Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
సత్వర ఉపాధికి... నర్సింగ్‌

2015-16 విద్యాసంవత్సరానికి తెలుగు రాష్ట్రాల్లో బీఎస్‌సీ నర్సింగ్‌ కోర్సు ప్రవేశ ప్రకటన వచ్చేసింది. ఎన్‌టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం నుంచి ఈ ప్రకటన విడుదలయింది. ఈ సందర్భంగా నర్సింగ్‌ కోర్సుల వివరాలు చూద్దాం. కేవలం ఒక వృత్తిగా కాకుండా సేవాభావంతో సహనం, మానవతా దృక్పథం జతకూరిస్తే దీనిలో రాణించగలరు!
       ఇంటర్‌ తరువాత చదివే వృత్తివిద్యల్లో వెంటనే ఉద్యోగావకాశాలను కల్పిస్తున్న కోర్సుల్లో నర్సింగ్‌ కోర్సు ఒకటి. ప్రస్తుతం దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని ఆసుపత్రుల్లో నర్సింగ్‌ సేవలందించే సిబ్బంది కొరత సమస్యగా ఉంది. ఈ నేపథ్యంలో వివిధ విద్యాసంస్థల్లోని నర్సింగ్‌ విద్యార్థులు కోర్సు చివరి సంవత్సరంలోనే కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఉపాధిని ఎంచుకుంటున్నారు.
గతంలో ఈ వృత్తి పట్ల ఉన్న అపోహల వల్ల నర్సింగ్‌ శిక్షణ కోర్సులు ఎంచుకునే వారి సంఖ్య తక్కువగా ఉండేది. ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.
ఈ కోర్సు పూర్తిచేసినవారు ఇతర దేశాల్లోనూ బాగా రాణిస్తున్నారు. ఇతర దేశాల్లో వైద్యులతో సమాన హోదాతో కూడిన జీతం పొందు తున్నారు.
మిస్‌ నైటింగేల్‌ శకం నుంచి నర్సింగ్‌ విద్య ప్రారంభమైంది. అసాధారణ నైపుణ్యం కలిగిన వనిత నైటింగేల్‌ను 1854 సంవత్సరంలో ఒక యుద్ధంలో గాయపడిన సైనికులకు సేవలు అందించడానికి బ్రిటిష్‌ ప్రభుత్వం నియమించింది. అప్పటికి నర్సింగ్‌ వృత్తి ఒక వ్యవస్థాపరమైన నైపుణ్యాన్ని పొందలేదు. మిస్‌ ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌కు సహాయకులుగా కొంతమందిని నియమించారు. సేవలు, పరిచర్యలకు నియమించినవారితో నర్సింగ్‌ సేవకు అంకురార్పణ జరిగింది. ఈ శిక్షణ సుశిక్షితులైన నర్సులను తయారుచేసి ఆరోగ్య సేవలకు ఉపయోగించడానికి వీలు కల్పిస్తుంది.
1917లో దేశంలో కేవలం రెండు శిక్షణ కేంద్రాలు నర్సింగ్‌ విద్యలను అదించేవి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే వీటి సంఖ్య వందల్లో ఉంది. దీనిలో ఉండే ఉపాధి అవకాశాలు తెలుసుకుంటే అనువైన విభాగపు ఎంపిక సులభమవుతుంది. నర్సింగ్‌ కోర్సుల్లో వివిధ రకాలు, రంగాల్లో శిక్షణనిస్తారు. నైపుణ్యంతోపాటు ఎటువంటి స్థితిలోనైనా నిబ్బరంగా ఉండే మహత్తర మానవత్వం, జీవనశైలి ఈ వృత్తిని చేపట్టేవారికి అప్రయత్నంగా కలుగుతుంది.
నర్సింగ్‌ కోర్సుల శిక్షణలో డిప్లొమా, బ్యాచిలర్స్‌ డిగ్రీ, పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌, ఎంఫిల్‌, పీహెచ్‌డీ కోర్సులను ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు అందిస్తున్నాయి.
కోర్సుల వివరాలు
* మల్టీపర్పస్‌ హెల్త్‌వర్కర్‌ (ఎంపీహెచ్‌డబ్ల్యూ): గ్రామీణ సమాజంలో ప్రముఖ పాత్రవహిస్తూ గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఆరోగ్య సేవలందిస్తున్నారు. ప్రతి ప్రాథమిక కేంద్ర పరిధిలో 16 మంది మిడ్‌వైఫరీలు (ఏఎన్‌ఎం) అసరమవుతున్నారు. ఈ కోర్సును అభ్యసించడానికి ఇంటర్‌లో ఏదైనా గ్రూపు ద్వారా 40% మార్కులు సాధించి ఉండాలి. 17 సంవత్సరాల వయసు దాటినవారు అర్హులు.
* డిప్లొమా ఇన్‌ జనరల్‌ నర్సింగ్‌- మిడ్‌ వైఫరీ (జీఎన్‌ఎం): ఈ కోర్సులో శిక్షణ అందించడానికి ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు ముందుకొస్తున్నాయి. శిక్షణ అనంతరం ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆసుపత్రుల్లో స్టాఫ్‌ నర్సులుగా విధులు నిర్వర్తించవచ్చు. ఇంటర్‌లో ఏదైనా గ్రూపు (బైపీసీ గ్రూపుకు ప్రాధాన్యం) ద్వారా 45% మార్కులు సాధించి ఉండాలి. 17 సంవత్సరాల వయసు నిండినవారు అర్హులు.
ఈ కోర్సు కాలవ్యవధి మూడున్నర సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ అధీనంలోని నర్సింగ్‌ స్కూళ్లు, ప్రభుత్వ ఆసుపత్రుల అనుసంధానంతో నడిచేవి, గుంటూరు, కాకినాడ, కర్నూలు, తిరుపతి, అనంతపురం, కడపతోపాటు ప్రైవేటు నర్సింగ్‌ స్కూళ్లు కూడా ఈ కోర్సును అందిస్తున్నాయి.
బీఎస్‌సీ నర్సింగ్‌ శిక్షణలో ప్రాక్టికల్‌ శిక్షణతోపాటు వివిధ అంశాల్లోని స్పెషలైజేషన్ల గురించి, ఆయా విభాగాల్లో ఎలా పనిచేయాలో, వారి విధుల గురించి బోధిస్తారు.
* బీఎస్‌స్సీ- నర్సింగ్‌: ఇది నాలుగేళ్ల కోర్సు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని చాలా సంస్థలు ఈ నాలుగేళ్ల నర్సింగ్‌ డిగ్రీ కోర్సును అందిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లోని నర్సింగ్‌ కళాశాలల సంఖ్య 221. ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 109 నర్సింగ్‌ కళాశాలలున్నాయి. సుమారు 5000 సీట్లు అందుబాటులో ఉన్నాయి (ఆంధ్ర, ఎస్‌వీయూ పరిధిలో). వీటి అనుమతిని కేంద్రంలో ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌, రాష్ట్రంలోని డా.ఎన్‌టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌లు మంజూరు చేయాల్సివుంటుంది.
ఇంటర్‌లో బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీలతోపాటు ఇంగ్లిష్‌ను ఒక సబ్జెక్టుగా చదివి 50% మార్కులపైన సాధించినవారు అర్హులు. వయసు 17 సంవత్సరాలు నిండివుండాలి. ఇంటర్‌లో సాధించిన మార్కుల ఆధారంగా ప్రతిభ ప్రకారం కౌన్సెలింగ్‌ పద్ధతిలో ప్రవేశం కల్పిస్తున్నారు.
* పోస్ట్‌ బేసిక్‌ బీఎస్‌సీ నర్సింగ్‌ డిగ్రీ (పీబీ బీఎస్‌సీ.(ఎన్‌): ఇది రెండు సంవత్సరాల నర్సింగ్‌ కోర్సు. జీఎన్‌ఎం (జనరల్‌ నర్సింగ్‌ మిడ్‌ వైఫ్‌ డిప్లొమా) కోర్సు 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. రెండు సంవత్సరాల నర్సింగ్‌ వృత్తిలో అనుభవం, స్టేట్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయ్యి ఉండాలి.
ఈ కోర్సులు చదివిన అభ్యర్థులు సమాజంలోని అన్ని స్థాయుల్లో తన సేవలను అందించవలసి ఉంటుంది. తరువాత గ్రామ, పట్టణ స్థాయి ఆసుపత్రుతోపాటు కార్పొరేట్‌ ఆసుపత్రుల్లోనూ ఉద్యోగావకాశాలున్నాయి. విదేశాల్లో (ముఖ్యంగా అమెరికా, కెనడా, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, గల్ఫ్‌) మన దేశ నర్సులు ఫస్ట్‌ లెవల్‌ నర్సులుగా అంతర్జాతీయ నర్సుల కౌన్సిల్‌లో గుర్తింపు పొంది మంచి జీతం పొందగలుగుతున్నారు. అమెరికాలో ఫస్ట్‌ లెవల్‌ నర్సులకు రిజిస్టర్‌ నర్సులుగా ఉపాధి పొంది అక్కడే స్థిరపడే అవకాశముంది.
బీఎస్‌సీ నర్సింగ్‌ థియరీ పార్ట్‌లో- జనరల్‌ నర్సింగ్‌, జనరల్‌ మెడిసిన్‌, వైద్యవిద్యతో సమాన బోధన ఉంటుంది.
* ఎంఎస్‌సీ నర్సింగ్‌ (మాస్టర్స్‌ డిగ్రీ ఇన్‌ నర్సింగ్‌): ఇది రెండు సంవత్సరాల కోర్సు. బీఎస్‌సీ నర్సింగ్‌ లేదా పోస్ట్‌ బేసిక్‌ నర్సింగ్‌లో 50%తో ఉత్తీర్ణులై ఉండాలి. 300 సీట్లు అందుబాటులో ఉన్నాయి. బీఎస్‌సీ- నర్సింగ్‌ చదివిన అభ్యర్థులు కనీసం ఒక సంవత్సరం వృత్తి అనుభవం కలిగివుండాలి.
పోస్ట్‌ బేసిక్‌ నర్సింగ్‌ చదివినవారు పీబీ- బీఎస్‌సీ తరువాత నేరుగా ఎంఎస్‌సీ- నర్సింగ్‌లో చేరడానికి అర్హులు.
స్టేట్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌లో నర్స్‌గా రిజిస్టర్‌ అయి ఉండాలి. పటిష్ఠమైన లేబొరేటరీలు, నైపుణ్యం కలిగిన బోధనా సిబ్బందిని కలిగిన కళాశాలలే సుశిక్షితులైన, నర్సులను తీర్చిదిద్దగలవు. తెలుగు రాష్ట్రాల్లో ఎంఎస్‌సీ నర్సింగ్‌ కళాశాలలు హైదరాబాద్‌, తిరుపతితోపాటు 16 ప్రైవేటు నర్సింగ్‌ కళాశాలలు అనుమతులు పొంది ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరానికి ప్రవేశప్రక్రియ పూర్తయివుంది.
* ఎన్‌టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంలోని నర్సింగ్‌ కోర్సులో ప్రవేశం కోసం దరఖాస్తులను http://ntruhs.ap.nic.inనుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
స్పెషాలిటీలు
* చైల్డ్‌ నర్సింగ్‌
* మెడికల్‌ సర్జికల్‌ నర్సింగ్‌
* కమ్యూనిటీ హెల్త్‌ నర్సింగ్‌
* సైకియాట్రిక్‌ నర్సింగ్‌
* గైనకాలజీ అండ్‌ అబ్‌స్ట్రిసైట్రిక్స్‌ నర్సింగ్‌ ముఖ్యమైనవి. ఈ విభాగాల్లో ప్రత్యేక శిక్షణ పొందితే పెద్ద కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఉపాధిని మెరుగుపరచుకోవచ్చు.
* ఎంఫిల్‌ ఇన్‌ నర్సింగ్‌: 2 సంవత్సరాలు. ఎంఎస్‌సీ నర్సింగ్‌ చేసినవారు అర్హులు. 55% మార్కులు సాధించి ఉండాలి. దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో బెంగళూరు, మణిపాల్‌ చెప్పుకోదగినవి. ప్రవేశపరీక్ష ద్వారా ప్రవేశం కల్పిస్తారు.
* పీహెచ్‌డీ ఇన్‌ నర్సింగ్‌: 3 సంవత్సరాలు. ఎంఎస్‌సీ నర్సింగ్‌ 55% మార్కులు సాధించి ఉండాలి. రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, బెంగళూరులో రాతపరీక్ష ద్వారా ప్రవేశం కల్పిస్తున్నారు.
ఈ శిక్షణ కోర్సులు దేశవ్యాప్తంగా ఒకేవిధంగా ఉంటాయి. కాబట్టి ఉపాధి అవకాశాలు అధికం. భవిష్యత్తులో ఆసుపత్రులతోపాటు పెరుగుతున్న నర్సింగ్‌హోమ్‌లు, రీహెబిలిటేషన్‌, హోమ్‌ నర్సింగ్‌ సేవాకేంద్రాలు ఉద్యోగావకాశాలను మరింత మెరుగుపరుస్తాయి. నర్సింగ్‌లో శిక్షణ పూర్తిచేసుకున్న వారికోసం ఉద్యోగాలు ఎదురు చూస్తాయనడంలో సందేహం లేదు. ప్రస్తుతం దేశంలో నర్సుల, రోగుల నిష్పత్తిలో వ్యత్యాసం చాలా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో శిక్షణ పొందినవారికి ప్రపంచవ్యాప్తంగా గిరాకీ బాగా ఉంది. అయితే కోర్సును అభ్యసించేముందు మంచి కళాశాలను ఎంచుకోవడం అవసరం. సుశిక్షితులైన నర్సులు తయారైతే చక్కటి వైద్య, ఆరోగ్య సేవలు అందించడమే కాకుండా వారు విదేశాల్లోనూ ఉపాధి పొందగలుగుతారు.

Published on 09-11-2015