Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
బిగ్‌ డేటాతో ఉద్యోగాలు

మనకు కావలసిన సమాచారం కోసం గూగుల్‌ సెర్చ్‌లో ఇలా టైప్‌ చేసి, అలా ఎంటర్‌ కొట్టగానే వేలకొద్దీ పేజీలు ఎలా వస్తాయి? ఆ సమాచారాన్నంతా ఏ విధంగా స్టోర్‌ చేస్తారు? లక్షల సంఖ్యలో ఉండే వెబ్‌ పేజీల్లో మనకు అవసరమైన సమాచారం చాలా వేగంగా, కచ్చితంగా ఎలా ప్రాసెస్‌ అవుతుంది? ఇందులో ఇమిడి ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఏమిటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతోంది... బిగ్‌ డేటా ఎనలిటిక్స్‌. సవాళ్లతో కూడిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ, అందులో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలనుకునే అభ్యర్థులకు, అద్భుతమైన ఉద్యోగ అవకాశాలతో బిగ్‌ డేటా రంగం విస్తరిస్తోంది.
ఒక్క మాటలో చెప్పాలంటే... విస్తృతమైన డేటాను మనకు అవసరమైన సమాచారంగా మార్చే కీలక ప్రక్రియ బిగ్‌ డేటా ఎనలిటిక్స్‌. ఇందులో స్ట్రక్చర్డ్‌ డేటా, అన్‌స్ట్రక్చర్డ్‌ డేటా కూడా ఉంటుంది. వివిధ మార్గాల ద్వారా రకరకాల కంపెనీల్లో నిత్యం ఈ డేటా తయారవుతూ ఉంటుంది. ఉదాహరణకు ఈ డేటా పరిమాణం పెటా బైట్స్‌ (1024 టెరాబైట్స్‌) లేదా ఎగ్జాబైట్స్‌ (1024 పెటాబైట్స్‌)లో ఉండొచ్చు. మనం రోజూ ఉపయోగించే కంప్యూటర్లలో ఉండే హార్డ్‌ డిస్క్‌ల ద్వారా ఇంత డేటాను ప్రాసెస్‌ చేయడం అసాధ్యం. డేటా పరిమాణానికి సంబంధించి ఫోర్బ్స్‌ ఏడాది కిందట అంచనా వేసింది. ఆ వివరాలు...
* డేటా పరిమాణం భారీగా పెరుగుతోంది. గత రెండేళ్లలో తయారైన డేటా మొత్తం ఇప్పటివరకు మానవ చరిత్రలో తయారైన డేటా కంటే ఎక్కువ.
* ఒక్క గూగుల్‌ ద్వారానే సెకనుకు 40000 సెర్చ్‌లు జరుగుతున్నాయి. అంటే ఏడాదికి 31.2 ట్రిలియన్‌ సెర్చ్‌లన్నమాట!
* ఆగస్టు 2015 లో ఒకే రోజు బిలియన్‌ యూజర్లు ఫేస్‌బుక్‌ ఉపయోగించారు.
* ఫేస్‌బుక్‌ యూజర్లు సగటున ప్రతి నిమిషానికి 31.25 మిలియన్‌ మెసేజ్‌లు పంపిస్తున్నారు, 2.77 మిలియన్‌ వీడియోలు చూస్తున్నారు.

ఇంత డేటా ప్రాసెసింగ్‌ ఎలా సాధ్యం?
సంప్రదాయ సాంకేతిక పరిజ్ఞానం, పద్ధతుల ద్వారా భారీ పరిమాణంలో డేటాను ప్రాసెస్‌ చేయడం సాధ్యం కాదు. డేటా పరిమాణం, వేగం, వైవిధ్యం, విలువ, విజువలైజేషన్‌, తదితర అంశాల్లో సాంకేతిక పరిజ్ఞానం సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ సవాళ్ల నుంచి పుట్టిందే హదూప్‌. కంపెనీలు హదూప్‌ పరిజ్ఞానాన్ని ఉపయోగించి తమకు అవసరమైన సమాచారాన్ని వేగంగా, మరింత కచ్చితత్వంతో, పద్ధతిగా, విశ్లేషణాత్మకంగా పొందగలవు. ఫార్చ్యూన్‌ 1000 కంపెనీల్లో 73 శాతం కంపెనీలు బిగ్‌ డేటాలో పెట్టుబడులు పెట్టాయి లేదా తదనుగుణంగా ప్రణాళికలు రూపొందించాయి. దీనివల్ల రాబోయే రోజుల్లో ఈ రంగంలో విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.
* హదూప్‌: బిగ్‌ డేటాను ప్రాసెస్‌ చేయడం, విశ్లేషించడం ద్వారా కంపెనీలు భవిష్యత్తు వ్యాపార అవకాశాలపై అంచనాలు వేస్తున్నాయి. ఈ ప్రక్రియలో హదూప్‌ ప్లాట్‌ఫామ్‌ కంపెనీలకు బాగా ఉపయోగపడుతుంది. డేటా స్టోరేజ్‌తోపాటు ప్రాసెసింగ్‌కు కూడా హదూప్‌ పరిజ్ఞానం ఉపయోగపడుతుంది.
* స్టోరేజ్‌: హదూప్‌కు ప్రత్యేకమైన స్టోరేజ్‌ మోడల్‌ ఉంది. దీన్ని హెచ్‌డీఎఫ్‌ఎస్‌ - హదూప్‌ డిస్ట్రిబ్యూటెడ్‌ ఫైల్‌ సిస్టమ్‌ అంటారు. ఏ పార్మాట్‌లో ఉన్న డేటానైనా ఈ ఫైల్‌సిస్టమ్‌లో నిల్వ ఉంచొచ్చు.
* ప్రాసెసింగ్‌: హదూప్‌ ద్వారా ప్రస్తుతం అనుసరిస్తున్న పద్ధతుల కంటే 100 నుంచి 500 రెట్లు వేగంగా, ఏ ఫార్మాట్‌లో ఉన్న డేటానైనా ప్రాసెసింగ్‌ చేయవచ్చు, వేరే ఫార్మాట్‌లోకి మార్చవచ్చు.
హదూప్‌ ఎందుకు నేర్చుకోవాలి?
హదూప్‌ ప్లాట్‌ఫామ్‌ ఆధారంగా బిగ్‌ డేటా సమస్యలను అర్థం చేసుకోవడం, పరిష్కరించడంలో నైపుణ్యం సాధించినవారికి మంచి ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఫ్రెషర్లు, అనుభవం ఉన్న ఇంజినీర్లు కూడా హదూప్‌ లేదా బిగ్‌ డేటా సంబంధిత కెరియర్‌లో ప్రవేశించవచ్చు. ఈ నిపుణులు హదూప్‌ డెవలపర్లు, బిగ్‌ డేటా ఆర్కిటెక్ట్‌లు, డేటా ఎనలిస్టులు, హదూప్‌ అడ్మినిస్ట్రేటర్లు, హదూప్‌ టెస్టర్లు, తదితర స్థాయుల్లో పనిచేయవచ్చు.

తాజా పరిణామాలపై అవగాహన
* ఐటీ కంపెనీల్లో మారుతోన్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా సామర్థ్యాలను పెంపొందించుకునే స్వభావం ఉన్నవారికి బిగ్‌ డేటా మంచి అవకాశాలను అందిస్తోంది.
* ఫ్రెషర్‌గా సాఫ్ట్‌వేర్‌ రంగంలో ప్రవేశించే అభ్యర్థులు బిగ్‌ డేటా సామర్థ్యాలు పెంపొందించుకోవడం చాలా కీలకం. ఈ రంగానికి సంబంధించి మంచి నైపుణ్యం ఉన్నవారి దగ్గర శిక్షణ తీసుకోవడం అభిలషణీయం. హదూప్‌లో వస్తోన్న తాజా పరిణామాలను అవగాహన చేసుకుంటూ, సర్టిఫికేషన్‌లను పొందడం ద్వారా ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచుకోవచ్చు.
* మనదేశంతోపాటు విదేశాల్లోని అనేక విద్యాసంస్థలు ఇప్పటికే బిగ్‌ డేటా ఎనలిటిక్స్‌ సంబంధిత అంశాలను గ్రాడ్యుయేషన్‌, పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో భాగంగా చేర్చాయి.
* అక్టోబరు 2016 నాటికి హదూప్‌ నిపుణుల సగటు వేతనాలు ఇతర రంగాల్లోని నిపుణుల వేతనాల కంటే 95 శాతం అధికంగా ఉన్నాయని సంబంధిత పరిశ్రమ వర్గాల అంచనా.

ప్రముఖ డిస్ట్రిబ్యూషన్లు, సర్టిఫికేషన్లు
అపాచీ కంపెనీ అందిస్తోన్న ఓపెన్‌ సోర్స్‌ సాఫ్ట్‌వేర్‌ హదూప్‌. అనేక కంపెనీలు హదూప్‌ క్లస్టర్ల ఇన్‌స్టాలేషన్‌, మేనేజ్‌ చేయడానికి అవసరమైన యూజర్‌ ఇంటర్‌ఫేస్‌లను అందిస్తున్నాయి. ఫారెస్టర్‌ ఎనలిటిక్స్‌ ప్రకారం ప్రస్తుతం మూడు డిస్ట్రిబ్యూషన్‌లు వీటిలో ప్రముఖమైనవి. ఈ కంపెనీలు, ఇవి అందిస్తున్న సర్టిఫికేషన్‌ల వివరాలు...
* క్లౌడ్‌ఎరా: తొలినాళ్లలో ఏర్పాటైన సంస్థ. ఈ సంస్థ సీసీఏ స్పార్క్‌, హదూప్‌ డెవలపర్‌ - సీసీఏ 175 సర్టిఫికేషన్‌లను అందిస్తోంది. అభ్యర్థులు 10-12 ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. క్లౌడ్‌ఎరా డిస్ట్రిబ్యూషన్‌ ఫర్‌ హదూప్‌ వెర్షన్‌ 5 (సీడీహెచ్‌5) గురించి ఈ ప్రశ్నలు అడుగుతారు.
* హార్టన్‌వర్క్స్‌: క్లౌడ్‌ఎరాకు మంచి పోటీనిస్తోన్న సంస్థ. హదూప్‌ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన మార్కెట్‌లో ద్వితీయస్థానంలో ఉంది. ఇది కూడా ఓపెన్‌ సోర్స్‌ సాఫ్ట్‌వేరే. ఈ సంస్థ హార్టన్‌వర్క్స్‌ డెవలప్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్‌ ఫర్‌ సర్టిఫైడ్‌ డెవలపర్స్‌ (హెచ్‌డీపీసీడీ) సర్టిఫికేషన్‌ను అందిస్తోంది. డేటా ఇన్‌జెషన్‌, డేటా ఎనాలిసిస్‌, డేటా టాన్స్‌ఫర్మేషన్‌ భావనలపై ఈ సంస్థ దృష్టి కేంద్రీకరిస్తుంది.
* మ్యాప్‌ఆర్‌: ప్రత్యేక ఫైల్‌ సిస్టమ్‌ (ఎంఏపీఆర్‌ - ఎఫ్‌ఎస్‌) ద్వారా అత్యుత్తమ పనితీరుకు హామీ ఇస్తుంది ఈ కంపెనీ. ఎంసీహెచ్‌డీ - మ్యాప్‌ఆర్‌ సర్టిఫైడ్‌ హదూప్‌ డెవలపర్‌ సర్టిఫికేషన్‌ను అందిస్తోంది. హదూప్‌ సొల్యూషన్స్‌ డిజైన్‌, డెవలప్‌మెంట్‌లో నైపుణ్యం ఉన్నవారు ఈ సర్టిఫికేషన్‌ కోసం ప్రయత్నించవచ్చు.


Back..

Posted on 05-11-2016