Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
వూరించే ఉద్యోగాలు!

తాజాగా దేనా బ్యాంకు పీజీడీబీఎఫ్‌ కోర్సు ద్వారా 200 పీఓ పోస్టులకూ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 270 క్రెడిట్‌ ఆఫీసర్లు, 400 మేనేజర్లు కొలువుల నియామకానికి ప్రకటనలు విడుదల చేశాయి. వీటిలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు పీజీ ఫైనలియర్‌ పరీక్షలు రాసి జూన్‌ 30లోగా ఫలితాలు వెలువడే అవకాశమున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు!
ఈ నెలలోనే బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ కూడా పీఓ, స్పెషలిస్ట్‌ ఆఫీసర్ల భర్తీకి ప్రకటనలు వెలువరించాయి. తాజా నోటిఫికేషన్లు వాటికి అదనంగా ఉండి అభ్యర్థులకు ఎక్కువ అవకాశాలు కలుగజేస్తున్నాయి.
దేనా బ్యాంక్‌ పీఓ పోస్టుల భర్తీకి ఎమిటీ యూనివర్సిటీతో కలిసి 12 నెలల పీజీ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ &ఫైనాన్స్‌ కోర్సు నిర్వహిస్తుంది. దీనిలో 9 నెలల పాటు ఆన్‌-క్యాంపస్‌ ప్రోగ్రామ్‌, 3 నెలల పాటు ఏదైనా దేనా బ్యాంక్‌ బ్రాంచిలో ఆన్‌ ద జాబ్‌ ప్రోగ్రామ్‌ ఉంటాయి. కోర్సు పూర్తిచేసినవారిని ప్రొబేషనరీ ఆఫీసర్లు (స్కేల్‌-I)గా నియమిస్తారు. ఈ కోర్సు సమయంలో స్టైపెండ్‌ ఇస్తారు.
అభ్యర్థుల ఎంపిక దేనా బ్యాంకులో ఆన్‌లైన్‌ రాత పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూల ద్వారా; బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఆన్‌లైన్‌ రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఉంటుంది.
రెండు బ్యాంకుల్లోని రాత పరీక్షల్లో రుణాత్మక మార్కులు ఉన్నాయి. అభ్యర్థులు గుర్తించే ప్రతి తప్పు సమాధానానికీ ఆ ప్రశ్నకు ఉన్న మార్కుల్లో 0.25 కోల్పోతారు.

సబ్జెక్టులు - అవగాహన
ఐబీపీఎస్‌ పీఓ పరీక్ష స్థాయిలోనే అదే తరహా ప్రశ్నలు ఈ పరీక్షల్లో ఉంటాయి.

రీజనింగ్‌: దీనిలోని టాపిక్స్‌ను జనరల్‌ రీజనింగ్‌, అనలిటికల్‌/ క్రిటికల్‌ రీజనింగ్‌లుగా చూడవచ్చు. డేటా సఫిషియన్సీ నుంచి కూడా ప్రశ్నలుంటాయి. పీఎ స్థాయిలోని పరీక్షల్లో అనలిటికల్‌/ క్రిటికల్‌ రీజనింగ్‌ ప్రశ్నలు ఎక్కువగా వస్తుంటాయి. అభ్యర్థులు ఈ టాపిక్స్‌ అన్నింటినీ బాగా అవగాహన చేసుకుని సాధన చేయాలి.

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: అన్నింటిలోనూ ఎక్కువ సమయం తీసుకునేది కావడంతో ఇది కాస్త కఠినంగా అనిపిస్తుంది. అయితే టాపిక్స్‌ను బాగా నేర్చుకుని ఎక్కువగా సాధన చేస్తే వీలైనన్ని ఎక్కువ మార్కులు కచ్చితంగా సాధించగలిగే విభాగమిది. దీనిలో దాదాపు సగం ప్రశ్నలు డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ నుంచి ఉంటాయి. ప్రశ్నలు వేగంగా, తక్కువ సమయంలో, తప్పులు లేకుండా సాధించడానికి వీలైనంత ఎక్కువగా సాధన అవసరం.

జనరల్‌ అవేర్‌నెస్‌: ఈ విభాగంలో బ్యాంకింగ్‌, ఆర్థిక విషయాలు కేంద్రంగా వచ్చే వర్తమానాంశాల ప్రశ్నలు ఎక్కువ. బ్యాంకింగ్‌ వ్యవస్థ, ఆర్థిక సంస్థలు, బడ్జెట్‌, స్టాక్‌మార్కెట్‌, ఆర్‌.బి.ఐ., కేంద్ర ప్రభుత్వ పథకాలు బాగా చూసుకోవాలి. దిన పత్రికలు, కరెంట్‌ అఫైర్స్‌ పుస్తకాలు చదువుతూ సొంతంగా నోట్సు తయారుచేసుకుంటూ సిద్ధమయితే మార్కులు అధికంగా సాధించవచ్చు.

ఇంగ్లిష్‌ లాంగ్వేజి: ఈ విభాగాన్ని ఆబ్జెక్టివ్‌, డిస్క్రిప్టివ్‌ పరీక్షలు (దేనా బ్యాంకులో) రెండింటిలో చూడవచ్చు. గ్రామర్‌పై పట్టు సాధిస్తే ఆబ్జెక్టివ్‌ టెస్టులో ప్రశ్నలు సులభంగా సాధించవచ్చు. రైటింగ్‌ స్కిల్‌పై డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ ఆధారపడి వుంటుంది. ప్రామాణిక ఇంగ్లిష్‌ దిన పత్రికలూ, ఎడిటోరియల్స్‌, లెటర్స్‌ టు ఎడిటర్‌ మొదలైనవి చదవాలి.
ఫైనాన్షియల్‌ మేనేజమెంట్‌ (బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు మాత్రమే): దీనిలో ప్రశ్నలు వచ్చే అవకాశమున్నవి- ఇంట్రడక్షన్‌, ఫైనాన్షియల్‌ సిస్టమ్‌, సోర్సెస్‌ ఆఫ్‌ ఫైనాన్సింగ్‌, కాపిటలైజేషన్‌, కాపిటల్‌ స్ట్రక్చర్‌, లెవరేజి, డివిడెండ్‌ డెసిషన్‌, కాపిటల్‌ బడ్జెటింగ్‌, వర్కింగ్‌ కాపిటల్‌ మొ॥వి.

సన్నద్ధత ఏ విధంగా?
దేనా బ్యాంక్‌ పరీక్ష జూన్‌ 11న జరుగుతుంది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పరీక్ష తేదీలను ఇంకా ప్రకటించలేదు. ఇంతకుముందు వెలువడిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా పీఓ పరీక్షకు దరఖాస్తు చేసి సిద్ధమవుతున్నవారికి అదే సన్నద్ధత సరిపోతుంది. కొత్తగా ప్రారంభించిన అభ్యర్థులు మాత్రం అన్ని విభాగాలనూ, వాటి టాపిక్స్‌నూ అవగాహన చేసుకోవాలి; వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలు సాధన చేయాలి.
బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పరీక్షలకు అర్హత ఉన్న అభ్యర్థులకు దేనా బ్యాంక్‌ పీఓ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా పీఓకు కూడా దరఖాస్తు చేసుకోవాలి. (బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా దరఖాస్తు చివరి తేదీ 01.05.2017)
పరీక్షలకు తక్కువ వ్యవధి ఉన్నప్పటికీ ప్రతిరోజూ 10-12 గంటల సమయం కేటాయిస్తే పరీక్షకు సిద్ధమవ్వచ్చు. ఈ పరీక్షలు అయ్యాక ఇదే సన్నద్ధతను అలాగే కొనసాగిస్తే రాబోయే ఐ.బి.పి.ఎస్‌., పి.ఒ. క్లర్క్‌, ఆర్‌.ఆర్‌.బి. (రూరల్‌ బ్యాంకులు) పరీక్షలకు బాగా ఉపయోగం.
Back..

Posted on 01-05-2017