Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
‘నీట్‌’గా గెలుద్దాం!

ఎంసెట్‌తో పోలిస్తే ఈ సంవత్సరం నీట్‌-2 ద్వారా భర్తీ అయ్యే మెడికల్‌ సీట్ల సంఖ్య చాలా ఎక్కువ. దీని సన్నద్ధతకు దాదాపు రెండు నెలల వ్యవధి ఉంది. సరైన ప్రణాళికతో, మెలకువలు తెలుసుకుని తయారైతే మంచి వైద్య కళాశాలలో సీటు సాధించి, కలల కోర్సులో సగర్వంగా ప్రవేశించవచ్చు!

వైద్యవిద్యకు సంబంధించి ఏప్రిల్‌ 28 నుంచి జరిగిన పరిణామాలకు చివరకు ఓ స్వరూపం ఏర్పడింది. ఈ ఏడాది ప్రవేశాల ప్రక్రియలో రాష్ట్రప్రభుత్వం నిర్వహించే ఎంసెట్‌ ద్వారా భర్తీ అయ్యే సీట్లు, నీట్‌ ద్వారా నింపాల్సిన సీట్లకు స్పష్టత ఏర్పడింది. రాష్ట్రపతి ఆర్డినెన్స్‌, నీట్‌-2 ప్రాస్పెక్టస్‌ గమనిస్తే పూర్తి అవగాహన ఏర్పడుతుంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు ఎంసెట్‌ ద్వారానే భర్తీ చేస్తారు. తెలంగాణలోని 5 ప్రభుత్వ కళాశాలల్లోని 850 సీట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని 12 ప్రభుత్వ కళాశాలల్లో 1900 సీట్లు ఈ రెండు రాష్ట్రాల ఎంసెట్‌ ర్యాంకుల ఆధారంగా నింపుతారు.
తెలంగాణలోని 12 ప్రైవేటు మెడికల్‌ కళాశాలల్లో 1600 సీట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని 12 ప్రైవేటు మెడికల్‌ కళాశాలల్లో 1650 సీట్లు ఉన్నాయి. వీటిలో ‘ఎ’కేటగిరీ లేదా 2015లో జరిగిన కన్వీనర్‌ కోటాలోని సీట్లు కూడా రాష్ట్రప్రభుత్వ నిర్ణయం మేరకు ఎంసెట్‌ లేదా నీట్‌ ద్వారా భర్తీ అవుతాయి. వీటిని కూడా ఎంసెట్‌ కిందే తీసుకుంటే తెలంగాణలో 1650 సీట్లు (850 ప్రభుత్వ+ 800 ప్రైవేటు కేటగిరీ ‘ఎ’);ఆంధ్రప్రదేశ్‌లో 2725 సీట్లు (1900 ప్రభుత్వ+ 825 ప్రైవేటు క్యాటగిరీ ‘ఎ’) ఎంసెట్‌ల ద్వారా నిండుతాయి.
ఈ వైద్య కళాశాలలు కాకుండా తెలంగాణలో 3, ఆంధ్రప్రదేశ్‌లో ఒక మైనారిటీ కళాశాల ఉన్నాయి. ఈ నాల్గింటిలో 400 సీట్లున్నాయి. ఇవి నీట్‌ ద్వారానే భర్తీ అవొచ్చు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రైవేటు మెడికల్‌ కళాశాలల్లో కేటగిరీ బి, సి కింద 1625 సీట్లున్నాయి. ఇవి కాక స్వయంప్రతిపత్తి గల విశ్వవిద్యాలయాలు 36 ఉన్నాయి. వీటిలోని అన్ని సీట్లూ నీట్‌-2 ద్వారానే భర్తీ అవుతాయి. వీటిలో 5575 సీట్లున్నాయి. తెలుగు విద్యార్థులు మొగ్గుచూపే కళాశాలల్లో 3800 వరకూ సీట్లున్నాయి. ఈ రకంగా చూస్తే తెలుగు రాష్ట్రాల విద్యార్థులు నీట్‌-2 ద్వారా పొందే సీట్లు 400+1625+ 5575= 7600.
నీట్‌-1 ఏం సూచిస్తోంది?
2013లో మే 5న తెలుగురాష్ట్రాల విద్యార్థులు నీట్‌ను రాశారు. అప్పటినుంచీ సిలబస్‌ ఉమ్మడిగానే ఉంది. బయాలజీలో తెలుగు రాష్ట్రాల్లో బోటనీ, జువాలజీలు విడివిడిగా ఉన్నందున కొంత అదనపు సిలబస్‌ ఉంది. అంటే సీబీఎస్‌ఈ కంటే మన తెలుగు రాష్ట్రాల్లోని బోటనీ, జువాలజీ అధికంగా ఉంది. భౌతిక రసాయనశాస్త్రాల సిలబస్‌లలో మనకూ సీబీఎస్‌ఈకీ ఎలాంటి అంతరమూ లేదు. మే 1న పూర్తయిన నీట్‌-1ను విశ్లేషిస్తే దీనికి ఎలా సిద్ధం కావాలో అవగాహన ఏర్పడుతుంది.
మొత్తం 180 ప్రశ్నల్లో 90 ప్రశ్నలు బయాలజీ, 45 భౌతికశాస్త్రం, 45 రసాయనశాస్త్రం నుంచి ఉన్నాయి. ఇక్కడ బయాలజీ 90 ప్రశ్నలే కానీ బోటనీ, జువాలజీ 45 చొప్పున కాదు. బోటనీ నుంచి 52 ప్రశ్నలు, జువాలజీ నుంచి 38 ప్రశ్నలు అడిగారు. ఈ 90 ప్రశ్నల్లో 82 తెలుగు అకాడమీ పుస్తకాల్లోనివే.మిగిలిన 8 ప్రశ్నల్లో 2 ప్రాక్టికల్‌ బయాలజీ నుంచి, మిగిలిన 6 సీబీఎస్‌ఈ వారు అదనంగా ఇచ్చిన సప్లిమెంటరీ, సపోర్టింగ్‌ మెటీరియల్‌ నుంచి వచ్చాయి. ఫిజిక్స్‌, కెమిస్ట్రీల్లో రెండు ప్రశ్నలు తప్పించి మిగిలినవన్నీ మన పాఠ్యపుస్తకాల్లోని ప్రశ్నలే. ఆ 2 ప్రశ్నలు ప్రయోగదీపిక నుంచి ఇచ్చారు.
నీట్‌-2: నీట్‌-2 నోటిఫికేషన్‌ను 26వ తేదీన జారీ చేశారు. దీని ప్రకారం తెలుగు రాష్ట్రాల్లోని ప్రైవేటు మెడికల్‌, డెంటల్‌ కళాశాలల సీట్లు, డీమ్డ్‌ యూనివర్సిటీ, ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మెడికల్‌ కాలేజీ సీట్లు నీట్‌-2 ద్వారా భర్తీ అవుతాయి. పరీక్ష ఇంగ్లిష్‌/హిందీ మాధ్యమంలోనే జరుగుతుంది. ఆన్‌లైన్లోనే దరఖాస్తు చేయాల్సివుంటుంది. www.aipmt.nic.inనుంచి ప్రాస్పెక్టస్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని జాగ్రత్తగా చదవాలి. ఆపైనే దరఖాస్తును నింపాలి.
ఫొటో ఎలా అప్‌లోడ్‌ చేయాలో మొదలుకొని తుది వరకూ ప్రాస్పెక్టస్‌లో వివరంగా ఇచ్చారు. దరఖాస్తు ఫీజు జనరల్‌ విద్యార్థులకు రూ.1400, ఎస్‌సీ, ఎస్‌టీ, పీహెచ్‌ విద్యార్థులకు రూ.750. దీన్ని ఈ-చలానా రూపంలో తీసుకుని జూన్‌ 21 లోపు దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేయాలి.
ఎలా సిద్ధం కావాలి?
ఎంసెట్‌, నీట్‌లకు మధ్య ముఖ్యమైన తేడాలు గమనిస్తే సన్నద్ధత సులువు అవుతుంది.
* ఎంసెట్‌లో 160 ప్రశ్నలతో 160 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. దీనిలో బోటనీ, జువాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీల్లో 40 ప్రశ్నల చొప్పున ఉంటాయి. అది కూడా ప్రథమ ద్వితీయ సంవత్సరాల సిలబస్‌ నుంచి సమ విభజన ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికీ, +1 మార్కు. తప్పు సమాధానం రాసినా మైనస్‌ మార్కుల్లేవు.
* నీట్‌ 180 ప్రశ్నలతో (బయాలజీ- 90, ఫిజిక్స్‌- 45, కెమిస్ట్రీ- 45) ఉంటుంది. ప్రతి సరైన జవాబుకూ +4 మార్కులు, తప్పు సమాధానానికి -1 (రుణాత్మక మార్కు). పరీక్ష 180 x 4 = 720 మార్కులకు జరుగుతుంది.
ప్రశ్నల సంఖ్య పెరిగినందున విద్యార్థి వేగమూ పెరగాలి. కానీ వేగం పెరిగితే తప్పులకు అవకాశం ఉంటుంది. ఇక్కడ తప్పు చేస్తే రుణాత్మక మార్కులున్నాయని మర్చిపోకూడదు. వేగంతో పాటు కచ్చితత్వం కూడా పెరిగేలా సాధన చేయాలి. ఎక్కువసార్లు పునశ్చరణ చేయటానికి ప్రాధాన్యం ఇస్తే పరీక్షలో నెగ్గినట్లే!
కటాఫ్‌ మార్కు: ఎంసెట్‌లో ఓసీ విద్యార్థులకు 25 శాతం మార్కులను కటాఫ్‌గా తీసుకుంటారు. 160 మార్కులకు 40 మార్కులపైన వచ్చినవారికి మాత్రమే ర్యాంకు కేటాయిస్తారు. ఎస్‌సీ, ఎస్‌టీ విద్యార్థులకు మాత్రం ఎలాంటి కటాఫ్‌ మార్కూ లేదు. నీట్‌లో ఓసీ విద్యార్థులకు 50వ పర్సంటైల్‌ను కటాఫ్‌గా తీసుకున్నారు. మొత్తం మార్కులకే కటాఫ్‌ను నిర్ణయిస్తున్నారు. ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ విద్యార్థులకు 40వ, ఓసీ- పీహెచ్‌వారికి 45వ పర్సంటైల్‌ను కటాఫ్‌గా పరిగణిస్తారు.
విద్యార్థుల మార్కులను ఆరోహణ క్రమంలో అమర్చి మొత్తం విద్యార్థుల సంఖ్యలో 50వ శాతపు విద్యార్థికి వచ్చిన మార్కులను కటాఫ్‌ మార్కుగా నిర్ణయిస్తారు. అలాగే ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీకి అయితే విద్యార్థుల సంఖ్యలో 40వ శాతపు విద్యార్థి మార్కు ఈ కేటగిరిలో కటాఫ్‌ మార్కు అవుతుంది. ప్రైవేటు వైద్య కళాశాలల్లో కేటగిరీ ‘సి’ సీట్ల భర్తీ యాజమాన్యాలు చేస్తున్నప్పటికీ సీటు పొందాలంటే నీట్‌ ర్యాంకు తప్పనిసరి. అందుకే కనీసం ఈ కటాఫ్‌ మార్కును ప్రతి విద్యార్థీ దాటాల్సివుంటుంది.
ర్యాంకుకు 16 సూత్రాలు
1. పాఠ్యపుస్తకాల్లోని సిలబస్‌లలో తేడా లేదు. ఈ సమయంలో మన అకాడమీ పాఠ్యపుస్తకాలను చదివితే ‘నీట్‌’కు సరిపోతుంది.
2. బయాలజీ సిలబస్‌లో తెలుగు రాష్ట్రాల సిలబస్‌ అధికంగా ఉంది. కాబట్టి ప్రాస్పెక్టస్‌లోని సిలబస్‌ పక్కనపెట్టుకుని అదనపు అంశాలను తీసివేసి చదవాలి.
3. సీబీఎస్‌ఈ 11, 12 తరగతి పాఠ్యపుస్తకాలకు అదనంగా ఎరాటా, సప్లిమెంటరీ మెటీరియల్‌, సపోర్టింగ్‌ మెటీరియల్‌ ఉన్నాయి. వీటిని కూడా తప్పకుండా తీసుకుని చదవాలి.
4. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల వెబ్‌సైట్‌లోనే ఎగ్జంప్లర్‌ పుస్తకాలు కూడా ఉన్నాయి. వీటిని తప్పకుండా చదవాలి. పుస్తకాలు మార్కెట్లో లభ్యమవుతాయి. లేదా వారి సైట్‌నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ప్రింట్‌ తీసుకుంటే చదవటానికి సులువుగా ఉంటుంది.
5. ఎగ్జంప్లర్‌ ఉండేది ప్రశ్నల రూపంలోనే. వాటికి అధిక సమయం కేటాయించాలి.
6. బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ ప్రయోగదీపికలు చదవాలి.
7. సీబీఎస్‌ఈలో 12వ తరగతిలోనే బోర్డు పరీక్షలుంటున్నాయి. సీనియర్‌ ఇంటర్‌ సిలబస్‌లో అధిక ప్రశ్నలు వస్తున్నాయి. నీట్‌-1 పరీక్షలో బోటనీ ఇంటర్‌ ప్రథమ సంవత్సరం నుంచి 27 ప్రశ్నలూ, ద్వితీయ సంవత్సరం నుంచి 25 ప్రశ్నలు వచ్చాయి. జవాలజీలో 19, 19; ఫిజిక్స్‌లో 22, 23; కెమిస్ట్రీలో 16, 29 ప్రశ్నలు మొదటి-రెండు సంవత్సరాల సిలబస్‌ నుంచి వరసగా వచ్చాయి.
8. ఫిజిక్స్‌లో గత ఏడాది రెండు పేపర్లు ( పరీక్షను రెండు సార్లు నిర్వహించారు), ఈ సంవత్సరం ఒక పేపరు విశ్లేషణ చూస్తే... మొదటి సంవత్సరం కంటే రెండో సంవత్సరం సిలబస్‌ నుంచి ఎక్కువ ప్రశ్నలు ఉన్నాయి. అయినా తేడా చాలా స్వల్పమే!
9. ఎంసెట్‌ ఫిజిక్స్‌లో నిడివిగా ఉన్న లెక్కలు వస్తున్నాయి. నీట్‌లో మాత్రం సరళంగా ఉన్న, సిద్ధాంతపరమైన ప్రశ్నలు వస్తున్నాయి.
10. సిద్ధాంతపరమైన ప్రశ్నలు ఎంసెట్‌ ఫిజిక్స్‌లో 10 శాతంలోపే. నీట్‌ ఫిజిక్స్‌లో కనీసం 30 శాతం వరకూ ఇవి ఉంటున్నాయి.
11. రసాయనశాస్త్రంలో అకర్బన, కర్బన, భౌతిక రసాయనశాస్త్రంలో దాదాపు సమ విభజనతో (మూడు విభాగాల నుంచి 15 చొప్పున ప్రశ్నలు) వస్తున్నాయి. వీటిలో భౌతిక రసాయనశాస్త్రానికి కొంత అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సివుంటుంది.
12. ప్రశ్నల సంఖ్య పెరిగి రుణాత్మక మార్కులు ఉన్నందున వేగం, కచ్చితత్వం పెంచుకోవడానికి వీలైనన్ని ఎక్కువ నమూనా పరీక్షలు రాయాలి.
13. ఇంతవరకూ విద్యార్థులకు ఎంసెట్‌ ప్రశ్నల అభ్యాసం ఎక్కువగా జరిగింది. ఈ రెండు నెలలూ నీట్‌-2 ప్రశ్నపత్రం దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ప్రశ్నపత్రాలనూ, సీబీఎస్‌ఈ ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలపై పట్టు ఉన్న అధ్యాపకులు ఇచ్చే ప్రశ్నపత్రాలనూ అధికంగా అభ్యాసం చేయాలి.
14. తెలుగు రాష్ట్రాల్లోని అధ్యాపకులు ఎక్కువగా ఎంసెట్‌కే ప్రాధాన్యం ఇచ్చివున్నారు. అందుకని సీబీఎస్‌ఈకి అధిక ప్రాధాన్యం ఉన్న ఉత్తరభారతదేశంలోని అధ్యాపకులు ఇచ్చే ప్రశ్నపత్రాలకు ప్రయోజనం ఎక్కువ. వీటిని అభ్యాసం చేస్తే పట్టు పెరుగుతుంది.
15. ఎంసెట్‌ బయాలజీలో ప్రశ్నలు చాలా నిడివిగా ఉంటున్నాయి. కానీ నీట్‌లో ఒకటి లేదా రెండు లైన్లలో ఉంటున్నాయి. ఆ విధానంలోనే అభ్యాసం చేయాలి.
16. ప్రాథమిక అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి చదవాలి. అదనపు అంశాలకు కొంత ప్రాధాన్యం ఉన్నప్పటికీ ఎక్కువ సమయం ప్రాథమిక అంశాలకు కేటాయిస్తేనే అధిక మార్కులు సాధించే వీలుంటుంది.




Back..

Posted on 31-05-2016