Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
అమెరికా వెళ్లేవారికి ఉచితంగా సమాచారం, సలహాలు

* విద్యార్థుల్లో అవగాహన పెంచుతున్న డాక్టర్‌ అనిల్‌
ఈనాడు, హైదరాబాద్‌: మధ్యతరగతి నుంచి సంపన్న వర్గాల వరకు అందరినీ ఊరించేది విదేశీ విద్య. తమ పిల్లలను అమెరికాలో చదివించాలని తల్లిదండ్రులు కలలు కనడం సహజం. అవకాశం ఉన్న ప్రతి కుటుంబమూ పైసాపైసా కూడబెట్టి అమెరికా పంపించేందుకు ప్రణాళికలు రూపొందించుకోవడం సహజం. డబ్బు సమకూర్చుకోగానే సరిపోదు. అమెరికా విద్యావిధానంపై సమగ్ర సమాచారం సేకరించకపోతే ఒక జీవిత కాలం నష్టపోతారు. అందుకే కచ్చితమైన సమాచారం కోసం అవస్థలు పడుతుంటారు. ఎలాంటి ప్రయాస లేకుండా విద్యార్థులకు ఉచితంగా తగిన సమాచారం, సలహాలు ఇచ్చి కెరీర్‌ను ఉత్తమంగా తీర్చిదిద్దుకోవడానికి సహకరిస్తున్నారు డాక్టర్‌ అనిల్‌. ఇటీవల నగరానికి వచ్చిన ఆయనతో 'ఈనాడు' ముచ్చటించింది.
* స్వానుభవంతో నేర్చుకున్న పాఠం
నగరానికి చెందిన పల్ల అనిల్‌ బీఏఎంఎస్‌(ఆయుర్వేదం) చదివారు. అందరిలాగే అమెరికా కల కన్న ఆయన 2009లో అక్కడికి వెళ్లేందుకు ఓ కన్సల్టెన్సీని సంప్రదించారు. వారు అడిగినట్లుగా రూ.60 వేలు ఇచ్చారు. నాలుగైదు నెలలపాటు ఏ సంగతీ తేలలేదు. కన్సల్టెన్సీ ప్రతినిధులను ఎన్నిసార్లు సంప్రదించినా అమెరికా విశ్వవిద్యాలయం నుంచి జవాబు రాలేదని చెప్పేవారు. చివరకు ఐ 20(ప్రవేశం ఇస్తున్నట్లు విశ్వవిద్యాలయం అధికారికంగా ఇచ్చే పత్రం) వచ్చాక అమెరికా వెళ్లి అక్కడి విశ్వవిద్యాలయం అధికారులను కలిసి జాప్యంపై ఆరా తీశారు. ఒక అడ్మిషన్‌కు నాలుగైదు నెలల సమయం ఎందుకు పడుతుందని ప్రశ్నించారు. నివ్వెరపోయిన అధికారులు అప్పటికి రెండుమూడు రోజులే కన్సల్టెన్సీ నుంచి తమకు ఈ-మెయిల్‌ వచ్చినట్లు చూపించారు. అప్పుడే అనిల్‌లో ఆలోచన మొదలైంది.
* ఉచితంగా సేవలు
అమెరికాలో విద్య అభ్యసించదలచుకున్న విద్యార్థులు ఎన్నో రకాలుగా నష్టపోతున్నారని అర్థం చేసుకున్నారు అనిల్‌. కన్సల్టెన్సీ కారణంగా తాను పడిన ఇబ్బంది ఇతరులకు ఎదురు కాకూడదని భావించారు. అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందాలనుకునే వారికి ఉచితంగా సమాచారం, సలహాలు అందిస్తున్నారు. వారం రోజుల్లోనే అనుమతులు మొత్తం పూర్తయి ప్రవేశాలు లభించేలా ఐ 20 వచ్చేలా సేవలందిస్తున్నారు. కొత్తగా వెళ్లే విద్యార్థులకు అవసరమైన ప్రవేశాల సేవలే కాకుండా అమెరికాలో చదువుకుంటూ అక్కడ అవగాహన లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే వారికీ అనిల్‌ మార్గదర్శనం చేస్తున్నారు.
* ట్రైవ్యాలీ బాధిత విద్యార్థులకు అండగా
ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయం వ్యవహారం అందరికీ గుర్తుండే ఉంటుంది. సరైన అనుమతులు(అక్రిడేషన్లు) లేని ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయంలో చేరి వందల మంది ఇబ్బందులు పడ్డారు. అప్పుడు సుమారు 1,200 మందికి సలివాన్‌ విశ్వవిద్యాలయం సీఈవో ఎరిక్‌ హార్టర్‌తో స్వయంగా సంప్రదించి ఉచితంగా తిరిగి ప్రవేశాలు దక్కేలా కృషి చేశారు.
* ఫీజులు తక్కువ ఒక్కటే చూడొద్దు
అమెరికా విద్యపై ఆశతో వెళ్లేవారు అక్కడి ప్రభుత్వ విధానాలు, విశ్వవిద్యాలయాల గుర్తింపు తదితర వాటిని క్షుణ్నంగా అధ్యయనం చేయకపోవడం వల్లే ఇబ్బంది పడుతున్నారు. నిజానికి కొన్ని విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు దరఖాస్తుల ఛార్జీలు, ఐ 20 షిప్పింగ్‌ ఛార్జీలు లేకుండా సేవలందిస్తుంటాయి. ఈ విషయం చాలామందికి తెలియదు. అమెరికాలో మాస్టర్స్‌ డిగ్రీ(పీజీ) పూర్తయ్యాక హెచ్‌ 1 రాకపోతే మళ్లీ మాస్టర్స్‌ డిగ్రీ చేస్తూ వర్క్‌ అథెంటిఫికేషన్‌ కోసం ప్రయత్నించే విద్యార్థులూ ఉంటారు. ఇలాంటి వారికి అనిల్‌ మార్గనిర్దేశనం చేస్తుంటారు. ఎక్కువ మంది ఐటీ కోర్సుల కోసం వెళ్తుంటారు. స్టెమ్‌(సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథ్స్‌) కోర్సుల వారికి 29 నెలల ఓపెన్‌ వర్క్‌ పర్మిట్‌ లభిస్తుంది. అదే మేనేజ్‌మెంట్‌, బయోకెమిస్ట్రీ లాంటివి చదవడానికి వెళ్లే వారికి 12 నెలలే ఎంప్లాయిమెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్‌(వర్క్‌ పర్మిట్‌). దీన్ని గమనించాలి. అమెరికా కళాశాలలకు, విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకునేటప్పుడు అవి ఫర్‌ ప్రాఫిటా? నాట్‌ ఫర్‌ ప్రాఫిటా? అని చూడాలి. ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయంలో విషయంలో విద్యార్థులు మోసపోవడానికి ప్రధాన కారణం ట్యూషన్‌ ఫీజులు అతి తక్కువగా ఉన్నాయని ఆకర్షితులు కావడమే. దాంతో అసలు ఆ విశ్వవిద్యాలయానికి గుర్తింపు ఉందా? లేదా? లాంటి మౌలిక వివరాలను సరి చూసుకోలేదు.
* ప్రస్థానం ఇదీ
నగరానికి చెందిన అనిల్‌ ఆయుర్వేద వైద్యునిగా ప్రస్థానం ప్రారంభించారు. ఆస్ట్రేలియాలో రెండు మాస్టర్స్‌ డిగ్రీలు చేశారు. హెల్త్‌కేర్‌కు సంబంధించి 2008లో పల్ల ఇన్ఫోటెక్‌ను ప్రారంభించారు. ఆ కంపెనీ ద్వారా మెడికల్‌ బిల్లింగ్‌, కోడింగ్‌ సేవలందించేవారు. తర్వాత 2009లో అమెరికా వెళ్లాక అక్కడా బ్రాంచి స్థాపించి వ్యాపారం చేస్తూనే సలివాన్‌ యూనివర్సిటీలో ఎంఎస్‌(మేనేజ్‌మెంట్‌) చేశారు. అదే విశ్వవిద్యాలయం నుంచి స్ట్రాటెజిక్‌ మేనేజ్‌మెంట్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు.
* సమాచారం, సలహాల కోసం: 99895 95123(భారత్‌), 13016335198 (అమెరికా), 16475250616(కెనడా), dranilpalla@pallainfotech.com లో సంప్రదించవచ్చు.

posted on 29.06.2015; 6pm