Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
తెలుగు మాధ్యమంలో.. వ్యవసాయ పాలిటెక్నిక్‌

గత రెండు మూడేళ్లుగా వ్యవసాయ, అనుబంధ రంగాల పాలిటెక్నిక్‌ ప్రవేశాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఎటువంటి ప్రవేశ పరీక్ష లేకుండా పదో తరగతిలో మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నారు.
గ్రామీణ ప్రాంత యువతీ యువకులకు ఉపాధి కల్పించే నిమిత్తం వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలలో పాలిటెక్నిక్‌ కోర్సులు ప్రవేశపెట్టారు. తెలుగు మాధ్యమంలో బోధన సాగించే ఈ పాలిటెక్నిక్‌లలో ప్రవేశాల సమయం ఆసన్నమైంది. ప్రైవేటు వ్యవసాయ పాలిటెక్నిక్‌లు ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఉండగా గత ఏడాది నుంచి ఉద్యాన పాలిటెక్నిక్‌లు ప్రవేశాలు కల్పించాయి.
తాజాగా ఈ ఏడాది నుంచి పశుసంవర్థక, మత్స్య, డెయిరీ టెక్నాలజీ విభాగాలలో ప్రైవేటు పాలిటెక్నిక్‌లు పరిచయం అవుతున్నాయి.
* జాగర్లమూడిలో సంగం డెయిరీ ప్రాసెసింగ్‌ పాలిటెక్నిక్‌.
* తూ.గో.జిల్లా పాటవాలలో మత్స్యశాస్త్ర పాలిటెక్నిక్‌
* నర్సరావుపేట, నాగాయలంక, సింగరాయకొండలలో పశుసంవర్థక పాలిటెక్నిక్‌లకు అనుమితినిచ్చారు.
* దరఖాస్తుకు ఆఖరి తేదీ: 24.7.2017
వ్యవసాయం, పశుపోషణ, ఉద్యాన, మత్స్య శాస్త్రాల్లో నిపుణుల కొరత ఎక్కువగా ఉంది. సంప్రదాయ పద్ధతుల్లో కాకుండా శాస్త్రీయంగా ఆయా రంగాలలో సూచనలు సలహాలు ఇచ్చే వారి సంఖ్య అరుదుగా మారింది. ఉన్నత విద్యావంతులు, శాస్త్రవేత్తలు జిల్లా, మండల స్థాయికే పరిమితం అవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతుకు అండగా నిలిచేందుకని ఈ డిప్లొమాల్లో బోధన తెలుగుమాధ్యమంలో నిర్వహిస్తున్నారు.
వ్యవసాయంలో డిప్లొమా పూర్తిచేసినవారికి వ్యవసాయశాఖ ఏఈవో, ఎంపీఈవో ఉద్యోగాలతో పాటు ప్రైవేటు విత్తన సంస్థలు, ఎరువుల కర్మాగారాల్లో ఉద్యోగాకాశాలు ఉన్నాయి. పురుగుమందులు, ఎరువులు, ఉత్పత్తులు విక్రయించే దుకాణాలను నిర్వహించాలంటే డిప్లొ్లమా తప్పనిసరి కాబోతోంది. పశుసంవర్థక పాలిటెక్నిక్‌ పూర్తిచేసినవారికి పశుసంవర్థకశాఖలో ఎంపీఈవో, వెటర్నరీ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు అర్హత కల్పించారు. కోళ్ల పరిశ్రమ, దాణా తయారీ కర్మాగారాలు, డెయిరీలలో ప్రైవేటు ఉద్యోగావకాశాలున్నాయి. ఉద్యాన పాలిటెక్నిక్‌ పూర్తిచేస్తే ఏహెచ్‌వో, ఎంపీఈవో ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత వస్తుంది. ప్రైవేటు నర్సరీలు, విత్తన కర్మాగారాల్లోనూ అవకాశాలున్నాయి.
ఇంటర్‌తో సమానంగా ఈ డిప్లొమాలను పరిగణించరు. అయితే వీరికి వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాలు నిర్వహించే అగ్రిసెట్‌, హార్టిసెట్‌ల ద్వారా నేరుగా బీఎస్సీ వ్యవసాయం, ఉద్యాన డిగ్రీలలో ప్రవేశాలు పొందే వెసులుబాటు కల్పించారు. బీవీఎస్సీ (పశు సంవర్థక), బీ టెక్‌ (డెయిరీ టెక్నాలజీ), ఏఎఫ్‌ఎస్సీ కోర్సులను అనుమతించరు.

గ్రామీణ విద్యార్థులే అర్హులు
వ్యవసాయ, పశువైద్య, ఉద్యాన పాలిటెక్నిక్‌లలో ప్రవేశాలు పొందేందుకు గ్రామీణ ప్రాంత విద్యార్థులే అర్హులు. ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివినకాలంలో కనీసం నాలుగు సంవత్పరాలైనా నగరపాలక, పురపాలకేతర ప్రాంతాలలో చదివి ఉండడం తప్పనిసరి. పదో తరగతి, దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంటర్‌ మొదటి, రెండో సంవత్పరం చదువుతున్నవారు, పదో తరగతి కంపార్టుమెంట్‌లో ఉత్తీర్ణులైనవారు అర్హులు. దరఖాస్తుదారుల వయసు 15-22 సంవత్సరాలు ఉండాలి. సీట్లను కౌన్సెలింగ్‌ నిర్వహించి రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ప్రకారం భర్తీ చేస్తారు.

ఎక్కడ? ఎన్ని విద్యాసంస్థలు
శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం
తిరుపతి కేంద్రంగా నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం పశుసంవర్థక, మత్స్య, డెయిరీ టెక్నాలజీ విభాగాల్లో పాలిటెక్నిక్‌ కళాశాలలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా ఏడు పశుసంవర్థక పాలిటెక్నిక్‌లు, ఒక మత్స్యశాస్త్ర పాలిటెక్నిక్‌ ఉంది.
వీటిలో 210 పశుసంవర్థక పాలిటెక్నిక్‌ సీట్లు, 29 మత్స్యశాస్త్ర పాలిటెక్నిక్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. 2017-18 సంవత్సరం నుంచి ప్రైవేటు రంగంలో పాలిటెక్నిక్‌లను మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో మరో ఒక పశుసంవర్థక పాలిటెక్నిక్‌, ఒక మత్స్యశాస్త్ర పాలిటెక్నిక్‌, ఒక డెయిరీ టెక్నాలజీ, మూడు డెయిరీ ప్రాసెసింగ్‌ కళాశాలలను అనుమతించింది. పశువైద్య విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ www.svvu.edu.in నుంచి దరఖాస్తుపత్రం డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. చలానా ఫారం డౌన్‌లోడ్‌ చేసుకుని రూ.500 రుసుము చెల్లించి దరఖాస్తును విశ్వవిద్యాలయానికి పంపాలి.

డా. వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం
పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్న గూడెంలో ఏర్పాటైన డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన పాలిటెక్నిక్‌లో రెండు సంవత్సరాల డిప్లొమా కోర్సు ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు విశ్వవిద్యాలయ పాలిటెక్నిక్‌లు ఉండగా అందులో 145 సీట్లు ఉన్నాయి. ఈ ఏడాది నుంచి రాష్ట్రంలో ఐదు ప్రైవేటు ఉద్యాన పాలిటెక్నిక్‌లను ప్రవేశపెట్టడంతో ఇందులో 200 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఉద్యాన పాలిటెక్నిక్‌లు సిలబస్‌ను తెలుగు మాధ్యమంలో బోధిస్తున్నారు. దరఖాస్తు గడువు జూన్‌ 12న ముగిసింది. www.drysrhu.edu.inవెబ్‌సైట్‌ చూడవచ్చు. హార్టిసెట్‌ ద్వారా ఉద్యానశాస్త్ర డిగ్రీలలో ప్రవేశాలు పొందే అవకాశం కల్పించారు.

వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో..
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (గుంటూరు) పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ, విత్తన సాంకేతిక పరిజ్ఞానం, సేంద్రియ వ్యవసాయంలో రెండేళ్ల కాలపరిమితి కలిగిన, మూడేళ్ల కాలపరిమితితో వ్యవసాయ ఇంజినీరింగ్‌ కోర్సుల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 15 విశ్వవిద్యాలయ వ్యవసాయ పాలిటెక్నిక్‌లు, 44 ప్రైవేటు వ్యవసాయ పాలిటెక్నిక్‌లు ఉన్నాయి. విత్తన సాంకేతిక పరిజ్ఞాన పాలిటెక్నిక్‌లు విశ్వవిద్యాలయానికి చెందినవి ఒకటి ఉండగా..ప్రైవేటు పాలిటెక్నిక్‌లు ఏడు ఉన్నాయి. సేంద్రియ వ్యవసాయంలో విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఒకటి, ప్రైవేటు రంగంలో ఒకటి పాలిటెక్నిక్‌లు ఉన్నాయి. వ్యవసాయ ఇంజినీరింగ్‌ పాలిటెక్నిక్‌లు విశ్వవిద్యాలయం రెండు నిర్వహిస్తుండగా ప్రైవేటు రంగంలో ఏడు పాలిటెక్నిక్‌లు ఉన్నాయి. పాలిటెక్నిక్‌ పూర్తి చేసిన అభ్యర్థులకు అగ్రిసెట్‌ ప్రవేశ పరీక్ష ద్వారా వ్యవసాయ డిగ్రీలలో ప్రవేశాలు పొందే వెసులుబాటు ఉంది. దరఖాస్తు తేదీ జూన్‌ 17తో ముగిసింది. సుమారు 11 వేలమంది విద్యార్థులు దరఖాస్తు చేశారు.విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ www.angrau.ac.in

తెలంగాణలో....
* తెలంగాణ రాష్ట్రంలోని పి.వి.నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలోని నాలుగు పశుసంవర్థక శాఖ పాలిటెక్నిక్‌లు ఉన్నాయి. కరీంనగర్‌, మహబూబ్‌ నగర్‌, మెదక్‌ జిల్లాలోని సిద్దిపేట, వరంగల్‌ జిల్లాలోని మామ్‌నూర్‌లలో పశుసంవర్థక పాలిటెక్నిక్‌లు ఉన్నాయి.
* కొండా లక్ష్మణ్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని ఆదిలాబాద్‌, రామగిరి ఖిల్లాలో ఉద్యాన పాలిటెక్నిక్‌లు ఉన్నాయి.
* ప్రొ. జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలో 11 వ్యవసాయ పాలిటెక్నిక్‌లలో 385 సీట్లు ఉన్నాయి. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా 7 ప్రైవేటు వ్యవసాయ పాలిటెక్నిక్‌లు ఉన్నాయి. విశ్వవిద్యాలయ పరిధిలో ఒక సీడ్‌ టెక్నాలజీ కళాశాల, ఒక వ్యవసాయ ఇంజినీరింగ్‌ పాలిటెక్నిక్‌ కళాశాల ఉన్నాయి. ప్రైవేటురంగంలో సైతం ఒక సీడ్‌ టెక్నాలజీ, 3 వ్యవసాయ ఇంజినీరింగ్‌ పాలిటెక్నిక్‌లు ఉన్నాయి.


Back..

Posted on 26-06-2017