే సత్ఫలితాలు
* మానసిక ప్రశాంతత ముఖ్యం

నాకు చదువంటే ఇష్టం. శరీరం సహకరించనందున చదవలేకపోతున్నా. మరుజన్మలోనైనా బాగుంటుందన్న ఆశతో ప్రాణాలు వదిలేస్తున్నా - శ్రీకాకుళం శాస్త్రి కాలనీకి చెందిన బీఈడీ విద్యార్థిని విద్యాధరి ఆవేదన ఇది.
నా ఆత్మహత్యకు చదువే కారణం. ఎంత చదివినా గుర్తుండడం లేదు. నాకు చదువు భారమైంది. ఒత్తిడితో చదవలేకపోతున్నా. - అనంతపురం జిల్లా హిందూపురం ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాల విద్యార్థిని నిషిత మనోవేదన ఇది.
15 నుంచి 22, 23 ఏళ్ల మధ్యన ఉన్న వారు చదువు కారణంగా చూపుతూ గత మూడు నెలల్లో అధిక సంఖ్యలో ప్రాణాల్ని తీసుకున్నారు. మానసిక ఒత్తిళ్లు, ఆత్మన్యూనతా భావాలు వారిని కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు ప్రేరేపిస్తున్నాయి. తెల్లవారుజామునుంచి రాత్రి పొద్దు పోయేంతవరకు పుస్తకాలతోనే విద్యార్థులు కుస్తీ పట్టేలా పలు కళాశాలల ప్రణాళికలు ఉంటున్నాయి. ర్యాంకులు, మార్కుల కోసం కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను మరయంత్రాలుగా మార్చేస్తున్నాయి. కళాశాలల పోకడలపై 2001లో నీరదారెడ్డి కమిటీ ఎండగట్టి దిద్దుబాటు చర్యలు శరణ్యమని నివేదించింది. అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు. ఈ విద్యా సంవత్సరం విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్ట్ర హైకోర్టులోనూ ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది.
* పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులను జూనియర్‌ ఇంటర్‌లో సెక్షన్లవారీగా విభజిస్తున్నారు. మూడు లేదా ఆరు నెలల పరీక్షల్లో వచ్చిన మార్కులను అనుసరించి సెక్షన్లను మార్చుతున్నారు. ఉన్నతి పొందనివారు, దిగువ శ్రేణికి వెళ్లే విద్యార్థులు ఆత్మన్యూనతను పెంచుకుంటున్నారు.
* తరగతుల నిర్వహణకు ప్రత్యేక పేర్లు పెడుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు అరగంట మినహా విద్యార్థులకు విశ్రాంతి దొరకడం లేదు.
* ఇంటర్‌తోపాటు విద్యార్థులకు జేఈఈ, ఎంసెట్‌ వంటి పోటీ పరీక్షలకు ప్రైవేట్‌ కళాశాలలు శిక్షణనిస్తున్నాయి. వారాంతపు పరీక్షల నుంచి వార్షిక పరీక్షల వరకు విద్యార్థులపై ఒత్తిడిని నిరంతరం కొనసాగిస్తున్నాయి.
* తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చేలా పిల్లల్ని తీర్చదిద్దకుంటే ప్రవేశాలు పెరగబోవని పలు యాజమాన్యాలూ హద్దులు మీరుతున్నాయి.
* క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు స్థానం లేదు. ఫలితంగా విద్యార్థులు మానసికంగా దృఢం కావడం లేదు. గ్రంథాలయం లేదు.
* పిల్లల శక్తిసామర్థ్యాలను, అభిరుచులను తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు.
* వసతిగృహాల నిర్వహణపై ప్రభుత్వ అజమాయిషీ ఉండాలని ఉమ్మడి ఇంటర్‌ విద్యాశాఖ రెండేళ్ల కిందట అప్పటి ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఇంతవరకు ఈ దస్త్రంలో కదలిక లేదు. కడప ఘటనపై విచారించిన కమిటీ కూడా తన నివేదికలో 'రెసిడెన్షియల్‌' పేరుతో జూనియర్‌ కళాశాలల నిర్వహణకు అనుమతివ్వకూడదని పేర్కొంది.
గడిచిన నెలల్లో విద్యార్థుల ఆత్మహత్యల వివరాలు
* కరీంనగర్‌ జిల్లా కోతిరాంపూర్‌లో విద్యార్థిని రుష్మిత పదో తరగతి పరీక్షల్లో తప్పడంతో ఒంటికి నిప్పంటించుకుని ప్రాణాలు విడిచింది.
* కర్నూలుకు చెందిన స్వర్ణకుమారి పరీక్షల ఒత్తిడిని తట్టుకోలేక ఫ్యాన్‌కు ఉరేసుకుంది.
* విశాఖ జిల్లా గాజువాకలోని ఓ ప్రైవేట్‌ కళాశాల వసతిగృహంలో ఉంటూ హరీశ్వరరావు ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదివాడు. గతేడాది హైదరాబాదులో ఓ కళాశాలలో చేరాడు. ఇంటర్‌లో అనుత్తీర్ణుడయినందుకే మనస్తాపానికి గురై ప్రాణాలు విడిచాడని భావిస్తున్నారు.
* హైదరాబాద్‌కు చెందిన నర్సింగరావు డిగ్రీ పరీక్షలో అనుత్తీర్ణుడై ఫ్యానుకు ఉరేసుకున్నాడు.
* ఇంటర్‌ రెండో సంవత్సరం తప్పానన్న మనస్తాపంతో కరీంనగర్‌ జిల్లా వేములవాడకు చెందిన విద్యార్థిని నిహారిక కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది.
* నెల్లూరులో చదివించాలని కోరినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదన్న ఆవేదనతో అనంతపురం జిల్లా కదిరికి చెందిన జీవన ఆత్మహత్య చేసుకుంది.
* ఎంసెట్‌లో మంచి ర్యాంకు రాలేదన్న కారణంతో పెనుమూరుకు చెందిన రాధిక ప్రాణాలు విడిచింది.
* డిగ్రీ పరీక్షల్లో తప్పడంతో మనస్తాపానికి గురై కడప ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల బీకాం ద్వితీయ సంవత్సరం విద్యార్థిని ఉరేసుకుంది.
* ఉపాధ్యాయ ఉద్యోగం రాదని భావించిన శ్రీకాకుళం జిల్లా సోంపేటకు చెందిన వి.శంకరరావు (23) చెట్టుకు ఉరేసుకున్నాడు.
* కడపలో ఇంటర్‌ విద్యార్థినులు నందిని, మనీషా ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
నిపుణుల సూచనలు
* విద్యార్థులను ఆయా సెక్షన్లలోనే ఉంచుతూ బోధనపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థుల నుంచి ఫిర్యాదుల్ని స్వీకరించేందుకు ప్రత్యేక సహాయ కేంద్రం ఏర్పాటుచేయాలి.
* తల్లిదండ్రులను కూడా వసతిగృహాల్లోకి అనుమతించాలి. అనుభవం ఉన్న అధ్యాపకులు లేదా మానసిక నిపుణుల ద్వారా కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
* జీవిత ప్రాధాన్యాలపై అవగాహన కలిగించాలి. విద్యార్థుల ప్రవర్తనల్లో వచ్చే మార్పులను గమనించి తల్లిదండ్రులు, యాజమాన్యాలు జాగ్రత్తలు తీసుకోవాలి.
వ్యవస్థ భ్రష్టు పట్టింది
విద్యావ్యవస్థనే భ్రష్టు పట్టింది. వ్యాపారమయంగా మారింది. ర్యాంకుల గోల తప్ప విద్యార్థుల మానసిక వికాసాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. దీనివల్ల విద్యార్థుల ఆత్మహత్య ఘటనలు ఎక్కువవుతున్నాయి. దీనిపై ప్రభుత్వాలపరంగా చర్యలు లేవు. విద్యార్థుల ఆసక్తి, సామర్థ్యాలను తెలుసుకుని తీర్చిదిద్దాల్సిన తల్లిదండ్రులు ఆ దిశగా దృష్టి పెట్టడం లేదు. ఫీజుల గురించి మినహా విద్యార్థుల బాగోగులను పట్టించుకునే ఓపిక కళాశాలల యాజమాన్యాలకు లేదు. బోధన రుసుముల చెల్లింపు పథకం ప్రవేశపెట్టాక విద్యారంగంలో కొన్ని దురదృష్టకర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. - ఎం.వి.భాస్కరరావు, మాజీ డీజీపీ
ఎవర్ని నొప్పించలేక బలవన్మరణాలు
విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడడం వెనుక చాలావరకు కళాశాలల పోకడ, తల్లిదండ్రుల ఆకాంక్షలు కారణాలవుతున్నాయి. పిల్లలను ఉన్నతస్థానాల్లో కూర్చోబెట్టాలని తల్లిదండ్రులు చూస్తున్నారు. ఇందులో తప్పేమీ లేదు. పిల్లల శక్తిసామర్థ్యాలు, అభిరుచులతో పాటు తమ ఆర్థిక స్థోమతను కూడా వారు పరిగణనలోకి తీసుకోవాలి. పిల్లల్ని చదివించాలనే తపనతో తల్లిదండ్రులు అప్పులు చేస్తున్నారు. ఒక్కోసారి విద్యార్థులు చదువులో వెనుకబడితే వారిలో ఆందోళన మొదలవుతుంది. తల్లిదండ్రుల ఆశలను వమ్ము చేశామనుకుని భావించి అందరినీ బాధపెట్టేకన్నా తనువు చాలించడం మంచిదని విద్యార్థులు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. పిల్లలకు చదువు ప్రాధాన్యాన్ని చెబుతూనే, వారి సామర్థ్యాలకు తగినట్లున్న ఉపాధి అవకాశాలను వివరించాలి. చదువు మధ్యలో తగినంత విశ్రాంతి అవసరం. -డాక్టర్‌ గౌరీదేవి, ప్రముఖ మానసిక వైద్యురాలు
పసిగడితే..ప్రాణాలు దక్కినట్లే
నా మాటే నెగ్గాలి.. నన్నర్థం చేసుకోవడం లేదు.. నా మాటకు విలువ లేదు.. తదితర మాట పట్టింపులు.. కుటుంబ కలహాలు, పరీక్షల్లో విఫలమవడం వంటి కారణాలతో క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వీరిలో ఆత్మహత్యకు పాల్పడాలనే ఆలోచన ముందు నుంచి ఉండకపోవచ్చు. ఆత్మహత్యలకు మరో ప్రధాన కారణం మానసిక కుంగుబాటు. 'నేను బాగుపడను.. ఈ జీవితం ఇంతే' ఇలాంటి ఆలోచనలు పెరుగుతాయి. కొన్ని ముఖ్య లక్షణాలను జాగ్రత్తగా పరిశీలిస్తే వారిని ఇట్టే పసిగట్టొచ్చు. నిద్రపోరు. తెల్లవారుజామున 3-4 గంటలకే లేచి కూర్చుంటారు. సరిగా తినరు. ఆకలి లేదని చెబుతుంటారు. క్రమేణ బరువు తగ్గుతారు. ఏ పనిపై ఉత్సాహం చూపరు. పనుల్ని వాయిదావేస్తూ వస్తారు. - ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్‌ ఎంఎస్‌ రెడ్డి
పాఠశాల విద్యలోనే అవగాహన కల్పించాలి
పాఠశాల విద్య ముగిసినప్పుడే విద్యార్థులకు ఇంటర్‌, ఆ తరువాత చదివే కోర్సులు, వాటివల్ల వచ్చే ఉపాధి అవకాశాలను వివరించాలి. దీనివల్ల వారు అభిరుచి, సామర్థ్యాలకు తగినట్లు కోర్సుల్ని ఎంపిక చేసుకుంటారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇదే కనిపిస్తోంది. ప్రభుత్వసంస్థల్లోని నిపుణులతో అవగాహన సదస్సులు నిర్వహిస్తే వీరికి జీవితంలో మనం ఏ రంగంలోనైనా రాణించవచ్చన్న ధీమా పెరుగుతుంది. చదువులో వెనుకబడ్డా ఎంచుకున్న వృత్తిలో రాణించవచ్చన్న ఆకాంక్ష బలీయమవుతుంది. ప్రస్తుతం తరగతి గది బోధన తీరులో మార్పు రావాలి. పాఠశాల విద్య నుంచే మనోధైర్యాన్ని పెంచే వాతావరణం కల్పించినట్లయితే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. పిల్లలపై నమ్మకాన్ని కొనసాగించడంతో పాటు వారి మనోవికాసంపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలి. - పి.విజయలక్ష్మి, రిజిస్ట్రార్‌, శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (నాగార్జున విశ్వవిద్యాలయం విద్యార్థిని రిషితేశ్వరి, కడప విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలపై విచారణకు ఏర్పడ్డ కమిటీల్లో సభ్యురాలు)

Posted on 30.08.2015