Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
బీకామ్‌లో ఫిజిక్స్‌ ఉందండీ బాబూ!

ఆ మధ్య ఒక రాజకీయ నాయకుడు బీకామ్‌లో ఫిజిక్స్‌ సబ్జెక్టు ఉందంటే టీవీలు, పేపర్లు గోల గోల చేశాయి. సోషల్‌ మీడియా ఆగమాగం చేసి రచ్చకీడ్చింది. ఆయన తెలిసి అన్నా... తెలియక అన్నా నిజంగానే బీకామ్‌లో ఫిజిక్స్‌ ఉందండి. అదే నయా ట్రెండ్‌. లిబరల్‌ స్టడీస్‌ (ఉదార అధ్యయనాలు) పేరుతో కొత్తగా వస్తున్న డిగ్రీల్లో బీఎస్సీ విద్యార్థులు హిస్టరీ, ఎకనామిక్స్‌ చదవచ్చు. బీకామ్‌ వాళ్లు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టులుగా తీసుకోవచ్చు. బీఏ అభ్యర్థులూ మ్యూజిక్‌, ఫ్యాషన్‌ వంటివి అధ్యయనం చేయవచ్చు. ఆసక్తి, అభిరుచులకు అనుగుణంగా కోర్సులను ఎంచుకునే అవకాశాన్ని లిబరల్‌ స్టడీస్‌ కల్పిస్తోంది. ఈ సరికొత్త విద్యావిధానం ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెంచుకుంటోంది. మన దేశంలోనూ ఇప్పుడిప్పుడే వీటి రూపకల్పన జరుగుతోంది. ఎంచుకున్న సబ్జెక్టులో పూర్తి నాలెడ్జ్‌, అదనపు అంశాల్లో తగినంత పరిజ్ఞానాన్ని సంపాదించుకొని అభ్యర్థులు పరిపూర్ణ నిపుణులుగా ఎదగాలన్నదే ఈ కొత్త కోర్సు లక్ష్యం.కోర్సులను ఎంచుకునే స్వేచ్ఛను విద్యార్థికి కల్పించడమే లిబరల్‌ స్టడీస్‌ లక్ష్యం.

సైన్స్‌, మ్యాథ్స్‌, ఆర్ట్స్‌, హ్యుమానిటీస్‌ అన్నీ కలిపి చదువుకునే అవకాశం దీనిలో ఉంటుంది. సహజ వాతావరణంలో పరిశీలనతో కూడిన మేటి విద్యను పొందవచ్చు. విభిన్న సబ్జెక్టుల మేళవింపుతో చదువుకోవడం వల్ల ఆల్‌రౌండర్‌ వికాసానికి అవకాశాలు ఎక్కువ!
కరిక్యులమ్‌లో మేజర్‌, మైనర్‌, ఫౌండేషన్‌ అనే మూడు విభాగాలుంటాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఏం నేర్చుకోవాలి అనేదానికంటే ఎలా నేర్చుకోవాలో తెలుసుకోవడానికి ఈ విధానంలో ప్రాధాన్యం! ఒక అంశానికి మరొకటి సమ్మిళితం చేసుకుంటూ నేర్పించడం లిబరల్‌ స్టడీస్‌ ప్రత్యేకత. యూజీ స్థాయిలో ఏ కోర్సులో చేరినప్పటికీ మొదటి రెండు సెమిస్టర్లు దాదాపు ఉమ్మడి అంశాలనే బోధిస్తాయి. ఆ తర్వాత నుంచి విద్యార్థి తనకు నచ్చిన విభాగాలను ఎంచుకోవచ్చు. మ్యూజిక్‌, ఆర్ట్స్‌, ఫొటోగ్రఫీ, ఫ్యాషన్‌...ఇలా నచ్చినవాటిని కోర్సులో చేర్చుకోవచ్చు.
ఎంచుకున్న మేజర్‌ సబ్జెక్టులో లోతైన ప్రావీణ్యం, మైనర్‌ సబ్జెక్టులపై ప్రాథమిక అవగాహన లభిస్తుంది. లైఫ్‌ స్కిల్స్‌కు ప్రాధాన్యం, జ్ఞానాన్ని అనువర్తించి నేర్చుకునే అవకాశం ఉంటాయి.

నియామక సంస్థలు ఆశించే లక్షణాలు
ప్రస్తుతం కంపెనీలు కోరుకుంటున్న నైపుణ్యాలన్నీ లిబరల్‌ స్టడీస్‌ చదువుతున్నవారి కరిక్యులమ్‌లో భాగమే. విద్యార్థుల్లో మేధాసామర్థ్యాలు పెంచేలా, ప్రపంచంపై అవగాహన కలిగించేలా ఈ చదువులను తీర్చిదిద్దారు. ఒక డిగ్రీతో భిన్న అంశాల్లో ప్రావీణ్యం పొందడానికి లిబరల్‌ విధానం తోడ్పాటునందిస్తోంది. కోర్సు పూర్తికాగానే రెడీ టు వర్క్‌ గా రూపొందేలా ఉంటాయీ చదువులు.
ఈ విధానంలో విద్యార్థికి ఎంచుకోవడానికి కావాల్సినన్ని ఆప్షన్లు ఉంటాయి. మేజర్‌, మైనర్‌ల్లో 200+ సబ్జెక్టుల నుంచి నచ్చిన కాంబినేషన్లు ఎంచుకోవచ్చు.మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా కోర్సులను రూపొందిస్తారు. పర్యావరణం, విలువలు, రచనా నైపుణ్యం, క్రీడలు, స్కిల్స్‌...వీటన్నింటిపైనా అవగాహన కల్పిస్తున్నారు. బీఏ, బీఎస్‌సీ, బీకాంలలో లిబరల్‌ ఆర్ట్స్‌ ఉంటాయి. పీజీ, పీహెచ్‌డీ స్థాయుల్లోనూ కోర్సులున్నాయి.
లిబరల్‌ స్టడీస్‌ కోర్సుల్లో ఫీజులు చాలా ఎక్కువే. అయితే ప్రతిభ ఉండి, ఆర్థికంగా వెనుకబడినవారికి మాత్రం 25 నుంచి వంద శాతం వరకు అశోకా, ఫ్లేమ్‌, క్రియా సంస్థల్లో రాయితీ లభిస్తోంది. అందువల్ల ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా ఎవరైనా సీటుకోసం పోటీపడవచ్చు.

మరికొన్ని సంస్థలు...
1.స్కూల్‌ ఆఫ్‌ లిబరల్‌ స్టడీస్‌, పండిట్‌ దీన్‌దయాళ్‌ పెట్రోలియం వర్సిటీ, గాంధీనగర్‌, గుజరాత్‌
2. ఓపీ జిందాల్‌ గ్లోబల్‌ వర్సిటీ, సోనిపట్‌, హరియాణ
3. సింబయాసిస్‌ స్కూల్‌ ఫర్‌ లిబరల్‌ ఆర్ట్స్‌, పుణె
4. ఎన్‌ఎంఐఎంఎస్‌ జ్యోతి దలాల్‌ స్కూల్‌ ఆఫ్‌ లిబరల్‌ ఆర్ట్స్‌, ముంబయి
5. అపీజయ్‌ స్ట్యా వర్సిటీ, సోహ్నా, గుడ్‌గావ్‌
6. యునైటెడ్‌ వరల్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ లిబరల్‌ ఆర్ట్స్‌, కర్నావతి యూనివర్సిటీ, గాంధీనగర్‌, గుజరాత్‌.

అవకాశాలు ఇలా...
ఫ్లేమ్‌, అశోక ...తదితర వర్సిటీల్లో లిబరల్‌ ఆర్ట్స్‌, యూజీ కోర్సులు పూర్తిచేసుకుంటే మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ప్రతి విభాగంలోనూ బహుళ జాతి కంపెనీలు వీరిని నియమించుకుంటున్నాయి. ఈ-కామర్స్‌, రియల్‌ ఎస్టేట్‌, మ్యానుఫ్యాక్చరింగ్‌, కన్సల్టింగ్‌, ఐటీ/ ఐటీఈఎస్‌, రిటైల్‌/ ఎఫ్‌ఎంసీజీ, బీఎఫ్‌ఎస్‌ఐ, సర్వీసెస్‌, మీడియా విభాగాల్లో ఇక్కడి విద్యార్థులు ఉన్నత స్థాయి ఉద్యోగాలు పొందుతున్నారు
కోర్సును బట్టి కన్సల్టెంట్‌, మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ, ప్రోగ్రాం మేనేజర్‌, రిసెర్చ్‌ అనలిస్ట్‌, రిసెర్చ్‌ అసోసియేట్‌, గ్రోత్‌ అంబాసిడర్‌, బిజినెస్‌ మేనేజర్‌, బ్రాండ్‌ అసోసియేట్‌, క్రెడిట్‌ అనలిస్ట్‌, స్ట్రాటజిక్‌ మేనేజర్‌, డేటా సైంటిస్ట్‌ హోదాలు లభిస్తున్నాయి. రూ.6.5 లక్షల నుంచి గరిష్ఠంగా 19.5 లక్షల వార్షిక వేతనాన్ని క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ల ద్వారా పొందుతున్నారు.

అశోకా యూనివర్సిటీ
యూజీ కోర్సుల్లో వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశానికి అక్టోబరు 17 నుంచి దరఖాస్తులు మొదలవుతాయి. యూజీలో బీఏ, బీఎస్సీ కోర్సులు ఉన్నాయి. పూర్తిగా మేజర్‌, ఇంటర్‌ డిసిప్లినరీ మేజర్‌, మైనర్‌ కోర్సులను అభిరుచుల మేరకు ఎంచుకోవచ్చు. వీటితోపాటు కో కరిక్యులర్‌ కోర్సులను తీసుకోవడం తప్పనిసరి. ఆర్ట్‌, ఫిల్మ్‌, లాంగ్వేజ్‌, పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌, ఫొటోగ్రఫీ, థియేటర్‌.. వీటిలో రెండింటిని ఎంచుకోవాలి. పీజీ స్థాయిలో ఎంఏ ఎకనామిక్స్‌, ఎంఏ లిబరల్‌ స్టడీస్‌ కోర్సులనూ ఈ సంస్థ అందిస్తోంది. పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌ అండ్‌ రిసెర్చ్‌, ఎకనామిక్స్‌, కంప్యూటర్‌ సైన్సెస్‌, బయాలజీ, ఇంగ్లిష్‌, హిస్టరీల్లో పీహెచ్‌డీలకు ఇక్కడ అవకాశం ఉంది. యూజీ కోర్సులకు ట్యూషన్‌, వసతి నిమిత్తం ఏడాదికి రూ.9 లక్షల ఫీజు చెల్లించాలి.
యంగ్‌ ఇండియా ఫెలోషిప్‌: ఏడాది వ్యవధితో యంగ్‌ ఇండియా ఫెలోషిప్‌ కోర్సు అశోకా యూనివర్సిటీ అందిస్తోంది. ఈ కోర్సుకు మంచి ఆదరణ లభిస్తోంది. 300 మందికి పైగా అవకాశం కల్పిస్తారు. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. మే 31, 2019 నాటికి వయసు 28 ఏళ్లలోపు ఉండాలి. మంచి అకడమిక్‌ రికార్డుతోపాటు బోధనేతర అంశాల్లో పాల్గొన్నవారై ఉండాలి. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌లో పట్టు తప్పనిసరి. నవంబరు 15లోగా ఆసక్తి ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను పరిశీలించి ఎంపికచేసినవారికి టెలిఫోన్‌ ఇంటర్వ్యూలు తీసుకుంటారు. అనంతరం కాంప్రహెన్షన్‌ పరీక్ష, ఇంటర్వ్యూ ఉంటాయి. కోర్సు ఫీజు రూ.9 లక్షలు. మెరిట్‌, అవసరాల ప్రాతిపదికన స్కాలర్‌షిప్పులూ కేటాయిస్తారు.
ప్రవేశం ఇలా: అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో కొందరిని ఎంపిక చేసి, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. నెగ్గినవారిని కోర్సుల్లోకి తీసుకుంటారు. ఇంటర్వ్యూలో భాగంగా కోరిన అంశంలో 30 నిమిషాల్లో ఎస్సే రాయాల్సి ఉంటుంది. అనంతరం ఆప్టిట్యూడ్‌ టెస్టు నిర్వహిస్తారు. తర్వాత వర్సిటీ ప్యానెల్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. విద్యార్థుల అవగాహన నిమిత్తం సిలబస్‌, రెండు మాదిరి ప్రశ్నపత్రాలు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో అవగాహన కోసం ఉంచారు.

ఫ్లేమ్‌ యూనివర్సిటీ
మూడేళ్ల వ్యవధితో ఇక్కడ యూజీ కోర్సులున్నాయి.
బీఏ: ఎకనామిక్స్‌, సైకాలజీ, లిటరరీ అండ్‌ కల్చరల్‌ స్టడీస్‌, ఇంటర్నేషనల్‌ స్టడీస్‌, ఎన్విరాన్మెంటల్‌ స్టడీస్‌, జర్నలిజం, పబ్లిక్‌ పాలసీ, సోషియాలజీ.
బీఎస్సీ: అప్లైడ్‌ మ్యాథమేటిక్స్‌.
బీబీఏ: ఫైనాన్స్‌, మార్కెటింగ్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌, ఆపరేషన్స్‌, జనరల్‌ మేనేజ్‌మెంట్‌.
బీబీఏ (కమ్యూనికేషన్స్‌ మేనేజ్‌మెంట్‌): అడ్వర్టైజింగ్‌ అండ్‌ బ్రాండింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌, కమ్యూనికేషన్‌ స్టడీస్‌.
డిజైన్‌, డ్యాన్స్‌, మ్యూజిక్‌, థియేటర్‌లను మైనర్‌గా అందిస్తున్నారు. మూడేళ్ల కోర్సు అనంతరం ఆసక్తి ఉన్నవారు నాలుగో ఏడాది ఫ్లేమ్‌ స్కాలర్స్‌ ప్రోగ్రామ్‌లో చేరవచ్చు. డిసెంబరు నుంచి ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశపరీక్ష, బృందచర్చ, ముఖాముఖి, అకడమిక్‌ రికార్డు, ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌, స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌ ద్వారా కోర్సుల్లోకి అవకాశం కల్పిస్తారు. పరీక్షలో ఇంగ్లిష్‌, రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ, జనరల్‌ నాలెడ్జ్‌ అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. ఫీజు ఏడాదికి రూ.7.3 లక్షలు (ట్యూషన్‌, వసతి, భోజనం...అన్నీ కలుపుకుని). ఈ సంస్థ పీజీలో ఎంబీఏ, ఎంబీఏ (కమ్యూనికేషన్స్‌ మేనేజ్‌మెంట్‌) కోర్సులు అందిస్తోంది.

ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ, అమరావతి
స్కూల్‌ ఆఫ్‌ లిబరల్‌ ఆర్ట్స్‌ అండ్‌ బేసిక్‌ సైన్సెస్‌ (ఎస్‌ఎల్‌ఏబీఎస్‌) ఆధ్వర్యంలో బీఏ, బీబీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు అందిస్తున్నారు. కామర్స్‌, ఎకనామిక్స్‌, ఇంగ్లిష్‌ స్టడీస్‌, హిస్టరీ, జర్నలిజం, సైకాలజీ, బిజినెస్‌ స్టడీస్‌, బయాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్‌, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టులను మేజర్‌గా ఎంచుకోవచ్చు. ఇక్కడ ఫౌండేషన్‌ కోర్సులు, డిపార్ట్‌మెంటల్‌ కోర్‌ కోర్సులు, ఎలక్టివ్స్‌, ఆప్షనల్‌ మైనర్లు, ఆప్షనల్‌ అడిషినల్స్‌...వీటిని ఏదైనా డిగ్రీలో భాగంగా చదువుకోవచ్చు. పై అన్ని సబ్జెక్టుల్లో ఎస్‌ఆర్‌ఎంలో పీహెచ్‌డీ చేసుకోవచ్చు.
2019 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇంటర్‌లో 60 శాతం మార్కులున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇక్కడ బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో ఏడాదికి రూ.1.50 లక్షలు ఫీజు చెల్లించాలి. బీబీఏ కోర్సుకు రూ.2.5 లక్షలు. వసతి, భోజనం నిమిత్తం రూ.1.2 లక్షల నుంచి 1.8 లక్షల వరకు(ఏసీ, నాన్‌ ఏసీ, షేరింగ్‌) ఏడాదికి చెల్లించాలి.

క్రియా యూనివర్సిటీ
21వ శతాబ్దం సవాళ్లను స్వీకరించి అవకాశాలను ఒడిసిపట్టుకునేలా విద్యార్థులను తయారుచేసే లక్ష్యంతో క్రియా యూనివర్సిటీ శ్రీ సిటీ, ఆంధ్రప్రదేశ్‌లో ఆవిర్భవించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి కోర్సులు మొదలవుతాయి. బీఏ (ఆనర్స్‌)లో ఎకనామిక్స్‌, హిస్టరీ, లిటరేచర్‌ అండ్‌ ది ఆర్ట్స్‌, పొలిటికల్‌ సైన్స్‌, సోషల్‌ స్టడీస్‌ ఉన్నాయి. బీఎస్సీ (ఆనర్స్‌)లో కంప్యూటర్‌ సైన్స్‌, ఎన్విరాన్మెంటల్‌ స్టడీస్‌, లైఫ్‌ సైన్సెస్‌ అండ్‌ కాగ్నిటివ్‌ సైన్సెస్‌, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ అందిస్తున్నారు. వీటిలో నచ్చిన సబ్జెక్టును మెయిన్‌గా తీసుకోవచ్చు. ఏ కోర్సులో చేరినప్పటికీ కోర్‌, స్కిల్‌ కోర్సులు, ఎలక్టివ్స్‌, కో కరిక్యులర్‌ యాక్టివిటీస్‌ ఉంటాయి. యూజీ కోర్సుల్లో చేరడానికి నవంబరు నుంచి రిజిస్ట్రేషన్లు మొదలవుతాయి. పది, ఇంటర్‌ మార్కులు, ఎస్సే రైటింగ్‌, ఇంటర్వ్యూ...ద్వారా ఎంపిక చేసుకుంటారు. ఫీజు ఏడాదికి రూ.6.5 లక్షలు, వసతికి రూ.1.2 లక్షలు చెల్లించాలి. ఆర్థికంగా వెనుకబడి, మెరిట్‌ ఉన్నవారికి ఫీజు మినహాయింపులుంటాయి.

Back..

Posted on 09-10-2018