Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
మూగజీవులూ.. కొలువులిస్తాయ్‌!

దారిలో ఓ బుజ్జి కుక్కపిల్ల కనిపిస్తే చాలామంది కాసేపు ఆగి దాన్ని ముద్దుచేసి పోతుంటారు. పక్కింట్లో పిల్లి అటూ ఇటూ పరుగులు పెడుతుంటే చూసి పరవశిస్తుంటారు. పెంపుడు చిలుక పలకడం మొదలెడితే, దాని గురించి ఫుల్‌స్టాప్‌ లేకుండా వచ్చిన వాళ్లందరికీ చెప్పేస్తుంటారు. పెట్‌ల పట్ల ప్రేమ, అభిమానం అలా ఉంటాయి. అంతటి అనుబంధం పెనవేసుకునే వాటి మధ్యలోనే మన ఉద్యోగం ఉంటే ఇంకెలా ఉంటుందో ఊహించండి. కాలం కరిగిపోతుంటుంది. పని చేస్తున్న ఫీలింగే ఉండదు. పెంపుడు జంతువుల పరిరక్షణ ఇప్పుడో ప్రత్యేకమైన కెరియర్‌గా ఎదుగుతోంది. ఎన్నో కోర్సులు, ఉద్యోగాలు వాటి కోసమే రూపొందుతున్నాయి.

పేద, గొప్ప తేడా లేకుండా చాలామంది జంతువులను పెంచుతుంటారు. వాటి చేష్టలకు మురిసిపోతుంటారు. సాటివారితో మాట్లాడినట్లే ఆ జంతువులతోనూ మాట్లాడుతుంటారు. వాటికి ఏమాత్రం తేడా చేసినా ఆందోళన పడిపోయి, ఆసుపత్రుల చుట్టూ తిప్పుతుంటారు. మనిషికీ, జంతువుకీ మధ్య అనుబంధం అత్యంత ప్రాచీనమైనది. అవి చూపించే ప్రేమ, విశ్వాసాలకు మనిషి ఎప్పుడో అలవాటు పడిపోయాడు. వాటిని జీవితంలో ఒక భాగంగా మార్చుకున్నాడు. ఇప్పుడు ఆ జంతువులను జాగ్రత్తగా చూసుకోవడం పెద్ద కెరియర్‌గా మారింది. రకరకాల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి. అందుకు తగిన కోర్సుల రూపకల్పన జరుగుతోంది.

ప్రతి మనిషినీ ఏదో ఒక దశలో ఏకాంతం వెంటాడుతుంది. ఒంటరితనం ఆరోగ్యానికి అంత మంచిది కాదని వైద్యులు అంటుంటారు. ఆ సమయంలో పెంపుడు జంతువులు తోడుంటే బీపీ, కొలెస్టరాల్‌ వంటివి తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. రోజులో కొంతసేపైనా వాటితో గడపనిదే ఉండలేమనేవారు చాలామంది ఉన్నారు. అలాంటిది రోజంతా వాటితోనే గడిపే ఉద్యోగం ఉంటే ఎగిరి గంతేయరూ! ఇలాంటి వారిని జంతు ఆధారిత కెరియర్‌ ప్రపంచంలో అవకాశాలు ఆహ్వానిస్తున్నాయి. జంతువులను పరిశీలించడం, వాటి గురించి తెలుసుకోవడం, వాటిని బాగుచేయడం.. ఇలా ఎన్నో విభాగాల్లో దీర్ఘకాలిక కెరియర్‌ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. మన దేశంలోని పలు విద్యాసంస్థలూ సంబంధిత కోర్సులను అందిస్తున్నాయి.

వెటర్నరీ డాక్టర్‌
పక్షులు, జంతువులకు సోకే వివిధ రకాల జబ్బులకు సంబంధించిన ట్రీట్‌మెంట్‌, వాటిని బాగుచేయడానికి సంబంధించిన వెటర్నరీ సైన్స్‌ను ఇందులో చదువుతారు. ఇది కొంచెం మానవ వైద్యశాస్త్రం లాగానే ఉంటుంది. వీటి ప్రాథమిక లక్ష్యం రోగాలను గుర్తించడం, నయం చేయడం. మొత్తంగా శరీరంలోని అవయవాలు సరిగా పనిచేసేలా చేయడం. అలాగే జంతువులకు అవసరమైన వ్యాక్సిన్లు వేయడం, ప్రాథమిక చికిత్సను అందించడం వంటివీ చేస్తారు. కుక్కలు, పిల్లులు, క్రూరజంతువులు మొదలైన వాటిల్లో ఏదో ఒకదానిపై స్పెషలైజేషన్‌ చేసే అవకాశమూ ఉంది. జనరల్‌ వెటర్నరీ ఎంచుకుంటే అన్ని రకాల జంతువులకు వైద్యం అందిస్తారు.
అర్హత: వెటర్నరీ డాక్టర్‌ కావాలనుకునేవారు అయిదేళ్ల బ్యాచిలర్స్‌ ఇన్‌ వెటర్నరీ సైన్స్‌ (బీవీఎస్‌సీ) పూర్తిచేయాలి. ఇంటర్మీడియట్‌ తరువాత నీట్‌లో ర్యాంకు సాధిస్తే ఈ కోర్సులోకి ప్రవేశం లభిస్తుంది. బీవీఎస్‌సీ అనంతరం పీజీలో స్పెషలైజేషన్‌ చేసుకోవచ్చు. కోర్సు పూర్తయ్యాక ప్రాక్టీస్‌ పెట్టడానికి వెటర్నరీ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకోవాలి. కౌన్సిల్‌ ఆధ్వర్యంలో ఆరు నెలల ఇంటర్న్‌షిప్‌ చేయాలి.
కోర్సు అందిస్తున్న ప్రముఖ సంస్థలు:
* ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌
* ఎన్‌టీ రామారావు కాలేజ్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్‌, గన్నవరం
* ఇండియన్‌ వెటర్నరీ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, బరేలీ
* బనారస్‌ హిందూ యూనివర్సిటీ, వారణాసి
* బాంబే వెటర్నరీ సైన్స్‌ కాలేజ్‌, ముంబయి
* కాలేజ్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్‌ అండ్‌ యానిమల్‌ హజ్బెండరీ, ఐజ్వాల్‌
* లాలా లజపతిరాయ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ వెటర్నరీ అండ్‌ యానిమల్‌ సైన్సెస్‌, హిస్సార్‌ మొదలైనవి
ఉద్యోగావకాశాలు: జంతు వైద్యశాలల్లో డాక్టర్‌గా చేరవచ్చు. సొంత ఆసుపత్రిని ఏర్పాటు చేసుకోవచ్చు. రిసెర్చ్‌, విద్యా సంబంధ సంస్థలు, డయాగ్నొస్టిక్‌ ల్యాబ్‌ల్లోనూ అవకాశాలుంటాయి. డెయిరీలు, పిగరీ, పౌల్ట్రీ ఫామ్‌ల్లోకీ తీసుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగావకాశాలూ ఉంటాయి.

పెట్‌ గ్రూమర్‌
జంతువుల రూపాన్ని కాపాడటంతోపాటు పరిశుభ్రంగా, అందంగా ఉంచడం గోర్లు, జుట్టు సరైన రీతిలో కత్తిరించడం చేస్తారు. పెంపుడు జంతువుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను యజమానులకు సూచిస్తారు. వీటి ఆరోగ్య విషయంలో ప్రధాన పాత్ర పోషిస్తారు. ఈ ఉద్యోగాలకు ఆదరణ పెరుగుతోంది. పోటీ కూడా ఎక్కువే.
అర్హత: ప్రత్యేకంగా డిగ్రీ అవసరం లేదు. కానీ, సర్టిఫికెట్‌, డిప్లొమా కోర్సులను చేసి ఉండాలి. కోర్సుల కాలవ్యవధి సాధారణంగా ఆరు నెలల నుంచి ఏడాది వరకూ ఉంటుంది. గ్రూమింగ్‌, స్టైలింగ్‌, పెట్స్‌ నిర్వహణ మొదలైన నైపుణ్యాలను నేర్పుతారు. స్పెషలైజ్‌డ్‌ పెట్‌ గ్రూమింగ్‌ కోర్సులు కూడా ఉన్నాయి. విభిన్న జాతుల పెంపుడు జంతువులను గుర్తించడం, వాటి తత్వాలను అర్థం చేసుకోవడం వాటిలో ఉంటాయి.
కోర్సులు అందిస్తున్న ప్రముఖ సంస్థలు:
* ఫుజ్జీ వుజ్జీ పెట్‌ స్టైలింగ్‌ స్టూడియో అండ్‌ స్పా, బెంగళూరు
* స్కూపీ స్క్రబ్‌, న్యూదిల్లీ, రెడ్‌పెట్‌ పాస్‌ పెట్‌ స్పా అండ్‌ షాప్‌, న్యూదిల్లీ మొదలైనవి.
కెరియర్‌: కెనెల్స్‌, వెటర్నరీ క్లినిక్‌లు, యానిమల్‌ షెల్టర్స్‌, పెట్‌ సప్లై స్టోర్లలో వీరికి అవకాశాలుంటాయి. యానిమల్‌ సెలూన్లు, యానిమల్‌ షోలల్లోనూ వీరిని తీసుకుంటారు.

వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌
ఇంట్లో పెంచుకోలేని జంతువుల ఫొటోలను తీయడమే వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రఫీ. ఇది సాహసోపేతమైన కెరియర్‌. కేవలం జంతువులు, మొక్కలను ఫొటో తీయడమే కాదు. వాటి జీవన విధానాన్ని సహజసిద్ధంగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తారు. చురుకుగా పనిచేసే తత్వం, ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇమడగలిగే వారికి ఇది తగిన కెరియర్‌. కెమెరాలు, యాంగిల్స్‌, ఫొటోగ్రఫీ టర్మినాలజీ, లైటింగ్‌ మొదలైన వాటి గురించీ తెలిసుండాలి.
అర్హత: ప్రత్యేక డిగ్రీ అవసరం లేదు. డిప్లొమా, సర్టిఫికేషన్‌లు సరిపోతాయి. కొన్ని ప్రముఖ సంస్థలు వీటిని అందిస్తున్నాయి. స్పెషలైజ్‌డ్‌ ఫొటోగ్రఫీ బ్యాచిలర్‌ డిగ్రీ కూడా చేయవచ్చు.
కోర్సులు అందిస్తున్న ప్రముఖ సంస్థలు: ‌
* నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ, ముంబయి
* క్రియేటివ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ, కేరళ
* దిల్లీ కాలేజ్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ, దిల్లీ ‌
* ద ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజిటల్‌ ఆర్ట్‌ అండ్‌ యానిమేషన్‌, కోల్‌కతా
* ఇమేజెస్‌ రీడిఫైన్‌డ్‌ ఫొటోగ్రఫీ ఇన్‌స్టిట్యూట్‌, కోల్‌కతా
* టీజీసీ, దిల్లీ, జయపుర ‌
* ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఫొటోగ్రఫీ ఎక్సలెన్స్‌, అహ్మదాబాద్‌
* శ్రీని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ, కోయంబత్తూరు ‌
* ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ, న్యూదిల్లీ
ఉద్యోగావకాశాలు: ఫ్రీలాన్సర్‌గా చేయొచ్చు. కొన్ని పెద్ద సంస్థలు ఫుల్‌ టైం విధానంలో తీసుకుంటున్నాయి. వార్తాపత్రికలు, ట్రావెల్‌ మేగజీన్లు, టీవీ చానళ్లు, పరిశోధన సంస్థలు, ఎన్‌జీఓలు వీరిని ఎక్కువగా ఎంచుకుంటున్నాయి. వీరు తీసిన ఫొటోలను గ్యాలరీలు, వెబ్‌సైట్లకు అమ్ముకోవచ్చు. ఫొటోగ్రఫీ కాంటెస్ట్‌లకూ పంపుకునే వీలుంటుంది.

ఆక్వారిస్ట్‌
అక్వేరియంలో పెరిగే చేపలు, ఇతర జంతువుల సంరక్షణ వీరి బాధ్యత. ఆక్వారిస్ట్‌లు ఎక్కువగా అక్వేరియం క్యూరేటర్‌ కింద చేస్తుంటారు. అక్వేరియంలో జీవించే మొక్కలు, జీవులకు సరైన ఆహారాన్ని తగిన మోతాదులో అందించడం, అవి జీవించడానికి తగిన వాతావరణాన్ని కల్పించడం వంటివి చేస్తుంటారు. అలాగే చేపలపై ప్రయోగాలు చేసి, ఆ సమాచారాన్ని వివిధ అవసరాలకు ఉపయోగించుకుంటారు.
అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ ఉండాలి. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ సైన్స్‌, బీఎస్‌సీ-ఇండస్ట్రియల్‌ ఫిష్‌ అండ్‌ ఫిషరీస్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌, బయాలజీ, సైన్స్‌, అగ్రికల్చర్‌, వెటర్నరీ సైన్స్‌ వంటి వాటిల్లో డిగ్రీ పూర్తి చేసినవారూ అర్హులే. కొన్ని సంస్థలు కొంత శిక్షణనిచ్చి ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. ఇంటర్న్‌షిప్‌ల ద్వారా అనుభవం సాధించడం మంచిది.
కోర్సులు అందిస్తున్న ప్రముఖ సంస్థలు:
* దిల్లీ యూనివర్సిటీ
* కర్ణాటక వెటర్నరీ యానిమల్‌ అండ్‌ ఫిషరీస్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ
* పంజాబ్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ
* డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ సెంట్రల్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ, బిహార్‌ మొదలైనవి.
కెరియర్‌: అక్వేరియం సంస్థలు, జూలు, థీమ్‌ పార్క్‌లు, యానిమల్‌ రిసెర్చ్‌ లెబోరేటరీలు మొదలైన వాటిల్లో వీరికి ఉద్యోగాలు ఉంటాయి

వైల్డ్‌లైఫ్‌ కన్జర్వేటర్‌
జనావాసాలు పెరిగిపోతుండటంతో అడవులు తగ్గి క్రూరమృగాలకు జీవించడం కష్టమవుతోంది. దీంతో జంతు పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ఎన్‌జీఓలూ ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తున్నాయి. ఈ క్రమంలో వైల్డ్‌లైఫ్‌ కన్జర్వేషన్‌కు డిమాండు పెరిగింది. వైల్డ్‌లైఫ్‌ కన్జర్వేటర్లు జంతువులతోపాటు అడవుల సంరక్షణపైనా దృష్టిపెడతారు. ఇందుకు వారు వివిధ జంతువుల అలవాట్లు, వాటి సంతతి, వాతావరణ మార్పులు మొదలై అంశాల గురించి అధ్యయనం చేస్తారు.
అర్హత: ఇంటర్‌లో బైపీసీ చదివినవారు ఈ విభాగంలో డిగ్రీ కోర్సులకు అర్హులు. బీఎస్‌సీ ఫారెస్ట్రీ, బీఎస్‌సీ వైల్డ్‌లైఫ్‌ కన్జర్వేషన్‌, డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పీజీలో స్పెషలైజేషన్‌ అవకాశం ఉంటుంది.
కోర్సులు అందిస్తున్న ప్రముఖ సంస్థలు:
* నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ బయలాజికల్‌ సైన్సెస్‌, బెంగళూరు
* టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్‌, ముంబయి
* వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, డెహ్రాడూన్‌
* యూనివర్సిటీ ఆఫ్‌ కోటా, రాజస్థాన్‌
* కేరళ వెటర్నరీ అండ్‌ యానిమల్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ, కేరళ
* సౌరాష్ట్ర యూనివర్సిటీ, రోజ్‌కోట్‌
* ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ మేనేజ్‌మెంట్‌, మధ్యప్రదేశ్‌ మొదలైనవి.
ఉద్యోగావకాశాలు: ఫారెస్ట్‌ కన్జర్వేటర్‌, వైల్డ్‌లైఫ్‌ బయాలజిస్ట్‌, హాబిటాట్‌ రిస్టోరేటర్‌ మొదలైన అవకాశాలుంటాయి. ప్రైవేటు సంస్థలతో పాటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వీరిని తీసుకుంటాయి.

యానిమల్‌ ట్రెయినర్
ఇది కొంత కఠినమైన, సవాళ్లతో కూడిన ఉద్యోగం. విపత్తుల సమయంలో సాయం అందించడం, నేర పరిశోధన, వినోద కార్యక్రమాలు, ప్రత్యేక అవసరాల వారికి సాయపడటం తదితర సందర్భాల్లో జంతువులకు ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తారు. కొన్ని సంస్థలు ప్రత్యేకంగా ఒక జంతువుకు సంబంధించిన కోర్సులనే ఇస్తున్నాయి. మరికొన్ని పెంపుడు జంతువులు, సర్వీస్‌ ఆధారిత, ఎక్జాటిక్‌ విభాగాల్లోనూ అందిస్తున్నాయి.
అర్హత: యానిమల్‌ సైన్స్‌, మెరైన్‌ సైన్స్‌ మొదలైన వాటిల్లో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. నేరుగా వీటికి సంబంధించిన డిగ్రీలైతే లేవు కానీ, చాలా సంస్థలు డిప్లొమా, సర్టిఫికేషన్‌ కోర్సులను అందిస్తున్నాయి.
కోర్సులు అందిస్తున్న ప్రముఖ సంస్థలు: ‌
* బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ అకాడమీ, టెకాన్‌పుర్‌
* డాగ్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌, న్యూదిల్లీ
* యానిమల్‌ రాహత్‌, మహారాష్ట్ర
* కొచ్చి డాగ్‌ ట్రైనింగ్‌ అకాడమీ అండ్‌ పెట్‌ రిసార్ట్‌, కేరళ
* కమాండో కెనెల్స్‌, సికింద్రాబాద్‌ మొదలైనవి.
కెరియర్‌: లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు, స్పెషల్‌ పోలీస్‌ ఆఫీసర్స్‌, బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, సెక్యూరిటీ ఏజెన్సీలు, బాంబ్‌ స్క్వాడ్స్‌ మొదలైనవి వీరిని నియమించుకుంటాయి.

అవేకాకుండా...
ఇంకా ఎన్నో కెరియర్‌లు జంతు ప్రేమికులకు అందుబాటులో ఉన్నాయి. యానిమల్‌ సైంటిస్ట్‌, ఆర్నిథాలజిస్ట్‌, జువాలజిస్ట్‌, వైల్డ్‌లైఫ్‌ బయాలజిస్ట్‌, యానిమల్‌ న్యూట్రిషనిస్ట్‌, మెరైన్‌ బయాలజిస్ట్‌, పెట్‌ ఫొటోగ్రాఫర్‌, యానిమల్‌ ఆక్టివిస్ట్‌, డాగ్‌ వాకర్‌, పెట్‌ సిట్టర్‌, జూ అండ్‌ అక్వేరియం అసోసియేట్‌, జూ కీపర్‌, యానిమల్‌ కేర్‌టేకర్‌ వంటివి వాటిలో కొన్ని. అభ్యర్థులు తమ ఆసక్తి మేరకు సంబంధిత కోర్సులను ఎంచుకుని కెరియర్‌ను నిర్మించుకోవచ్చు.

Back..

Posted on 21-11-2018