Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
పోటీకీ ప్రాణాధారం.. ప్రాథమికాంశలే

పోటీ పరీక్షల అభ్యర్థులకు నిపుణులూ, అనుభవజ్ఞులూ తరచూ ఇచ్చే ప్రధాన సలహా... ‘ప్రాథమికాంశాలపై దృష్టి పెట్టండి’ అని. ఏమిటా అంశాలు? వాటికున్న ప్రాధాన్యం, పట్టు పెంచుకునే విధానం తెలుసుకుందామా?
కావ్య, శ్రుతి- ఇద్దరూ తెలుగు రాష్ట్రాల్లో సర్వీస్‌ కమిషన్లు నిర్వహించే గ్రూప్‌-2 పరీక్షకు సన్నద్ధమవుతున్నారు. వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) ఇటీవల బాగా వార్తల్లో ఉన్నందువల్ల సమకాలీన అంశాల విభాగంలో దీనిపై ఒకటి, రెండు ప్రశ్నలు అనివార్యమని అందరూ గట్టిగా నమ్ముతున్నారు. దీంతో ఈ అంశంపై వీరిద్దరూ వీలైనంత సమాచారం సేకరించుకుని సన్నద్ధమవుతున్నారు.
కావ్య ఏ అంశం గురించైనా అందుబాటులో ఉన్న విషయాలను సేకరించుకుని చదివే స్వభావం గల అభ్యర్థి. కానీ శ్రుతిది కొంచెం భిన్నమైన ప్రవృత్తి. తాను చదివే అంశం గురించి కేవలం తాజా విషయాలే కాకుండా అన్వేషణ ప్రవృత్తితో ఆ అంశానికి సంబంధించిన ప్రాథమిక విషయాలను (బేసిక్స్‌) చదవందే వదలదు. ఇదే ఆమెకు లాభించింది. నమూనా పరీక్షల్లో జీఎస్‌టీపై అందరూ ఆశించే ప్రశ్నలు..
* జీఎస్‌టీ ఎన్నో రాజ్యాంగ సవరణ బిల్లు? (122)
* ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టంగా జీఎస్‌టీ నిలిచింది? (101 సవరణ)
* జీఎస్‌టీ బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రమేది? (అసోం)
ఇలాంటివి రాకుండా నమూనా ప్రశ్నపత్రంలో ప్రత్యక్షమైన ప్రశ్న...
* 101వ రాజ్యాంగ సవరణను అనుసరించి వస్తు, సేవల పన్నుకోసం కొత్తగా చేర్చిన రాజ్యాంగ నిబంధన ఏది?
ఈ ప్రశ్నకు జవాబు కావ్య గుర్తించలేకపోయింది. శ్రుతి మాత్రం ఆర్టికల్‌ 279 (ఎ) జవాబుగా గుర్తించి మార్కు పొందగలిగింది. జీఎస్‌టీ బిల్లు చట్టబద్ధమైన క్రమంలో పార్లమెంట్‌ ప్రక్రియ మొత్తంలో కీలకమైన అంశమిదే.
రాజ్యాంగ సవరణ ద్వారా ప్రభావితమైన ఆర్టికల్‌పై అడగడం మౌలిక ప్రశ్నగా పరిగణించాలి. ఈ నిబంధన ప్రకారం కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసి దేశం మొత్తానికి వర్తించే ఏకీకృత పన్నుల వ్యవస్థను రూపొందించవచ్చు. పోటీపరీక్ష ప్రాథమిక అంశాలను చదవడం అంటే ఇదే!
చాలామంది అభ్యర్థులు ఈ తరహా ప్రశ్నలకు జవాబులు రాయలేరు. సాధారణ ప్రశ్నలన్నింటికీ జవాబులు గుర్తించినా ఈ తరహా ప్రాథమిక అంశాలను స్పృశిస్తూ ఇచ్చే ప్రశ్నల విషయంలో అవగాహన లేకపోవడంతో వెనకబడుతుంటారు. పోటీపరీక్షల అభ్యర్థిగా చూపాల్సిన సహజ ఆసక్తి, మౌలికాంశాలను తెలుసుకోవాలన్న కుతూహలం లేకపోవడమే ఇందుకు కారణం.
ఏ రంగంలోనైనా ప్రాథమిక అంశాలు తెలిసి ఉండడం ఆ పునాదిపై ఎప్పటికప్పుడు కొత్త విషయాలతో తాజాగా రాణించగలగడం ఒక జీవన నైపుణ్యం. విద్య, ఉద్యోగ పోటీపరీక్షల్లో సైతం ఇదే నైపుణ్యం అభ్యర్థుల జయాపజయాలను నిర్దేశిస్తుంటుంది.
నిజానికి సివిల్‌ సర్వీసెస్‌, బ్యాంకులు, రాష్ట్ర సర్వీస్‌ కమిషన్‌ పరీక్షల్లో సబ్జెక్టు ఏదైనా అందులో మౌలికాంశాలపై ఇచ్చే ప్రశ్నలే కీలకం. వీటిని ఎవరు పరిష్కరించగలుగుతారో వారే ఉద్యోగ ఎంపిక జాబితాలో ఉంటారు. అందుకే ప్రాథమిక విషయాపై పట్టు తెచ్చుకోవడం పలువిధాల అభ్యర్థికి ప్రయోజనకరం.

తాజా అంశాలకు పునాది
పోటీ పరీక్షార్థులు వర్తమాన అంశాలను ఎప్పటికపుడు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. హఠాత్తుగా ఆర్థిక, శాస్త్ర, సాంకేతిక, పరిపాలన, రాజ్యాంగపరంగా సంభవించే పరిణామాలను అవగాహన చేసుకోవాలంటే వాటి ప్రాథమిక అంశాలపై అవగాహన తప్పనిసరి. ఉదాహరణకు ఇటీవల కశ్మీర్‌లో జరిగిన ఉరీ ఉగ్రవాదుల సంఘటననే తీసుకుందాం.
కొందరు ఉగ్రవాదులు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే) సరిహద్దున ఉన్న కంచెను కత్తిరించి భారతదేశ సరిహద్దుల్లోకి చొరబడి అక్కడ కాపలాగా ఉన్న సైనికుల గుడారాలపై దాడిచేసిన సంఘటన యావద్దేశాన్నీ కలచివేసింది. ఈ సంఘటనలో కీలకాంశం- పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ అన్నది స్పష్టం. దీనిపై ప్రాథమిక అవగాహన లేకపోతే ఇతర పరిణామాలు అర్థం కావడం కష్టం. 1947లో భారత్‌- పాక్‌ల మధ్య మొదటి యుద్ధం జరిగింది. భారత్‌ ఐక్యరాజ్యసమితిని ఈ వివాద పరిష్కారం కోసం కోరగా- కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. అప్పటికే పాకిస్థాన్‌ చొరబడిన భూభాగం వద్ద 1972లో ప్రస్తుత వాస్తవాధీన రేఖ (లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌) స్థిరపడింది. దీని పక్కనే ప్రస్తుత సంఘటన ఉరీ ప్రాంతం ఉంది.

తాజా పరిణామాలపై తక్షణావగాహన
నిత్యం జరుగుతున్న వివిధ తాజా పరిణామాలకు మూలాలు వేరుగా ఉంటాయి. వాటిపై అవగాహన ఉన్న అభ్యర్థికి తాజా పరిణామాలు తక్షణం అర్థమవుతాయి. ఉదాహరణకు- ఇటీవల భారత్‌ క్రయోజనిక్‌ ఇంజిన్ల తయారీలో స్వయం ప్రతిపత్తి సాధించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో క్రయోజనిక్‌ ఇంజిన్‌ను రూపొందించే సామర్థ్యాన్ని గడించింది. అయితే ఈ సందర్భంలో అసలు క్రయోజనిక్‌ ఇంజిన్‌ సాంకేతిక పరిజ్ఞానంపై మౌలిక అవగాహన కొరవడితే తాజా పరిణామ ప్రాధాన్యం అర్థం కాదు.
భారీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకువెళ్లడానికి వీలుగా రాకెట్‌లోని అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రత వద్ద ఇంధనాన్ని ఉపయోగించుకునే ఇంజిన్‌ను క్రయోజనిక్‌ ఇంజిన్‌ అంటారు. దీన్ని ఉపగ్రహాలను తీసుకువెళ్లే రాకెట్‌ల మోటార్లలో అమరుస్తారు. క్రయోజనిక్‌ ఇంజిన్‌లో హైడ్రోజన్‌ను ఇంధనంగా, గాలిలోని ఆక్సిజన్‌ను ఆక్సిడైజర్‌గా ఉపయోగిస్తారు.

త్వరితగతిన అవగాహన
ఒక విషయంపై ప్రాథమిక అవగాహన ఉంటే దానికి సంబంధించిన ఏ అంశాన్నయినా తక్కువ సమయంలో అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు- కంప్యూటర్‌ హఠాత్తుగా ఆగిపోయింది. విద్యుత్‌ సరఫరా బాగానే ఉంది కానీ సిస్టం పనిచేయడం లేదు.
వెంటనే సంబంధిత వ్యక్తిని సంప్రదిస్తే.. ‘అది బూటింగ్‌ సమస్య, ఒకసారి బూట్‌ చేసి చూడండి, సిస్టమ్‌ పనిచేస్తుంద’ని సలహా ఇస్తారు. ఆపరేటింగ్‌ సిస్టంలోని ఫైళ్లను మెమరీలోకి లోడ్‌ చేసే విధానాన్ని బూటింగ్‌ అంటారు. బూటింగ్‌ను ఫ్లాపీ డిస్క్‌ ద్వారాకానీ, హార్డ్‌డిస్క్‌ ద్వారాకానీ చేయవచ్చని తెలిస్తే పని సులువవుతుంది. ఈ ప్రాథమిక అవగాహన లేకపోతే మళ్లీ ఇంకొకరిని సంప్రదించాల్సి వస్తుంది.
సివిల్‌ సర్వీసెస్‌, బ్యాంకులు, రాష్ట్ర సర్వీస్‌ కమిషన్‌ పరీక్షల్లో సబ్జెక్టు ఏదైనా అందులో మౌలికాంశాలపై ఇచ్చే ప్రశ్నలే కీలకం. వీటిని ఎవరు పరిష్కరించగలుగుతారో వారే ఉద్యోగ ఎంపిక జాబితాలో ఉంటారు.

విశ్లేషణ సామర్థ్యం
మౌలిక అవగాహన ఉంటే ఆ విషయంపై చక్కని విశ్లేషణ చేసే అవకాశం ఉంటుంది. పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు ఈ నైపుణ్యం వ్యాసరూప ప్రశ్నలకు జవాబులు రాసేటపుడు ఎంతగానో అక్కరకు వస్తుంది. ఇటీవల తెలంగాణలో కురిసిన భారీ వర్షాల వల్ల హైదరాబాద్‌ నగరం జలమయం అయింది. చాలా ప్రాంతాల్లో మూడు, నాలుగు అడుగుల మేరకు నీరు వచ్చేసింది. నగరంలో ట్రాఫిక్‌ స్తంభించి గంటల తరబడి రోడ్లపై జనం నరకయాతన అనుభవించారు. ఈ సమస్య ఒక్క హైదరాబాద్‌ నగరానికే కాదు. ఒకప్పుడు ముంబయి, తరువాత చెన్నై కూడా ఈ సమస్యను ఎదుర్కొన్నాయి. దీనిపై సివిల్స్‌, గ్రూప్‌-1 స్థాయి మెయిన్‌ పరీక్షల్లో ‘ప్రతికూల వాతావరణ పరిస్థితులు, అధిక వర్షపాతం కారణంగా నగరాల్లో విపత్తు నిర్వహణ’ అనే కోణం నుంచి ప్రశ్న వస్తే ఈ విషయంపై ప్రాథమిక అవగాహన ఉంటేనే కలం కదులుతుంది.
హైదరాబాద్‌కానీ ఇతర నగరాల్లోకానీ మురుగు కాలువలపై అక్రమ కట్టడాలు, నగర ఆధునిక జీవితంలో మితిమీరిన ప్లాస్టిక్‌ వినియోగం కారణంగా భారీ వర్షాలు వచ్చినపుడు డ్రైనేజీ వ్యవస్థ విఫలమవుతోంది. సహజంగా నీటిని తమలోకి చేర్చుకునే చెరువుల ఆక్రమణ, కొన్ని చోట్ల సకాలంలో పూడికలు తీయకపోవడం ఇతర కారణాలు. వీటిపై కనీస అవగాహన ఉంటే ఈ సమస్యను విశ్లేషించి ఆపై పరిష్కార మార్గాలు సూచించవచ్చు.

ఆలోచనా పరిధి పెంపు
ప్రాథమిక అవగాహన... పోటీపరీక్షలకు వెళ్లే అభ్యర్థి ఆలోచనాసరళిని పెంచుతుంది. ఇంకా తెలుసుకోవాలన్న జిజ్ఞాస అంకురించి కొత్త జ్ఞాన ద్వారాలు తెరుచుకుంటాయి. అందరూ చాలా సాధారణంగా తీసుకునే రెండు విషయాలపై ఇటీవల నూతన పరిణామాలు జరిగాయి.
వీటిలో ఒకటి- ఎప్పటినుంచో అనుసరిస్తున్న ఆర్థిక సంవత్సరం. మనదేశంలో ఆర్థిక, వాణిజ్య వ్యవహారాలకు ఆర్థిక సంవత్సరం ఏటా ఏప్రిల్‌ 1వ తేదీన ప్రారంభమై మరుసటి ఏడాది మార్చి 31తో ముగుస్తుందని తెలిసిందే.
అయితే ఈ తేదీలనే ఎందుకు అనుసరించాలి? ఈ సమయానికి ఏదైనా ప్రాధాన్యం ఉందా? దీనికి ప్రత్యామ్నాయ తేదీలేంటి? అన్న విషయాలను అంచనా వేయడానికి కేంద్రప్రభుత్వం ఇటీవల డాక్టర్‌ శంకర్‌ ఆచార్య కమిటీని నియమించింది. శంకర్‌ ఆచార్య ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారుగా పనిచేశారు.
రెండోది- జాతీయ స్థాయిలో రెండు బడ్జెట్లు ఉన్నాయి. ఒకటి కేంద్ర ఆర్థిక బడ్జెట్‌, రెండోది రైల్వే బడ్జెట్‌. ఎందుకిలా? ఇతర ఏ శాఖకూ లేని ప్రత్యేక బడ్జెట్‌ రైల్వేశాఖకే ఎందుకు? అన్న ఆలోచనతో ప్రభుత్వం 2017- 18 నుంచి రైల్వే బడ్జెట్‌ను ప్రధాన బడ్జెట్‌లో కలిపివేస్తోంది. ప్రభుత్వం బిబేక్‌ దేబ్రాయ్‌ కమిటీ చేసిన సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇది తెలియడంతోపాటు 1924లో బ్రిటిష్‌ హయాంలో ఆక్‌వర్త్‌ కమిటీ సిఫారసు మేరకు రైల్వేశాఖకు ప్రత్యేకించి బడ్జెట్‌ ప్రారంభమైందన్న మౌలిక అవగాహన ఉండడం వల్ల ఇప్పటి పరిణామాలపై ఆలోచనాసరళి వేగమవుతుంది.
మెయిన్స్‌, ఇంటర్వ్యూలకు ఉపయోగకరం
పాయింట్‌ నుంచి పాయింట్‌కు సమాచారం కేవలం తొలిదశ- వడపోత పరీక్షలకే పరిమితమవుతుంది. తరువాతి దశ- మెయిన్స్‌, ఆపై ఇంటర్వ్యూల్లో నిలబడాలంటే లోతైన, ప్రాథమిక స్థాయి నుంచి అవగాహన అవసరం.
ఉదాహరణకు- భారతదేశ చారిత్రక కాలంలో మధ్యయుగం నుంచి ఆర్థిక పరిస్థితిని అధ్యయనం చేయాల్సి వచ్చినపుడు కేవలం బిట్ల రూపంలో సమాచారాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలని ప్రయత్నిస్తే అది వడపోత పరీక్షకే పరిమితమవుతుంది. ఆ పరీక్షలో కూడా గట్టెక్కుతారన్న గ్యారంటీ లేదు. అదే మనదేశ ఆర్థిక వ్యవస్థకు మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయన్న ఆసక్తితో రాజపుత్ర యుగం నుంచి ప్రారంభించి మధ్యయుగం, స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్‌ కాలం, స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రణాళిక కాలం అన్న వర్గీకరణ చేసుకుని క్రమపద్ధతిలో అధ్యయనం చేస్తే మెయిన్స్‌కూ ఆదుకుంటుంది.
ఇంటర్వ్యూలో ఈ విషయంపై వచ్చే ప్రశ్నలకు చక్కగా జవాబులు ఇచ్చే సామర్థ్యం పెరుగుతుంది. మొత్తం మీద ప్రాథమిక అవగాహన పెంచుకునేలా చేసే పరిశీలన, అధ్యయనం బహుముఖ ప్రయోజనాలను కలిగిస్తుంది. సబ్జెక్టుపై సమగ్ర అవగాహన కల్పించి పోటీపరీక్షలను ఎదుర్కొనడంలో తగిన విశ్వాసాన్ని పాదుగొల్పుతుంది.

పట్టు రావాలంటే..?
పాఠశాల పుస్తకాలు: ఎనిమిదో తరగతి నుంచి ప్లస్‌ టూ స్థాయి వరకున్న సీబీఎస్‌ఈ పుస్తకాలు భౌతిక, రసాయన, జీవశాస్త్రాలు, భౌగోళిక, చరిత్ర, అర్థ, పౌర శాస్త్రాల్లోని ప్రాథమిక విషయాలపై స్పష్టత తెచ్చుకోవడానికి ఉపయోగపడతాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల పాఠశాల స్థాయి పుస్తకాలు కూడా ఇందుకు ఉపకరిస్తాయి. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతూ ఇపుడు వాటిని చదవడం వల్ల త్వరితగతిన అర్థమవుతాయి.
విజ్ఞాన సర్వస్వాలు: వివిధ సబ్జెక్టులపై వేర్వేరుగా ఉన్న విజ్ఞాన సర్వస్వాలు (ఎన్‌సైక్లోపీడియా) అవగాహన కలిగించడానికి దోహదం చేస్తాయి. ప్రాథమిక అంశాల నుంచి వీటిలో పొందుపరచి ఉంటున్నందున మౌలిక భావనలపై స్పష్టత ఏర్పడుతుంది. అయితే, ఏకధాటిగా చదవకుండా పోటీపరీక్షల సిలబస్‌లను చదువుతున్న సందర్భంలో ఎక్కడ సందేహం ఉత్పన్నమవుతుందో ఆ విషయాలనే పరిశీలన చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
అంతర్జాలం: కావాల్సిన సమాచారం చేతిలోని మొబైల్‌ ఫోన్‌కే అందుబాటులోకి వస్తున్న కాలంలో ఉన్నాం కాబట్టి ఈ సాంకేతిక విప్లవాన్ని పరీక్షల సన్నద్ధతకు సమర్థంగా వినియోగించుకునే ప్రయత్నం చేయాలి. సిలబస్‌లను అనుసరిస్తూ సన్నద్ధమవుతున్న తరుణంలో ఎక్కడ ఏ మౌలిక భావనపై స్పష్టత కొరవడినా అంతర్జాలం (ఇంటర్నెట్‌)లో అధికారిక వెబ్‌సైట్‌లో అన్వేషించి తెలుసుకోవచ్చు. అలా చేస్తే చాలాకాలం గుర్తుండిపోతుంది.


Back..

Posted on 26-09-2016