Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
వాహన రంగంలో 15 లక్షల ఉద్యోగాలు

అడుగు వేస్తే ఆటో.. బయట·కెళితే బైకు.. కాలు కదిపితే కారు.. బహుదూర ప్రయాణాలకు బస్సు, లగేజీ పంపాలంటే లారీ.. ఇలా అనుక్షణం మన జీవితాలతో ముడిపడిపోయింది ఆటోమొబైల్‌ రంగం. అందుకే నిరంతరం ఉద్యోగాల కల్పనకు ఇది ప్రధాన వేదికగా మారింది. కొత్త కొత్త ఆవిష్కరణలతో ఎప్పటికప్పుడు డిమాండ్‌లో ఉంటోంది. 2022 నాటికి ఈ సెక్టార్‌లో 15 లక్షల ఉద్యోగాలు వస్తాయని ఇటీవల ఒక సర్వేలో వెల్లడైంది. విద్యుత్తు వాహనాలు, సెల్ఫ్‌డ్రైవింగ్‌ కార్ల వంటి వాటికి గిరాకీ పెరగబోతోందని తేలింది. దీంతో సంబంధిత సాంకేతిక పరిజ్ఞానంలో అర్హతలు కలిగిన వారికి టాప్‌గేర్‌లో అవకాశాలు అందబోతున్నాయి.నిరంతరం నూతనత్వానికి స్వాగతం పలికే ఆటోమొబైల్‌ రంగంలో ఉపాధి అవకాశాలకు కొదవే లేదు. టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ అనే సంస్థ ఇటీవల విడుదల చేసిన శాలరీస్‌ ప్రైమర్‌ రిపోర్ట్‌ (2017-18) ప్రకారం 2022 నాటికి ఆటోమొబైల్‌ రంగంలో 15 లక్షల కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి. ఒక్క విద్యుత్‌ వాహనాల విభాగమే 10 లక్షల ఉద్యోగాలు కల్పించనుంది. ఆటోసేల్స్‌ ట్రెయినర్‌, అప్లికేషన్‌ ఇంజినీర్‌ మేనేజర్‌, మ్యాట్‌ల్యాబ్‌ ఎక్స్‌పర్ట్‌ తదితర ఎన్నోరకాల కొలువులు రానున్నాయి. దీంతోపాటు పారిశ్రామిక తయారీ రంగంలో కూడా దాదాపు 6 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయని అంచనా. రోబోటిక్స్‌, ఐఓటీ (ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌) నిపుణులకు గిరాకీ పెరగనుంది. భారీగా పెరుగుతున్న ఇంధన ధరలు, కొరత, కాలుష్యం లాంటి కారణాల వల్ల కార్లు, ఇతర వాహన తయారీ సంస్థలు విద్యుత్‌ వాహనాల వైపు దృష్టిసారిస్తున్నాయి. అలాగే ప్రమాదాల నివారణకు సెల్ఫ్‌-డ్రైవింగ్‌ కార్లు తయారుచేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నవారికి ఆటోమొబైల్‌ రంగం ఎర్ర తివాచీ పరుస్తోంది.

మూడు రకాల కొలువులు
కార్లు, ట్రక్‌లు, మోటర్‌సైకిళ్లు, స్కూటర్లు మొదలైన ఆటోమొబైల్స్‌ డిజైనింగ్‌, అభివృద్ధి, తయారీ, టెస్టింగ్‌, మరమ్మతు, సర్వీసింగ్‌ లాంటి సేవలను ఆటోమొబైల్‌ ఇంజినీర్లు అందిస్తుంటారు. ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌లో ఉద్యోగాలు స్థూలంగా మూడు రకాలుగా ఉంటాయి. ప్రొడక్ట్‌/ డిజైన్‌ ఇంజినీర్స్‌, రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇంజినీర్స్‌, మాన్యుఫాక్చరింగ్‌ ఇంజినీర్స్‌.
* డిజైన్‌ ఇంజినీర్లు ఆటోమొబైల్స్‌కి సంబంధించిన డిజైనింగ్‌, టెస్టింగ్‌ లాంటి అంశాలను పర్యవేక్షిస్తారు. ప్రతి పార్ట్‌ సక్రమంగా, కస్టమర్‌ కోరుకున్న రీతిలో పని చేసేలా చూడటం మొదలైనవి వీరి పరిధిలోకి వస్తాయి.
* మాన్యుఫాక్చరింగ్‌ ఇంజినీర్లు ఆటోమొబైల్స్‌కి సంబంధించిన అన్ని పార్ట్‌ల తయారీ, అసెంబ్లింగ్‌ పనులను నిర్వర్తిస్తారు. పరికరాల డిజైన్‌, లేఅవుట్‌, మెషిన్‌ రేట్స్‌, పరికరాల స్పెసిఫికేషన్‌, రక్షణ వ్యవహారాలను కూడా చూస్తారు.
* డెవలప్‌మెంట్‌ ఇంజినీర్లు అన్ని వ్యవస్థలతో సమన్వయంగా పని చేస్తూ, కస్టమర్‌ అవసరాలకు తగినట్లు వాహనం/ పరికరాలు సిద్ధమయ్యేలా చూస్తారు.
ఆటోమొబైల్‌ పరిశ్రమ సర్వీస్‌ సెంటర్లు, ట్రాన్స్‌పోర్ట్‌‌ కార్పొరేషన్లు, ఇన్సూరెన్స్‌ కంపెనీలు, మోటార్‌వెహికల్‌ డిపార్ట్‌మెంట్లు మొదలైనవాటిలో అవకాశాలను కల్పిస్తోంది.
ఆఫీసర్‌ అకౌంట్స్‌: ఈ హోదాలో ఫైనాన్షియల్‌, పోర్టబిలిటీ స్టేట్‌మెంట్లు, ఎంఐఎస్‌ నివేదికలు సిద్ధం చేయాల్సివుంటుంది. కన్సల్టెంట్లు, బ్యాంకర్లు, చట్టబద్ధమైన ఆడిటర్లతో సమన్వయం చేయాల్సివుంటుంది.
సేల్స్‌ ఎగ్జిక్యూటివ్స్‌: కార్పొరేట్‌ సేల్స్‌, రీటెయిల్‌ సేల్స్‌పై ఆసక్తి ఉన్నవారు ఈ పోస్టుల్లో చేరవచ్చు.
మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ: ఈ హోదాలో చేరినవారు కొత్త బిజినెస్‌ కాన్సెప్టులపై పనిచేయాల్సివుంటుంది.
కార్పొరేట్‌ కమ్యూనికేషన్‌: కార్పొరేట్‌ కమ్యూనికేటర్స్‌, పీఆర్‌ ఎగ్జిక్యూటివ్స్‌ చేసేవిధుల్లో .. స్ట్రాటజిక్‌ కమ్యూనికేషన్స్‌ ప్లాన్స్‌ దగ్గర్నుంచి ఎంప్లాయీ న్యూస్‌ లెటర్ల రూపకల్పన వరకూ ఉంటాయి.

కెరియర్‌గా మలుచుకోవాలంటే..
మ్యాథమేటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌ సబ్జెక్టుల్లో మంచి పట్టున్న వారు ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ను కెరియర్‌గా మలుచుకోవచ్చు. దేశంలోని పలు సంస్థలు ఈ విభాగంలో బీఈ/బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌ కోర్సులను అందిస్తున్నాయి.
* పదోతరగతి తర్వాత ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేసినవారు పీజీ డిప్లొమా చదవచ్చు. కొన్ని కాలేజీలు 50 శాతం మార్కులతో ఆటోమొబైల్‌ డిప్లొమా ఉత్తీర్ణులైనవారికి ఇంజినీరింగ్‌ డిగ్రీలో ప్రవేశం కల్పిస్తున్నాయి. ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్‌ కోర్సులో ప్రవేశానికి ఫిజిక్స్‌, మ్యాథ్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ కోర్సులో చేరాలంటే వివిధ స్థాయుల్లో నిర్వహించే ప్రవేశపరీక్షల్లో అర్హత సాధించాల్సి ఉంటుంది.
గ్రాడ్యుయేట్‌ లెవల్‌ కోర్సులకు అఖిల భారత స్థాయిలో నిర్వహించే జేఈఈ మెయిన్స్‌, అడ్వాన్స్‌డ్‌, బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (బిట్‌శాట్‌), యూనివర్సిటీ ఆఫ్‌ దిల్లీ కంబైన్డ్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (సీఈఈ) లాంటి ప్రవేశపరీక్షల్లో ఏదో ఒకదానిలో అర్హత పొందాలి.
* భారత్‌ యూనివర్సిటీ ఎంటెక్‌ ఎంట్రన్స్‌‌ ఎగ్జామ్‌, గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌), జేఎన్‌టీయూ ఎంటెక్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌, వెల్లూర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఇంజినీరింగ్‌ ఎంట్రన్స్‌ లాంటి పరీక్షల్లో అర్హత సాధించడం ద్వారా పీజీ స్థాయి కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు.

ఎలక్ట్రిక్‌ వాహనాల కోర్సులు
మార్కెట్లో క్రమంగా ఎలక్ట్రిక్‌ వాహనాల జోరు పెరుగుతోంది. ఈ సందర్భంగా ఈ ప్రత్యేకరంగంలో శిక్షణ సదుపాయాలు కూడా వృద్ధి చెందుతున్నాయి. ప్రధానంగా ఆన్‌లైన్లో ఇవి అందుబాటులో ఉంటున్నాయి.
ఎలక్ట్రిక్‌ వెహికల్‌ సర్టిఫికేషన్‌ కోర్సు: నీతి ఆయోగ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ మొబిలిటీ విజన్‌ 2030 స్కిల్‌ పార్ట్‌నర్‌గా ఉన్న ‘దియ్‌గురు’ నిర్వహించే ఆన్‌లైన్‌ కోర్సు ఇది. వ్యవధి 30 రోజులు.ఆన్‌లైన్‌ వీడియోలూ, టెక్స్ట్‌, ఇతర విధానాల ద్వారా బోధన ఉంటుంది. ప్రాథమిక సాంకేతిక విద్యార్హత లేనివారైనా, ఆటోమోటివ్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, మెకానిక్స్‌ నేపథ్యాలకు చెందినవారు కూడా ఈ కోర్సు చేయవచ్చు. ‌www.diyguru.org
ఎలక్ట్రిక్‌ వెహికల్‌ టెక్నాలజీ సర్టిఫికెట్‌ ప్రోగ్రాం, అడ్వాన్స్‌డ్‌ ఎనర్జీ స్టోరేజ్‌, ఆటోమోటివ్‌ సిస్టమ్స్‌, ఎలక్ట్రిక్‌ అండ్‌ హైబ్రిడ్‌ వెహికల్‌ టెక్నాలజీ కోర్సులు కూడా ఆన్‌లైన్లో లభిస్తున్నాయి.
ఆటోమోటివ్‌ కంపోనెంట్స్‌, జనరల్‌ మెయిన్‌టెనెన్స్‌పై పరిజ్ఞానం ఉన్నవారు ఈ కోర్సులు చేస్తే ఉపయోగం..
బీఈ/ బీటెక్‌ ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌
తెలుగు రాష్ట్రాల్లో జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కాలేజీల్లో నాలుగేళ్ల ఈ కోర్సు అందుబాటులో ఉంది. ఈ కోర్సు అందించే ఇతర సంస్థలు:
* మణిపాల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ, మణిపాల్‌ manipal.edu,, మద్రాస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, చెన్నై ‌www.mitindia.edu,, ఎస్‌సీఎంఎస్‌ స్కూల్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (ఎస్‌ఎస్‌ఈటీ), కొచ్చి www.scmsgroup.org,, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ, చెన్నై, సింబయాసిస్‌ స్కిల్స్‌ అండ్‌ ఓపెన్‌ యూనివర్సిటీ, సత్యభామ యూనివర్సిటీ ‌www.sathyabama.ac.in, పీఎస్‌జీ కాలేజ్‌ ఆఫ్‌ టెక్నాలజీ
ఎంఈ/ ఎంటెక్‌ ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌
ఈ కోర్సు మణిపాల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ, మద్రాస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఉంది.
ఎంఈ/ ఎంటెక్‌ ఆటోమోటివ్‌ ఇంజినీరింగ్‌
* పీఎస్‌జీ కాలేజ్‌ ఆఫ్‌ టెక్నాలజీ, కోయంబత్తూరు వెబ్‌సైట్‌: www.psgtech.edu

సర్టిఫికెట్‌, డిప్లొమా కోర్సులు
* హిందుస్థాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ టెక్నాలజీ (హెచ్‌ఐఈటీ), చెన్నైలో డిప్లొమా ఇన్‌ ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ కోర్సు ఉంది. www.hiet.in ‌
* సింబయాసిస్‌ స్కిల్స్‌ అండ్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (ఎస్‌ఎస్‌ఓయూ) బీటెక్‌ ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌తోపాటు
1) సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ టెస్ట్‌ టెక్నీషియన్‌
2) డిప్లొమా ఇన్‌ ఆటోమోటివ్‌ ఎలక్ట్రానిక్స్‌ (అర్హత: ఇంటర్‌ లేదా ఐటీఐ లేదా మెకానిక్‌/ ఆటో/ ఎలక్ట్రికల్‌ విభాగాల్లో డిప్లొమా ఉత్తీర్ణత. వ్యవధి: ఏడాది)
3) సర్టిఫికెట్‌ ఇన్‌ ఆటోమోటివ్‌ సర్వీస్‌ టెక్నీషియన్‌ (అర్హత: పదోతరగతి/ ఐటీఐ ఉత్తీర్ణత. వ్యవధి: 6 నెలలు) కోర్సులను కూడా అందిస్తోంది. ‌www.ssou.ac.in
* చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో బీటెక్‌ ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ (స్పెషలైజేషన్‌ ఇన్‌ ఆటోమోటివ్‌ ఎలక్ట్రానిక్స్‌), ఎంటెక్‌ ఆటోమోటివ్‌ హైబ్రిడ్‌ సిస్టమ్స్‌ ఇంజినీరింగ్‌ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.www.srmuniv.ac.in

ఏయే సంస్థల్లో..?
ఆటోమొబైల్స్‌ ఇంజినీరింగ్‌ను కెరియర్‌గా ఎంచుకున్నవారికి ప్రముఖ సంస్థలు అవకాశాలు కల్పిస్తున్నాయి.
ఉదా:
* ఆడి
* ఫోర్డ్‌
* మారుతి సుజుకి మోటార్స్‌ లిమిటెడ్‌
* మహీంద్రా అండ్‌ మహీంద్రా లిమిటెడ్‌
* టాటా మోటార్స్‌
* హ్యుందయ్‌ మోటార్‌ కంపెనీ
* శోక్‌ లేలాండ్‌
* నిస్సాన్‌
* మెర్సిడెజ్‌ బెంజ్‌
* బీఎండబ్ల్యూ
* హోండా కార్స్‌ ఇండియా లిమిటెడ్‌
ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ ఉద్యోగులకు అనుభవం, అర్హత, సామర్థ్యం, సంస్థ స్థాయిని బట్టి వేతనాలు లభిస్తాయి. తాజా గ్రాడ్యుయేట్లు నెలకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వేతనం పొందొచ్చు. అయితే చాలా సంస్థలు ఐఐటీలు, ఎన్‌ఐటీలు, బిట్స్‌ లాంటి సంస్థల నుంచి వచ్చిన విద్యార్థులకు వారి అకడెమిక్‌ మెరిట్‌, స్కిల్స్‌ ఆధారంగా ఆకర్షణీయమైన ప్యాకేజీలు ఇస్తున్నాయి. ఈ రంగంలో మూడు నుంచి నాలుగేళ్ల అనుభవం గడించినవారికి నెలకు రూ.40 వేల వేతనం లభిస్తోంది.

ఎలాంటి నైపుణ్యాలు కావాలి?
ఆటోమొబైల్‌ ఇంజినీర్‌గా స్థిరపడాలంటే.. వాహనాల తయారీలో ఇమిడి ఉన్న మెకానికల్‌ ఇంజినీరింగ్‌, దహన ప్రక్రియ, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్‌ సిస్టమ్స్‌, ఇంధన సాంకేతికత మొదలైన అంశాల మీద మంచి అవగాహన అవసరం. వీటికి తోడు కంప్యూటర్‌ పరిజ్ఞానం, సమాచార (కమ్యూనికేషన్‌), విశ్లేషణ (అనలిటికల్‌), సమస్యా పరిష్కార (ప్రాబ్లం సాల్వింగ్‌) నైపుణ్యాలు ఉండాలి. తార్కికంగా ఆలోచించగలగడం, ఆచరణాత్మకత, ఓర్పు, సృజనాత్మకత, కొత్త టెక్నాలజీలను అర్థం చేసుకోవడం, వాటిని ఉపయోగించడం మొదలైనవన్నీ ఈ రంగంలో ఉన్నతస్థానానికి చేరుకోవడానికి తోడ్పడతాయి.
ఆటోమొబైల్‌ ఇంజినీర్లకు వాహనాల్లో తలెత్తే యాంత్రిక సమస్యలను గుర్తించడానికి అవసరమైన గణితశాస్త్ర నైపుణ్యం అవసరం. భారీ పరికరాలతో పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి, శారీరకంగా దృఢంగా ఉండటం తప్పనిసరి. కొన్ని సందర్భాల్లో ఎక్కువ సమయం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి పరిస్థితులకు సిద్ధంగా ఉండాలి. కొత్తగా ఈ రంగంలోకి ప్రవేశించేవారు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, రోబోటిక్స్‌, కాగ్నిటివ్‌ సొల్యూషన్స్‌, మెషిన్‌ లర్నింగ్‌ల్లో నైపుణ్యం సాధిస్తే ఆకర్షణీయమైన అవకాశాలను అందుకోవచ్చు.

ఇవీ ఉద్యోగాలు..
* ఆటోమోటివ్‌ టెక్నీషియన్‌
* కార్‌ మెకానిక్‌
* డీజిల్‌ మెకానిక్‌
* ఆటోమొబైల్‌ ఇంజినీర్‌
* ఆటోమొబైల్‌ డిజైనర్‌
* మెటీరియల్‌ ప్రాసెసింగ్‌ స్పెషలిస్ట్‌
* మెటీరియల్‌ పర్చేజ్‌ మేనేజర్‌
* సేఫ్టీ ఇంజినీర్లు
* ఎమిషన్స్‌ రిసెర్చ్‌
* ఎన్‌వీహెచ్‌ (నాయిస్‌, వైబ్రేషన్‌, హర్ష్‌నెస్‌) ఇంజినీర్లు
* పర్ఫార్మెన్స్‌ ఇంజినీర్లు
* వెహికల్‌ డైనమిక్స్‌ కంట్రోలర్‌లు
* ఆపరేషన్స్‌ రిసెర్చ్‌
* డిజైనర్లు
* క్వాలిటీ కంట్రోల్‌ ఎగ్జిక్యూటివ్‌
* రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇంజినీర్‌

అవకాశాలు ఎక్కడెక్కడ..?
భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా వాహనాలకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. దీంతోపాటు ఆటోమొబైల్‌ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. ఆటోమొబైల్‌ ఇంజినీర్లు వాహనాలకు సంబంధించిన ప్రణాళిక, డిజైనింగ్‌, అభివృద్ధి, తయారీలో (మాన్యుఫాక్చరింగ్‌), ఆటోమొబైల్‌ పరికరాలు ఉదాహరణకు ఇంజిన్‌ ఛాసిస్‌, ట్రాన్స్‌మిషన్‌ సిస్టమ్స్‌ పనితీరు, సామర్థ్య పరీక్షల్లో పాలుపంచుకుంటారు.
ఆటోమొబైల్‌ ఇంజినీర్లు పనితీరు, సామర్థ్యం, బలం, అప్పియరెన్స్‌తోపాటు తయారీ, నిర్వహణకు అయ్యే ఖర్చు మొదలైన అంశాలను దృష్టిలో ఉంచుకుని కొత్త డిజైన్లకు రూపకల్పన చేయాల్సి ఉంటుంది. సంప్రదాయ పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అత్యుత్తమ ప్రమాణాలున్న వాహనాలను తయారు చేయడం ఆటోమొబైల్‌ ఇంజినీర్ల ప్రధాన కర్తవ్యం.
వీరికి ఆటోమొబైల్‌ మాన్యుఫాక్చరింగ్‌ పరిశ్రమలు, ప్రొడక్షన్‌ ప్లాంట్స్‌, సర్వీస్‌ స్టేషన్లు, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు, ప్రైవేట్‌ రవాణా సంస్థలు, బీమా సంస్థలు, మోటార్‌ వెహికల్‌ డిపార్ట్‌మెంట్లలో ఉద్యోగాలు లభిస్తాయి. కంప్యూటర్‌ ఎయిడెడ్‌ డిజైన్‌ ్బదితిద్శీ, దితిలీ (ఆటోమేషన్‌), ఈఆర్‌పీ లాంటి కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్నవారికి కంప్యూటర్‌ ఆధారిత పరిశ్రమల్లో డిజైనర్లుగా అవకాశం ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు రిసెర్చ్‌, డెవలప్‌మెంట్‌ విభాగంలో చేరి కొత్త వాహనాలను తయారు చేయొచ్చు.
ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేసినవారు సొంతంగా ఆటోమొబైల్‌ మెయింటెనెన్స్‌ వర్క్‌షాప్‌/ గ్యారేజ్‌ ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందొచ్చు.
* వర్క్‌షాప్‌లు, ఫ్యాక్టరీలు, గ్యారేజీలు ఆటోమొబైల్‌ మెయింటెనెన్స్‌ ఇంజినీర్లను జనరల్‌ సూపర్‌వైజర్లుగా నియమించుకుంటాయి.
* ఆటోమొబైల్స్‌లో బీటెక్‌ చదివి, ఎంబీఏ పూర్తి చేసినవారు మార్కెటింగ్‌ మేనేజర్లుగా ఉన్నతస్థాయికి చేరుకోవచ్చు.
* ఆటోమొబైల్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేసి, బోధనలో అయిదేళ్ల అనుభవం గడించినవారు ఇంజినీరింగ్‌ కాలేజీల్లో అధ్యాపకులుగా చేరొచ్చు.
* ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ చేసినవారికి ఆ రంగంలో రిసెర్చర్‌/ సైంటిస్ట్‌గా అవకాశాలు లభిస్తాయి. ఈ రంగంలో మంచి నైపుణ్యం, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉన్నవారు కెరియర్‌ పరంగా వెనక్కి తిరిగి చూడనవసరం లేదు.

 

Back..

Posted on 11-8-2018