Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
కొలువులిచ్చే వాయుసేన!

యువత క్రేజీగా భావించే కెరియర్లలో ఎయిర్‌ ఫోర్స్‌ ఉద్యోగాలు ముందు వరుసలో ఉంటాయి. వాయుసేనలో ఆఫీసర్‌ స్థాయి ఉద్యోగాలైతే ఆ ప్రత్యేకతల గురించి చెప్పనవసరం లేదు. వీటిని ఎయిర్‌ ఫోర్స్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్టు (ఏఎఫ్‌ క్యాట్‌)తో సొంతం చేసుకోవచ్చు. దీని ప్రకటన ఇటీవలే వెలువడింది. అన్ని విభాగాల్లో కలిపి 169 పోస్టులున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 17, 18 తేదీల్లో జరిగే పరీక్షలకు ఈ డిసెంబరు 30లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఫీజు ఖర్చు లేకుండా పైలట్‌ కావాలనుకునేఅభిలాష ఈ పరీక్ష ద్వారా నెరవేర్చుకోవచ్చు. ఫ్లయింగ్‌ విభాగంతోపాటు గ్రౌండ్‌ డ్యూటీ (టెక్నికల్, నాన్‌ టెక్నికల్‌) లో ఉన్నత స్థాయి ఉద్యోగాలున్నాయి. ఈ పోస్టులకు మహిళలూ పోటీ పడవచ్చు!

ఫ్లయింగ్, గ్రౌండ్‌ డ్యూటీ (టెక్నికల్, నాన్‌ టెక్నికల్‌), ఎన్సీసీ స్సెషల్‌ ఎంట్రీ (ఫ్లయింగ్‌) ఖాళీల భర్తీకి భారత వైమానిక దళం ప్రతి సంవత్సరం జూన్, డిసెంబరుల్లో ఏఎఫ్‌ క్యాట్‌ ప్రకటన విడుదల చేస్తుంది. ఇందులో రెండు రకాల పోస్టులుంటాయి. కొన్ని పర్మనెంట్‌ కమిషన్, మరికొన్ని షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ పరిధిలోకి వస్తాయి.

పర్మనెంట్‌ కమిషన్‌ (పీసీ) విభాగంలో ఎంపికైనవారు పదవీ విరమణ వయసు వరకు ఉద్యోగంలో కొనసాగవచ్చు. షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్సీ)లో అవకాశం పొందితే గరిష్ఠంగా 14 ఏళ్లపాటు ఉద్యోగంలో సేవలందించి వైదొలుగుతారు. మహిళలు ఎస్‌ఎస్సీ ఉద్యోగాలకే అర్హులు. అలాగే ఫ్లయింగ్‌ బ్రాంచ్‌ ఉద్యోగమైన పైలట్‌ పోస్టులన్నీ ఎస్‌ఎస్సీ కిందకే వస్తాయి. గ్రౌండ్‌ డ్యూటీ పోస్టులను పర్మనెంట్, షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ రెండు విభాగాల్లోనూ భర్తీ చేస్తారు.

ఏ అర్హతలుండాలి?

ఫ్లయింగ్‌ బ్రాంచ్‌
విద్యార్హత: ఈ విభాగంలోని పోస్టులకు 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇంటర్‌ / ప్లస్‌ 2లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ చదివివుండడం తప్పనిసరి.

వయసు: జనవరి 1, 2020 నాటికి 20 నుంచి 24 ఏళ్లలోపు ఉండాలి. జనవరి 2, 1996 - జనవరి 1, 2000 మధ్య జన్మించినవార్లు అర్హులు.

ఎత్తు: కనీసం 162.5 సెం.మీ ఉండాలి. ఎలాంటి దృష్టి దోషం ఉండరాదు.

గ్రౌండ్‌ డ్యూటీ - టెక్నికల్‌ బ్రాంచ్‌

విభాగం: ఏరోనాటికల్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రానిక్స్‌)

విద్యార్హత: 60 శాతం మార్కులతో ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ లేదా ఎలక్ట్రానిక్స్‌ లేదా ఎలక్ట్రికల్‌ లేదా కమ్యూనికేషన్స్‌ లేదా కంప్యూటర్‌ సైన్స్‌... తదితర విభాగాల్లో ఎందులోనైనా బీటెక్‌/ బీఈ పూర్తిచేసినవారు అర్హులు. ఇంటర్‌/ +2 లో ఫిజిక్స్, మ్యాథ్స్‌ల్లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

విభాగం: ఏరోనాటికల్‌ ఇంజినీర్‌ (మెకానికల్‌)

విద్యార్హత: 60 శాతం మార్కులతో ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ లేదా ఏరోస్పేస్‌ లేదా ఎయిర్‌ క్రాఫ్ట్స్‌ మెయింటెనన్స్‌ లేదా మెకానికల్‌ లేదా ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌ వీటిలో ఏ విభాగంలోనైనా బీటెక్‌/ బీఈ పూర్తిచేసినవాళ్లు అర్హులు. ఇంటర్‌/+2లో ఫిజిక్స్, మ్యాథ్స్‌ల్లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

గ్రౌండ్‌ డ్యూటీ - నాన్‌ టెక్నికల్‌ బ్రాంచ్‌

ఇందులో అడ్మినిస్ట్రేషన్‌ ఖీ లాజిస్టిక్స్, అకౌంట్స్, ఎడ్యుకేషన్‌ విభాగాలు ఉన్నాయి.

అడ్మినిస్ట్రేషన్‌ఖీ లాజిస్టిక్స్‌: కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తిచేసినవారు ఈ విభాగంలో పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అకౌంట్స్‌: 60 శాతం మార్కులతో బీకాం పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

విద్యార్హత: ఏదైనా డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు పీజీలో ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఇంటర్నేషనల్‌ రిలేషన్స్, ఇంటర్నేషనల్‌ స్టడీస్, సైకాలజీ, కంప్యూటర్‌ సైన్స్, ఐటీ, మేనేజ్‌ మెంట్, మాస్‌ కమ్యూనికేషన్, జర్నలిజం, పబ్లిక్‌ రిలేషన్, మేనేజ్‌ మెంట్, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌...వీటిలో ఏదేని కోర్సులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: గ్రౌండ్‌ డ్యూటీలోని టెక్నికల్, నాన్‌ టెక్నికల్‌ అన్ని పోస్టులకు జనవరి 1, 2020 నాటికి 20 నుంచి 26 ఏళ్లలోపు వయసువారు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే జనవరి 2, 1994 - జనవరి 1, 2000 మధ్య జన్మించినవారు అర్హులు.

ఎత్తు: పురుషులైతే 157.5, మహిళలు 152 సెం.మీ.ఉండాలి.

ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ: ఈ విభాగానికి ఎన్‌సీసీ సీనియర్‌ డివిజన్‌ సి సర్టిఫికెట్‌ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే వీరికి 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీతోపాటు 10+2 లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ల్లోనూ 60 శాతం ఉండాలి.

ఎంపిక విధానం ఇలా...

పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్టుల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఏ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ప్రవేశ పరీక్ష మాత్రం అభ్యర్థులందరికీ ఉమ్మడిగా ఉంటుంది. టెక్నికల్‌ బ్రాంచ్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు ఇంజినీరింగ్‌ నాలెడ్జ్‌ టెస్ట్‌ (ఈకేటీ) అదనంగా రాయాలి. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు స్టేజ్‌-1, స్టేజ్‌-2 పరీక్షలు నిర్వహిస్తారు. ఫ్లయింగ్‌ బ్రాంచ్‌కు దరఖాస్తు చేసుకున్నవారికి ఇంటర్వ్యూ అనంతరం కంప్యూటరైజ్డ్‌ పైలట్‌ సెలక్షన్‌ సిస్టం (సీపీఎస్‌ఎస్‌) పరీక్ష ఉంటుంది. వీటన్నింటిలో అర్హత సాధించినవారికి మెడికల్‌ పరీక్షలు నిర్వహించి శిక్షణలోకి తీసుకుంటారు.

మైనస్‌ మార్కులుంటాయి...

పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం 300 మార్కులకు ఉంటుంది. వంద ప్రశ్నలు వస్తాయి. అంటే ప్రతి ప్రశ్నకు మూడు మార్కులు. తప్పుగా గుర్తించిన ప్రతి జవాబుకూ ఒక మార్కు చొప్పున తగ్గిస్తారు. ప్రతి ప్రశ్నకూ నాలుగు ఆప్షన్లు ఉంటాయి. పరీక్ష వ్యవధి రెండు గంటలు.

ఇందులో జనరల్‌ అవేర్‌నెస్, వెర్బల్‌ ఎబిలిటీ, రీజనింగ్, న్యూమరికల్‌ ఎబిలిటీ, మిలటరీ ఆప్టిట్యూడ్‌ విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. న్యూమరికల్‌ ఎబిలిటీ ప్రశ్నలు పదో తరగతి స్థాయిలో ఉంటాయి. మిగిలిన విభాగాల్లోనివి మాత్రం డిగ్రీ స్థాయిలో అడుగుతారు. జనరల్‌ అవేర్‌నెస్‌లో... చరిత్ర, క్రీడలు, భూగోళశాస్త్రం, పర్యావరణం, కళలు, సంస్కృతి, వర్తమానాంశాలు, రాజకీయాలు, పౌరశాస్త్రం, రక్షణ రంగం, సామాన్యశాస్త్రంలోని ప్రాథమికాంశాల నుంచి ప్రశ్నలుంటాయి. వెర్బల్‌ ఎబిలిటీ ఇంగ్లిష్‌ విభాగం నుంచి... కాంప్రహెన్సన్, ఎర్రర్‌ డిటెక్షన్, సెంటెన్స్‌ కంప్లిషన్, సిననిమ్స్, యాంటనిమ్స్, ఒకాబులరీ అంశాల నుంచి ప్రశ్నలడుగుతారు.

న్యూమరికల్‌ ఎబిలిటీ విభాగంలో... సగటు, లాభనష్టాలు, శాతాలు, సూక్ష్మీకరణ, భిన్నాలు, నిష్పత్తి-అనుపాతం, బారువడ్డీ అంశాల్లో అభ్యర్థి పరిజ్ఞానాన్ని పరిశీలించేలా ప్రశ్నలుంటాయి. రీజనింగ్, మిలటరీ ఆప్టిట్యూడ్‌ విభాగంలో వెర్బల్‌ స్కిల్స్, స్పేషియల్‌ ఎబిలిటీ(మెంటల్‌ ఎబిలిటీ) అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

ఈ పరీక్ష ముగిసిన వెంటనే టెక్నికల్‌ బ్రాంచ్‌ దరఖాస్తు చేసుకున్నవారికి ఇంజినీరింగ్‌ నాలెడ్జ్‌ టెస్ట్‌ (ఈకేటీ) నిర్వహిస్తారు. వ్యవధి 45 నిమిషాలు. 50 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 3 చొప్పున వీటికి 150 మార్కులు కేటాయించారు. ఐఏఎఫ్‌ వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్‌ టెస్టు అందుబాటులో ఉంటుంది.

స్టేజ్‌ 1, 2 ల్లో...

రాత పరీక్షలో ఉత్తీర్ణులను స్టేజ్‌ 1, 2 పరీక్షలకు పిలుస్తారు. వీటిని ఎయిర్‌ ఫోర్స్‌ సెలక్షన్‌ బోర్డు (ఏఎఫ్‌ ఎస్‌ బీ) నిర్వహిస్తుంది. అభ్యర్థులు 1.6 కి.మీ. దూరాన్ని 10 నిమిషాల్లో చేరుకోవాలి. అలాగే 10 పుష్‌ అప్స్, 3 చిన్‌ అప్స్‌ తీయగలగాలి. స్టేజ్‌ -1 స్క్రీనింగ్‌ టెస్టు .ఇందులో చిన్న అసైన్‌మెంట్స్, పజిల్స్‌ లాంటి వాటి ద్వారా అభ్యర్థి మేధ స్థాయులను తెలుసుకుంటారు. ఏదైనా చిత్రాన్ని చూపించి దానిపై విశ్లేషణ చేయమంటారు. ఇందులో అర్హత సాధించినవారే స్టేజ్‌ -2కి వెళ్తారు. స్టేజ్‌ -2లో సైకాలజిస్టు ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం ఇండోర్, అవుట్‌ డోర్‌ ఇంటరాక్టివ్‌ గ్రూపు టెస్టులు ఉంటాయి. వీటిలో మానసిక, శారీరక పనులు మిళితమై ఉంటాయి. అనంతరం వ్యక్తిగత ముఖాముఖి నిర్వహిస్తారు. ఈ దశలన్నీ విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి మెడికల్‌ పరీక్షలు చేపడతారు. అందులోనూ విజయవంతమైనవారిని మెరిట్‌ లిస్టు తయారుచేసి శిక్షణ కోసం ఎంపిక చేస్తారు. అభ్యర్థులకు సంబంధిత విభాగంలో జనవరి మొదటి వారం, 2020 నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది.

ప్రోత్సాహకాలు...

శిక్షణ సమయంలో నెలకు రూ.56,100 చొప్పున స్టైపెండ్‌ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులు విధుల్లో చేరతారు. ఉద్యోగంలో చేరినవారికి రూ.56,100 మూలవేతనం లభిస్తుంది. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఎ ఇతర ఆలవెన్సులు అదనం. అలాగే మిలటరీ సర్వీస్‌ పే (ఎంఎస్పీ) లో భాగంగా ప్రతి నెలా రూ.15,500 చెల్లిస్తారు. పోస్టింగ్‌ పొందిన ప్రాంతం బట్టి రూ.83,000 నుంచి 96,000 వరకు నెల వేతనం (సీటీసీ విధానంలో) పొందవచ్చు. ట్రాన్స్‌ పోర్టు అలవెన్సు, చిల్డ్రన్‌ ఎడ్యుకేషన్‌ అలవెన్సు, రాయితీ ధరలకు క్యాంటీన్, ఫర్నిచర్‌ తో కూడిన నివాస సముదాయం, తక్కువ వడ్డీకి రుణాలు, ఎల్టీఏ, 60 వార్షిక సెలవులు, 20 సాధారణ సెలవులు... ఉంటాయి.

వెబ్‌సైట్‌: https://afcat.cdac.in/AFCAT/

Back..

Posted on 17-12-2018