Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
‘నవరత్న’ కొలువులు!

* 108 ఇంజినీర్లకు మంచి అవకాశం

నవరత్న సంస్థల్లో ఒకటైన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) బెంగళూరు సాఫ్ట్‌వేర్‌ డివిజన్‌ 108 ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించింది. సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్‌ మార్కులు, అనుభవం, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నియమితులైనవారు ఏడాది నుంచి నాలుగేళ్ల వరకు విధుల్లో కొనసాగే అవకాశం ఉంది. వీరు బెంగళూరు, హైదరాబాద్, చాందీపూర్‌ల్లో ఎక్కడైనా సేవలు అందించాల్సి ఉంటుంది.

ఈ నియామక ప్రకటన ద్వారా జూనియర్‌ ఇంజినీర్, ప్రాజెక్టు ఇంజినీర్‌ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ దాదాపు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలే. జూనియర్‌ ఇంజినీర్‌గా ఎంపికైనవారు బెంగళూరులో సేవలు అందిస్తారు. ఏడాది పాటు విధుల్లో కొనసాగుతారు. అనంతరం సంస్థ అవసరాలు, అభ్యర్థి సమర్థత ప్రాతిపదికన సేవలు పొడిగిస్తారు. వీరు గరిష్ఠంగా మూడేళ్ల పాటు ఉద్యోగంలో కొనసాగుతారు. ఈ పోస్టుకు ఎంపికైనవారికి మొదటి ఏడాది రూ.25 వేలు, రెండో సంవత్సరం రూ.28వేలు, మూడో ఏట రూ.31 వేలు చెల్లిస్తారు. ప్రాజెక్టు ఇంజినీర్‌గా ఎంపికైనవారు రెండేళ్ల ఒప్పంద ప్రాతిపదికన విధులు నిర్వర్తించాలి. అప్పటి అవసరాలు, ఉద్యోగి సమర్థత ప్రాతిపదికన ఈ వ్యవధిని మరో రెండేళ్లు పొడిగిస్తారు. వీరికి తొలి సంవత్సరం రూ. 35 వేలు, రెండో ఏడాది రూ.40 వేలు, మూడో సంవత్సరం రూ.45 వేలు, చివరిదైన నాలుగో ఏట రూ.50 వేలు ప్రతి నెలా చెల్లిస్తారు. ఈ ఉద్యోగానికి ఎంపికైనవారు బెంగళూరు, హైదరాబాద్, చాందీపూర్‌ల్లో ఎక్కడైనా సేవలు అందించాల్సి ఉంటుంది. ఎక్కువ ఖాళీలు బెంగళూరులోనే ఉన్నాయి. అయితే సంస్థ అవసరాల నిమిత్తం దేశంలో ఎక్కడి నుంచైనా విధులు నిర్వర్తించడానికి సిద్ధపడాలి.

ఎంపిక విధానం: వచ్చిన దరఖాస్తులను మార్కుల మెరిట్, పని అనుభవం ప్రకారం వడపోస్తారు. అకడమిక్‌ మార్కులకు 75 శాతం వెయిటేజీ ఉంటుంది. 10 మార్కులు అనుభవానికి, 15 ఇంటర్వ్యూకు కేటాయించారు. కనీస అనుభవం ఉన్నవారికి 2.5 మార్కులు ఇస్తారు. ప్రతి ఆరు నెలల అదనపు అనుభవానికీ 1.25 మార్కుల చొప్పున కలుపుతారు. అకడమిక్‌ మార్కులు, అనుభవం ప్రకారం మెరిట్‌ లిస్టు తయారుచేసి ఒక్కో పోస్టుకీ అయిదు మందిని చొప్పున ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తారు. ప్రాజెక్టు ఇంజినీర్‌ పోస్టులకు ఏదైనా సంస్థలో రెండేళ్లు పనిచేసిన అనుభవం తప్పనిసరి. ఆ వివరాలను చూపాల్సి ఉంటుంది. బోధన, పరిశోధన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోరు.

మొత్తం ఖాళీలు: 108
ట్రెయినీ ఇంజినీర్‌ ఖాళీలు: 54.
అర్హత: ప్రథమ శ్రేణి మార్కులతో కంప్యూటర్‌ సైన్స్‌లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది. జావా లేదా సీ++లో ఎందులోనైనా పరిజ్ఞానం ఉండాలి. వయసు: సెప్టెంబరు 1, 2020 నాటికి 25 ఏళ్లలోపు ఉండాలి.

ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ ఖాళీలు: 54.
అర్హత: కంప్యూటర సైన్స్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రానిక్స్‌/ ఈఈఈ/ ఈటీఈ వీటిలో ఏదైనా బ్రాంచిలో ప్రథమ శ్రేణి మార్కులతో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది. వయసు: సెప్టెంబరు 1, 2020 నాటికి 28 ఏళ్లలోపు ఉండాలి. రెండేళ్ల పని అనుభవం తప్పనిసరి. వీరు సాఫ్ట్‌వేర్‌ టెస్టర్‌ లేదా సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా సేవలు అందించాల్సి ఉంటుంది. ఏదైనా ప్రోగ్రామ్‌ లాంగ్వేజ్‌ ఫ్రేమ్‌వర్క్‌పై అవగాహన ఉండాలి. సీ, సీ++, జావా వీటిలో దేనిపైనైనా పట్టు తప్పనిసరి. పై రెండు పోస్టులకూ ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: సెప్టెంబరు 27 వరకు స్వీకరిస్తారు.
దరఖాస్తు ఫీజు: ప్రాజెక్టు ఇంజినీర్‌ పోస్టులకు రూ.500. ట్రెయినీ ఇంజినీర్‌ పోస్టులకు రూ.200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.
వెబ్‌సైట్‌: www.bel-india.in

Back..

Posted on 10-09-2020