Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
మౌఖిక పరీక్షలో మీ సత్తా చూపండి!

     రాతపరీక్షలో ప్రతిభ చూపించి నెగ్గుకొచ్చినవారు కీలకమైన మౌఖిక పరీక్షలోనూ సత్తా చూపించాలి. ఉద్యోగసాధనకు ఇది అత్యావశ్యకం. నియామకాల ప్రక్రియలో భాగంగా రాతపరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నేపథ్యంలో పాటించవలసిన మెలకువలు..
ఆఫీసర్‌ పోస్టు కోసం జరగబోయే మౌఖికపరీక్షలో అభ్యర్థులు ఆంగ్లభాషపై తమకున్న పట్టును నిరూపించుకోవాలి. అంటే సమాధానాలు ఇంగ్లిష్‌లో మాత్రమే చెప్పవలసి ఉంటుంది. ఉద్యోగం ఖరారైన తరువాత దేశంలో ఏ ప్రదేశంలోనైనా ఉద్యోగం రావచ్చు. అందుకని ఇంగ్లిష్‌పై పట్టు తప్పనిసరి.
క్లరికల్‌ పోస్టులు రాష్ట్రస్థాయిలో జరుగుతాయి. ప్రాంతీయ భాషపై (తెలుగు- ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులకు) పట్టు తప్పనిసరి.
రాతపరీక్షలో అభ్యర్థులు సబ్జెక్టుపై తమకున్న పట్టు నిరూపించుకున్నారు కాబట్టి, మౌఖికపరీక్షలో సబ్జెక్టు గురించి ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం లేదు.
వేటిపై దృష్టిపెట్టాలి?
1. భావ వ్యక్తీకరణ
2. సానుకూల దృక్పథం
3. కెరియర్‌పై పూర్తి అవగాహన
4. గ్రాడ్యుయేషన్‌/ పీజీలో చదివిన సబ్జెక్టులు
5. అభ్యర్థుల ఇంటిపేరు/ పేరు/ వూరు/ జిల్లాలకు ఉన్న ప్రాముఖ్యాలు- ప్రత్యేకతలు
6. కరంట్‌ అఫైర్స్‌ (ప్రత్యేకంగా పరీక్ష రోజు నాటి దినపత్రిక)
7. భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ పాలసీలు
8. ఇన్సూరెన్స్‌ కంపెనీలోని పోస్టులకు- ఆ కంపెనీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి.
9. బ్యాంకింగ్‌ టెర్మినాలజీ
10. ఐబీపీఎస్‌- క్లర్క్‌ పరీక్ష కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులు, నేషనల్‌ బ్యాంకు గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి.
డ్రస్‌ కోడ్‌: మౌఖికపరీక్ష రోజు అభ్యర్థులు డ్రస్‌కోడ్‌ తప్పనిసరిగా పాటించాలి. ముదురు రంగు దుస్తులు ధరించరాదు.
పురుషులు: ఇస్త్రీ చేసిన దుస్తులు ధరించాలి. క్లీన్‌ షేవ్‌, హెయిర్‌ కట్‌ నీటుగా ఉండాలి. ఇన్‌షర్ట్‌ చేస్తే చూడడానికి బాగుంటుంది. షూ వేసుకుని చక్కగా పాలిష్‌ చేయించుకోవాలి. జీన్స్‌ పాంట్‌, టీ షర్ట్‌ వేసుకోకూడదు. ఫుల్‌హ్యాండ్‌ షర్ట్‌ వేసుకున్నట్త్లెతే చేతులు మడవకూడదు. గుండీలు పెట్టుకోవాలి.
మహిళలు: పార్టీలకు ధరించే దుస్తులు వేసుకోకూడదు. ఎక్కువ మేకప్‌ వేసుకోకూడదు. తలలో పూలు పెట్టుకోరాదు. హై హీల్‌ చెప్పులు వేసుకోకూడదు.
ఆశించదగ్గ ప్రశ్నలు
* Tell me about yourself
* Types of banks, bank rates, banking related act, functions of RBI
* Insurance company policies
* Lates news related to Banking, Finance, Insurance companies
* Latest news related to 'RBI'
* State/ Central cabinet ministers
* Central government policies
* Bank/ Insurance company norms
* Why Banking?
* What if posted in remote area?
* What is the bank/ govt office visited recently etc
ఈ తరహా ప్రశ్నలు సాధారణంగా అడుగుతూ ఉంటారు. వీటిని గమనించుకుంటూ, రెజ్యూమెలో ఇచ్చిన సమాచారానికి తగ్గట్టుగా సన్నద్ధం అవడం మంచిది.
వీటిని పాటించాలి
* నిర్ణీత సమయానికి 15 నిమిషాలు ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.
* కావాల్సినవి సర్టిఫికెట్స్‌/ డాక్యుమెంట్లను ముందు రోజే అమర్చుకోవాలి.
* ఇంటర్వ్యూ పానెల్‌ సభ్యులను (గుడ్‌ మార్నింగ్‌/ గుడ్‌ ఆఫ్టర్‌నూన్‌) అని విష్‌ చేయాలి.
* ప్రతి అభ్యర్థి చేతిలో సర్టిఫికెట్స్‌ ఫైల్‌, పురుషులు చొక్కా జేబులో కలం పెట్టుకోవాలి.
* Introduce yourself అనే ప్రశ్నకు సమాధానాన్ని ముందుగా సిద్ధమవాలి. ముందుగా పేరు, వూరు, 10, ఇంటర్‌, గ్రాడ్యుయేషన్‌ చదివిన విద్యాలయాలు, అభిరుచి మొదలైనవి.
* ఇంటర్వ్యూ జరుగుతున్నంత వరకూ 'ఐ కాంటాక్ట్‌' జాగ్రత్తగా కొనసాగించాలి.
* ముఖంలో ఒత్తిడి కనిపించకుండా చిరునవ్వుతో ఉండాలి.
* తెలిసిన ప్రశ్నకు కచ్చితమైన సమాధానం చెప్పాలి. తికమక పెట్టడానికి ప్రయత్నించినా, తడబడకుండా జవాబివ్వాలి.
* తెలియని ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ప్రయత్నించకూడదు. అలా ప్రయత్నిస్తే దానికి సంబంధించి ఇంకొన్ని ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి సున్నితంగా తెలియదని చెప్పాలి.
* సానుకూల దృక్పథంతో మెలగాలి- తెలియని సమాచారాన్ని ఇంటర్వ్యూ బోర్డులోని వారు చెప్పినపుడు థాంక్యూ సర్‌/ మేడం అని విష్‌ చేయడం, తెలియని ప్రశ్నలకు నిజాయతీగా 'తెలియదు' అని చెప్పడం వంటివి ముఖ్యం.
* సమాధానం చెప్పే సమయంలో అత్యుత్సాహం ప్రదర్శించకూడదు. తెలిసిన ప్రశ్నలు అడిగిన వెంటనే ఉత్సాహంగా చెప్పకూడదు.
* చివరిగా థాంక్యూ సర్‌/ మేడం అని చెప్పి ముగించాలి.
చేయకూడని పనులు
* మౌఖిక పరీక్ష ముగించిన అభ్యర్థులతో ఎక్కువగా మాట్లాడకూడదు.
* నిర్లక్ష్యంగా/ అజాగ్రత్తగా ఉండకూడదు.
* కాళ్లు, చేతులూ టేబుల్‌పై నిర్లక్ష్యంగా ఉంచకూడదు. సమాధానం చెప్పే సమయంలో దిక్కులు చూడడం, పైకి- కిందకి చూడడం వంటివి చేయకూడదు.
* అనవసరమైన విషయాలూ, తెలియని ప్రశ్నకు సమాధానాలూ చెప్పకూడదు.
* చప్పుడు వచ్చే పనులేవీ ఇంటర్వ్యూలో చేయకూడదు.
* పదోన్నతి, జీతభత్యాలు వంటి అంశాలు ప్రస్తావించకూడదు.

posted on 26.1.2015