Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
యాప్‌ తయారు చేద్దాం పదండి..!

స్మార్ట్‌ యుగంలో ప్రతి చిన్న విషయానికి ఏదో ఒక ‘యాప్‌’ మీద ఆధారపడటం తప్పనిసరై పోయింది. బ్యాంకింగ్‌, దుస్తులు, యోగా, హోటల్‌, రెస్టారెంట్‌ భోజనం, చివరికి నిత్య జీవితానికి కావాల్సిన సరకుల షాపింగ్‌ సహా ప్రతి చిన్న పనీ వేలికొనల మీదే పూర్తవుతోంది.ప్రతి వ్యాపారంలో యాప్స్‌ సృష్టించడం వల్ల కలిగిన సౌకర్యం ఇది. అనతికాలంలోనే ఇంత ప్రాధాన్యం సంతరించుకున్న యాప్‌ రంగంలో స్థిరపడాలనుకునే వారు ఏయే కోర్సులు నేర్చుకుంటే ఉపయుక్తంగా ఉంటుందో చూద్దాం..

మన దేశంలో స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌ వేగంగా విస్తరిస్తుండటంతో కొత్త కొత్త కంప్యూటర్‌ శిక్షణా కోర్సులకు యువతలో క్రేజ్‌ ఏర్పడింది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌, ముంబయి, న్యూదిల్లీ నగరాల్లో ఈ ధోరణి బాగా కనిపిస్తోంది.
* దక్షిణ భారతదేశంలోని యువత జావా, జే2ఈఈ, .నెట్‌ లాంటి సంప్రదాయ కంప్యూటర్‌ కోర్సులపై ఆసక్తి చూపుతున్నారు. ఉత్తర భారతంలోని విద్యార్థులు మాత్రం ఆండ్రాయిడ్‌ అప్లికేషన్‌ ట్రయినింగ్‌, వెబ్‌ డిజైనింగ్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు దాదాపు అన్ని స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీలు వెబ్‌ బ్రౌజర్‌, క్యాలెండర్‌, మ్యాపింగ్‌, మ్యూజిక్‌ లేదా ఇతర యాప్స్‌ కొనుగోలుకు వీలు కల్పించే యాప్స్‌ను ముందే ఇన్‌స్టాల్‌ చేసి విక్రయిస్తున్నాయి. వీటన్నింటి వెనుక మొబైల్‌ యాప్‌ డెవలపర్ల పాత్ర ఎనలేనిది.
* ఎక్కువ కంపెనీలు ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌లో సర్టిఫికేట్‌తో పాటు ఏదైనా డిగ్రీ చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. కంప్యూటర్‌ సైన్స్‌లో డిగ్రీ చేయకపోయినా ఎంచుకున్న కెరియర్‌ని బట్టి (ప్రోగ్రామర్‌ లేదా డెవలపర్‌) ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌లో ప్రావీణ్యం తప్పనిసరి. ఆండ్రాయిడ్‌, ఆపిల్‌, విండోస్‌, సింబియాన్‌, ఆర్‌ఐఎం మొదలైన వాటికి యాప్‌ని రూపొందించాలంటే జావాస్క్రిప్ట్‌, హెచ్‌టీఎంఎల్‌, సీఎస్‌ఎస్‌తో పాటు పీహెచ్‌పీ లాంగ్వేజ్‌లు తెలిసి ఉండాలి.

సీ : ఇది ఇతర లాంగ్వేజ్‌లకు పునాది లాంటిది. అత్యంత ప్రాథమికమైంది కూడా. ఇందులో ప్రాథమిక సూత్రాలు నేర్చుకోవడంతో పాటు హార్డ్‌వేర్‌కు అనుబంధంగా ‘సీ’ లాంగ్వేజ్‌లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటున్నాయో నిరంతరం గమనిస్తూ ఉండాలి. అప్పుడే డీబగ్గింగ్‌, మెమరీ మేనేజ్‌మెంట్‌, సమర్థవంతమైన కోడింగ్‌ రాయడంలో నైపుణ్యం అలవడుతుంది.

జావా : ప్రోగ్రామింగ్‌లో విస్తృతంగా వినియోగిస్తున్న రెండో లాంగ్వేజ్‌ ఇది. సీ++, పెర్ల్‌, పైతాన్‌, పీహెచ్‌పీలో అవసరమయ్యే ఆబ్జెక్ట్‌ ఓరియెంటెడ్‌ ప్రిన్సిపుల్స్‌ (పీవోపీ) రూపకల్పనలో ఉపయోగపడుతుంది.

పైతాన్‌ : చాలా తేలికగా నేర్చుకోగల, కాస్త తమాషాగా ఉండే ఈ లాంగ్వేజ్‌ అద్భుతమైంది. మిగతావాటితో పోలిస్తే ఇందులో ప్రోగ్రామింగ్‌రాయడానికి పట్టే సమయం తక్కువ. తక్కువ లైన్లలోనే పూర్తవుతుంది కూడా. కొద్దిపాటి కాన్సెప్టులు నేర్చుకుంటే చాలు. ప్రాథమిక స్థాయిలో ఉన్న వారు ఈ లాంగ్వేజ్‌ను వేగంగా నేర్చుకోగలరు.

జావాస్క్రిప్ట్‌ : ఇది చాలా మెరుగైన ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌. కానీ చాలా తేలికగా ఉంటుంది. బ్రౌజర్లలో చాలా వరకు జావాస్క్రిప్ట్‌లో రూపొందినవి కావడం వల్ల తక్కువ సమయంలోనే ఇందులో ప్రావీణ్యం సాధించవచ్చు.

ఏం నేర్చుకోవాలి..?
ఈ లాంగ్వేజ్‌లన్నీ చాలా ప్రాథమికమైనవి. తప్పనిసరిగా నేర్చుకోవాల్సినవి కూడా. మొబైల్‌ అప్లికేషన్‌ డెవలపర్‌ అవ్వాలన్నా, ఈ రంగంలో అడుగుపెట్టాలన్నా వివిధ లాంగ్వేజ్‌లలో ప్రావీణ్యం సంపాదించాలి. వీటితో పాటు మీ ఆసక్తి, ఎంచుకున్న ఉద్యోగాన్ని బట్టి హెచ్‌టీఎంఎల్‌, ఓపెన్‌జీఎల్‌, యానిమేషన్‌, .నెట్‌ కూడా నేర్చుకోవచ్చు.

బ్యాక్‌-ఎండ్‌/ సర్వర్‌-సైడ్‌ ప్రోగ్రామర్‌: దీని కోసం పైతాన్‌, రూబీ, పీహెచ్‌పీ, జావా లేదా .నెట్‌ నేర్చుకోవాలి. డేటాబేస్‌, సిస్టమ్‌ అడ్మినిస్ట్రేషన్‌ మీద అవగాహన కలిగి ఉంటే ఇంకా మంచిది.

ఫ్రంట్‌-ఎండ్‌ /క్లయింట్‌-సైడ్‌ ప్రోగ్రామర్‌: హెచ్‌టీఎంఎల్‌, సీఎస్‌ఎస్‌, జావా స్క్రిప్ట్‌తో పాటు కొన్ని డిజైనింగ్‌ స్కిల్స్‌ అవసరం.

మొబైల్‌ ప్రోగ్రామర్‌: మొబైల్‌ వెబ్‌ సైట్స్‌ అభివృద్ధి చేయాలంటే సీ లేదా జావా (ఆండ్రాయిడ్‌ కోసం), హెచ్‌టీఎంఎల్‌ లేదా సీఎస్‌ఎస్‌తో పాటు సర్వర్‌కు సంబంధించిన పరిజ్ఞానం ఉండాలి.

త్రీడీ ప్రోగ్రామర్‌/ గేమ్‌ ప్రోగ్రామర్‌: సీ లేదా సీ++, ఓపెన్‌జీఎల్‌, యానిమేషన్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌తో పాటు కళాత్మక దృష్టి ఉంటే గేమ్స్‌ ప్రోగ్రామర్‌గా స్థిరపడవచ్చు.
హై పర్ఫార్మెన్స్‌ ప్రోగ్రామర్‌: దీనికి కూడా సీ లేదా సీ++, జావా నేర్చుకోవాలి. అలాగే మ్యాథమెటిక్స్‌, క్వాంటిటేటివ్‌ అనాలసిస్‌లో మంచి పట్టు ఉండాలి.

భవిష్యత్‌ ఏమిటి..?
మొబైల్‌ ఫోన్ల ఆధునీకీకరణ మొదలై దాదాపు ఎనిమిదేళ్లవుతోంది. జీవితంలో స్థిరపడాలని కోరుకునే వారు యాప్స్‌ రంగాన్ని ఎంచుకోవడానికి ఇది సరైన సమయం. నాణ్యమైన, సక్రమంగా పనిచేసే యాప్స్‌కి ఎప్పుడూ ఆదరణ లభిస్తూనే ఉంటుంది. యాప్స్‌ని అభివృద్ధి చేసిన కంపెనీలు ఎప్పటికప్పుడు వినియోగదారులకు అందుబాటులో ఉంటూ దానిలోని లోపాలను సవరించి మరింత మెరుగ్గా రూపొందించడానికి కృషి చేస్తున్నాయి. అందువల్ల కనీసం పదేళ్ల వరకు ఇందులో కెరియర్‌ ఉజ్వలంగా ఉండబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.


Back..

Posted on 15-10-2016