Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఉపాధినిచ్చే వస్త్రాలు

* ఏటీడీసీలో వృత్తిశిక్షణ కోర్సులు

వస్త్రపరిశ్రమకు సంబంధించిన వృత్తిశిక్షణలో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సంస్థ- అపెరల్‌ ట్రెయినింగ్‌ అండ్‌ డిజైన్‌ సెంటర్‌ (ఏటీడీసీ). సదరన్‌ రీజియన్లోని హైదరాబాద్‌లో ఈ సంస్థ వొకేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆధ్వర్యంలో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ పాసైనవారికి ఎన్నో కోర్సులున్నాయి. వీటి వ్యవధి.. మూడేళ్ల నుంచి మూడు నెలలు!

దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల యోజన కింద తెలుగు రాష్ట్రాల్లోని యువతకు ఉపాధి కల్పించడం కోసం ఏటీడీసీ హైదరాబాద్‌ కేంద్రం నైపుణ్యాభివృద్ధి శిక్షణను ఉచితంగా అందిస్తోంది. కోర్సు పేరు- ఇండస్ట్రియల్‌ ఇంజినీర్‌ ఎగ్జిక్యూటివ్‌. కాలపరిమితి ఆరు నెలలు. ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన పరీక్ష పాసైన విద్యార్థులు దీనిలో చేరడానికి అర్హులు. దీని కోసం ఏటీడీసీ సంస్థలో ప్రత్యేకంగా హైస్పీడ్‌ కుట్టుమిషన్‌, కంప్యూటర్‌, ప్యాట్రన్‌ మేకింగ్‌ ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయి.

ఈ కోర్సులో చేరాలనుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలి. అభ్యర్థి దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబానికి చెంది ఉండాలి. ఆదాయ ధ్రువీకరణ పత్రంలో అభ్యర్థి పేరు తప్పనిసరిగా ఉండాలి. ఆరు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలను దరఖాస్తుకు జతపరచాలి. పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం లేదా హైయర్‌ సెకండరీ స్కూల్‌ సర్టిఫికెట్‌, నివాస ధ్రువీకరణ పత్రం, ఆధార్‌ కార్డు కాపీలను జతచేయాలి.

ఈ కోర్సుకు ఎంపికైన అభ్యర్థులకు ఉచిత శిక్షణ, వసతి, భోజన సదుపాయాలను కల్పిస్తారు. ట్రెయినింగ్‌ మెటీరియల్‌ను కూడా ఉచితంగానే అందజేస్తారు. కోర్సుకు సంబంధించిన శిక్షణతోపాటుగా కంప్యూటర్‌, సాఫ్ట్‌స్కిల్స్‌లో మెలకువలు నేర్పిస్తారు. ఉద్యోగ నైపుణ్యాలను పెంచడానికి కావాల్సిన శిక్షణనూ అందిస్తారు.

బ్యాచిలర్‌ వొకేషనల్‌ డిగ్రీలు
వీటి కాలపరిమితి మూడు సంవత్సరాలు.
బి.వొకేషనల్‌ ఇన్‌ అపెరల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ అండ్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌: అపెరల్‌ ప్రొడక్షన్‌ విధానాలు, దుస్తుల తయారీలో వచ్చిన ఆధునిక సాంకేతిక పద్ధతులు, వ్యాపార నైపుణ్యాలను మెరుగుపరచడంపై శిక్షణ ఇస్తారు. అవకాశాల కల్పన, బిజినెస్‌ ప్లానింగ్‌, వెబ్‌ డిజైనింగ్‌, వ్యాపారాభివృద్ధిలో భాగంగా సోషల్‌ మీడియాను ఉపయోగించుకోవడం, వివిధ పరిశ్రమలను సందర్శించడం మొదలైనవి నేర్పిస్తారు.
చేరదల్చినవారు 10+2 లేదా తత్సమాన పరీక్ష పాసై ఉండాలి. ఈ కోర్సు పూర్తిచేసినవారు ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌లు, ప్రొడక్షన్‌ మేనేజర్లు, ఇండస్ట్రియల్‌ ఇంజినీర్లు, మర్చండైజర్లు, అసిస్టెంట్‌ మర్చండైజర్లు, క్వాలిటీ మేనేజర్లుగా ఉద్యోగాలు పొందొచ్చు.
బి.వొకేషనల్‌ ఇన్‌ ఫ్యాషన్‌ డిజైన్‌ అండ్‌ రిటైల్‌: ఫ్యాషన్‌ మార్కెటింగ్‌, లేటెస్ట్‌ టెక్నాలజీ టూల్స్‌ ఇన్‌ అపెరల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌, ఫ్యాషన్‌-ఐటీ సినర్జీ, ఫ్యాషన్‌ ప్రొడక్ట్‌ క్లాసిఫికేషన్‌ అండ్‌ న్యూ ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌, బ్రాండింగ్‌-ప్రైసింగ్‌- ప్రమోషన్‌-డిస్ట్రిబ్యూషన్‌, డిజిటల్‌ మర్చంటైజింగ్‌ అండ్‌ ఇ-పోర్ట్‌ఫోలియో డెవలప్‌మెంట్‌, ఐడియా జనరేషన్‌, పరిశ్రమల సందర్శన మొదలైన అంశాలు శిక్షణలో భాగంగా ఉంటాయి.
ఈ కోర్సులో చేరాలంటే గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి 10+2 లేదా తత్సమాన పరీక్ష పాసై ఉండాలి. ఈ శిక్షణ పూర్తిచేసినవారికి మర్చండైజర్లు, ఫ్యాషన్‌ డిజైనర్లు, సాంప్లింగ్‌ మేనేజర్లు, డిజైన్‌ కోఆర్డినేటర్లు, రిటైల్‌ మేనేజర్లు, అసిస్టెంట్‌ మర్చండైజర్లు, ఫ్యాషన్‌ కో ఆర్డినేటర్స్‌ ఇన్‌ అపెరల్‌ అండ్‌ రిటైల్‌ ఇండస్ట్రీ అండ్‌ ఫ్యాషన్‌ ఆంత్రప్రెన్యూర్స్‌గా ఉద్యోగావకాశాలు ఉంటాయి.

డిప్లొమా ప్రోగ్రాములు
ఈ కోర్సుల కాలవ్యవధి సంవత్సరం.
* ఫ్యాషన్‌ డిజైన్‌ టెక్నాలజీ
* అపెరల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ టెక్నాలజీ

ఈ జనవరిలో ప్రవేశప్రకటన
* ఏటా జనవరిలో డిప్లొమా, జులైలో డిప్లొమా, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలుంటాయి. డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన వెలువడింది.
* మా సంస్థలో ఇప్పటివరకూ సుమారు 1500 మంది ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో డిప్లొమాలు పూర్తిచేశారు. మిగతా వాటి కంటే ఈ కోర్సుకే గిరాకీ ఎక్కువ. నాలుగేళ్ల కిందట ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టాం. ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో శిక్షణ పొందిన యువత దేశ విదేశాల్లో ఉపాధిని పొందుతున్నారు.
* మా దగ్గర ఉపయోగించే కుట్టుమిషన్లు చాలా వేగంగా పనిచేస్తాయి. ఐదుగురు చేసేపనిని ఒక్కరు చేయవచ్చు. ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌లో శిక్షణ తీసుకునేవారికి మిషన్‌ నియంత్రణనూ, కుట్టడంలోని మెలకువలనూ నేర్పిస్తాం. వేగంగా, నైపుణ్యంతో పనిచేసేలా అభ్యర్థులను తీర్చిదిద్దుతాం.

సంస్థ చిరునామా: దుస్తుల శిక్షణ, డిజైన్‌ కేంద్రం (ఏటీడీసీ), సర్వే నం.64, ఆవాస హోటల్‌ దగ్గర, హైటెక్‌ సిటీ, మాదాపూర్‌, హైదరాబాద్‌-500 081.

వెబ్‌సైట్: https://atdcindia.co.in/

Back..

Posted on 07-01-2020