Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
పైసా ఖ‌ర్చ‌వ‌కుండా పైల‌ట్‌!

యువ‌త‌లో క్రేజ్ ఉన్న ర‌క్ష‌ణ రంగ ఉద్యోగాల‌కు చిరునామాగా నిలుస్తోంది...ఎయిర్ ఫోర్స్‌! సంఘంలో గుర్తింపు, చ‌క్క‌ని యూనిఫారం, మంచి వేత‌నాలు, సౌక‌ర్యాలు ఇవ‌న్నీ యువ‌త‌రాన్ని ఆక‌ర్షిస్తున్నాయి. ఉచితంగా పైల‌ట్ కావ‌డానికి వాయుసేన‌ ఉత్త‌మ వేదిక‌గా నిలుస్తోంది. పదో తరగతితోనే ఎయిర్ మెన్ ఉద్యోగాలు సొంతం చేసుకోవ‌చ్చు. ఇంటర్ ఉంటే చాలు ఫ్ల‌యింగ్ ఆఫీస‌ర్ కోసం ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు. డిగ్రీ, డిప్లొమా...విద్యార్హత ఏదైన‌ప్ప‌టికీ అందుకు తగ్గ ఉద్యోగాలెన్నో ఎయిర్‌ఫోర్స్‌లో ఉన్నాయి. వాటిలో ప్ర‌వేశానికి అరు నెల‌ల‌కు ఒక‌సారి ప్ర‌క‌ట‌న‌లూ వెలువ‌డుతున్నాయి. ఆ వివ‌రాలు చూద్దాం...

చిన్న‌ప్పుడు విమానాన్ని ఆశ్చ‌ర్యంగా క‌న్నార్ప‌కుండా చూస్తూ పెరిగిన‌వాళ్ల‌మే. అప్ప‌ట్లో విమానాశ్ర‌యానికి వెళ్ల‌డం ఒక విశేషం. తొలిసారి విమానంలో ప్రయాణించడం ఎప్ప‌టికీ మధుర జ్ఞాపకమే. అదే విమానం నడిపే అవకాశమే వ‌స్తే...ఎంతో సంతోష‌మే క‌దా. మ‌రి పైల‌ట్ శిక్ష‌ణ‌, అందుకు అవ‌స‌ర‌మైన డ‌బ్బులు ఎవ‌రిస్తార‌ని ఆలోచిస్తున్నారా? మ‌రేం ఫ‌ర్వాలేదు. ప్రతిభ మీ సొంత‌మైతే స‌రిపోతుంది.. పైసా చెల్లించకుండా పైల‌ట్ శిక్ష‌ణ పొంద‌వ‌చ్చు. వెంట‌నే ఉద్యోగంలోనూ చేరిపోవ‌చ్చు. మామూలు విమానాలే కాదు యుద్ధ విమానాలతో ఆకాశంలో విన్యాసాలూ చేయొచ్చు. ఈ అవకాశాన్ని ఎయిర్ ఫోర్స్ కల్పిస్తోంది. విమానాలు, హెలికాప్టర్లు నడపడానికి పైలట్లు, వాటి నిర్వహణ, మరమ్మతుల కోసం టెక్నికల్, గ్రౌండ్ డ్యూటీ సిబ్బంది, గగనతలంలో దేశ రక్షణకు ఎయిర్ మెన్లు...ఇలా పలు ఉద్యోగాలు వాయుసేనలో ఉన్నాయి. ఆయా విభాగాల వారీ వివ‌రాలు చూద్దాం.

ఎయిర్ మెన్
ఇందులో గ్రూప్ ఎక్స్, గ్రూప్ వై అనే రెండు ట్రేడ్లు ఉంటాయి. వీటిలో గ్రూప్ వైలో మ్యుజీషియన్, మెడికల్ అసిస్టెంట్; మ్యుజీషియన్, మెడికల్ అసిస్టేంటేతర‌ ట్రేడ్లు ఉంటాయి. గ్రూప్ ఎక్స్ లో ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్‌, ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్ర‌క్ట‌రేత‌ర‌ ట్రేడ్లు ఉన్నాయి. ఈ పోస్టుల‌కు ప‌రీక్ష‌లో చూపిన ప్ర‌తిభ‌, ఫిజిక‌ల్‌, మెడిక‌ల్ టెస్టుల ద్వారా నియామ‌కాలు చేప‌డ‌తారు.

గ్రూప్ వై
మ్యుజీషియన్: ఈ ట్రేడ్ ఉద్యోగాలకు పదో తరగతి విద్యార్హతతో పోటీ పడవచ్చు. అయితే ఏదైనా సంగీత/ వాయిద్య పరికరంలో ప్రావీణ్యం ఉండాలి. 17-25 ఏళ్లలోపువాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎత్తు కనీసం 162 సెం.మీ. ఉండాలి.
మెడికల్ అసిస్టెంట్: 10+2 / ఇంటర్‌లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్ సబ్జెక్టులతో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు ఈ పోస్టులకు అర్హులు. ఇంగ్లిష్‌లో విడిగా 50 శాతం మార్కులు ఉండాలి. వయసు 17-21 ఏళ్లలోపు వారు అర్హులు.
మ్యుజీషియన్, మెడికల్ అసిస్టెంటేతర ట్రేడ్లు: 50 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణులు వీటికి అర్హులు. ఆంగ్లంలో 50 శాతం మార్కులు తప్పనిసరి. వయసు 17-21లోపు ఉండాలి.

గ్రూప్ ఎక్స్
టెక్నికల్: ఈ విభాగంలో పోస్టులకు మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్‌లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి. అలాగే విడిగా ఆంగ్లంలో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. లేదా 50 శాతం మార్కులతో నిర్దేశిత ట్రేడుల్లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులూ దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు ఇంగ్లిష్ సబ్జెక్టులో 50 శాతం మార్కులతో డిప్లొమా/ఇంటర్/పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించాలి. వయసు 17-21 సంవత్సరాల్లోపు ఉండాలి.
ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్‌: బీఎడ్‌తోపాటు యూజీ/ పీజీ అర్హ‌త‌ల‌తో ఈ పోస్టుల‌కు పోటీ ప‌డ‌వ‌చ్చు. ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా బీఏ లేదా ఫిజిక్స్ /సైకాలజీ/ కెమిస్ట్రీ /మ్యాథ్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ /కంప్యూటర్ సైన్స్/ స్టాటిస్టిక్స్ వీటిలో ఏదైనా ఒక సబ్జెక్టుతో బీఎస్సీ లేదా బీసీఏ చదివినవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత కోర్సులో 50 శాతం మార్కులు తప్పనిసరి. అలాగే వీటితోపాటు 50 శాతం మార్కులతో బీఎడ్ ఉత్తీర్ణత సాధించాలి. వయసు 20-25 ఏళ్లలోపు ఉండాలి. ఎంఏ- ఇంగ్లిష్ /సైకాలజీ లేదా ఎమ్మెస్సీ-మ్యాథ్స్ /ఫిజిక్స్/ స్టాటిస్టిక్స్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎంసీఏ వీటిలో ఏదైనా కోర్సులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే 50 శాతం మార్కులతో బీఎడ్ తప్పనిసరి. వయసు 20 - 28 ఏళ్లలోపు ఉండాలి.

శిక్ష‌ణ‌...హోదా..
ఎయిర్ మెన్ పోస్టుల‌కు ఎంపికైనవారికి బెళ్గంలోని ఎయిర్ ఫోర్స్‌ ప్రాథమిక శిక్షణ కేంద్రంలో తర్ఫీదునిస్తారు. విజయవంతంగా దీన్ని ముగించుకున్నవారికి సంబంధిత కేంద్రాల్లో ట్రేడ్ శిక్షణ ఉంటుంది. గ్రూప్ ఎక్స్ టెక్నికల్ ఉద్యోగులు వివిధ విభాగాల్లో ఫిట్టర్ హోదాతో సేవలందిస్తారు. ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్ పోస్టుల‌కు ఎంపికైన‌వారు ఎయిర్ ఫోర్స్ శిక్షణ కేంద్రాల్లో తర్ఫీదునిస్తారు. ఎయిర్ మెన్లను ఎడ్యుకేట్ చేయడం వీరి విధి. గ్రూప్ వై టెక్నికల్ విభాగంలో ఎంపికైనవారు కమ్యూనికేషన్/ ఆటోమొబైల్ టెక్నీషియ‌న్ హోదాతో విధులు నిర్వర్తిస్తారు. నాన్ టెక్నికల్ విభాగంలో మ్యుజీషియ‌న్ పోస్టుల్లో చేరిన‌వారు మ్యుజీషియ‌న్ల‌గా, మెడిక‌ల్ విభాగంలోనివారు మెడికల్ అసిస్టెంట్ హోదాతో చెలామ‌ణి అవుతారు. నాన్ టెక్నిక‌ల్ ట్రేడుల్లో మిగిలిన‌వారు అడ్మిన్ / అకౌంట్స్/ లాజిస్టిక్స్ / ఆపరేషన్స్...మొదలైన విభాగాల్లో అసిస్టెంట్లుగా కొనసాగుతారు. అలాగే ఎయిర్ ఫోర్స్ సెక్యూరిటీ/ పోలీస్ గా సేవలు అందిస్తారు. వీరందరికీ కెరీర్ ప్రారంభంలో ఎయిర్ క్రాఫ్ట్స్‌మెన్‌ హోదా కేటాయిస్తారు. భవిష్యత్తులో మాస్టర్ వారంట్ ఆఫీసర్ స్థాయి వరకు చేరుకుంటారు. గ్రూప్ వై విభాగంలో పోస్టుల‌కు ఎంపికైనవారికి రూ.26900, గ్రూప్ ఎక్స్ టెక్నిక‌ల్ పోస్టుల‌కు రూ.33100, ఎడ్యుకేష‌న్ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్ల‌కు రూ.40,600 మూలవేతనం లభిస్తుంది. దీనికి అద‌నంగా డీఏ, హెచ్ఆర్ఏ ఉంటాయి. 60 రోజులు వార్షిక సెలవులు, 20 సాధారణ సెలవులు పొంద‌వ‌చ్చు. వీటితోపాటు ప‌లు ప్రోత్సాహ‌కాలు ద‌క్కుతాయి.

ఆఫీస‌ర్ ఉద్యోగాలు
ఆఫీసర్ హోదాతో ఫ్ల‌యింగ్‌, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్, నాన్ టెక్నికల్) విభాగాల్లో విధులు ఉంటాయి. ఫ్ల‌యింగ్ బ్రాంచీలో ఎంపికైనవారు పైలట్ గా సేవలు అందిస్తారు. ఇందులో ఫైట‌ర్లు, ట్రాన్స్‌పోర్ట‌ర్లు, హెలికాప్టర్లు ఉంటారు. యుద్ధ విమానాలు నడిపేవాళ్లు ఫైట‌ర్స్‌. సరకు, మనుషులను తీసుకెళ్లేవారు ట్రాన్స్‌పోర్ట‌ర్లు. హెలికాప్టర్లను నడిపేవాళ్లు హెలికాప్టర్ పైలట్లు. గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ ద్వారా మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఉద్యోగాలు ల‌భిస్తాయి. గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్‌లో అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్, లాజిస్టిక్స్, ఎడ్యుకేషన్, మెటీరియాలజీ విభాగాలు ఉంటాయి. ఆయా విభాగాల్లోకి ప్ర‌వేశ మార్గాల‌ను తెలుసుకుందాం.

ఫ్ల‌యింగ్ బ్రాంచ్:
ఫ్ల‌యింగ్ బ్రాంచ్(పైల‌ట్‌) ఉద్యోగాల‌ను యూపీఎస్సీ నిర్వహించే ఎన్‌డీఏ, సీడీఎస్ఈలతోపాటు ఏఎఫ్ క్యాట్‌- ఎస్ఎస్సీ స్పెషల్ ఎంట్రీ (మెన్ అండ్ విమెన్), ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ (మెన్) ద్వారా ద‌క్కించుకోవ‌చ్చు.
ఎన్డీఏ: ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే ఎయిర్ ఫోర్స్‌లో పైలట్ అయ్యే అవకాశం కల్పిస్తోంది యూపీఎస్సీ నిర్వహించే నేషనల్ డిఫెన్స్ అకాడెమీ (ఎన్డీఏ) పరీక్ష. మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్ పూర్తిచేసినవారు, ఆఖరు సంవత్సరం కోర్సు చదువుతున్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 16 1/2 - 19 1/2 ఏళ్లలోపు ఉండాలి. ఎత్తు 162.5 సెం.మీ. ఉండాలి. ఏడాదికి రెండుసార్లు జ‌న‌వ‌రి, ఆగ‌స్టుల్లో ప్రకటన వెలువడుతుంది. ఒక్కో విడతలో 90కి పైగా ఖాళీలను భర్తీ చేస్తారు. రాతపరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వీరికి నేషనల్ డిఫెన్స్ అకాడెమీ (ఎన్డీఏ) పుణె లో శిక్షణ ఉంటుంది. ఎయిర్ ఫోర్స్ క్యాడెట్లు శిక్షణతోపాటు బీటెక్ విద్య అభ్యసిస్తారు. విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్నవారికి జేఎన్‌యూ, న్యూదిల్లీ ఇంజినీరింగ్ డిగ్రీలను ప్రధానం చేస్తుంది. అనంతరం ఎయిర్ ఫోర్స్‌ కేంద్రాల్లో పైలట్ శిక్షణ ఉంటుంది. దీన్ని విజ‌య‌వంతంగా పూర్తిచేసుకున్న‌వారు ఫ్ల‌యింగ్ ఆఫీస‌ర్ హోదా పొందుతారు.
సీడీఎస్ఈ: క‌ంబైన్డ్‌ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్ఈ) పేరుతో యూపీఎస్సీ ఏడాదికి రెండుసార్లు జూన్‌, అక్టోబ‌రుల్లో ప్రకటన వెలువడుతుంది. ఒక్కో విడతలో 30కిపైగా ఖాళీలు ఉంటాయి.ఎయిర్ ఫోర్స్ ఫ్లయింగ్ బ్రాంచ్ ఉద్యోగాలను ఈ పరీక్ష ద్వారా పొందవచ్చు. ఇంట‌ర్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్ చ‌దువుకున్న గ్రాడ్యుయేట్లు ఈ ప‌రీక్ష‌కు అర్హులు. వయసు 20 - 24 ఏళ్లలోపు ఉండాలి. రాత ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ, మెడిక‌ల్ టెస్టుల ద్వారా నియామ‌కాలు చేప‌డ‌తారు.
ఏఎఫ్ క్యాట్‌: ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్టు (ఏఎఫ్‌క్యాట్‌) ద్వారా ఫ్లయింగ్ బ్రాంచ్‌ అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. ఇందులో రెండు విభాగాల్లో పైలట్ కావచ్చు. అవి ఎస్సెస్సీ ఎంట్రీ, ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ. ఈ పరీక్షకు సంబంధించి ప్రకటనలు ఏడాదికి రెండుసార్లు జూన్, డిసెంబరుల్లో వెలువడతాయి. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ, మెడిక‌ల్ టెస్టుల ద్వారా నియామ‌కాలు చేప‌డ‌తారు.
ఎస్పెస్సీ ఎంట్రీ: షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) విధానంలో నియామ‌కాలు చేప‌డ‌తారు. ఈ విధానంలో ఎంపికైనవాళ్లు 14 ఏళ్లు విధుల్లో కొన‌సాగిన త‌ర్వాత వైదొల‌గాల్సి ఉంటుంది. పురుషులతోపాటు మహిళలు కూడా ఈ విభాగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులు ఉండాలి. దీంతోపాటు ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లోనూ 60 శాతం మార్కులు తప్పనిసరి.
ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ: ఎన్సీసీ సీ సర్టిఫికెట్ ఉన్నవారికి ప్రత్యేకంగా ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ ద్వారా ఫ్లయింగ్ బ్రాంచ్‌లో అవకాశం కల్పిస్తున్నారు. పురుషులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. కనీసం 60 శాతం మార్కులతో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివుండడం తప్పనిసరి.

గ్రౌండ్ డ్యూటీ - టెక్నికల్ బ్రాంచ్
ఈ ఉద్యోగాల‌న్నీ ఏఎఫ్ క్యాట్ తోనే భర్తీ చేస్తున్నారు. ఇందులో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ మెకానికల్/ ఎలక్ట్రానిక్స్ విభాగాలు ఉన్నాయి.
ఏరోనాటికల్ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్): 60 శాతం మార్కులతో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రికల్ లేదా కమ్యూనికేషన్స్ లేదా కంప్యూటర్ సైన్స్... తదితర విభాగాల్లో ఎందులోనైనా బీటెక్/ బీఈ పూర్తిచేసినవాళ్లు అర్హులు. ఇంటర్/ +2లో ఫిజిక్స్, మ్యాథ్స్ ల్లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
ఏరోనాటికల్ ఇంజినీర్ (మెకానికల్): 60 శాతం మార్కులతో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ లేదా ఏరోస్పేస్ లేదా ఎయిర్ క్రాఫ్ట్స్ మెయింటెనన్స్ లేదా మెకానికల్ లేదా ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ వీటిలో ఏ విభాగంలోనైనా బీటెక్/ బీఈ పూర్తిచేసినవాళ్లు అర్హులు. ఇంటర్/+2లో ఫిజిక్స్, మ్యాథ్స్ ల్లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

గ్రౌండ్ డ్యూటీ - నాన్ టెక్నికల్ బ్రాంచ్
ఈ ఉద్యోగాల‌న్నీ ఏఎఫ్ క్యాట్ ద్వారా భర్తీ చేస్తారు. ఇందులో అడ్మినిస్ట్రేషన్ & లాజిస్టిక్స్, అకౌంట్స్, ఎడ్యుకేషన్, మెటీరియాల‌జీ విభాగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాల‌కు మ‌హిళ‌లూ అర్హులే. అయితే వీరిని షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ విధానంలో తీసుకుంటారు. అందువ‌ల్ల 14 ఏళ్ల త‌ర్వాత వైదొల‌గాల్సి ఉంటుంది.
అడ్మినిస్ట్రేషన్ & లాజిస్టిక్స్: కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తిచేసినవారు ఈ విభాగంలో పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అడ్మినిస్ట్రేష‌న్ పోస్టుల‌కు ఎంపికైన‌వారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల‌ర్‌, ఫైట‌ర్ కంట్రోల‌ర్‌గా సేవ‌లు అందిస్తారు.
అకౌంట్స్: 60 శాతం మార్కులతో బీకాం పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎడ్యుకేషన్: ఏదైనా డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు పీజీలో ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంటర్నేషనల్ స్టడీస్, సైకాలజీ, కంప్యూటర్ సైన్స్, ఐటీ, మేనేజ్ మెంట్, మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం, పబ్లిక్ రిలేషన్, కంప్యూటర్ అప్లికేషన్స్...వీటిలో ఏదేని కోర్సులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణ‌త‌ సాధించినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
మెటీరియాల‌జీ: డిగ్రీలో 55 శాతం మార్కుల‌తో మ్యాథ్స్‌, ఫిజిక్స్ స‌బ్జెక్టుల‌తో ఉత్తీర్ణ‌త‌తోపాటు నిర్దేశిత సైన్స్ స్ట్రీమ్‌లో 50 శాతం మార్కుల‌తో పీజీ పూర్తిచేయాలి.
వయసు: గ్రౌండ్ డ్యూటీలోని టెక్నికల్, నాన్ టెక్నికల్ అన్నిపోస్టులకు 20 నుంచి 26 ఏళ్లలోపువాళ్లు అర్హులు.
ఎత్తు: పురుషులైతే 157.5, మహిళలు 152 సెం.మీ. ఉండాలి.

శిక్ష‌ణ‌...వేత‌నాలు...
ఆఫీస‌ర్ పోస్టుల‌కు సంబంధించి అభ్యర్థులు ఏ విభాగంలో, ఏ ప‌రీక్ష ద్వారా ఎంపికైనప్పటికీ చివ‌రి ఏడాది శిక్ష‌ణ‌లో ఉన్నప్పుడు రూ.56,100 స్టయిపెండ్ చెల్లిస్తారు. శిక్ష‌ణ అనంత‌రం విధుల్లోకి చేరిన త‌ర్వాత‌ రూ.56,100 మూలవేతనంతోపాటు మిలటరీ సర్వీస్ పే (ఎంఎస్పీ) రూ.15500 అంద‌రికీ అందుతుంది.. పైలట్లకు ఫ్లయింగ్ అలవెన్స్ కింద నెలకు రూ.25,000 అద‌నంగా ద‌క్కుతాయి. టెక్నికల్ విభాగాల్లో ఎంపికైనవారికి టెక్నికల్ అలవెన్సు ప్ర‌త్యేకంగా చెల్లిస్తారు. వీట‌న్నింటితోపాటు డీఏ, హెచ్ఆర్ఏ ఉంటాయి. క్యాంటీన్, ఎల్టీసీ, తక్కువ వడ్డీకి గృహ‌, కారు రుణాలు, 60 వార్షిక, 20 సాధారణ సెలవులు మొద‌లైన‌వి ఉంటాయి. పిల్లల చదువులకోసం నర్సరీ నుంచి ప్లస్ టు (ఇంటర్) వరకు ప్రతి నెల ఒక్కొక్కరికీ రూ.2250 చొప్పున ఇద్ద‌రికి చెల్లిస్తారు. తక్కువ వ్యవధిలోనే ప్రమోషన్లు అందుకోవచ్చు.

పైల‌ట్ పోస్టుల‌కు సీపీసీఎస్ లేదా పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్టు (పీఏబీటీ)లో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. ఏ విధానంలో(సీడీఎస్ఈ, ఏఎఫ్ క్యాట్) ఎంపికైనప్పటికీ పైలట్ పోస్టులకు 18 నెలల పాటు ఫ్ల‌యింగ్ శిక్షణ ఉంటుంది. ముందుగా ఆరు నెలలు ఎయిర్ ఫోర్స్ అకాడెమీలో ప్రాథమిక (స్టేజ్‌-1) శిక్షణ ఇస్తారు.. అనంతరం అభ్యర్థుల ప్రతిభ ప్రకారం.. ఫైటర్ పైలట్, ట్రాన్స్ పోర్ట్ పైలట్, హెలికాప్టర్ పైలట్లగా విడదీసి అందుకుతగ్గ శిక్షణను రెండు దశల్లో నిర్వహిస్తారు. ఫైటర్ పైలట్ కోర్సుకి ఎంపికైనవారికి స్టేట్-2 శిక్షణ 24 వారాలపాటు హాకింపేటలో ఉంటుంది. స్టేజ్-3 శిక్షణ మరో 24 వారాలపాటు బీదర్‌లో కొనసాగుతుంది. ట్రాన్స్ పోర్ట్ పైలట్ గా ఎంపికైనవారికి స్టేజ్-2, స్టేజ్-3 శిక్షణలు 48 వారాలపాటు ఎలహంకలో ఉటాయి. హెలికాప్టర్ స్ట్రీమ్ లో ఎంపికైనవారికి హాకింపేటలో 24 వారాలపాటు శిక్షణ కొనసాగుతుంది. అనంతరం మరో 24 వారాల పాటు స్టేజ్-3 శిక్షణను ఎలహంకలో నిర్వహిస్తారు. ఏఎఫ్ క్యాట్ ద్వారా టెక్నికల్ విభాగాల్లో ఎంపికైనవారికి 74 వారాలు, నాన్ టెక్నికల్ విభాగాల్లో ఎంపికైనవారికి 52 వారాలు శిక్షణ ఉంటుంది. శిక్ష‌ణ అనంత‌రం ఫ్ల‌యింగ్ ఆఫీస‌ర్ హోదాతో కెరీర్ మొద‌ల‌వుతుంది. కొద్ది సంవ‌త్స‌రాల్లోనే వీరు సీనియారిటీ, ప్ర‌తిభ ప్రాతిప‌దిక‌న‌ ఫ్ల‌యిట్ లెఫ్టినెంట్‌, స్క్వాడ్ర‌న్ లీడ‌ర్‌, వింగ్ క‌మాండ‌ర్‌, గ్రూప్ కెప్టెన్ త‌దిత‌ర హోదాల‌ను పొందుతారు. భ‌విష్య‌త్తులో వీరు ఎయిర్ మార్ష‌ల్‌, ఎయిర్ చీఫ్ మార్ష‌ల్‌, మార్ష‌ల్ ఆఫ్ ది ఐఏఎఫ్ కావ‌చ్చు.

వెబ్‌సైట్లు: www.careerairforce.nic.in, https://afcat.cdac.in/AFCAT/, www.upsc.gov.in/

Back..

Posted on 02-01-2019