Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
చదివింది గుర్తుండటం లేదా?

పోటీ పరీక్షల్లోనైనా, కళాశాలల్లో జరిగే వార్షిక పరీక్షల్లోనైనా జ్ఞాపకశక్తికి ఎంతో ప్రాముఖ్యం. కానీ చాలామంది విద్యార్థులు ఎంత చదివినా తమకు సరిగ్గా గుర్తుండదని బాధపడుతుంటారు. ఈ సమస్య తొలగాలంటే ఏ మెలకువలు పాటించాలో చూద్దామా?
పట్టుదల, అంకితభావంతో చదువుతున్నా తగిన జ్ఞాపకశక్తి లేకపోతే శ్రమంతా వృథా అవుతుంది. జ్ఞాపకశక్తిలేమి విజయంపై అనుమానాలను రేకెత్తిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తుంది. చివరకు కుంగుబాటుకూ కారణమవుతుంది. అయితే శాస్త్రీయ అవగాహన, అభ్యాసంతో ప్రతిఒక్కరూ జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవచ్చు. కావాల్సిన అర్హత ఒకటే... విశ్వసనీయతగల ధారణశక్తిని అలవరచుకోవాలనే బలమైన కోరిక!
జ్ఞాపకశక్తికి సంబంధించి ప్రయోగాలు చేసిన సైకాలజిస్టులు శాస్త్రీయ సమాచారాన్ని మన అందుబాటులోకి తెచ్చారు. క్రమమైన అధ్యయనం, అభ్యాసంతో ప్రతి ఒక్కరూ జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవచ్చు.
నేర్చుకున్నది ఏదైనా 'నేను మరచిపోయాను అనుకునేకంటే, సరైన పద్ధతిలో గుర్తుంచుకోలేదు' అనుకోవడం సబబు. ఇందువల్ల జ్ఞాపకశక్తి వారి నియంత్రణలో ఉండవలసిన బాధ్యతగా రూపొంది సత్ఫలితాలనిస్తుంది.
జ్ఞాపకశక్తి ఒకరోజులోనో, రాత్రికి రాత్రో అలవడే నైపుణ్యం కాదు. లక్ష్యాత్మకంగా, సంకల్పబలంతో క్రమంగా పట్టు సాధించవలసిన ప్రక్రియ అది. ఒకసారి శాస్త్రీయ జ్ఞాపకశక్తి అలవడితే చాలు, ఆ తరువాత నేర్చుకోవడం ఇష్టమైన వ్యాపకంగా రూపుదిద్దుకుంటుంది.
మూడు అంశాలు
ఇది మూడు అంశాలతో ముడిపడిన జ్ఞానాత్మక (కాగ్నిటివ్‌) ప్రక్రియ. మొదటిది- నేర్చుకోవాల్సిన అంశాన్ని సంకేతాలు, చిత్రాల రూపంలో (కోడింగ్‌) అన్వయం చేసుకోవడం. రెండోది- అన్వయించుకున్న సమాచారాన్ని జ్ఞాపక భాండాగారంలో భద్రపరచుకోవడం. మూడోది- సమాచారాన్ని అది నిక్షిప్తం చేసిన చోటును గుర్తించి అక్కడి నుంచి దాన్ని వ్యవహారం కోసం రాబట్టుకోవడం. ఈ మూడు అంశాలకు సంబంధించిన లోతైన అవగాహనను ఏర్పరచుకుంటే జ్ఞాపకశక్తి మెలకువలు సులభంగా అలవడతాయి.
జ్ఞాపకశక్తి ప్రక్రియను వివరించే సిద్ధాంతాలు ఎన్నో ఉన్నాయి. రిచర్డ్‌ అట్‌కిన్‌సన్‌ అనే అమెరికన్‌ సైకాలజీ ప్రొఫెసర్‌ తన విద్యార్థి రిచర్డ్‌ షిఫ్రిన్‌తో కలిసి రూపొందించిన సిద్ధాంతం పరీక్షలను ఎదుర్కొనే వారికి సులభంగా అర్థమై ప్రయోజనాలను చేకూర్చే విధంగా ఉంది.
జ్ఞాపకశక్తి ప్రక్రియ
నేర్చుకునే సందర్భంలో సమాచారాన్ని మెదడుకు చేరవేసే బాధ్యతను మన జ్ఞానేంద్రియాలైన కళ్లు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం చేపడతాయి. అయితే ఈ అయిదింటిలో కళ్లు (చూడడం), చెవుల (వినడం) ద్వారానే ఎక్కువశాతం అభ్యసనం కొనసాగుతుంది.
* ప్రతి జ్ఞానేంద్రియానికీ అనుబంధంగా పనిచేస్తూ సమాచారాన్ని భద్రపరచడానికి 'సెన్సరీ రిజిస్టర్‌' అనే ఒక తాత్కాలిక జ్ఞాపక భాండాగారం ఉంటుంది.
* జ్ఞానేంద్రియాల సమాచారం సెన్సరీ రిజిస్టర్‌లో కేవలం రెండు సెకన్లు నిల్వ ఉంటుంది. ఆ తరువాత అది అదృశ్యమైపోతుంది.
* అలా అదృశ్యమైపోయేలోపే మనం జాగ్రత్తపడి ఆ సమాచారాన్ని 'షార్ట్‌ టర్మ్‌ మెమరీ' అనే రెండోస్థాయి జ్ఞాపక భాండాగారంలోకి పంపించాలి.
* ఇలా పంపడానికి మనం సెన్సరీ రిజిస్టర్‌లోకి చేరిన అంశాలను ఏకాగ్రతతో గుర్తించి వాటి ఉనికి, స్వరూప స్వభావాలను పసిగట్టాలి. అలా అవధానం (అటెన్షన్‌)తో గుర్తించిన అంశాలు మాత్రమే షార్ట్‌ టర్మ్‌ మెమరీలోకి చేరతాయి.
* షార్ట్‌టర్మ్‌ మెమరీలో కూడా సమాచారం మహా అయితే ముప్పై సెకన్లపాటు నిల్వ ఉంటుంది.
* మనం మళ్లీ జాగ్రత్తపడి తక్షణమే సమాచారాన్ని షార్ట్‌టర్మ్‌ మొమరీ నుంచి మూడో, శాశ్వత జ్ఞాపక భాండాగారమైన 'లాంగ్‌టర్మ్‌ మెమరీ'లోకి పంపించాలి.
లాంగ్‌టర్మ్‌ మెమరీలో నిక్షిప్తమైన సమాచారం చాలాకాలంపాటు నిల్వ ఉంటుంది. ఎంతకాలమనేది వ్యక్తిగతంగా తీసుకునే జాగ్రత్తలను బట్టి ఉంటుంది. అయితే షార్ట్‌టర్మ్‌ మెమరీలో ఉన్న సమాచారాన్ని లాంగ్‌టర్మ్‌ మెమరీలోకి పంపించడానికి మనం పునరావృత అభ్యాసం (రిహార్సల్‌) అనే పద్ధతిని అనుసరించాలి. సమాచార అర్థాన్ని అవగతం చేసుకుంటూ రిహార్సల్‌ చేస్తేసరి, అది లాంగ్‌టర్మ్‌ మెమరీలో చాలాకాలం నిల్వ ఉంటుంది. మనకు సమాచారం అవసరమైనపుడు దాన్ని లాంగ్‌టర్మ్‌ మెమరీలోనుంచి వెలికి తెచ్చుకోవాలి. ఇదీ సూక్ష్మంగా జ్ఞాపకశక్తి ప్రక్రియ పనిచేసే తీరు.
చదివేటప్పుడు ప్రతి అంశాన్నీ లాంగ్‌టర్మ్‌ మెమరీలోకి చేరవేసిన తరువాతే కొత్త అంశాన్ని చేపట్టాలి. ప్రతిభావంతమైన అభ్యాసమంటే ఇదే.
కొన్ని మెలకువలు
వ్యక్తుల స్వభావరీత్యా ఉన్న వ్యత్యాసాల కారణంగా జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి ఒక్కొక్కరికి ఒక్కో మెలకువ నచ్చుతుంది. అందువల్ల అన్ని మెలకువలూ అలవడడం లేదని నిరుత్సాహపడకూడదు. క్రమంగా ఒక్కోదాన్ని అలవరచుకుంటూ, పట్టు సాధిస్తూ, కొత్త మెలకువల వైపు దృష్టిపెట్టాలి.
1. సాధారణ అనుసంధానం (జనరల్‌ అసోసియేషన్‌)
ప్రతి వ్యక్తి లాంగ్‌టర్మ్‌ మెమరీలో అదివరకే భద్రపరిచిన ఎన్నో అంశాలుంటాయి. కొత్త అంశాలను నేర్చుకునేటప్పుడు అభ్యాసకులు వాటిని లాంగ్‌టర్మ్‌ మెమరీలో సారూప్యత ఉన్న అంశాలతో అనుసంధానం చేస్తూ గుర్తుంచుకోవచ్చు.
ఉదాహరణకు ఒక కొత్తవ్యక్తి పేరును గుర్తుంచుకోవడానికి అదివరకే అదేపేరుతో మనకు తెలిసిన వ్యక్తి ఉంటే ఆ ఇద్దరు వ్యక్తులను, గతంలో మనకు తెలిసినవ్యక్తి ఎక్కువగా ఉండేచోట, సమష్టిగా ఒక పనిచేస్తున్నట్టుగా వూహాత్మకంగా అనుసంధానపరచాలి. అలా కొత్తవ్యక్తి పేరు భద్రంగా మన లాంగ్‌టర్మ్‌ మెమరీలోకి చేరిపోతుంది. అలా వూహాత్మకంగా అనుసంధానపరిచేటప్పుడు పెద్దదైన పరిమాణం, కదలిక, హాస్యం, అసహజత్వం అనే గుణాలను కలగలిపి చిత్రీకరణ చేసుకోవాలి. అలా చేస్తే ఎక్కువ శ్రమ లేకుండా అవసరమైనప్పుడు సమాచారం వెంటనే గుర్తుకొస్తుంది. వేర్వేరు పదాల మొదటి అక్షరాలను జోడించి ఒక కొత్త పదాన్ని తయారుచేసుకుని వాటి ఆధారంగా ఆ పదాలను గుర్తుంచుకోవడానికీ అనుసంధాన మెలకువ ఉపయోగపడుతుంది.
2. స్థల అనుసంధానం (ప్లేస్‌ బేస్‌డ్‌ అసోసియేషన్‌)
వ్యాసరూప సమాధానాలు రాసేటప్పుడు, అంశాలను ఒక క్రమంలో తెలియజేసేటప్పుడు స్థల అనుసంధాన మెలకువ ఎంతో ఉపయోగపడుతుంది.
మనకు బాగా తెలిసిన ఇల్లు, ఆఫీసు, పొడవాటి వీధి వంటి స్థలాలను ఎంపిక చేసుకుని అక్కడున్న వస్తువులకు సంబంధించి మనసులో ఒక నిర్దిష్టమైన వరుసక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అనంతరం మనం గుర్తుంచుకోవాల్సిన అంశాల క్రమాన్ని అదివరకే మన లాంగ్‌టర్మ్‌ మెమరీలో ఉన్న వస్తువులతో అనుసంధానంచేస్తూ వాటిమధ్య సంబంధాన్ని కుదర్చాలి. మానసికంగా ఒక వూహను సృష్టించేటప్పుడు హాస్యం, కదలిక వంటి గుణాలకు ప్రతిసారీ ప్రాధాన్యమివ్వాలి. స్థల అనుసంధానం మెలకువ ద్వారా మనకు బాగా తెలిసిన వస్తువులను మనోఫలకం మీదకు తెచ్చుకుంటే సరి, వాటితో జతపరిచిన కొత్త అంశాలు గుర్తుకు వస్తాయి. మొదట్లో కొంత కొత్తగా, కష్టతరంగా అనిపించినా అభ్యాసంతో అనుసంధాన నైపుణ్యాన్ని అలవరచుకోవచ్చు.
3. సంఖ్య- అక్షర ఆధారిత చిత్రాలు (నంబర్‌- లెటర్‌ రిలేటెడ్‌ ఇమేజెస్‌)
సంఖ్య- అక్షర ఆధారిత చిత్రాల రూపకల్పనకు అభ్యాసకులు ముందుగా నిర్దిష్టమైన బొమ్మలను నిర్దిష్టమైన స్థలంలో ఉన్నట్టుగా లాంగ్‌టర్మ్‌ మెమరీలో నిక్షిప్తం చేసుకోవాలి. ఉదాహరణకు ఇంగ్లిష్‌ అక్షరమాలలో ఇరవై ఆరు అక్షరాలున్నాయి. ఒకటో అక్షరం 'ఎ'. ఆ అక్షరంతో ప్రారంభమయ్యే ఇంగ్లిష్‌ పదాన్ని, దాని సంబంధిత చిత్రాన్ని ఒక నిర్దిష్టమైన చోట ఉన్నట్టుగా సృష్టించి మెమరీలో భద్రపరచుకోవాలి. అలా ఇరవై ఆరు అక్షరాలకూ చిత్రాలను రూపొందించుకోవాలి.
ఒకసారి చిత్రాలు రూపొందాక గుర్తుంచుకోవాల్సిన అంశాలను వాటితో అనుసంధానం చేస్తేసరి. అవసరమైనప్పుడు ఆధార చిత్రాల సాయంతో కొత్త అంశాలను జ్ఞప్తికి తెచ్చుకోవచ్చు. చాలా అంకెలు గల సంఖ్యలు, సంవత్సరాలను గుర్తుంచుకోవడానికీ ఈ మెలకువ బాగా ఉపయోగం. సంఖ్యలను సూచించే అక్షరాలతో ప్రారంభమయ్యే పదాలకు చెందిన సంబంధిత చిత్రాల మధ్య ఒక జతపరిచే సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. వాటిని జ్ఞప్తికి తెచ్చుకునేటప్పుడు చిత్రాల నుంచి మొదలుపెట్టి వాటి పదాల మొదటి అక్షరం సాయంతో సంఖ్యలను రాబట్టు కోవాలి.
4. కథారూప ధారణ (స్టోరీ బేస్‌డ్‌ మెమరీ)
భావుకత, వివరణ సామర్థ్యం, వర్ణన నైపుణ్యం ఉన్నవారికి ఈ మెలకువ ఉపయోగపడుతుంది. గుర్తుంచుకోవాల్సిన అంశాలను కొన్ని భాగాలు, అంశాలు/ పదాలుగా విడగొట్టాలి. వాటిమధ్య సంబంధాన్ని ఏర్పరుస్తూ ఒక కథను అల్లుకోవాలి. కథకు ఒక క్రమంలో కొనసాగే స్వభావమున్న దృష్ట్యా సమాచారాన్ని వెలికితీసే సమయాన ఒక్కో అంశం మనోఫలకంపై వచ్చి దానితో అనుసంధానమైన కొత్త అంశాన్ని మనకు గుర్తుకుతెస్తుంది.
నేర్చుకున్న అంశాలు ధారణలో స్థిరపడడానికి ప్రణాళికాయుత అభ్యసనం అలవరచుకోవాలి.
* సబ్జెక్టు క్లిష్టత, ప్రాధాన్యం, వ్యక్తిగతంగా దానిపై ఉండేపట్టు, అందుబాటులో ఉన్న సమయం, పరీక్షవిధానం వంటి వివిధ ప్రాముఖ్యంగల అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏ సబ్జెక్టును ఏ క్రమంలో చదవాలో ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవడం
* సెన్సరీ రిజిస్టర్‌ దశ నుంచి మొదలుకుని సమాచారం లాంగ్‌టర్మ్‌ మెమరీలో నిక్షిప్తమయ్యే దశవరకు జాగ్రత్త తీసుకుంటూ జ్ఞాపకశక్తిపై విశ్వాసాన్ని పెంపొందించుకోవడం.
* అభ్యసన ప్రక్రియ, పరీక్షల సమయంలో ఇతరులతో పోల్చుకోకుండా వ్యక్తిగత అభివృద్ధికి దోహదపడే పద్ధతులవైపే మొగ్గుచూపడం.
* నేర్చుకున్న అంశాలు ఏ మేరకు లాంగ్‌టర్మ్‌ మెమరీలో నిక్షిప్తమయ్యాయో తెలుసుకోవడానికి ప్రత్యేక సమయాన్ని కేటాయించుకుని స్వయంగా నమూనా పరీక్షలను రాసుకోవడం, ఫలితాల ఆధారంగా దిద్దుబాటు చర్యలు చేపట్టడం.
* ఒకవైపు దిద్దుబాటు చర్యలు కొనసాగిస్తూనే మరోవైపు అభ్యసనానికి బలం చేకూరే విధంగా ప్రత్యేక సమయాన్ని ఏర్పాటు చేసుకుని పునశ్చరణ చేసుకోవడం.
ఈ జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు రాస్తే తిరుగులేని పరిశ్రమకు తరుగులేని జ్ఞాపకశక్తి తోడై విజయం సొంతమవుతుంది.

Posted on 28-09-.2015