Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
రమ్మంటున్నాయ్‌ రక్షణ కొలువులు

* ఆర్మీ, నేవీల్లో అవకాశాలు

మీ విద్యార్హత చిన్నదైనా, పెద్దదైనా వాటికి తగ్గ చక్కని ఉద్యోగాలకు అవకాశం ఇప్పుడు వచ్చేసింది! పది, ఇంటర్‌, డిప్లొమా, బీటెక్‌, ఎమ్మెస్సీ చదివినవారి కోసం రక్షణ రంగంలో కొలువులు ఎదురుచూస్తున్నాయి. ఇందుకోసం ప్రకటనలు వెలువడ్డాయి. ప్రతిభ చూపినవారికి లెఫ్టినెంట్‌, సబ్‌ లెఫ్టినెంట్‌, అసిస్టెంట్‌ కమాండెంట్‌ హోదాతో అవకాశం లభిస్తుంది. వీటితోపాటు నావిక్‌, చార్జ్‌మెన్‌ పోస్టులు సైతం ఉన్నాయి.

ఉత్సాహం పరవళ్లు తొక్కే సాహస యువతకు గౌరవప్రదమైన కెరియర్లను అందిస్తుంది దేశ రక్షణ రంగం. స్థాయి, హోదా ఎలాంటిదైనా ఎన్నో వడపోతల తర్వాతే ఈ ఉద్యోగాల్లోకి ప్రవేశించటం సాధ్యమవుతుంది. రక్షణదళాల్లో విధులంటే నిరంతర సవాళ్లను ఎదుర్కొంటూ ఉత్తేజకరంగా ముందుకుసాగటం. దానికి తగ్గట్టుగానే అద్భుతమైన జీవన ప్రమాణాలకు వీలుంటుంది. వేగంగా పదోన్నతులు, ఆకర్షణీయమైన సౌకర్యాలు, పిల్లలకు విద్యా వసతులు మొదలైనవెన్నో ఈ కొలువుల్లో సాధారణం.

ఆర్మీలో 10+2 టెక్నికల్‌ ఎంట్రీ
ఇంటర్‌ ఎంపీసీ గ్రూప్‌ విద్యార్థులకు ఇంజినీరింగ్‌ విద్యతోపాటు లెఫ్టినెంట్‌ ఉద్యోగాన్ని అందిస్తోంది ఇండియన్‌ ఆర్మీ. ఇందుకోసం 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. షార్ట్‌ లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు రెండు దశల్లో వివిధ పరీక్షలు నిర్వహించి నియామకాలు చేపడతారు. అన్ని విభాగాల్లోనూ అర్హత సాధించినవారికి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయి. విజయవంతంగా శిక్షణ, కోర్సు పూర్తి చేసినవారికి ఆర్మీలో శాశ్వత ప్రాతిపదికన లెఫ్టినెంట్‌ హోదాతో ఉద్యోగం సొంతమవుతుంది.
ఖాళీలు: 90
అర్హత: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్‌ సబ్జెక్టుల్లో 70 శాతంతో ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 16 1/2 ఏళ్ల నుంచి 19 1/2 ఏళ్ల మధ్య ఉండాలి. జులై 1, 2000 కంటే ముందు; జులై 1, 2003 తర్వాత జన్మించినవారు అనర్హులు ఎత్తు: కనీసం 157.5 సెం.మీ.ఆన్లైన్‌ దరఖాస్తుల గడువు: జూన్‌ 8
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఇంటర్‌ ఎంపీసీ గ్రూప్‌ లో సాధించిన మార్కుల మెరిట్‌ ఆధారంగా షార్ట్‌ లిస్ట్‌ చేస్తారు. ఎంపికైనవారికి అయిదు రోజులపాటు రెండు దశల్లో ఎస్‌ఎస్‌బీ సైకలాజికల్‌ పరీక్షలు, గ్రూప్‌ పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. స్టేజ్‌-1 లో అర్హత సాధించినవారిని స్టేజ్‌-2కు అనుమతిస్తారు. అన్ని విభాగాల్లోనూ రాణిస్తే మెడికల్‌ టెస్టుకు పంపుతారు. విజయవంతమైతే తుది శిక్షణకు ఖరారుచేస్తారు.
కోర్సులో చేరినవాళ్లకి అయిదేళ్లపాటు శిక్షణ కొనసాగుతుంది. తొలి ఏడాది ఆఫీసర్‌ ట్రైనింగ్‌ అకాడమీ - గయలో బేసిక్‌ మిలిటరీ ట్రైనింగ్‌ నిర్వహిస్తారు. అనంతరం సాంకేతిక శిక్షణ (టెక్నికల్‌ ట్రైనింగ్‌) ఉంటుంది. ఎంపికైనవారు ఎలక్ట్రికల్‌ అండ్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సులు చదువుతారు. మూడేళ్ల శిక్షణ అనంతరం అభ్యర్థులకు నెలకు రూ.56,100 చొప్పున స్టయిపెండ్‌ చెల్లిస్తారు. విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్నవారికి దిల్లీలోని జేఎన్‌యూ ఇంజినీరింగ్‌ డిగ్రీని ప్రదానం చేస్తుంది.
వెబ్‌సైట్‌: www.joinindianarmy.nic.in

ఇండియన్‌ కోస్టుగార్డులో...
ఉత్సాహవంతులైన గ్రాడ్యుయేట్‌ యువతీ, యువకుల కోసం భారతీయ తీరదళం అసిస్టెంట్‌ కమాండెంట్‌ ఉద్యోగానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎంపికైతే నేరుగా గ్రూప్‌- ఎ గెజిటెడ్‌ ఆఫీసర్‌ పోస్టు సొంతం చేసుకోవచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్టుల ద్వారా నియామకాలు చేపడతారు.
దరఖాస్తులను పరిశీలించి మదింపు చేస్తారు. వీరికి స్టేజ్‌ -1 పరీక్ష నిర్వహించి, ఎంపికైనవారికి స్టేజ్‌-2 నిర్వహిస్తారు. ఇందులో సైకలాజికల్‌ పరీక్షలు, గ్రూప్‌ టాస్క్‌, ఇంటర్వ్యూ ఉంటాయి. స్టేజ్‌-2లోనూ ఎంపికైనవారికి మెడికల్‌ పరీక్షలు నిర్వహించి తుది నియామకాలు చేపడతారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారిని అసిస్టెంట్‌ కమాండెంట్‌గా విధుల్లోకి తీసుకుంటారు. ఈ సమయంలో రూ.56,100 మూలవేతనం చెల్లిస్తారు.
పోస్టు: అసిస్టెంట్‌ కమాండెంట్లు (గ్రూప్‌-ఎ గెజిటెడ్‌)
1) జనరల్‌ డ్యూటీ (పురుషులు)
2) జనరల్‌ డ్యూటీ (ఎస్‌ఎస్‌ఏ) - మహిళలు

అర్హత: కనీసం 60శాతం అగ్రిగేట్‌ మార్కులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. ఇంటర్లో మ్యాథమేటిక్స్‌, ఫిజిక్స్‌ చదివి ఉండాలి. అభ్యర్థులు 01.07.1995 - 30.06.1999 మధ్య జన్మించి ఉండాలి.
3) కమర్షియల్‌ పైలట్‌ ఎంట్రీ (ఎస్‌ఎస్‌ఏ) - పురుషులు/ మహిళలు
అర్హత: మ్యాథమేటిక్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టులతో పన్నెండో తరగతి ఉత్తీర్ణతతోపాటు కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ ఉండాలి. అభ్యర్థులు 01.07.1995 - 30.06.2001 మధ్య జన్మించి ఉండాలి.
4) టెక్నికల్‌ (ఇంజినీరింగ్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌): పురుషులు
అర్హత: సంబంధిత బ్రాంచీల్లో 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు.జులై 1, 1995 - జూన్‌ 30, 1999 మధ్య జన్మించివుండాలి.
5) లా- పురుషులు/ మహిళలు
అర్హత: 60శాతం మార్కులతో డిగ్రీ (లా) ఉత్తీర్ణత. జులై 1, 1990 - జూన్‌ 30, 1999 మధ్య జన్మించాలి.
అసిస్టెంట్‌ కమాండెంట్‌ జనరల్‌ డ్యూటీ, లా విభాగాలకు పురుషులు 157, మహిళలు 152 సెం.మీ. ఎత్తు ఉండడం తప్పనిసరి. అలాగే ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి. అభ్యర్థులు ఏదైనా ఒక విభాగానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు చేసుకుంటే అన్నింటినీ రద్దు చేస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులు: మే 24 నుంచి జూన్‌ 4 వరకు స్వీకరిస్తారు.

నేవీలో పీసీ, ఎస్సెస్సీ పోస్టులు
షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ విధానంలో ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌, టెక్నికల్‌ బ్రాంచ్‌, పర్మనెంట్‌ కమిషన్‌ విధానంలో ఎడ్యుకేషన్‌ బ్రాంచ్‌ ఉద్యోగాలకు ఇండియన్‌ నేవీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎగ్జిక్యూటివ్‌లో...నేవల్‌ ఆర్మమెంట్‌ ఇన్‌స్పెక్షన్‌ క్యాడర్‌, ఏటీసీ, అబ్జర్వర్‌, లాజిస్టిక్స్‌, ఐటీ ఉద్యోగాలు; టెక్నికల్లో ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ బ్రాంచీల్లో జనరల్‌ సర్వీస్‌ ఉద్యోగాలు ఉన్నాయి. పర్మనెంట్‌ కమిషన్లో ఎడ్యుకేషన్‌ బ్రాంచ్‌లో పలు పోస్టులు లభిస్తున్నాయి. పరీక్షలో చూపిన ప్రతిభ, ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్టుల ద్వారా నియామకాలు చేపడతారు. సబ్‌ లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు.
ఖాళీలు: ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌లో 55, టెక్నికల్‌ బ్రాంచ్‌లో 48, ఎడ్యుకేషన్‌ బ్రాంచ్‌లో 18 ఉన్నాయి.
అర్హత: ఆయా పోస్టులు బట్టి బీఈ/ బీటెక్‌, ఎమ్మెస్సీ, ఎంసీఏ, బీఎస్సీ, బీకాం
ఆన్లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మే 29

172 చార్జ్‌మెన్‌ పోస్టులు
భారతీయ నావికాదళం చార్జ్‌మెన్‌ మెకానిక్‌, అమ్యునిషన్‌ అండ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.ఇందుకోసం ఇండియన్‌ నేవీ సివిలియన్‌ ఎంట్రన్స్‌ టెస్టు నిర్వహిస్తారు. ప్రారంభంలో రూ.35,400 మూలవేతనం లభిస్తుంది.
ఖాళీలు: మెకానిక్‌-103, అమ్యునిషన్‌ అండ్‌ ఎక్స్‌ప్లోజివ్‌-69
అర్హత: సంబంధిత విభాగాల్లో డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 30 ఏళ్లలోపు ఉండాలి.
ఆన్లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మే 26
www.joinindiannavy.gov.in

పదితో నావిక్‌
ఇండియన్‌ కోస్ట్‌ గార్డు పదోతరగతి విద్యార్హతతో నావిక్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలచేసింది. ఎంపికైనవారిని డొమెస్టిక్‌ బ్రాంచ్‌ కుక్‌, స్టివార్డ్‌ హోదాల్లో తీసుకుంటారు. రాత, దేహదార్ఢ్య, వైద్య పరీక్షల ద్వారా నియామకాలు చేపడతారు. ఉద్యోగంలో చేరినవారికి ప్రారంభంలో రూ.21,700 మూలవేతనంగా చెల్లిస్తారు.
అర్హత: పదోతరగతిలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత (ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే 45 శాతం)
వయసు: అక్టోబరు 1, 2019 నాటికి 18 - 22 ఏళ్లలోపు ఉండాలి. అంటే అక్టోబరు 1, 1997 - సెప్టెంబరు 30, 2001 మధ్య జన్మించినవారే అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు వయసు పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, దేహదార్ఢ్య పరీక్ష, వైద్య పరీక్షల ద్వారా. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు దేహదార్ఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. అన్ని దశలూ విజయవంతంగా పూర్తిచేసుకుని ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్‌ఎస్‌ చిల్కలో శిక్షణ మొదలవుతుంది. అనంతరం విధుల్లోకి తీసుకుంటారు. కుక్‌, స్టివార్డ్‌ విధులు నిర్వర్తిస్తారు.
ఆన్లైన్‌ దరఖాస్తులు: జూన్‌ 5 నుంచి 10 వరకు స్వీకరిస్తారు.
http://joinindiancoastguard.gov.in/

Back..

Posted on 20-05-2019