తెగువ చూపే మహిళల కోసం రక్షణ దళాలు ఎదురు చూస్తున్నాయి. చిన్నా చితకా ఉద్యోగాల్లోకి కాదు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ అన్నింటిలోనూ నవతరం యువతుల కోసం వైట్ కాలర్ ఉద్యోగాలెన్నో ఉన్నాయి. త్రివిధ దళాల్లోనే కాదు పారా మిలటరీలోనూ పేరున్న పోస్టులున్నాయి.
యూపీఎస్సీ నిర్వహించే సీడీఎస్ఈ, అసిస్ట్టెంట్ కమాండెంట్స్ (ఏసీ) పరీక్షలతోపాటు ఎయిర్‌ఫోర్స్ ఏఎఫ్ క్యాట్, ఆర్మీ, నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ ఉమెన్ ఎంట్రీ... ఇలా ఎన్నో ప్రవేశమార్గాల ద్వారా అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు.
డిఫెన్స్ ఉద్యోగాల్లో మహిళలు చేరడానికి చాలా మార్గాలున్నాయి. అయితే ఇవన్నీ షార్ట్ సర్వీస్ కమిషన్ పోస్టులే. గరిష్ఠంగా 14 ఏళ్లు మాత్రమే కొనసాగే వీలుంది. వీరిని శాశ్వత ఉద్యోగాల్లోకి (పర్మనెంట్ కమిషన్) తీసుకోవాలనే వినతి పరిశీలనలో ఉంది. మిలిటరీ అనుభవంతో బయట ఉద్యోగాలెన్నో వీరు పొందవచ్చు.
యూపీఎస్సీ నిర్వహించే సీడీఎస్ఈ, సీఏపీఎఫ్ ఏసీ ఉద్యోగాల ద్వారా మిలటరీ, పారా మిలటరీ కొలువుల్లో చేరవచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏటా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్)ల్లో కానిస్టేబుల్ పోస్టులకు ప్రకటన విడుదల చేస్తోంది. ఏఎస్ఐ, ఎస్ఐ పోస్టులనూ ఏటా ఎస్ఎస్సీ భర్తీ చేస్తోంది. వీటిలో స్త్రీల కోసమే కొన్ని పోస్టులున్నాయి. వీటిలో పదవీ విరమణ వరకు కొనసాగవచ్చు. ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ, నేవీలు విడిగా పరీక్షలు నిర్వహించి మహిళలను నియమించుకుంటున్నాయి.
ఆర్మీలో అవకాశం లభిస్తే లెఫ్టినెంట్, నేవీలో అయితే సబ్ లెఫ్టినెంట్, ఎయిర్ ఫోర్స్‌లో ఫ్లయింగ్ ఆఫీసర్ హోదాలు లభిస్తాయి. శిక్షణలో ఉన్నప్పుడే రూ.56,100 స్టయిపెండ్ చెల్లిస్తారు. అనంతరం ఇదే మొత్తం మూలవేతనంగా లభిస్తుంది. దీనికి డీఏ, హెచ్ఆర్ఏ అదనం. ఏ విభాగంలో చేరినప్పటికీ రూ.15,500 మిలటరీ సర్వీస్ పే (ఎంఎస్పీ) ప్రతి నెలా అందుతుంది. ఎయిర్ ఫోర్స్‌లో పైలట్లకు ప్రతినెలా రూ. 25,000 ఫ్లయింగ్ అలవెన్సు చెల్లిస్తారు. ఇంజినీర్లకు సైతం ట్రేడ్ అలవెన్సులు ఉంటాయి. ఈ తరహా ప్రోత్సాహకాల కారణంగా మొదటి నెల నుంచే రూ. లక్షకుపైగా వేతనరూపంలో అందుకోవడం సాధ్యమే. ఆర్మీలో ఆఫీసర్‌గా విధుల్లోకి చేరినవారు రెండేళ్ల సర్వీస్‌తో కెప్టెన్, ఆరేళ్ల సర్వీస్ పూర్తిచేసుకుంటే మేజర్, 13 ఏళ్ల సర్వీస్‌తో లెఫ్టినెంట్ కల్నల్ హోదాకి చేరుకోవచ్చు. నేవీ, ఎయిర్ ఫోర్స్లోనూ ఇదేవిధంగా పదోన్నతులు లభిస్తాయి. పదో తరగతి, సాధారణ డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ...ఇలా పలు విద్యార్హతలతో పోస్టులు దక్కించుకోవచ్చు.
ఆర్మీలో...
గ్రాడ్యుయేట్ యూపీఎస్సీ, గ్రాడ్యుయేట్ నాన్ యూపీఎస్సీ, గ్రాడ్యుయేట్ టెక్ ఎంట్రీ విధానాల్లో పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ విభాగాల్లో పోస్టులకు ప్రకటనలు ఏడాదికి రెండుసార్లు వెలువడుతున్నాయి. ఎంపికైనవారికి ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ చెన్నైలో 49 వారాలపాటు శిక్షణ నిర్వహిస్తారు. అనంతరం లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. అవివాహిత మహిళలు అర్హులు. పరీక్ష, ఫిజికల్ టెస్టులు, ఇంటర్వ్యూల ద్వారా నియామకాలు చేపడతారు.
గ్రాడ్యుయేట్ యూపీఎస్సీ: సీడీఎస్‌ఈతో ఈ పోస్టులు భర్తీ చేస్తారు. ఏడాదికి రెండుసార్లు వెలువడే ఈ ప్రకటనకు ఏదైనా డిగ్రీ కోర్సు పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 19 - 25 ఏళ్లలోపు ఉండాలి.
గ్రాడ్యుయేట్ నాన్ యూపీఎస్సీ: ఎన్సీసీ స్పెషల్, జాగ్ల ద్వారా భర్తీ చేస్తారు.
ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ: డిగ్రీలో 50 శాతం మార్కులు ఉండాలి. ఎన్సీసీ సీనియర్ డివిజన్ ఆర్మీలో రెండేళ్ల అనుభవం, సి సర్టిఫికెట్ పరీక్షలో కనీసం బి గ్రేడ్ తప్పనిసరి. 152 సెం.మీ. ఎత్తు ఉండాలి.
మిలటరీ నర్సింగ్ సర్వీస్: ఎమ్మెస్సీ లేదా బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేసినవాళ్లు ఇందులో చేరవచ్చు. ఈ విధానంలో ఎంపికైనవారికి లెఫ్టినెంట్ హోదా కేటాయిస్తారు. వంద మార్కులకు నిర్వహించే రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేపడతారు. (ఖాళీలు ఉన్నప్పుడు ఈ ప్రకటన వెలువడుతుంది)
నేవీలో...
ఏటీసీ, అబ్జర్వర్, లా, లాజిస్టిక్స్, ఎడ్యుకేషన్, నేవల్ ఆర్కిటెక్చర్, పైలట్ (మేరీటైమ్ రికనయిసెన్స్ స్ట్రీమ్), నేవల్ ఆర్మమెంట్ ఇన్స్పెక్టరేట్ పోస్టులకు మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు.
నేవల్ ఆర్కిటెక్చర్: మెకానికల్ / సివిల్/ ఏరోనాటికల్/ మెటలర్జీ/ నేవల్ ఆర్కిటెక్చర్ విభాగాల్లో బీఈ/ బీటెక్ పూర్తిచేసినవారు 19 1/2 - 25 ఏళ్లలోపు ఉంటే ఈ పోస్టులకు అర్హులు. అబ్జర్వర్: బీఈ/ బీటెక్ ఉత్తీర్ణులు అర్హులు. 19 - 24 ఏళ్లలోపు ఉండాలి.
ఎడ్యుకేషన్ విభాగం: ద్వితీయ శ్రేణితో పీజీలో నిర్దేశిత సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించాలి. యూజీలోనూ కొన్ని సబ్జెక్టులు చదివుండాలి. లేదా నిర్దేశిత బ్రాంచిలో ఇంజినీరింగ్ పూర్తిచేయాలి. 21 - 25 ఏళ్లలోపు ఉండాలి.
* లాజిస్టిక్స్ పోస్టులకు బీటెక్ / ఎంబీఏ / ఎంసీఏ / ఎమ్మెస్సీ (ఐటీ) లో ప్రథమ శ్రేణి ఉత్తీర్ణులు అర్హులు. వర్క్స్ విభాగానికి బీటెక్ (సివిల్) లేదా బీఆర్క్ వారు అర్హులు.
* క్యాటరింగ్ పోస్టులకు హోటల్ మేనేజ్మెంట్లో ఎమ్మెస్సీ/ ఎంబీఏ లేదా ప్రథమ శ్రేణితో పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తిచేసినవారు అర్హులు. 19 1/2 - 25 ఏళ్లలోపు ఉండాలి.
* జడ్జ్ అడ్వొకేట్ జనరల్ లేదా లా ఆఫీసర్ పోస్టులకు ఎల్ఎల్బీ, 22 - 27 ఏళ్లలోపు ఉండాలి.
* ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) ఖాళీలకు ఇంజినీరింగ్ ఉత్తీర్ణత, వయసు 19 1/2 - 25 ఏళ్లలోపు ఉండాలి.
* పైలట్ జనరల్ పోస్టులకు ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు అర్హులు. 19 - 24 ఏళ్లలోపు ఉండాలి.బీ నేవల్ ఆర్మమెంట్ ఇన్స్పెక్టరేట్ (ఎన్ఏఐ) విభాగానికి ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ మెకానికల్/ ప్రొడక్షన్/ ఇన్స్ట్రుమెంటేషన్/ ఐటీ/ కెమికల్/ మెటలర్జీ/ ఏరోస్పేస్లో ఇంజినీరింగ్ చదివినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 19 1/2 - 25 ఏళ్లలోపు ఉండాలి.
ఎయిర్ ఫోర్స్‌లో...
ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్, నాన్ టెక్నికల్), ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ (ఫ్లయింగ్) ఖాళీల భర్తీకి వైమానిక దళం జూన్, డిసెంబరుల్లో ఏఎఫ్ క్యాట్ ప్రకటన విడుదల చేస్తుంది. వీటిలో ఎస్సెస్సీ ఉద్యోగాలకు మహిళలు అర్హులు.
ఫ్లయింగ్ బ్రాంచ్: 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇంటర్ / ప్లస్ 2 లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివుండడం తప్పనిసరి. 20 నుంచి 24 ఏళ్లలోపు ఉండాలి. ఎత్తు కనీసం 162.5 సెం.మీ ఉండాలి. దృష్టి దోషం ఉండరాదు.
ఏరోనాటికల్ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్): 60 శాతం మార్కులతో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రికల్ లేదా కమ్యూనికేషన్స్ లేదా కంప్యూటర్ సైన్స్...లో బీటెక్/ బీఈ పూర్తిచేసినవాళ్లు అర్హులు. ఇంటర్లో ఫిజిక్స్, మ్యాథ్స్‌ల్లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
ఏరోనాటికల్ ఇంజినీర్ (మెకానికల్): 60 శాతం మార్కులతో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ లేదా ఏరోస్పేస్ లేదా ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనన్స్ లేదా మెకానికల్ లేదా ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్- వీటిలో ఏ విభాగంలోనైనా బీటెక్/ బీఈ పూర్తిచేసినవారు అర్హులు. ఇంటర్/+2లో ఫిజిక్స్, మ్యాథ్స్ ల్లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
గ్రౌండ్ డ్యూటీ - నాన్ టెక్నికల్ బ్రాంచ్
ఇందులో అడ్మినిస్ట్రేషన్ అండ్ లాజిస్టిక్స్, అకౌంట్స్, ఎడ్యుకేషన్ విభాగాలున్నాయి.
అడ్మినిస్ట్రేషన్ అండ్ లాజిస్టిక్స్: కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అకౌంట్స్: 60 శాతం మార్కులతో బీకాం పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రౌండ్ డ్యూటీలోని టెక్నికల్, నాన్ టెక్నికల్ అన్నిపోస్టులకు 20 నుంచి 26 ఏళ్లలోపు వయసువారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎత్తు 152 సెం.మీ. ఉండాలి.
ఎన్ సీసీ స్పెషల్ ఎంట్రీ: ఈ విభాగానికి ఎన్ సీసీ సీనియర్ డివిజన్ సి సర్టిఫికెట్ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీతోపాటు 10+2 లో మ్యాథ్స్, ఫిజిక్స్ ల్లోనూ 60 శాతం ఉండాలి.
మెటీరియాలజీ బ్రాంచ్: ఈ ఉద్యోగాలను ఏఎఫ్ క్యాట్ తో కాకుండా ప్రత్యేకంగా భర్తీ చేస్తారు. ఏదైనా సైన్స్ స్ట్రీమ్‌లో 50 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులు అర్హులు. డిగ్రీ స్థాయిలో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. వయసు 20 - 26 ఏళ్లలోపు ఉండాలి.
సీఏపీఎఫ్‌ల్లో....
బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీఎఫ్, ఎస్ఎస్బీ, ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్‌లో కానిస్టేబుల్ పోస్టులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏటా ప్రకటన విడుదలచేస్తుంది. అలాగే వీటిలో కొన్ని విభాగాలతోపాటు దిల్లీ పోలీస్‌లో ఎస్సై, సీఐఎస్ఎఫ్లో ఏఎస్సై ఖాళీల భర్తీకి ఉమ్మడి ప్రకటన ఏటా వెలువడుతోంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్/ పర్సనాలిటీ టెస్టు, మెడికల్ పరీక్ష ద్వారా నియామకాలు చేపడతారు.
కానిస్టేబుల్ (జీడీ): పదో తరగతి ఉత్తీర్ణులు పరీక్ష రాసుకోవచ్చు. వయసు 18-23, ఎత్తు 157 సెం.మీ. ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనవారికి రూ.21,700 మూలవేతనం చెల్లిస్తారు. దీనికి డీఏ, హెచ్ఆర్ఏ... ఉంటాయి.
ఎస్ఐ, ఏఎస్ఐ: డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు 25 ఏళ్లలోపు వయసువారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్ఐ పోస్టులకు ఎంపికైనవారికి రూ.35,400 మూలవేతనం అందుతుంది. ఏఎస్ఐలకు రూ.29,200 చెల్లిస్తారు.
యూపీఎస్సీ
అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి యూపీఎస్సీ ఏటా ప్రకటన విడుదల చేస్తుంది. ఏసీపీ / డీఎస్పీ లతో సమాన హోదా అసిస్టెంట్ కమాండెంట్లకు ఉంటుంది. డిగ్రీ అర్హతతో పాతికేళ్లలోపు వయసు వారు ఈ ఉద్యోగానికి ప్రయత్నించవచ్చు. రాతపరీక్ష, ఫిజికల్ టెస్టు, ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభ ద్వారా నియామకాలు చేపడతారు. ఇది గ్రూప్ ఎ గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగం. ఈ పరీక్ష ద్వారా ఎంపికైన వారికి ఏడాది పాటు శిక్షణ నిర్వహిస్తారు. శిక్షణ అనంతరం బీఎస్ఎఫ్, సీఆర్ పీఎఫ్, సీఐఎస్ ఎఫ్, ఐటీబీపీ, ఎస్ ఎస్ బీ లో ఎందులోనైనా అసిప్టెంట్ కమాండెంట్ గా విధులు నిర్వర్తిస్తారు. వీరికి రూ.56,100 మూలవేతనం చెల్లిస్తారు.
ప్రకటనలు వెలువడ్డాయి!
జేఏజీ ఎంట్రీ లా గ్రాడ్యుయేట్స్: 55 శాతం మార్కులతో ఎల్ఎల్బీ ఉత్తీర్ణత, వయసు 27 ఏళ్లలోపు ఉండాలి. దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 14.
గ్రాడ్యుయేట్ టెక్ ఎంట్రీ: సంబంధిత బ్రాంచిలో ఇంజినీరింగ్ డిగ్రీ చదివుండాలి. 27 ఏళ్లలోపు వయసువారు అర్హులు. దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 21.
వెబ్సైట్లు: https://joinindianarmy.nic.in, www.joinindiannavy.gov.in, http://www.joinindiannavy.gov.in, http://indianairforce.nic.in, https://upsc.gov.in/, https://ssc.nic.in
Posted on 10-02-2019