Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 

గణాంకాలతో వైరస్‌పై పోరు!

కరోనా వైరస్‌ సృష్టిస్తున్న కల్లోలాన్ని కట్టడి చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. లక్షల కేసులు వేల మరణాలు. ఇవి రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు, డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలూ ఎందరో ఈ మహమ్మారిని నిరోధించేందుకు కాలంతో పోటీపడి ప్రయత్నాలు చేస్తున్నారు. వీరితోపాటు ప్రాణాంతకమైన ఆ వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి మరికొందరు పరిశ్రమిస్తున్నారు. వాళ్లే బయో స్టాటిస్టిషియన్లు. గణిత, గణాంక శాస్త్రాల్లో వీరికున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరిశోధనల్లో శాస్త్రవేత్తలకు, నియంత్రణలో ఆరోగ్య సిబ్బందికి సాయపడతారు. ఇదో విశిష్టమైన, వైవిధ్యమైన కెరియర్‌.

శతాబ్దాల నుంచి మనుషుల ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ, వ్యాధులను, ఇతర అనారోగ్యాలను నియంత్రిచడంలోనూ సైన్స్‌తోపాటు బయోస్టాటిస్టిక్స్‌ ప్రధానపాత్ర పోషిస్తోంది. భారతీయ వైద్యపరిశోధన రంగంలో పురోగతి వేగంగా సాగుతుండటంతో ఇది ఒక ఆకర్షణీయమైన కెరియర్‌గా ఎదుగుతోంది.బయోస్టాటిస్టిక్స్‌ అంటే ప్రధానంగా జీవుల, జీవ వ్యవస్థల డేటా సేకరణ, డేటా మేనేజ్‌మెంట్‌. రకరకాల గణాంక పద్ధతులను ఉపయోగించి, అనువర్తించి డేటాను విశ్లేషిస్తారు. ఫలితాలను శాస్త్రవేత్తలకూ, సంబంధిత విభాగాలకు అందిస్తారు. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే చైనా, దక్షిణ కొరియా, ఇరాన్‌, ఇటలీ వంటి దేశాల్లో వైరస్‌ సోకిన విధానాలను పరిశీలించి గణిత మోడలింగ్‌, గణాంక అధ్యయనాలతో వైరస్‌ వ్యాప్తి తీరును, మరణాల గరిష్ఠస్థాయిని అంచనావేసి ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడే ఇలాంటి క్లిష్ట సమయాల్లో యుద్ధాల్లో సైనికుల్లా వీరు పనిచేయాల్సి ఉంటుంది. ఆ విధంగా వర్క్‌ చేసేందుకు ఆసక్తి ఉన్నవాళ్లు బయోస్టాటిస్టిక్స్‌ను కెరియర్‌గా ఎంచుకోవచ్ఛు పర్యావరణం, వ్యవసాయ రంగాల్లోనూ గణాంక పరిశోధనలకు ప్రాధాన్యం ఉంది.

ఎవరు అర్హులు?
బయో స్టాటిస్టిక్స్‌ ప్రధానంగా పీజీ స్థాయిలో పలు యూనివర్సిటీల్లో అందుబాటులో ఉంది. మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, లైఫ్‌సైన్సెస్‌లో బీఎస్సీ పూర్తి చేసిన వాళ్లు ఈ కోర్సుల్లో చేరవచ్ఛు రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అడ్మిషన్లు ఇస్తున్నారు. చాలా వరకు కోర్సులు అందిస్తున్న సంస్థలే ప్రత్యేక ప్రవేశ పరీక్షలు నిర్వహించుకుంటున్నాయి. బయోస్టాటిస్టిక్స్‌ అనేది స్టాటిస్టిక్స్‌లో ఒక విభాగం. దీనికి వైద్య, ఆరోగ్య రంగాలతో అనుబంధం ఉంటుంది. సంబంధిత కోర్సుల్లో చేరాలనుకుంటే బయాలజీ, కెమిస్ట్రీలపై మంచి పట్టు ఉండాలి. గణితం, గణాంక శాస్త్రాలపైనా అవగాహన అవసరం. ఎందుకంటే గణాంక విశ్లేషణ, డేటా ప్రజెంటేషన్లకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌లపై వీళ్లు పనిచేయాల్సి ఉంటుంది. కొన్ని సంస్థలు డిగ్రీ స్థాయిలో బయోస్టాటిస్టిక్స్‌ అందిస్తున్నప్పటికీ ఇందులో పీజీ లేదా పీహెచ్‌డీ చేసిన వారికి నియామకాల్లో ప్రాధాన్యం లభిస్తోంది. పీజీలో స్టాటిస్టిక్స్‌తోపాటు అడ్వాన్స్‌డ్‌ మ్యాథ్స్‌, డేటా అనాలిసిస్‌ తదితరాలు ఉంటాయి. వీటితోపాటు మెడిసిన్‌కి సంబంధించిన కొన్ని అంశాలను బోధిస్తారు. విశ్లేషణల ద్వారా అభ్యర్థులు పరిశోధించిన వివరాలను తగిన విధంగా అనువర్తింపజేయడానికి ఈ పరిజ్ఞానం ఉపయోగపడుతుంది.

ఏయే సంస్థలు?
మణిపాల్‌ యూనివర్సిటీ, అమృత విశ్వవిద్యాపీఠం, మహాత్మాగాంధీ యూనివర్సిటీ (కేరళ), ఇంటర్‌నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పాపులేషన్‌సైన్సెస్‌ బయోస్టాటిస్టిక్స్‌లో పీజీ అందిస్తున్నాయి. వెల్లూర్‌లోని క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీలో ఎమ్మెస్సీ ఇన్‌ బయోస్టాటిస్టిక్స్‌ ఉంది. దీనికి ప్రవేశాలు మేలో నిర్వహిస్తారు.

గణిత, గణాంక శాస్త్రాల్లో పీజీలను దిల్లీ యూనివర్సిటీ, ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌, ఎస్‌ఆర్‌ఎం, శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ వంటి సంస్థలూ నిర్వహిస్తున్నాయి. వీటితోపాటు యూనివర్సిటీ ఆఫ్‌ మద్రాస్‌, యూనివర్సిటీ ఆఫ్‌ పుణె, యూనివర్సిటీ ఆఫ్‌ కోల్‌కతా, సీఎంసీ-వెల్లూర్‌ తదితరాలూ ఈ కోర్సులను నిర్వహిస్తున్నాయి.

దిల్లీ, మద్రాస్‌, పుణె యూనివర్సిటీల్లో మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌లో ఎమ్మెస్సీ ఉంది. అడ్మిషన్ల ప్రక్రియ సాధారణంగా మేలో జరుగుతుంది. ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ సహా పలు ఇతర విశ్వవిద్యాలయాలు మ్యాథ్స్‌ ప్రత్యేకంగా పీజీలను అందిస్తున్నాయి.

ఉద్యోగాలు ఎక్కడ?
ఆసుపత్రులు, రిసెర్చ్‌ ల్యాబ్‌లు, క్లినికల్‌ ట్రైయల్స్‌ విభాగాలు, ఔషధ పరిశ్రమల్లో బయోస్టాటిస్టిషియన్ల సేవలు అవసరవుతాయి. బృందాలతో కలిసి లేదా ఒక్కరే పనిచేయాల్సి ఉంటుంది. వైద్య, ఆరోగ్య రంగాలకు సంబంధించిన డేటాను పెద్ద ఎత్తున సేకరించి, సమన్వయపరచి, విశ్లేషించి సమస్యలకు పరిష్కారాన్ని కనుక్కునే ప్రయత్నం వీళ్లు చేస్తారు. కొత్త ఔషధాలను ఉపయోగించడం వల్ల ఎదురయ్యే రిస్క్‌ను, దాని ప్రభావాన్ని డేటా సాయంతో అంచనావేస్తారు. వ్యాధికి కారణమయ్యే ప్రమాదకారకాలను అధ్యయనం చేస్తారు. అందుకే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో మంచి అవకాశాలు లభిస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలూ బయోస్టాటిస్టిషియన్లను ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి.విద్యారంగంలోనూ వీరికి ఉపాధి దొరుకుతోంది. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), యూఎన్‌ఓ, అంతర్జాతీయ చారిటీ సంస్థలు రెగ్యులర్‌గా బయోస్టాటిస్టిషియన్లను నియమించుకుంటున్నాయి. బిగ్‌డేటా వంటి ఆధునిక టెక్నాలజీ వల్ల వీరికి ఇంకా కొత్త కొత్త రకాల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రారంభంలో నెలకు రూ. పన్నెండు వేల నుంచి రూ. పదిహేను వేలు జీతం ఉండవచ్ఛు కొంత అనుభవం సంపాదించిన తర్వాత నెలకు రూ. నలభై వేల వరకు పొందే వీలుంది.

Back..

Posted on 30-04-2020