Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
పేద విద్యార్థులకు కోర్సులు ఉచితం

* డిగ్రీ, పీజీ, లా, ఇంటిగ్రేటెడ్‌ బీఎస్సీ ఎడ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు అజీం ప్రేమ్‌జీ వర్సిటీ ప్రకటన

పేరున్న సంస్థ.. ప్రసిద్ధ కోర్సులు. రూ. లక్షల్లో ఫీజు. అయినా అల్పాదాయ వర్గాలకు అంతా ఉచితం. ప్రామాణిక విద్యకు ప్రఖ్యాతి చెందిన అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్సిటీ ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు అందిస్తున్న అద్వితీయ అవకాశం. వచ్చే విద్యాసంవత్సరం యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలువరించింది. ఆదాయాన్ని అనుసరించి కొందరికి ఉచితంగా, ఇంకొందరికి రాయితీలతో కోర్సులను అందిస్తోంది.

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతోపాటు వారిలో సామాజిక స్పృహ పెంచడానికి అజీం ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం కృషి చేస్తోంది. మేటి ఫ్యాకల్టీ, ఆధునిక వసతులు, ఆహ్లాదకరమైన వాతావరణంలాంటి ప్రత్యేకతలతో బెంగళూరులో ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. సమాజానికి నాణ్యమైన మానవ వనరులు అందించే లక్ష్యంతో కోర్సులను రూపొందించారు. సైన్సెస్‌, ఆర్ట్స్‌, హ్యుమానిటీస్‌, న్యాయవిద్య, బోధన రంగాల్లో ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ సంస్థలో చదవడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. అన్ని కోర్సులవారికీ కామన్‌ కరిక్యులమ్‌తోపాటు, ప్రతి కోర్సులోనూ మేజర్‌ (కంపల్సరీ), ఎలెక్టివ్‌లు ఉంటాయి.

ఉమ్మడి ప్రవేశపరీక్ష
బీఏ, బీఎస్సీ, బీఎస్సీ-బీఎడ్‌ అన్ని కోర్సులకూ ఉమ్మడిగానే పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో రెండు విభాగాలుంటాయి. ఆబ్జెక్టివ్‌ విభాగంలో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, క్వాంటిటేటివ్‌ రీజనింగ్‌ ఒక్కో విభాగం నుంచి 18 చొప్పున 36 ప్రశ్నలు వస్తాయి. వీటిని 2 గంటల వ్యవధిలో పూర్తిచేయాలి. ప్రతి సరైన జవాబుకూ 2 మార్కులు ఇస్తారు. సమాధానం తప్పుగా గుర్తిస్తే ఒక మార్కు తగ్గిస్తారు. మరో విభాగంలో ఎస్సే /డేటా ఎనాలిసిస్‌/ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ల్లో ఒక వ్యాసరూప ప్రశ్న వస్తుంది. అభ్యర్థి ఎంచుకున్న కోర్సుపై ఆధారపడి ఏదో ఒక విభాగం ప్రశ్నకు ఆన్సర్‌ రాయాలి. వ్యవధి ఒక గంట. అర్హత: సంబంధిత గ్రూప్‌లో 50 శాతం మార్కులతో 2019లో ఇంటర్‌ ఉత్తీర్ణత. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ అర్హులే. వయసు 19 ఏళ్లలోపు ఉండాలి. దరఖాస్తు చివరి తేదీ నవంబరు 22. పరీక్ష డిసెంబరు 8న నిర్వహిస్తారు. హైదరాబాద్‌, విజయవాడల్లో పరీక్షాకేంద్రాలు ఉన్నాయి. ఇంటర్వ్యూలను జనవరి 3, 4, 5 తేదీల్లో నిర్వహిస్తారు తరగతులు జులై నుంచి ప్రారంభమవుతాయి.

ఫీజు
బీఏ, బీఎస్సీ, బీఎస్సీ-బీఎడ్‌.. ఏ కోర్సులో చేరినా తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.6 లక్షలలోపు ఉంటే పూర్తి ఫీజు మినహాయింపు లభిస్తుంది. వసతి కూడా ఉచితమే. రూ.6-10 లక్షల లోపు ఉంటే 75 శాతం, రూ. 10-14 లక్షల మధ్య 50 శాతం, రూ. 14-18 లక్షల మధ్య ఉన్నవారికి 25 శాతం ఫీజు, వసతిలో రాయితీ లభిస్తుంది. రూ.18 లక్షలకు మించి వార్షికాదాయం ఉన్నవారు బీఏ, బీఎస్సీ కోర్సులకు మూడేళ్లకూ కలిపి ఫీజు, వసతి కోసం రూ.8.46 లక్షలు చెల్లించాలి. బీఎస్సీ బీఎడ్‌ కోర్సులకైతే నాలుగేళ్లకూ కలిపి రూ.9.18 లక్షలు అవసరమవుతాయి. రుణ సౌకర్యం ఉంది.

పీజీ కోర్సుల్లోకి..
ఎంఏ, ఎల్‌ఎల్‌ఎం కోర్సులన్నింటికీ ప్రవేశపరీక్ష ఉమ్మడిగా ఉంటుంది. ఇందులో 2 విభాగాలుంటాయి. పార్ట్‌-1లో 80 బహుళైచ్ఛిక ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. పరీక్ష వ్యవధి 2 గంటలు. రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ 25, రీజనింగ్‌ ఎబిలిటీ 10, క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ 25, జనరల్‌ అండ్‌ సోషల్‌ అవేర్‌నెస్‌ 20 చొప్పున ప్రశ్నలు వస్తాయి. పార్ట్‌ -2లో ఎంఏ కోర్సులకు సంబంధించి అభ్యర్థి తొలి ప్రాధాన్యం ఇస్తున్న సబ్జెక్టుపై 500 పదాల్లో వ్యాసం రాయాలి. ఎల్‌ఎల్‌ఎం కోర్సులో చేరాలనుకున్నవారికి 2 వ్యాసాలు ఇస్తారు. వాటిలో ఒకటి రాయాలి. వ్యవధి ఒక గంట. అర్హత: ఏ విభాగంలోనైనా డిగ్రీ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆఖరి సంవత్సరం చదువుతున్న వారూ అర్హులే. ఎల్‌ఎల్‌ఎం (లా అండ్‌ డెవలప్‌మెంట్‌) కోర్సులోకి ప్రవేశించాలంటే ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణులై ఉండాలి. ఆఖరి సంవత్సరం విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ జనవరి 22. పరీక్ష తేదీ ఫిబ్రవరి 8. ప్రవేశపరీక్షను హైదరాబాద్‌, విశాఖపట్నంల్లో నిర్వహిస్తారు. డిగ్రీ తర్వాత రెండేళ్లు, ఆ పైన పని అనుభవం ఉన్నవారి కోసం దరఖాస్తుల గడువు, పరీక్ష తేదీలను వేర్వేరుగా ప్రకటించారు. వివరాలు నోటిఫికేషన్‌లో ఉన్నాయి. ఫీజు: నాలుగు లక్షల లోపు వార్షికాదాయం ఉంటే పూర్తి ఫీజు మినహాయింపు లభిస్తుంది.

ఇవీ కోర్సులు
బీఏ: ఎకనామిక్స్‌, హ్యుమానిటీస్‌; బీఎస్సీ: ఫిజిక్స్‌, మ్యాథ్స్‌, బయాలజీ; బీఎస్సీ బీఎడ్‌: ఫిజికల్‌ సైన్సెస్‌, లైఫ్‌ సైన్సెస్‌, మ్యాథమేటిక్స్‌ ఎంఏ: ఎడ్యుకేషన్‌, డెవలప్‌మెంట్‌, పబ్లిక్‌ పాలసీ అండ్‌ గవర్నెన్స్‌, ఎకనామిక్స్‌; ఎల్‌ఎల్‌ఎం. పరీక్షలో చూపిన ప్రతిభ, ఇంటర్వ్యూల ద్వారా ప్రవేశం.

ప్లేస్‌మెంట్లు
కోర్సులు పూర్తిచేసుకున్నవారికి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ల ద్వారా ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. వివిధ కంపెనీలు నియామకాలు చేపడతున్నాయి. ఇక్కడ పీజీ, ఇంటిగ్రేటెడ్‌ బీఎస్సీ బీఎడ్‌ చదివినవారికి నెలకు రూ.30 వేల నుంచి రూ. 35 వేల వరకు వేతనంతో సంస్థలు ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. అనుభవం ఉన్నవారికి ఇంతకంటే పెద్దమొత్తం ఇస్తున్నాయి.

వెబ్‌సైట్‌: http://azimpremjiuniversity.edu.in

 

Back..

Posted on 12-11-2019