Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
దశ తిరిగేది ఏ దిశలో?

విద్యార్థి జీవితంలో మిగిలిన పరిస్థితులన్నీ ఒకెత్తు! పదో తరగతి పూర్తయినవేళ ఎదురయ్యే స్థితి ఒకెత్తు! పాఠశాల నుంచి బయటపడి... నాలుగు రోడ్ల కూడలి కాదు, జీవితంలో ఎటువెళ్ళాలో నిర్ణయించుకోవాల్సిన.. అనేక కూడళ్ల వద్ద నిలబడి దశాదిశా తేల్చుకోవాల్సిన తరుణమిది! ఎంచుకోవాల్సినవేమిటి? అందుకు కావాల్సిన లక్షణాలేమిటి?ఎంచుకుంటున్నదారి మంచిదేనా? వేరేవారిని చూసి గుడ్డిగా వెళుతున్నామా? ఇవన్నీ బేరీజు వేసుకుని ముందడుగు వేయాలి!

పది పూర్తయిన ప్రతి విద్యార్థికీ ఇంటర్మీడియట్‌లో చేరటం ఒక మార్గమైతే- పాలిటెక్నిక్‌/ ఐటీఐల్లో చేరటం మరో దారి. ఇవి కాకపోతే ఒకేషనల్‌/ డిప్లొమా కోర్సుల్లో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. అవసరం, ఆసక్తులను బట్టి ఆర్మీ, నేవీ, రైల్వేల్లో ఉద్యోగ ప్రయత్నాలూ చేయవచ్చు. కోర్సులతో సంబంధం లేకుండా డీటీపీ, టాలీ, గ్రాఫిక్స్‌లాంటి షార్ట్‌టర్మ్‌ కోర్సులు నేర్చుకుంటే ఉపాధి పొందవచ్చు.

వివిధ వృత్తుల్లో ప్రవేశానికి ఇంటర్మీడియట్‌ సింహద్వారంలా ఉపయోగపడుతుంది. కోరుకున్న విభాగంలో రాణించడానికి అందుకు తగ్గ కోర్సులను ఇంటర్లో ఎంచుకోవడం తప్పనిసరి. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా పది పూర్తయిన ఎక్కువమంది ఇంటర్మీడియట్‌ కోర్సుల్లోనే చేరుతున్నారు. భవిష్యత్తులో ఇంజినీర్లు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, వైద్యులు మొదలైన వృత్తుల్లో రాణించడానికి ఇంటర్మీడియట్‌ పునాదిగా నిలుస్తుంది. జాతీయస్థాయిలో నిర్వహించే జేఈఈ, నీట్‌, క్లాట్‌; రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఎంసెట్‌, డైట్‌సెట్‌, లాసెట్‌ వీటన్నింటికీ ఇంటరే ఆధారం.

తెలుగు రాష్ట్రాల్లో బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ ఆధ్వర్యంలో ఇంటర్లో దాదాపు 85 గ్రూపు కాంబినేషన్లు ఉన్నాయి. అయితే ప్రతి చోటా అందుబాటులో ఉన్నవి మాత్రం ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్‌ఈసీలే. మ్యూజికల్‌, లాజిక్‌, సైకాలజీ సబ్జెక్టులను సైతం ఇంటర్‌ నుంచే చదువుకోవచ్చు. కానీ ఈ కోర్సులు అందించే కళాశాలలు చాలా తక్కువ. ప్రతి గ్రూపులోనూ 3 లేదా 4 సబ్జెక్టులుంటాయి. వీటితోపాటు ఆంగ్లం, మరో భాష తప్పనిసరి.

ఇంటర్లో ఏ గ్రూప్‌తో ఏమిటి?
ఎంపీసీ: ఇంటర్లో చేరే విద్యార్థుల్లో ఎక్కువమంది ఎంచుకుంటోన్న గ్రూప్‌ ఇదే. బీఈ/ బీటెక్‌, బీఆర్క్‌ కోర్సులు చదవడానికి దీన్ని ఎంచుకోవడం తప్పనిసరి. అలాగే పైలట్‌ కావాలన్నా ఇంటర్లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ చదివుండాలి. ఫ్యాషన్‌ టెక్నాలజీ కోర్సులకూ ఎంపీసీ ఉండాల్సిందే. ఇంటర్‌ గ్రూప్‌ సబ్జెక్టులతోనే బీఎస్సీ/ ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ లో చేరవచ్చు. స్టాటిస్టిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, జియాలజీ...ఇలా కొత్త సబ్జెక్టులను ఎంచుకోవచ్చు. డీఎడ్‌, లా, డిజైన్‌, ఫార్మసీ..ఇలా ఎంచుకోవడానికి ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి.
బైపీసీ: వైద్య వృత్తి, అనుబంధ రంగాల్లో రాణించడానికి ఇంటర్లో బైపీసీ తప్పనిసరి. అలాగే వ్యవసాయ కోర్సులు, బీఎస్సీ నర్సింగ్‌, కొన్ని పారామెడికల్‌ కోర్సుల్లో చేరడానికి ఈ గ్రూప్‌ తప్పనిసరి. ఫిషరీ సైన్స్‌, ఆక్వా, మైక్రో బయాలజీ మొదలైన కోర్సులకు బైపీసీ అనివార్యం. ఇంటర్లో చదివిన సబ్జెక్టులతోనే బీఎస్సీలో చేరవచ్చు. మ్రైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, ఫారెస్ట్రీ, జెనెటిక్స్‌, ఫోరెన్సిక్‌ సైన్స్‌...తదితర కొత్త సబ్జెక్టులను డిగ్రీ స్థాయిలో తీసుకోవచ్చు. ఫార్మసీ, ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ, డీఎడ్‌, లా, డిజైన్‌...తదితర కోర్సుల్లో వీరు చేరవచ్చు. బైపీసీ గ్రూప్‌ తీసుకున్నవారు కొన్ని డిప్లొమా, బ్యాచిలర్‌ కోర్సులు పూర్తిచేసి సొంతంగా రాణించవచ్చు.
ఎంఈసీ: వర్తక, వాణిజ్య, గణాంకశాస్త్ర రంగాల్లో రాణించాలనుకునేవారికి ఇది మేటి కోర్సు. ఈ గ్రూప్‌ విద్యార్థులకోసమే అంటూ ప్రత్యేకమైన కోర్సులు ఏమీ లేనప్పటికీ సీఏ, సీఎంఏ, సీఎస్‌లలో రాణించడానికి ఎంఈసీ ఉపయోగపడుతుంది. బిజినెస్‌ ఎనలిస్ట్‌, స్టాటిస్టీషియన్‌, మార్కెట్‌ నిపుణులు...మొదలైన రంగాలకు ఎంఈసీ కాంబినేషన్‌ పనికొస్తుంది. వీరు ఇవే సబ్జెక్టులతో డిగ్రీలో కొనసాగవచ్చు. డీఎడ్‌, లా...మొదలైన కోర్సుల్లోనూ చేరిపోవచ్చు. ఎకనామిక్స్‌పై పట్టున్నవారికి సైన్స్‌ కోర్సులతో సమాన అవకాశాలు లభిస్తున్నాయి.
సీఈసీ/ హెచ్‌ఈసీ: ఎకనామిక్స్‌, కామర్స్‌ కలయికతో ఈ కోర్సులు చదివినవారు అకౌంటింగ్‌ రంగంలో రాణించవచ్చు. వీరు భవిష్యత్తులో ఆర్ట్స్‌, హ్యుమానిటీస్‌ కోర్సుల్లో చేరవచ్చు. లేదా న్యాయవిద్య, ఉపాధ్యాయ విద్య అభ్యసించవచ్చు. ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ, ఇంటిగ్రేటెడ్‌ బీఎఎడ్‌, ఇంటిగ్రేటెడ్‌ బీఏఎల్‌ఎల్‌బీ కోర్సులు ఈ గ్రూపు విద్యార్థులకు అనువైనవి. ఇంటర్‌ తర్వాత సోషియాలజీ, సోషల్‌ వర్క్‌, ఆంత్రొపాలజీ, సైకాలజీ, జాగ్రఫీ, విదేశీ భాషలు... ఇలా నచ్చిన కోర్సులను బీఏ స్థాయిలో ఎంచుకోవచ్చు. టూరిజం స్టడీస్‌, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లోనూ చేరవచ్చు.

ఏ స్ట్రీమ్‌కు ఎవరు సరిపోతారు?
పదో తరగతి తర్వాత సైన్స్‌, కామర్స్‌, హ్యుమానిటీస్‌/ఆర్ట్స్‌ స్ట్రీముల్లో దేన్ని ఎంచుకోవాలన్నది ప్రతి విద్యార్థికీ సమస్యగా ఉంటుంది. సైన్స్‌ స్ట్రీమ్‌ వారికి ఇంటర్‌ తర్వాత అవసరమైతే కామర్స్‌, హ్యుమానిటీస్‌/ఆర్ట్స్‌లోకి మారే వెసులుబాటు ఉంటుంది. హ్యుమానిటీస్‌/ఆర్ట్స్‌, కామర్స్‌ వారు మాత్రం ఇంటర్‌ తర్వాత సైన్స్‌లోకి మారే అవకాశం ఉండదు. అభిరుచీ, ఆసక్తులకు సరిపోయేది ఎంచుకుంటే రాణించే అవకాశం ఎక్కువ. అవసరమైతే నిపుణుల దగ్గర కెరియర్‌ కౌన్సెలింగ్‌ తీసుకోవటం మంచిది. ఈ విషయంలో తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల, సీనియర్ల సహాయం తీసుకోవచ్చు.
సైన్స్‌ (బయాలజీ): దీన్ని ఎంచుకోవాలంటే...మంచి జ్ఞాపకశక్తి, జీవశాస్త్ర అంశాలపై ఇష్టం అవసరం. చిత్రపటాలూ, ఫార్ములాలూ, పట్టికలూ లాంటివి గుర్తుంచుకోవాలి. సేవాభావం, కష్టపడి కృషిచేయగలిగే సామర్థ్యం, పట్టుదల, సహనం అవసరం. ఈ స్ట్రీమ్‌లో థియరీతో పాటు ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం ఉంటుంది.
సైన్స్‌ (మ్యాథ్స్‌): దీన్ని ఎంచుకోవాలంటే... గణితంపై పట్టు ఉండాలి. సంఖ్యలూ, ఫార్ములాలూ, థియరిమ్స్‌ లాంటివి గుర్తుంచుకోవాలి. తార్కికంగా ఆలోచించే లక్షణం ఉండాలి. దేన్నయినా విశ్లేషించి సరైన అంచనాకు వచ్చే పరిజ్ఞానం అవసరం. యంత్రాలూ, కంప్యూటర్లతో పనిచేయటంపై, సాంకేతికతపై ఆసక్తి ఉండాలి. ఈ స్ట్రీమ్‌లో థియరీతో పాటు ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం ఉంటుంది.
కామర్స్‌: దీన్ని ఎంచుకోవాలంటే... వ్యాపార రంగంపై, సంబంధిత ప్రభుత్వ విధానాలపై ఆసక్తి ఉండాలి. జాతీయ అంతర్జాతీయ సంఘటనల పరిశీలన అవసరం. ఫార్ములాలూ, ఆర్థిక పదజాలం గుర్తుంచుకోవాలి. గణాంకాలూ, గణిత సంబంధ అంశాలను ఇష్టపడే స్వభావం ఉండాలి.
హ్యుమానిటీస్‌/ఆర్ట్స్‌: దీన్ని ఎంచుకోవాలంటే... బయాలజీ, మ్యాథ్స్‌, కామర్స్‌ అంశాలంటే ఆసక్తి లేనివారు దీన్ని ఎంచుకోవచ్చు. చరిత్ర, సామాజికశాస్త్రాలపై, సామాజిక ప్రగతి, కార్యకలాపాలపై అభిరుచి ఉన్నవారికి ఇది తగినది. ఈ స్ట్రీమ్‌లో థియరీ ఎక్కువ, ప్రాక్టికల్‌ చాలా తక్కువ. అయితే సివిల్స్‌ పరీక్షల లక్ష్యం ఉన్నవారికిది ప్రాథమికంగా అనువైనది.

గ్రూపు ఎంపికలో...
* ఇంటర్లో గ్రూపును ఎంపిక చేసుకునేటప్పుడు సామర్థ్యాలు, ఆసక్తులకు అనుగుణంగా ఉన్నవాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడు అందులో రాణించడం సులువవుతుంది.
* పదో తరగతిలో ఆయా సబ్జెక్టుల్లో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకోవచ్చు. కింది తరగతుల్లో ఆ సబ్జెక్టుల్లో సాధించిన మార్కులకూ గ్రూప్‌ ఎంపికలో ప్రాధాన్యం ఇవ్వవచ్చు.
* ఏ సబ్జెక్టుపై ఎక్కువ ఆసక్తి, ఇష్టం కలుగుతోంది, ఏ సబ్జెక్టు సౌకర్యవంతంగా ఉన్నదీ తెలుసుకుని ఎంపికలో ప్రాధాన్యం ఇవ్వవచ్చు.
* విద్యార్థులు ఏ గ్రూపులో రాణించగలరో ఉపాధ్యాయులకు ఒక అంచనా ఉంటుంది. కెరియర్‌ ఎంపికలో మీగురించి బాగా తెలిసిన ఉపాధ్యాయుల అభిప్రాయాన్ని లెక్కలోకి తీసుకోవచ్చు.
* ఫలానా కెరియర్‌లో ప్రవేశించాలనే లక్ష్యం ఉంటే అందుకు ఏ కోర్సులు (సబ్జెక్టులు) చదవాలో తెలుసుకోవాలి. ఆ సబ్జెక్టులపై ఏమాత్రం ఇష్టం లేకపోతే సంబంధిత కోర్సుల జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఉదాహరణకు... డాక్టర్‌ కావాలని ఆశించే వ్యక్తికి బయాలజీ అంటే ఇష్టం లేకపోతే లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం.
* ఒక సబ్జెక్టుపై ఆసక్తి ఉంటే.. ఆ సబ్జెక్టులో ఏమంత ప్రావీణ్యం లేకపోయినప్పటికీ కచ్చితంగా సంబంధిత కోర్సును ఎంచుకోవచ్చు.

చేయకూడనివి...
* అవకాశాలు ఎక్కువనో, అందరూ చెప్పారనో ఇష్టం లేని సబ్జెక్టు ఎంచుకుంటే కెరియర్‌ పరంగా నష్టపోవచ్చు. కాబట్టి ఇతరులు చెప్పిన విషయాలు గుడ్డిగా ప్రామాణికంగా తీసుకోరాదు.
* మిత్రులు చేరిన గ్రూపులోనే మీరూ చేరాలనుకోవడం పొరపాటు. అలాగే బంధువులు, తెలిసినవాళ్లు చెప్పారని అనుకరించడమూ మంచిది కాదు.
* తమ కోరికలను పిల్లల ద్వారా తీర్చుకోవాలనుకునే తల్లిదండ్రుల సంఖ్య తక్కువేమీ కాదు. పిల్లల విజయాలను నలుగురిలోనూ గొప్పగా చెప్పుకోవాలనే తహతహలు నవతరం అమ్మానాన్నల్లో పుష్కలం. తాము సాధించలేనిదాన్ని తమ పిల్లలు సాధించి తీరాల్సిందే నంటూ ఆరాటపడే వర్గమూ ఉంటుంది. డబ్బులు పెడుతున్నాం కాబట్టి చెప్పింది చదవాల్సిందే అనే అభిప్రాయమూ విస్తరిస్తోంది. ఇలా పిల్లల ఇష్టాలను కాదని తల్లిదండ్రులు తమ ఇష్టం ప్రకారం చదువులు కొనసాగించమనడం వల్ల నష్టమే తప్ప లాభం లేదు.
* ఫలానా గ్రూపులో చేరితే ఎక్కువ సంపాదన సాధ్యమవుతుందనే భావనలో కొందరు తల్లిదండ్రులు ఉంటారు. విద్యార్థికి ఇష్టం లేకపోయినప్పటికీ ఆ కోర్సులోనే చేరమని ఒత్తిడి తెస్తారు. ఈ తరహా ధోరణితో పిల్లలు నష్టపోతారు.


Back..

Posted on 08-04-2019