Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
మనసున్న వారికి..దివ్యమైన కోర్సులు!

అందరితోపాటే.. కానీ అందరిలో కలవలేరు. అందరిలాగానే.. కానీ అన్నీ గ్రహించలేరు. మాటలో స్పష్టత.. చూపులో నాణ్యత ఉండవు. భావం.. ఉద్వేగం ఉంటాయి. వ్యక్తీకరణ ఉండదు. సహజ కారణాలతో లేదా అసహజ సందర్భాల వల్ల ఏర్పడిన లోపాలతో ఇబ్బందులు పడుతుంటారు. జీవన నైపుణ్యాలు లేక సతమతమవుతుంటారు. అలాంటి దివ్యాంగులకు సాధారణ బోధన సరిపోదు. కొన్ని వనరులు, పరికరాలతో శిక్షణ ఇస్తే ఎవరి మీద ఆధారపడకుండా జీవించగలుగుతారు. ‘స్పెషల్‌ ఎడ్యుకేషన్‌’ కోర్సులు చేసిన నిపుణులు ఆ తరహా ప్రత్యేక శిక్షణ ఇవ్వగలుగుతారు. సేవాభావం, సహనం ఉన్నవాళ్లు ఈ కోర్సులు చేస్తే మంచి కెరియర్‌ను అందుకోవచ్చు.

శారీరక, మానసిక, అభివృద్ధిపరమైన లోపాలున్న పిల్లలు మనకు తరచూ తారసపడుతూనే ఉంటారు. ఒక విషయాన్ని నేర్చుకోవడంలోనూ, అర్థం చేసుకోవడంలోనూ వీరికి కొంత ఇబ్బందులు ఎదురవుతుంటాయి. భాషాపరమైన, భావవ్యక్తీకరణ సంబంధమైన చిక్కులూ, భావోద్వేగపరమైన, వినికిడి, దృష్టి సంబంధిత లోపాలు, ఆటిజం, వ్యాకులత.. ఇవన్నీ ఇందులో భాగమే. నేర్పుగా, ఓర్పుగా బోధిస్తే తప్ప వీరు విషయాలను గ్రహించలేరు. మిగతావారిలా సాధారణ తరగతి బోధన వీరికి సరిపడదు. సాధారణ పిల్లలతో పోలిస్తే వీరికి అన్ని విషయాల్లో ప్రత్యేక బోధన అవసరమవుతుంది. అందుకే సంప్రదాయేతర, ఆరోగ్యకరమైన విధానంలో వీరికి నేర్పించాలి. విద్యార్థినిబట్టి బోధన పద్ధతుల్లోనూ తేడాలుంటాయి. ‘స్పెషల్‌ ఎడ్యుకేషన్‌’ అంటే ఇదే! దీనిలో ప్రత్యేక శిక్షణ పొంది బోధించేవారిని స్పెషల్‌ ఎడ్యుకేటర్లు/ ప్రత్యేక బోధకులుగా వ్యవహరిస్తారు.

ఈ తరహా పిల్లలు పాఠశాలలో ఇతర పిల్లలతో కలిసిపోయేలా చూడటం, చుట్టూ జరిగే అంశాలను అర్థం చేసుకునేలా చేయడం, వారిలో కమ్యూనికేషన్‌ నైపుణ్యాలను పెంచడం, ఇతరుల సాయం లేకుండా జీవించడానికి అవసరమైన నైపుణ్యాలను ప్రత్యేక బోధకులు పిల్లలకు బోధిస్తారు. వీరికి ఇటీవలి కాలంలో గిరాకీ పెరిగింది. వీరు తమ విద్యార్థుల లోపాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక కరిక్యులమ్‌ను రూపొందిస్తారు. ప్రత్యేకమైన వనరులు, పరికరాలతో బోధన సాగిస్తారు. చిన్న చిన్న మాటలు, జీవించడానికి అవసరమైన నైపుణ్యాలు, భావవ్యక్తీకరణ అంశాలు వంటివీ ఇందులో భాగమే. వీటన్నింటిపై అవగాహన ఏర్పరచుకునేందుకు వీలుగా వీరు ప్రత్యేక శిక్షణ తీసుకుంటారు. దీనికి సంబంధించి ఎన్నో సంస్థలు వివిధ కోర్సులను అందిస్తున్నాయి.

ఇంటర్‌, డిగ్రీ అర్హతలతో స్పెషల్‌ ఎడ్యుకేషన్‌
ప్రత్యేక లక్షణాలు అవసరం
మిగతా కెరియర్లతో పోల్చినపుడు ఇది కొంచెం ప్రత్యేకం. కాబట్టి వీరికి కొన్ని ప్రత్యేక లక్షణాలుండటం తప్పనిసరి.
* పిల్లలంటే ప్రేమ, బోధనపై ఆసక్తి ఉండాలి.
* ఈ పిల్లలతో వ్యవహరించేటపుడు ఒకరకంగా భావోద్వేగపరంగా, శారీరకంగా అలసట ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో చాలా ఓపికగా ఉండాలి.
* సానుకూల దృక్పథం ఉండాలి.
* మంచి కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు ఉండాలి.
* త్వరగా కలిసిపోయే మనస్తత్వం ఉండాలి.
* సృజనాత్మకత ఉండాలి.

కెరియర్‌ అవకాశాలు
గతంలో మానసికపరమైన, శారీరక, ప్రత్యేక అవసరాలున్న వారిని ఇంట్లో ఒక గదికి మాత్రమే పరిమితం చేసేవారు. దీంతో ఆ పిల్లలకు బయటి విషయాలపై అవగాహన ఉండేది కాదు. కొంత కాలంగా వీరిపై అవగాహన పెరిగింది. కొద్దిపాటి శిక్షణతో వారిని అందరిలో కలిసేలా, వారిలో మార్పు తీసుకురావచ్చన్న అవగాహన పెరిగింది. దీంతో ప్రత్యేక బోధకుల అవసరమూ పెరిగింది. అయితే అందుకు తగ్గట్టుగా ప్రస్తుతం ప్రత్యేక బోధకులు అందుబాటులో లేరు. దీంతో వీరికి డిమాండు పెరుగుతోంది. పైగా ఇటీవలి కాలంలో చిన్న వయసులోనే ఈ లోపాలున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇందుకు తగ్గట్టుగానే వీరి కోసం ప్రత్యేక పాఠశాలలూ ఏర్పాటవుతున్నాయి. ఫలితంగా ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఎక్కువ అంశాల్లో నైపుణ్యం ఉన్నవారు కన్సల్టెంట్లతో కలిసి పనిచేయవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో వీరికి ఉద్యోగావకాశాలు ఉన్నాయి. సాధారణంగా వీరిని ప్రాథమిక పాఠశాలలు, ప్రత్యేక పాఠశాలలు, వివిధ ఎన్‌జీఓలు, రిహాబిలిటేషన్‌ సెంటర్లు, ఆసుపత్రుల్లో స్పెషల్‌ ఎడ్యుకేటర్‌, స్పెషల్‌ టీచర్‌, రిహాబిలిటేషన్‌ ప్రొఫెషనల్‌, రిహాబిలిటేషన్‌ కన్సల్టెంట్‌, సోషల్‌ వర్కర్‌, రిహాబిలిటేషన్‌ ఆఫీసర్‌, థెరపిస్ట్‌ మొదలైన హోదాలకు ఎంచుకుంటున్నారు. సైకోథెరపిస్టులు, సైకాలజిస్టులు, స్పీచ్‌ థెరపిస్టులతో కలిసీ పనిచేయవచ్చు.
జీతభత్యాలు: ఎంచుకున్న సంస్థ, అనుభవాన్ని బట్టి జీతభత్యాల్లో మార్పులుంటాయి. ప్రారంభ వేతనం ఏడాదికి రూ.1,20,000 నుంచి రూ.2,00,000 వరకూ ఉంటుంది. అనుభవం, నైపుణ్యాలను బట్టి జీతంలో మెరుగుదల ఉంటుంది.

కోర్సుల వివరాలు!
స్పెషల్‌ ఎడ్యుకేషన్‌కు సంబంధించి సర్టిఫికెట్‌, డిప్లొమా, పీజీ డిప్లొమా, బ్యాచిలర్‌, పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. చాలావరకూ సంస్థలు ప్రవేశపరీక్షను నిర్వహించి, అందులో మెరుగైన ర్యాంకును సాధించినవారికి ప్రవేశాలను కల్పిస్తున్నాయి. మరికొన్ని ప్రవేశపరీక్షతోపాటు వ్యక్తిగత ఇంటర్వ్యూనూ నిర్వహిస్తున్నాయి. నేరుగా ప్రవేశాలను కల్పిస్తున్న సంస్థలూ ఉన్నాయి.
సర్టిఫికెట్‌ స్థాయిలో: సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ స్పెషల్‌ నీడ్స్‌ ఎడ్యుకేషన్‌. దీని కాలవ్యవధి మూడు నుంచి ఆరు నెలలు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులు.
డిప్లొమా స్థాయిలో: స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ (సెరెబ్రల్‌ పాల్సీ), స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ (హియరింగ్‌ ఇంపైర్డ్‌), స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ (మెంటల్‌ రిటార్డేషన్‌), డిప్లొమా ఇన్‌ ఒకేషనల్‌ ట్రైనింగ్‌ అండ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ (విజువల్లీ హ్యాండీ…క్యాప్‌డ్‌), జూనియర్‌ డిప్లొమా ఇన్‌ టీచింగ్‌ ద డెఫ్‌, పీజీ డిప్లొమా ఇన్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ (మల్టిపుల్‌ డిజెబిలిటీస్‌, ఫిజికల్లీ అండ్‌ న్యూరోలాజికల్‌), సీనియర్‌ డిప్లొమా ఇన్‌ టీచింగ్‌ ద డెఫ్‌ వంటి కోర్సులున్నాయి.
కోర్సుల కాలవ్యవధి ఏడాది నుంచి రెండేళ్లు. డిప్లొమా కోర్సులకు ఇంటర్మీడియట్‌ పూర్తిచేసినవారు అర్హులు. పీజీ డిప్లొమా కోర్సులకు ఏదేని డిగ్రీ లేదా సంబంధిత డిప్లొమా పూర్తిచేసినవారు అర్హులు.
డిగ్రీ స్థాయిలో: బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆడియాలజీ అండ్‌ స్పీచ్‌ లాంగ్వేజ్‌ పాథాలజీ, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌/ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ కోర్సులున్నాయి. బ్యాచిలర్‌ కోర్సుల కాలవ్యవధి నాలుగేళ్లు. ఇంటర్‌లో ఫిజిక్స్‌, కెమిస్ట్రీలు సబ్జెక్టులుగా ఉన్నవారెవరైనా ఈ కోర్సులో చేరొచ్చు.
బీఈడీ: హియరింగ్‌ ఇంపెయిర్డ్‌, విజువల్‌ హ్యాండికాప్‌డ్‌ మొదలైన విభాగాల్లో బీఈడీ కోర్సులున్నాయి. వీటి కాలవ్యవధి రెండేళ్లు. ఏదేని డిగ్రీ పూర్తిచేసినవారు అర్హులు.
పీజీ స్థాయిలో: ఎంఎస్‌సీ, ఎంఈడీ కోర్సులు. వీటిల్లోనూ ఆడియాలజీ అండ్‌ స్పీచ్‌ లాంగ్వేజ్‌, హియరింగ్‌ ఇంపెయిర్‌మెంట్‌, లర్నింగ్‌ డిజెబిలిటీ వంటి విభాగాల్లో కోర్సులున్నాయి. కొన్ని కోర్సులకు ఏదైనా డిగ్రీ వారికి ప్రవేశం కల్పిస్తుండగా, మరికొన్నింటికి అదే విభాగంలో డిగ్రీ పూర్తిచేసిన వారిని తీసుకుంటున్నారు..

దివ్యాంగన్‌లో..
ముంబయిలోని అలియావర్‌ జంగ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌ డిజెబిలిటీస్‌ (దివ్యాంగన్‌) వివిధ ప్రత్యేక కోర్సులకు సంబంధించి ప్రకటన విడుదల చేసింది. ప్రవేశపరీక్ష ద్వారా వీటిలోకి ప్రవేశాలను పొందొచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
యూజీ కోర్సులు: బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆడియాలజీ అండ్‌ స్పీచ్‌ లాంగ్వేజ్‌ పాథాలజీ, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌/ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ (హియరింగ్‌ ఇంపెయిర్‌మెంట్‌)
పీజీ కోర్సులు: ఎంఎస్‌సీ ఆడియాలజీ, మాస్టర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌/ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ (హియరింగ్‌ ఇంపెయిర్‌మెంట్‌), మాస్టర్‌ ఆఫ్‌ ఆడియాలజీ అండ్‌ స్పీచ్‌ లాంగ్వేజ్‌ పాథాలజీ
డిప్లొమా కోర్సులు: డిప్లొమా ఇన్‌ హియరింగ్‌, లాంగ్వేజ్‌ అండ్‌ స్పీచ్‌, డిప్లొమా ఇన్‌ ఇండియన్‌ సైన్‌ లాంగ్వేజ్‌ ఇంటర్‌ప్రిటర్‌, డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌- స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ (మెంటల్‌ రిటార్డేషన్‌) కోర్సులు.
దరఖాస్తు చివరితేదీ: మే 31, 2019
ప్రవేశపరీక్ష తేదీలు: జూన్‌ 15, 22, 29
www.ayjnihh.nic.in

అందిస్తున్న సంస్థలు
* ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్టణం
* అలియావర్‌ జంగ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌ డిజెబిలిటీస్‌ (దివ్యాంగ్‌జన్‌), ముంబయి
* జమియా మిల్లియా ఇస్లామియా, దిల్లీ
* శ్రీమతి నతీబాయ్‌ దామోదర్‌ థాకర్సే విమెన్స్‌ యూనివర్సిటీ, ముంబయి
* రిహాబిలిటేషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, దిల్లీ
* బి.ఆర్‌. అంబేడ్కర్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌
* నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌, సికింద్రాబాద్‌
* అమిటీ యూనివర్సిటీ, లఖ్‌నవూ, నోయిడా
* బనారస్‌ హిందూ యూనివర్సిటీ, వారణాసి
* కళశలింగం యూనివర్సిటీ, తమిళనాడు
* కురుక్షేత్ర యూనివర్సిటీ, కురుక్షేత్ర
* ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ టీచర్స్‌ ట్రైనింగ్‌, హైదరాబాద్‌, బిలాయ్‌, తమిళనాడు, బెంగళూరు


Back..

Posted on 01-05-2019