Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఎమ్మెస్సీ సీటుకు ఎలా చదవాలి?

     ఈ నెల చివరి వారం నుంచి తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల పీజీ ప్రవేశ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. బేసిక్‌ సైన్సెస్‌, బయాలజీ సబ్జెక్టులకు పోటీ పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేయాలనుకునే కల నెరవేరాలంటే ఏం చేయాలి?
గణితం, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, బయోటెక్నాలజీ, బయో కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, మెటీరియల్‌ సైన్స్‌, నానో టెక్నాలజీ సబ్జెక్టులు ఇటీవలి కాలంలో ప్రాచుర్యం పొందుతున్నాయి. మన రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు ఎంఎఎస్‌సీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే ప్రవేశపరీక్షలకు ఈ సబ్జెక్టుల్లో బాగా పోటీ ఉంది. రసాయనశాస్త్రం, భౌతికశాస్త్రం, గణితాలతోపాటు బయాలజీ సబ్జెక్టులైన బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, మైక్రో బయాలజీలకు పోటీ ఎక్కువ. అత్యుత్తమ ప్రణాళికతో చదివితేనే విద్యార్థులు విశ్వవిద్యాలయాల్లో సీట్లు సాధించగలరు.
రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో ఎంఏ, ఎంఎస్‌సీ, ఎంకాం, ఎంసీఏ, ఎంబీఏ, ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్సులతోపాటు ఎంఫిల్‌, పీహెచ్‌డీ పరిశోధన కోర్సులున్నాయి. పీజీ సెట్‌ల ద్వారా ఎంఏ, ఎంఎస్‌సీ, ఎంకాం, ఇంటిగ్రేటెడ్‌ పీజీ తదితర కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు. మిగతా కోర్సులకు విడిగా ప్రవేశపరీక్షలుంటాయి. సైన్స్‌, ఆర్ట్స్‌, కామర్స్‌ సబ్జెక్టుల్లో పీజీ ప్రోగ్రాములను నిర్వహిస్తున్నాయి.
మంచి మౌలిక సౌకర్యాలు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు అందుబాటులో ఉండే విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, ప్రముఖ ప్రైవేటు కళాశాలల్లో సీటు సాధించాలంటే సంబంధిత సబ్జెక్టులో ఉత్తమ ర్యాంకులు తెచ్చుకోవాల్సిందే. క్యాంపస్‌ కళాశాలల్లో మంచి గ్రంథాలయాలు, ప్రయోగశాలలు, అంతర్జాల సౌకర్యం, ఉన్నత కోర్సుల పోటీపరీక్షలకు సిద్ధమవడానికి అవసరమైన పుస్తకాలూ, మార్గదర్శకత్వం అందుబాటులో ఉంటాయి.
ముఖ్యమైన తేడా
బీఎస్‌సీ పరీక్షలకు కొన్ని ఎంపిక చేసుకున్న అంశాలకు సిద్ధమైతే సరిపోతుంది. కానీ ఎంఎస్‌సీ ప్రవేశపరీక్షలకు ప్రవేశపరీక్షల సిలబస్‌ మొత్తాన్నీ అనువర్తిత ధోరణిలో చదవాలి.
పీజీ కోసం ఎంచుకున్న సబ్జెక్టు డిగ్రీ స్థాయిలోని పాఠ్యాంశాలను విశ్లేషణాత్మకంగా చదవాలి. వివిధ అంశాలను అన్వయించడం తెలుసుకోవాలి. ఇది ప్రవేశ పరీక్షలకు పునాదిగా ఉపయోగపడుతుంది. విద్యార్థులు గ్రాడ్యుయేషన్‌ మొదటి సంవత్సరంలో ఉన్నపుడే పీజీ ఏ సబ్జెక్టులో చేయాలనేది నిర్ణయించుకోవాలి. ఎంచుకున్న సబ్జెక్టును పైన చెప్పిన పద్ధతిలో చదవడం ప్రారంభించాలి. ముందు ఇంటర్‌లో చదివిన విషయాలను ఒకసారి పునశ్చరణ చేసుకోవాలి. తర్వాత డిగ్రీ అంశాలను క్రమం తప్పకుండా చదవాలి.
ఈ పద్ధతిలో సిద్ధమవనివారు- ప్రవేశపరీక్షకు చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి- సంబంధిత సబ్జెక్టులో ముఖ్యమైన అంశాలను పునశ్చరణ చేసుకుని మాదిరి పరీక్షలను బాగా సాధన చేయాలి.
ప్రస్తుతమున్న పోటీని బట్టి చూస్తే 60- 70 శాతం మార్కులు సాధిస్తే సీటు రావచ్చు. డిగ్రీ మొదటి సంవత్సరం నుంచి సిద్ధమవుతున్నవారు అయితే అదే పద్ధతిలో ఆఖరి సంవత్సరం వరకూ అలానే చదివితే సరిపోతుంది. కానీ డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులూ, డిగ్రీ పూర్తయినవారూ రోజుకు 5- 6 గంటలు చదవాలి. సబ్జెక్టుకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే తమ కళాశాల అధ్యాపకులను అడిగి నివృత్తి చేసుకోవచ్చు. డిగ్రీ పూర్తయ్యాక సన్నద్ధత ప్రారంభించేవారైతే కోచింగ్‌ తీసుకోవడమే మంచిది.
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో తమ సంబంధిత ప్రాంతీయ విద్యార్థులకు 85% సీట్లను, ప్రాంతీయేతర విద్యార్థులకు 15% సీట్లను కేటాయిస్తారు. కాబట్టి విద్యార్థులు తమ ప్రాంత విశ్వవిద్యాలయాలకు ముందుగా ప్రాధాన్యమివ్వాలి.
ఎంఎస్‌సీ ప్రవేశపరీక్ష ప్రశ్నపత్రాలు బహుళైచ్ఛిక పద్ధతిలో నిర్వహిస్తారు. కాబట్టి సబ్జెక్టును అనువర్తిత ధోరణిలో విశ్లేషణాత్మకంగా చదవాలి. ఆపై బహుళైచ్ఛిక ప్రశ్నలున్న రిఫరెన్స్‌ పుస్తకాలు, మాదిరి ప్రశ్నపత్రాలు, గత ప్రశ్నపత్రాలను అధ్యయనం చేయాలి.
ఎంఎస్‌సీ ప్రవేశపరీక్షలో 100 ప్రశ్నలకు 90 నిమిషాల్లో సమాధానం రాయాలి.
విశ్వవిద్యాలయాల వారీగా...
డిగ్రీ మొదటి సంవత్సరం నుంచి సిద్ధమవుతున్నవారు అయితే అదే పద్ధతిలో ఆఖరి సంవత్సరం వరకూ అలానే చదివితే సరిపోతుంది. కానీ డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులూ, డిగ్రీ పూర్తయినవారూ రోజుకు 5- 6 గంటలు చదవాలి. సబ్జెక్టుకు సంబంధించి సందేహాలుంటే కళాశాల అధ్యాపకులను అడిగి నివృత్తి చేసుకోవచ్చు.
* ఉస్మానియా విశ్వవిద్యాలయం: ఎంఎస్‌సీ బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, జెనెటిక్స్‌, ఫుడ్‌ & న్యూట్రిషన్‌ సబ్జెక్టులన్నింటికీ కలిపి ఉమ్మడి ప్రవేశపరీక్షను నిర్వహిస్తోంది. ఈ పరీక్షకు బీఎస్‌సీలో బయాలజీతోపాటు రసాయనశాస్త్రం కలిగిన విద్యార్థులు, ఎంపీసీ విద్యార్థులు కూడా అర్హులే. ఈ ప్రవేశపరీక్షలో బీఎస్‌సీలో తాము చదివిన ఏదైనా ఒక బయాలజీ ఆప్షనల్‌ను ఎంపిక చేసుకోవాలి. రసాయనశాస్త్రం అందరికీ ఉంటుంది. సాధారణంగా బయాలజీ విద్యార్థులు సంబంధిత బయాలజీతోపాటు రసాయన శాస్త్రానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తూ సమగ్రంగా చదవాలి.
ఉస్మానియా బయోటెక్నాలజీ ఉమ్మడి ప్రవేశపరీక్ష రాసిన తరువాత మంచి ర్యాంకు సాధించిన విద్యార్థులు, తమకు నచ్చిన స్పెషలైజేషన్‌లో ఎంఎస్‌సీ చేయవచ్చు. ఉస్మానియా బయోటెక్నాలజీ ఉమ్మడి ప్రవేశపరీక్ష రాయబోయే విద్యార్థులు గమనించవలసింది ఏంటంటే బయాలజీ సిలబస్‌కు 60%, రసాయన శాస్త్రం సిలబస్‌కు 40% వెయిటేజీ ఉంది. కాబట్టి బయాలజీతోపాటు రసాయనశాస్త్రం సిలబస్‌కు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి.
* ఆంధ్రా విశ్వవిద్యాలయం: ఎంఎస్‌సీ మెరైన్‌ బయోటెక్నాలజీ, ఎంఎస్‌సీ మెరైన్‌ కెమిస్ట్రీ, ఎంఎస్‌సీ న్యూక్లియర్‌ కెమిస్ట్రీ, ఎంఎస్‌సీ టెక్‌, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌ మొదలైన కోర్సులను అందిస్తోంది.
* ఎస్‌వీ యూనివర్సిటీ: పీజీ సెట్‌ ఎంఎస్‌సీలో నూతన కోర్సులను అందిస్తోంది. ఎంఎస్‌సీ ఇమ్యూనో టెక్నాలజీ, ఎంఎస్‌సీ బయో ఇన్ఫర్మాటిక్స్‌, ఎంఎస్‌సీ మెటీరియల్‌ సైన్స్‌, నానోటెక్నాలజీ, ఎంఎస్‌సీ వైరాలజీ, ఎంటెక్‌ స్పేస్‌ టెక్నాలజీ మొదలైన కోర్సులను అందిస్తోంది.
* ఎన్‌ఐటీ వరంగల్‌: పీజీ స్థాయిలో ఎంఎస్‌సీ (టెక్‌) ఇంజినీరింగ్‌ ఫిజిక్స్‌, ఎంఎస్‌సీ అప్త్లెడ్‌ మ్యాథ్స్‌, ఎంఎస్‌సీ మేథమేటిక్స్‌ & సైంటిఫిక్‌ కంప్యూటింగ్‌, ఎంఎస్‌సీ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ & ఎంఎస్‌సీ ఎనలిటికల్‌ కెమిస్ట్రీ కోర్సులను అందిస్తోంది.
ఈ పీజీ కోర్సుల్లో 50% సీట్లు జామ్‌ 2015 ర్యాంకు ఆధారంగా, మిగిలిన సీట్లకు ఎన్‌ఐటీ వరంగల్‌ నిర్వహించే ప్రవేశపరీక్ష ఆధారంగా ప్రవేశం ఉంటుంది. ఇది జాతీయ స్థాయి ప్రవేశపరీక్ష. బీఎస్‌సీ స్థాయిలో మొదటి తరగతి (60%)లో ఉత్తీర్ణులైన విద్యార్థులు మాత్రమే దీనికి అర్హులు. అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్టులో 80 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు రెండు గంటల కాలవ్యవధితో ఇస్తారు. సరైన సమాధానానికి 4 మార్కులు, తప్పు సమాధానానికి ఒక రుణాత్మక మార్కు.
సబ్జెక్టును ఇష్టపడి చదవాలి. సానుకూల దృక్పథంతో శ్రమిస్తేనే ర్యాంకు సాధించవచ్చు. అంతర్జాలం ఉపయోగించుకుని కూడా కొన్ని మాదిరి ప్రశ్నపత్రాల సాధన చేసుకోవచ్చు.

posted on 20.4.2015