Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఒత్తిడిని తొక్కిపెట్టు.. విజయాన్ని ఒడిసి పట్టు!

* ఓటమి అంచులో ఉన్న ఆత్మస్థైర్యం వదలకు
* ప్రతిభను గుర్తించి సానపెట్టడం మరవకు

వించే విధానాన్ని నేర్పించే స్థలమే పాఠశాల(స్కూల్‌ ఈజ్‌ ఏ ప్లేస్‌ వేర్‌ కల్చర్‌ ఈజ్‌ టాట్‌) ఆక్స్‌పర్డ్‌ డిక్షనరీలో బడికి ఉన్న అర్థమిది. కాలంతోపాటే పాఠశాల మారింది. చదువే పరమావధి అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఈ దుష్పరిణామం విద్యార్థుల్లో పెనుఒత్తిడికి కారణమైంది. ఫలితమే ఆత్మన్యూనతతో విద్యార్థుల అఘాయిత్యాలు.. ఆత్మహత్యలు. తాజాగా నగరంలో ఇద్దరు విద్యార్థులు పరీక్షల ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడటం ఆందోళన రేకెత్తించింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఒత్తిడిని అధిగమించేందుకు నిపుణుల సూచనలేమిటి..? విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని ప్రోది చేయడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర ఏమిటి?...
అది ప్రమాదకరం
ఒత్తిడి లేకుంటే ఫలితాలు రావు. ఇది ముమ్మాటికీ వాస్తవం. ఆ ఒత్తిడి విద్యార్థి ప్రతిభకు అనుగుణంగానే ఉండాలి. అలా చేయడమూ సబబే. కానీ అంతకంటే ఎక్కువ ఒత్తిడికి గురి చేస్తేనే ప్రమాదకరం. ఉదాహరణకు ఒక తీగను మామూలుగా వదిలేస్తే రింగులు రింగులుగా వదులుగా ఎందుకూ పనికి రాకుండా ఉంటుంది. అదే వీణకు గట్టిగా చుడితే సరాగాలు పలికిస్తుంది. ఇంకా గట్టిగా లాగితే తెగిపోతుంది. విద్యార్థిపై ఒత్తిడీ అలాంటిదే. పతాకస్థాయిని తాకేలా ఉండే ఒత్తిడి(యూస్ట్రెస్‌) అద్భుత ఫలితాలనిస్తుంది. ఆ ఒత్తిడి మరీ ఎక్కువైతే ప్రమాదకర స్థాయికి(డిస్ట్రెస్‌) చేరి అనర్థాలకు దారితీస్తుంది.
అప్పుడే అనర్థాలు
విద్యార్థి ఒత్తిడికి లోనైనప్పుడు గుర్తించకుండా.. ఇంకా పెంచే ప్రయత్నం చేస్తుండటంతోనే అనర్థాలకు, ఆత్మహత్యలకు దారితీస్తోంది. ఒత్తిడి పెరిగితే రోగనిరోధక శక్తి తగ్గుతుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒత్తిడి మరీ ఎక్కువైతే ఆందోళనతో విద్యార్థులు డిప్రెషన్‌కు లోనై ప్రాణాలు తీసుకోవడానికి దారితీస్తోంది. విద్య కష్టమైనా ఇష్టంతో చదువుకునే పరిస్థితులు కల్పించాలి. సృజనాత్మకతను మేళవించి సులభమైన విధానంలో బోధన సాగితే ఎలాంటి విద్యార్థి అయినా చదువుపై మమకారం పెంచుకుంటాడు. కష్టమైనా ఇష్టంతో చదువుకుంటాడు.
ఇదే కీలకం
సాధారణంగా ప్రతీ విద్యార్థి తనదైన ప్రతిభను కలిగి ఉంటాడు. ఒకరు గణితంలో దిట్ట కావచ్చు.. మరొకరు క్రీడల్లో పట్టు ఉండొచ్చు.. ఇంకొకరు కళల్లో రాణించొచ్చు. దీన్ని గుర్తించడమే కీలకం. ఇందులో ఉపాధ్యాయుల పాత్ర ఉన్నతమైనది. విద్యార్థి ప్రతిభను గుర్తించి సానబెడితే అద్భుతాలు సాధించేందుకు అవకాశముంటుంది. అలా కాకుండా నిత్యం 10-15 గంటల తరబడి చదువుపైనే దృష్టి సారించాలని ఒత్తిడి పెంచినప్పుడే దుష్పరిణామాలు సంభవిస్తున్నాయి.
విపరీత రక్షణాత్మక ధోరణి
ఇటీవల పరిస్థితిని గమనిస్తే కొందరు తల్లిదండ్రుల వ్యవహారశైలి విపరీత రక్షణాత్మక ధోరణిని సూచిస్తోంది. చిన్నారులకు మంచీ చెడులను నేర్పించాల్సిన గురుతర బాధ్యత గురువులపై ఉందన్నది నిర్వివాదాంశమే. ఆ బాధ్యతను కాలరాచేలా ఉంటోంది కొందరు తల్లిదండ్రుల సరళి. ‘అమ్మా పెట్టదు.. అడుక్కు తిననివ్వదు..’ అన్న చందంగా ఓ వైపు ఇంట్లో పిల్లలను గారాబం చేస్తూనే.. పాఠశాలలోనూ గురువులు బెత్తం పట్టొద్దంటూ ఆంక్షలు విధిస్తున్నారు. విద్యార్థి దారి తప్పకుండా గాడిన పెట్టేందుకు ఉపాధ్యాయుడు బెత్తంతో ఒకటి తగిలించడం పాపం.. మీడియాను వెంటేసుకొని నానా హంగామా చేసే కొత్తరకం తల్లిదండ్రులు బయల్దేరారిప్పుడు. ఈ తరహా సంస్కృతి అంతిమంగా విద్యార్థి నడవడికను దారి తప్పించేదిగా మారుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాము తప్పుడు దారిలో నడిస్తే అటు గురువులు.. ఇటు తల్లిదండ్రులు తాట తీస్తారనే భయం ఉన్నప్పుడే విద్యార్థి సన్మార్గంలో నడిచేందుకు ఆస్కారముంటుందని చెబుతున్నారు. విద్యార్థులకు స్వేచ్ఛ అవసరమే అయినా అది తప్పనిసరిగా పరిమితులతో కూడినదై ఉండాల్సిందే.
సన్నద్ధత ప్రణాళిక ఇలా..
కొందరు విద్యార్థులకు పరీక్షలు అనగానే ఎక్కడలేని భయం పట్టుకుంటుంది. పరీక్ష హాల్లోకి ప్రవేశించగానే గుండెదడ ఎక్కువ అవుతుంది. పరీక్షల ఫోబియా ఉన్న విద్యార్థులు ఇలాంటి సమస్యల్ని ఎదుర్కొంటారు. దీని నివారణకు విద్యాసంవత్సరం ఆరంభం నుంచే పటిష్ట ప్రణాళికతో సన్నద్ధం కావడం అవసరం. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలకు ఒక నెల ఉన్నందున ఇందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించుకోవాలి. నిరంతర సమగ్ర మూల్యాంకనం(సీసీఈ) విధానంలో పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో గత ప్రశ్నాపత్రాల్ని అధ్యయనం చేయాలి. బట్టీ పద్ధతులకు స్వస్తి పలుకుతూ.. సృజనాత్మకతకు పెద్దపీట వేసేలా ఈ విధానాన్ని అమలు చేస్తుండటంతో అందుకు అనుగుణంగా సన్నద్ధులు కావాలి. ప్రస్తుత సరళిని గమనిస్తే పరీక్షల్లో 30 శాతం సులభంగా, 40 శాతం మధ్యస్థంగా, 30 శాతం కఠినంగా ప్రశ్నలు ఉంటున్నాయి. సులభమైన ప్రశ్నలకు జవాబులు రాయడంతోపాటు మరికొంత దృష్టి సారించినా సులువుగా ఉత్తీర్ణత సాధించొచ్చు.
నేనా.. ఓడిపోవడమా..!
గెలుపు.. గెలుపు.. గెలుపు.. ఇదే పరమార్థం కాదని పిల్లలకు అవగతం చేయించాలి. ఓటమి అనుభవమైతేనే కదా గెలుపు రుచి తెలిసేది. అందుకే తప్పకుండా ఓటమిని పరిచయం చేయించాలని నిపుణుల మాట. ఓటమి అంచుల్లో నుంచి గెలుపును రుచి చూపించినప్పుడే అందులోని మధురానుభూతిని అనుభవిస్తారెవరైనా.
చిట్కాలున్నాయి...
పరీక్షలనగానే ఒత్తిడిని ఎదుర్కొనే విద్యార్థుల కోసమే ఈ చిట్కాలు..
* ఎప్పటికప్పుడే మననం: ఏ రోజు పాఠాలు ఆరోజే మననం చేసుకోవాలి. అప్పుడే అర్థం కానివి తెలిసిపోతాయి. వాటిని వెంటనే ఉపాధ్యాయుడితో చర్చించి పరిష్కరించుకోవాలి. అనంతరం సొంతంగా ప్రశ్నలు రూపొందించుకొని జవాబులు రాబట్టాలి.
* మధ్యమధ్యలో విరామాలు: పరీక్షల సమయంలో రాత్రంతా మేలుకొని చదివితే మార్కులు వస్తాయనుకోవడం పొరపాటు. గంటల తరబడి చదువుకుంటూ పోతే బుర్రకెక్కదు. గరిష్ఠంగా 50 నిమిషాల పాటే చదవాలి. తర్వాత 5-10 నిమిషాల విరామం తప్పనిసరి. ఆ సమయంలో స్నాక్స్‌ తీసుకోవడమో, నడవడమో.. టీవీ చూడటమో చేయొచ్చు. చదివే సమయంలో అంతరాయం లేకుండా చూసుకోవాలి.
* ఆరోగ్యంపై దృష్టి: పరీక్షల సమయంలో జంక్‌ఫుడ్స్‌ జోలికి అసలే వెళ్లొద్దు. మొలకెత్తిన గింజలు, పండ్లు, పళ్లరసాలు.. లాంటి బలవర్ధకమైన ఆహారం తీసుకోవడంతోపాటు కాసింత వ్యాయామం చేస్తే సత్ఫలితాలుంటాయి. ఈ సమయంలో శరీరానికి తగినంత నిద్ర దొరికితేనే చదువు ఎక్కుతుంది.
* సాధన.. సాధన.. సాధన : సాధన మనిషిని పరిపూర్ణుడిని చేస్తుందనడంలో సందేహం లేదు. అందుకే పరీక్షల సమయంలో వీలైనన్ని సార్లు ప్రశ్నల్ని సాధన చేయాలి. అవసరమైతే ఉపాధ్యాయుడి సహాయంతో నమూనా ప్రశ్నపత్రాలకు జవాబులు రాయాలి. తోటి విద్యార్థులతోనూ కలిసి పరస్పరం ఇలా ప్రశ్నల్ని రూపొందించుకొని సాధన చేయాలి.
* నిరాశను రానీయొద్దు: పరీక్షల సమయంలో నిరాశ ఆవరించడం శ్రేయస్కరం కాదు. నిరాశపూరిత ఆలోచనలు కలిగినప్పుడు ఆశావహ దృక్పథాన్ని మనసులో నింపుకోవాలి. ఉదాహరణకు ‘నేను పరీక్షలో ఫెయిల్‌ కాబోతున్నాను..’ అనే ఆలోచన వచ్చినప్పుడు ‘నేను సామర్థ్యం మేరకు చదువుతున్నాను. అందుకే తప్పకుండా పాసవుతాను..’ ఆలోచనతో భర్తీ చేయాలి. నిరాశ ఆవరించినప్పుడు దీర్ఘ శ్వాసతో కూడిన ప్రాణాయామం చేయాలి. పరీక్షల్లో విజయాన్ని వూహించుకోవడం ద్వారా ఆశావహ ఫలితాల్ని రాబట్టొచ్చు.
* ప్రశ్నపత్రం అధ్యయనం: పరీక్ష ప్రారంభించే ముందు ప్రశ్నపత్రాన్ని క్షుణ్ణంగా చదవాలి. అప్పుడే ఎంత సమయంలో పరీక్షను పూర్తి చేయొచ్చనే విషయంలో అంచనాకు రావొచ్చు. సులభంగా ఉన్నవాటిని ముందుగా రాయాలి.
‘అతి’ అనర్థదాయకం
పిల్లల విషయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు జాగ్రత్తగా ఉండాలి. వారి స్థాయిని బట్టి ఒత్తిడి పెడితే మంచిది. పిల్లలు ఆడిపాడటాన్ని ఆస్వాదిస్తారు. అలా కాదని రోజుకు 15 గంటలపాటు చదువుపైనే దృష్టి సారింపజేస్తే దుష్ఫలితాలు తప్పవని తల్లిదండ్రులు గమనించాలి. సాధారణంగా ఏదైనా వినేటప్పుడు గరిష్ఠంగా 40-50 నిమిషాల పాటే ఏకాగ్రత ఉంటుంది. ఆ తర్వాత కూడా ఉపాధ్యాయులు చెప్పడం కొనసాగిస్తే బుర్రకెక్కదు.
        - డా.శ్రీనివాస్‌, మానసిక విశ్లేషణ నిపుణులు, ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం


Back..

Posted on 19-02-2017