Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్‌

వైద్యవిద్యలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పి నిపుణులైన వైద్యులను దేశానికి అందించే లక్ష్యంతో ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ఏర్పడింది. అండర్‌గ్రాడ్యుయేషన్‌, పీజీ స్థాయుల్లో మెడికల్‌, పారామెడికల్‌ కోర్సులను అందిస్తోంది. ఎంబీబీఎస్‌లో ప్రవేశాల కోసం ఈ సంస్థ ఇటీవల ప్రకటన వెలువరించింది. అర్హత సాధించిన అభ్యర్థులు న్యూదిల్లీలోని ఎయిమ్స్‌తోపాటు ఇతర ప్రఖ్యాత సంస్థల్లో కూడా సీటు పొందే అవకాశం ఉంది.

మెడిసిన్‌ కోర్సులకు అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌), న్యూదిల్లీ జాతీయస్థాయిలో ఎంతో ప్రఖ్యాతమైంది. ఈ సంస్థలో ఎంబీబీఎస్‌ సీటు లభించడం అభ్యర్థుల కెరియర్‌లో చక్కటి మలుపుగా భావించవచ్చు. దేశవ్యాప్తంగా అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతారు. పోటీ ఎక్కువగానే ఉంటుంది. ఎయిమ్స్‌ న్యూదిల్లీతోపాటు భోపాల్‌, భువనేశ్వర్‌, మంగళగిరి, జోధ్‌పూర్‌, నాగ్‌పూర్‌, పట్నా, రాయ్‌పూర్‌, రిషికేశ్‌ కేంద్రాల్లో ప్రవేశాలు లభిస్తాయి. అన్ని చోట్లా కలిపి 800 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్‌ పరీక్షలో అభ్యర్థి చూపిన ప్రతిభ ద్వారా ప్రవేశం లభిస్తుంది. .
పరీక్ష ఇలా...
మొత్తం 200 ప్రశ్నలు వస్తాయి. వీటిలో మల్టిపుల్‌ ఛాయిస్‌తోపాటు రీజన్‌ - అసెర్షన్‌ తరహా ప్రశ్నలు ఉంటాయి. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ (బోటనీ, జువాలజీ) ఒక్కో సబ్జెక్టు నుంచి 60 చొప్పున ప్రశ్నలు వస్తాయి. వీటితోపాటు జనరల్‌ నాలెడ్జ్‌ నుంచి 10, ఆప్టిట్యూడ్‌, లాజికల్‌ థింకింగ్‌ నుంచి 10 ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. పరీక్షకు మూడున్నర గంటల సమయం కేటాయించారు. 140 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు, 60 రీజన్‌, అసెర్షన్‌ ప్రశ్నలు వస్తాయి. జనరల్‌ నాలెడ్జ్‌, ఆప్టిట్యూడ్‌లో రీజన్‌, అసెర్షన్‌ ప్రశ్నలు ఉండవు. ప్రతి సరైన సమాధానానికీ ఒక మార్కు. తప్పుగా గుర్తించిన ప్రతి ప్రశ్నకు ఒక మార్కులో మూడోవంతు చొప్పున తగ్గిస్తారు. పరీక్షలో అర్హత సాధించడానికి జనరల్‌ అభ్యర్థులు 50, ఓబీసీ 45, ఎస్సీ, ఎస్టీలు 40 శాతం మార్కులు సాధించాలి. ఈ విధంగా రూపొందించిన అర్హుల జాబితా నుంచి మెరిట్‌, రిజర్వేషన్ల ప్రాతిపదికన ప్రవేశాలు కల్పిస్తారు.
మొత్తం సీట్లు 800. మంగళగిరి, నాగ్‌పూర్‌ క్యాంపస్‌ల్లో 50 చొప్పున ఉన్నాయి. మిగిలిన అన్ని చోట్లా వందేసి ఉంటాయి. మంగళగిరి క్యాంపస్‌ విద్యార్థులకు తాత్కాలికంగా విజయవాడ సిద్ధార్థ మెడికల్‌ కాలేజీలో తరగతులు నిర్వహిస్తారు. కోర్సు వ్యవధి అయిదున్నరేళ్లు. ఇందులో ఏడాది తప్పనిసరి ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది.
విద్యార్హత: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీలతో ఇంటర్మీడియట్‌ లేదా ప్లస్‌2 ఉత్తీర్ణత. ఇంగ్లిష్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల్లో జనరల్‌, ఓబీసీ అభ్యర్థులు 60 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 50 శాతం మార్కులు సాధించాలి. ప్రస్తుతం రెండో సంవత్సరం కోర్సు చదువుతున్నవాళ్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: డిసెంబరు 31, 2018 నాటికి 17 ఏళ్లు (జనవరి 2, 2002 తర్వాత జన్మించినవాళ్లు అనర్హులు)
ఆన్‌లైన్‌ దరఖాస్తులు: మార్చి 5 సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు.
దరఖాస్తు, రిజిస్ట్రేషన్‌ ఫీజు: జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.1500; ఎస్సీ, ఎస్టీలకు రూ.1200
అడ్మిట్‌ కార్డులు: మే 10 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
పరీక్ష: ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ విధానంలో మే 26, 27 తేదీల్లో రోజుకి రెండు విడతల చొప్పున నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి 12:30; మధ్యాహ్నం 3 నుంచి 6:30 వరకు ఉంటాయి.
పరీక్షా కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్‌లో చీరాల, గుంటూరు, కర్నూలు, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం; తెలంగాణలో హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌.
ఫలితాలు: జూన్‌ 18న ప్రకటిస్తారు.
వెబ్‌సైట్‌: ‌www.aiimsexams.org

Back..

Posted on 14-02-2018