Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
గ్రూప్స్‌ సిలబస్‌.... రూపం... సారం

     ఏపీపీఎస్‌సీ గ్రూప్స్‌ పోటీపరీక్షల ముసాయిదా సిలబస్‌ను ప్రకటించింది. దీనిలో మార్పులూ, చేర్పులపై అవగాహన చాలా ముఖ్యం. రెండు తెలుగు రాష్ట్రాల వారూ ఈ పరీక్షలు రాయవచ్చు. పోటీ పరీక్షల జనరల్‌స్టడీస్‌, ఇంకా గ్రూప్‌-2 సిలబస్‌పై వీరికి ఉపకరించే విశ్లేషణ...
సాంఘిక సాంస్కృతిక కోణంలో చారిత్రక నేపథ్యాన్ని చదవాలనే ధోరణి సిలబస్‌లో కనిపిస్తోంది. రాజకీయ చారిత్రక నేపథ్యం భారం తగ్గింది.
బడ్జెట్‌ తర్వాత గ్రూప్స్‌ పరీక్షల ప్రకటన వెలువడుతుందన్న ఏపీ ఆర్థికమంత్రి ప్రకటనా, త్వరలోనే వేల ఉద్యోగాలను భర్తీ చేస్తానన్న ఏపీపీఎస్‌సీ చైర్మన్‌ ప్రకటనా నిరుద్యోగుల్లో ఆశలు కల్పించాయి.
నాలుగు సంవత్సరాల నిరీక్షణకు స్వస్తి పలుకుతూ అభ్యర్థులకు మార్గదర్శిగా ‘ముసాయిదా సిలబస్‌’ కూడా వెలువడింది. ఈ నెలాఖరులోపుగానే సిలబస్‌ ఖరారు ప్రకటన కూడా రావొచ్చు. 100కి పైగా గ్రూప్‌-1, సుమారు 1000కు గ్రూప్‌- 2 ఖాళీలు భర్తీ చేయనున్నట్లు సమాచారం. రెవిన్యూశాఖ ఉద్యోగాలు అధికంగా ఉన్నట్లు వస్తున్న వార్తలు నిరుద్యోగులకు వూరట కల్పించేవే. ఇటువంటి కీలక సమయంలో గ్రూప్‌-2 పరీక్షల సిలబస్‌నూ, మార్పులనూ పరిశీలిస్తే సన్నద్ధత మార్గం సుగమం అవుతుంది.
వెలువడిన సిలబస్‌ ప్రకారం పాత పరీక్ష స్వరూపాన్నే కొనసాగించారు.
సిలబస్‌ మార్పులు
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మాదిరిగా భారీ మార్పులకు ఉపక్రమించకుండా 95 శాతానికి పైగా పాత సిలబస్‌నే కొనసాగించారు. ఫలితంగా ఆంధ్ర అభ్యర్థులు గతంలోనే కోచింగ్‌లు తీసుకున్నారు. సిద్ధమైనవారు ఇబ్బందిపడకుండా ఉద్యోగ ప్రయత్నాలకు మార్గం సుగమం అయింది. పాత సిలబస్‌నే కిందకూ పైకీ మార్చటం, అధ్యాయాల పేర్లు మార్చటం లాంటి మార్పులకే కమిటీ పరిమితమయింది.
తెలంగాణ భూభాగానికి సంబంధించిన అనేక విషయాలు వదిలెయ్యడం వల్ల ఒకరకంగా అభ్యర్థులపై భారం తగ్గింది. కానీ గతంలో అభ్యర్థులను విసిగించిన ‘సైద్ధాంతిక’ ఎకానమీ అంశాలు యథాతథంగా కొనసాగించటం, అనువర్తన (అప్లికేషన్‌)కు పెద్దగా అవకాశం ఇవ్వకపోవడం, పరిపాలనా సామర్థ్యాలు పరిశీలించకపోవడం, యూపీఎస్‌సీ సిలబస్‌లో వస్తున్న మార్పులను పరిగణనలోకి తీసుకోకపోవడం, సామాజిక అధ్యయనాలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం లాంటివి సీనియర్‌ అభ్యర్థుల సౌలభ్యం కోసం అని భావించవచ్చు.
దాదాపుగా ప్రస్తుతం వెలువడిన సిలబస్‌ పెద్దగా మార్పులు లేకుండా కొనసాగే అవకాశం ఉన్నందున మీనమేషాలు లెక్కించకుండా సన్నద్ధతను కొనసాగించాలి.
గ్రూప్‌-2 పేపర్‌-2
గతంలో మాదిరిగానే ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర, భారత రాజ్యాంగం అనే రెండు భాగాలు ఉన్నాయి. ఒక్కో విభాగానికి 75 మార్కులు కేటాయించారు.
ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో మార్పులు...
* ఆంధ్ర జాతి, ఆంధ్రదేశ కోణాల్లో చారిత్రక అంశాల అధ్యయనం
* ఆంధ్ర భూభాగం భౌగోళిక అంశాలు చారిత్రక, సాంస్కృతిక అంశాల కోణంలో ఏవిధంగా ప్రభావం చూపాయి?
* మార్పులకు పూర్వం ఉన్న ‘ఆంధ్ర’ చారిత్రక నేపథ్యం
* తెలుగు భాషాసాహిత్యం, వాస్తు, కళ, చిత్రలేఖనం మొదలైనవి 11 నుంచి 15 శతాబ్దాల మధ్య ఎలా పరిణామం చెందాయి అనే అంశాలను స్పష్టంగా సిలబస్‌లో పేర్కొన్నారు. కుతుబ్‌షాహీలు ఆంధ్ర చారిత్రక, సాంస్కృతిక పరంగా ఏయే అంశాలకు మద్దతు ఇచ్చారో అధ్యయనం చేయాల్సివుంటుంది.
* గత సిలబస్‌తో పోల్చినపుడు ‘యూరోపియన్స్‌ రాక, 1857 తిరుగుబాటు- ఆంధ్రదేశంపై ప్రభావం, సాంస్కృతిక పునరుజ్జీవం, 1885-1947 మధ్య జాతీయ ఉద్యమం ఆంధ్రప్రదేశ్‌పై చూపిన ప్రభావం... లోతుగా చదివేలా సిలబస్‌ రూపకల్పన జరిగింది.
* తెలంగాణ భూభాగంలో జరిగిన చారిత్రక అంశాలు, నిజాం కాలంనాటి సంఘటనలు, వారి రాజకీయ చరిత్ర చదవనక్కర్లేదు. అయితే అసఫ్‌జాహీ రాజ్యంలో జరిగిన సాంఘిక సాంస్కృతిక చైతన్యం ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌ 1956లో ఏర్పడినప్పటినుంచి 2014 వరకూ జరిగిన ఘటనలు లోతుగా అధ్యయనం చేసే పరిస్థితిని సిలబస్‌లో ఏర్పరిచారు.
సాంఘిక సాంస్కృతిక కోణంలో చారిత్రక నేపథ్యాన్ని చదవాలనే ధోరణి సిలబస్‌లో కనిపిస్తోంది. రాజకీయ చారిత్రక నేపథ్యం భారం తగ్గింది. కాకతీయ, విజయనగర చారిత్రక అంశాలను ఇదే కోణంలో చదవాలి.
రాజ్యాంగం (పేపర్‌ 2- రెండో భాగం)
కొత్త సిలబస్‌లో ప్రతి అంశాన్నీ వివరణాత్మకంగా ఇవ్వటంతో చదవాల్సిన అంశాల పరిధి పెరిగింది.
ఉభయ తారకం
* రాష్ట్ర విభజన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులూ రెండు రాష్ట్రాల్లోనూ పోటీ పరీక్షలకు హాజరు కావొచ్చు. ఎంపిక కావచ్చు. ఉద్యోగ క్యాడర్‌ను బట్టి 20 శాతం నుంచి 40 శాతం ఉద్యోగాలకు రాష్ట్రానికి చెందినవారినీ, చెందనివారినీ కలిపి పరిగణనలోకి తీసుకుని అంతిమ ర్యాంకింగ్‌ నిర్ణయిస్తారు.
* గ్రూప్‌-2లో వెయ్యికి పైగా పోస్టులు ఉన్న నేపథ్యంలో గ్రూప్‌-1 2012 నోటిఫికేషన్‌పై కోర్టు కేసు ఉన్న పరిస్థితిలో గ్రూప్‌-2కు సంసిద్ధమవటం సముచితం.
* గ్రూప్‌-1, 2 రెండిటినీ అనుసంధానం చేసుకుంటూ (ఇంటిగ్రేట్‌) తయారయ్యే పద్ధతికి కూడా ఇది అనువైన సమయం. మొదట గ్రూప్‌-2 పూర్తిచేసుకుని తర్వాత గ్రూప్‌-1పై దృష్టిపెడితే బహుజనరల్‌స్టడీస్‌ముఖ ప్రయోజనాలు ఉంటాయి.
* రాజ్యాంగ పరిణామం * రెండో కేంద్ర రాష్ట్ర సంబంధాల కమిటీ (పూంఛ్‌ కమిటీ) * శ్రీకృష్ణ కమిటీ * నీతి అయోగ్‌ ఏర్పాటు * భారత రాజకీయ పార్టీలు, ప్రాంతీయ తత్వం, ఉప ప్రాంతీయ తత్వం, నూతన రాష్ట్రాల డిమాండ్‌, భారత జాతీయ సమైక్యత, ఏకతకు సవాళ్ళు * సమాచార హక్కు * లోక్‌పాల్‌- లోకాయుక్త-న్యాయవ్యవస్థ క్రియాశీలత మొదలైన కొత్త అంశాలను అదనంగా ఈ విభాగంలో చేర్చారు.
కేంద్ర రాష్ట్ర వ్యవస్థల నిర్మాణాంశాలు, వాటి మధ్య సంబంధాలు- సంఘర్షణలు ప్రధానంగా ఉండేలా సిలబస్‌ రూపకల్పన జరిగినట్లు కన్పిస్తోంది. రాజ్యాంగ సంస్థలైన యూపీఎస్‌సీ, సీఏజీ అధికారాల-విధుల గురించి చదవాలని స్పష్టంగా చెప్పడం గమనించాలి. తెలుగు అకాడమీ ప్రచురణల ఆధారంగా కొత్త అంశాలనూ, సమాచారాన్నీ ప్రామాణిక వెబ్‌సైట్‌ల నుంచి, విశ్వవిద్యాలయ పుస్తకాల నుంచి సేకరించుకోవాలి.
ఆర్థిక వ్యవస్థ (గ్రూప్‌-2 పేపర్‌ 3)
గతంలో మాదిరిగానే ఈ పేపర్లో రెండు విభాగాలు కొనసాగించారు- భారత ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక అభివృద్ధి, సమకాలీన సమస్యలు. ఒక్కో విభాగానికి 75 మార్కుల చొప్పున మొత్తం 150 మార్కులకు పేపర్‌ను ప్రతిపాదించారు.
* మొదటి ప్రణాళిక నుంచి ప్రస్తుత వికేంద్రీకృత ప్రణాళికా వ్యవస్థ వరకూ అనుసరించిన వ్యూహాలు, ప్రత్యామ్నాయాలు, వైఫల్య కారణాలు, ఆర్థిక సంస్కరణలకు ముందు, తర్వాత అనే నిర్దేశనంలో ప్రణాళికల గురించి చదవాలి.
* ఆర్థిక విధానాలు కింద వ్యవసాయ, పారిశ్రామిక, ద్రవ్య విత్త, విదేశీ వ్యాపార విధానాలను ప్రస్తావించారు. చాలా విశాల పరిధి ఉన్న ఈ అంశాలపై ఆబ్జెక్టివ్‌ ధోరణిలో పట్టుసాధించాల్సిరావడం కాస్త శ్రమతో కూడిన పనే. అయినా మార్కులు గణనీయంగా పొందే అవకాశం ఉంది.
* సహజ వనరులు - అభివృద్ధి అనే పేరులో జనాభా, మానవవనరుల అభివృద్ధి, మానవ అభివృద్ధి సూచిక, మానవ శ్రామిక పంపిణీ అనే అంశాలను చేర్చి సిలబస్‌ను క్రమబద్ధీకరించటం అభ్యర్థుల శ్రమను తగ్గించే ప్రయత్నం. గతంలో ఇదే అధ్యాయంలో ఉన్న జోక్యరహిత విధానం లాంటి అంశాలను తొలగించారు.
* ద్రవ్యం, బ్యాంకింగ్‌-ఫైనాన్స్‌ చాప్టర్లో గతంలో ఉన్న సైద్ధాంతిక అంశాలను క్రమబద్ధీకరించారు. నేరుగా, సరళంగా ద్రవ్యం, బ్యాంకింగ్‌, పన్నులు, పన్నేతర ఆదాయం మొదలైనవి పేర్కొనటం వల్ల సైన్స్‌ అభ్యర్థులు కూడా పట్టు సాధించే పరిస్థితి ఏర్పరిచారు.
రెండో విభాగంలో..
* ఏపీలో వ్యవసాయ ఉత్పత్తుల తీరు, కనీస మద్దతు ధర, సేకరణ ధర, జీవ సాంకేతికత- ఆర్థిక వ్యవస్థ లాంటి అంశాలను తొలగించారు.
* వివిధ అధ్యాయాల్లోని ఉప అంశాలను ఒక అధ్యాయం నుంచి మరొక అధ్యాయానికి మార్చటం తప్ప పెద్ద మార్పులు లేవు.
* 23 జిల్లాల గణాంకాల ఆధారంగా వివిధ ఆర్థిక అంశాల అధ్యయనం గతం. ఆ స్థానంలో ప్రస్తుతం 13 జిల్లాల ఆధారిత ఆర్థిక గణాంక వ్యవస్థను అధ్యయనం చేయటం ఒకరకంగా అభ్యర్థిని శ్రమింపజేసే విషయం. కాబట్టి ఆ కోణంలో సన్నద్ధత దృఢపడాలి.
ఈ తరహా పునర్నిర్మాణం జరిగిన పుస్తకాల లభ్యత అంతంతమాత్రం కాబట్టి దినపత్రికలు, ప్రభుత్వ వెబ్‌సైట్లు, ఆర్థిక సర్వే, బడ్జెట్‌ మొదలైన వనరుల సద్వినియోగం ముఖ్యం. నవ్యాంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత రాష్ట్రప్రభుత్వ కొత్త విధానాలు, పథకాలపై పట్టు సాధించాలి.
జనరల్‌స్టడీస్‌
గతంలో ఉన్న జనరల్‌స్టడీస్‌కు అదనంగా విపత్తునిర్వహణలో భాగంగా విపత్తు అంచనా కోసం రిమోట్‌ సెన్సింగ్‌, జీఐఎస్‌ను ఉపయోగించుకునే ఒకే అంశాన్ని చేర్చారు. సాధారణంగా మార్కెట్లో దొరికే పుస్తకాల్లో విస్తృత సమాచారం ఉంటుంది. అయితే సిలబస్‌లో వచ్చిన మార్పుల్ని క్షుణ్ణంగా గమనిస్తే కింద విషయాలను పరిగణనలోకి తీసుకుని చదవటం వల్ల శ్రమ తగ్గుతుంది.
1. ఎప్పుడూ జీఎస్‌లో అంతర్భాగంగా ఉండే జనరల్‌సైన్స్‌ను తొలగించారు. వర్తమాన కాలంలో శాస్త్ర సాంకేతిక విషయాల్లో, ప్రత్యేకంగా సమాచార సాంకేతికతలోని అభివృద్ధి విషయాలను మాత్రమే ప్రస్తావించారు. అందువల్ల రసాయన, వృక్ష, జంతు, భౌతిక శాస్త్ర అంశాల సైద్ధాంతిక విషయాలు చదవాల్సిన అవసరం లేదు.
2. గ్రూప్‌-2 జీఎస్‌లో మాత్రం ఆధునిక భారతదేశా నికి సంబంధించిన సాంఘిక ఆర్థిక రాజకీయ అంశాలు మాత్రమే ప్రస్తావించారు. అయితే గ్రూప్‌-1 ప్రిలిమినరీ (జీఎస్‌)లో ప్రాచీన, మధ్యయుగ చరిత్రల ప్రస్తావన ఉంది. ఏపరీక్షకు సిద్ధమవుతున్నారో అందుకు అనుగుణంగా పరిధిని నిర్ణయించుకుని చదవాలి.
3. పాలిటీ కింద రాజ్యాంగ అంశాలు మాత్రమే చది వితే సరిపోదు. విధాన తయారీ, అమలుతో పాటు పరిపాలనా సంస్కరణలు, ఈ-గవర్నెన్స్‌ విషయాలు ప్రధానంగా ఉన్నాయి. ఈ అదనపు సిలబస్‌ను సాంప్రదాయిక పాలిటీలో చదవటం ఉండదు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి.
4. గ్రూప్‌-1 ప్రిలిమినరీలో ‘పర్యావరణ క్షీణత, సవాళ్ళు’ అనే చాప్టర్‌ను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆర్థిక సంస్కరణల అనంతరం ఏర్పడిన సంతులిత అభివృద్ధి సవాళ్ళను కూడా ప్రత్యేకంగా చదవాల్సివుంటుంది.
5. ప్రత్యేకంగా అంకగణిత సమస్యలు సాధన చేయాల్సిన విభాగాన్ని కూడా తొలగించారు. రీజనింగ్‌ సమస్యలతో పాటు డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ సాధన చేయాలి.
6. గ్రూప్‌-2 జీఎస్‌లో భారత ఉపఖండ భౌగోళిక అంశాలు మాత్రమే ప్రస్తావించారు. అందువల్ల ప్రత్యేకంగా ప్రపంచ భౌగోళిక అంశాలకు సమయం కేటాయించాల్సిన అవసరం ఉంది. గ్రూప్‌-1 ప్రిలిమినరీలో మాత్రం ప్రపంచ, భారతదేశ, ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక అంశాలు సిలబస్‌ పరిధిలో ఉన్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
7. జీకే లాంటి అంశాలను తొలగించారు. అయితే జాతీయ అంతర్జాతీయ ప్రాధాన్య అంశాల పేరుతో ప్రపంచయుద్ధాలు, ప్రధాన సదస్సులు, ఇతర కీలక ఘట్టాలు ప్రధానంగా గత 65 సంవత్సరాల్లో జరిగిన విషయాలు చదవాల్సిన అవసరం ఉంటుంది.
8. భౌగోళిక అంశాలను పాఠశాల స్థాయి పుస్తకాల ఆధారంగా చదవడం ఉత్తమం. చరిత్ర, పాలిటీ అంశాలను తెలుగు అకాడమీ పుస్తకాల ఆధారంగా అధ్యయనం చేయాలి.
9. శాస్త్ర సాంకేతిక విషయాలు, విపత్తు నిర్వహణ అంశాలు, పర్యావరణ సంబంధిత విషయాలు వర్తమాన ఆధారంగా చదివితే సరిపోతుంది.
10. వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాలు ప్రణా ళిక యుగంలో, ఆర్థిక సంస్కరణల, సహకార సమాఖ్య కాలంలో ఏ విభాగం అభివృద్ధి జరిగిందో పరిశీలించేందుకు అకాడమీ పుస్తకాలతో పాటు ప్రభుత్వ విధానాలు, పథకాలు చదవాల్సివుంటుంది.
గ్రూప్‌-1 ప్రిలిమినరీ, గ్రూప్‌-2, ఇతర పరీక్షల్లో జనరల్‌స్టడీస్‌ పరిధి ఒకే రకంగా ఉంది. కాబట్టి కొత్త అభ్యర్థులు సైతం ఈ పేపర్‌పై మొదట పట్టు సాధించడం ద్వారా ఉద్యోగ సాధనలో మొదటి అడుగు వెయ్యాలి.

posted on 08.03.2016

Back..