Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
బయోటెక్‌ పీజీ దారి

రానున్న కాలంలో బయోటెక్నాలజీ రంగం మనదేశంలో 10 లక్షల ఉద్యోగాలు, వాటికి సమానమైన ఉపాధి అవకాశాలను సృష్టించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) బయోటెక్నాలజీ ప్రవేశపరీక్ష ప్రకటన వచ్చేసింది. ఆనవాయితీకి భిన్నంగా చాలా ముందుగా వెలువడిందిది. పరీక్ష కూడా డిసెంబర్లోనే!

జేఎన్‌యూ గత 30 సంవత్సరాలుగా.. (1985) ఎంఎస్‌సీ బయోటెక్నాలజీ సబ్జెక్టును అందిస్తోంది. ప్రస్తుతం భారత్‌లో మొత్తం 32 విశ్వవిద్యాలయాలు కలిసి ఈ కంబైన్డ్‌ బయోటెక్నాలజీ ప్రవేశపరీక్షను నిర్వహిస్తున్నాయి. దేశం మొత్తంలో సుమారుగా 550 సీట్లున్నాయి. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లోని పద్మావతి విశ్వవిద్యాలయం కూడా ఈ ప్రవేశపరీక్ష ఆధారంగా ఎంఎస్‌సీ బయోటెక్నాలజీ కోర్సులో ప్రవేశాన్ని కల్పిస్తోంది. బయాలజీ, టెక్నాలజీ కలగలిసిన పరిశోధనాత్మక విజ్ఞానశాస్త్రం- బయో టెక్నాలజీ. బయో కెమిస్ట్రీ, కెమిస్ట్రీ, జెనెటిక్స్‌, ఇమ్యునాలజీ, మైక్రోబయాలజీ, వైరాలజీ, ఇంజినీరింగ్‌ వంటివి కూడా అందులో భాగం. సృష్టికి ప్రతిసృష్టి చేయగలిగిన క్లోనింగ్‌, మానవ జీనోమ్‌ ప్రాజెక్టు, స్టెమ్‌సెల్‌ రిసర్చ్‌, జన్యుపరివర్తిత పంటలు.. ఇవన్నీ బయోటెక్‌కి సంబంధించినవే.

వైవిధ్యమైన కోర్సులు
కొన్ని విశ్వవిద్యాలయాలు ఎంఎస్‌సీ జనరల్‌ బయోటెక్నాలజీ కోర్సును, మరికొన్ని ఇండస్ట్రియల్‌ బయోటెక్నాలజీ, మెడికల్‌ బయోటెక్నాలజీ, మెరైన్‌ బయోటెక్నాలజీ, న్యూరోసైన్స్‌, మాలిక్యులార్‌, హ్యూమన్‌ జెనెటిక్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ బయోటెక్నాలజీ మొదలైన వైవిధ్యమైన కోర్సులను అందిస్తున్నాయి. ఎంఎస్‌సీ మెడికల్‌ బయోటెక్నాలజీ, న్యూరోసైన్స్‌, మాలిక్యులార్‌, హ్యూమన్‌ జెనెటిక్స్‌ పూర్తిచేసినవారు వైద్య కళాశాలలు, ఆస్పత్రులలోని ల్యాబ్‌లు, ఫార్మా సంస్థల్లో ఉపాధి అవకాశాలు పొందవచ్చు. ఎంఎస్‌సీ మెరైన్‌ బయోటెక్నాలజీ పూర్తిచేసినవారికి పెట్రో కెమికల్‌ ఇండస్ట్రీస్‌, జియోలాజికల్‌ సర్వే డిపార్ట్‌మెంట్‌లో ఉపాధి లభిస్తుంది. 10 + 2 + 3/ 4/ 5తో 55% మార్కులను కలిగివున్న విద్యార్థులు ఈ ప్రవేశపరీక్షకు అర్హులు. జేఎన్‌యూ కంబైన్డ్‌ బయోటెక్నాలజీ పరీక్ష రాసేవారు ఏ సబ్జెక్టుకు అధిక ప్రాధాన్యముందో గుర్తించి, దానికి అనువర్తిత విధానంలో సన్నద్ధమవ్వాలి. ఈ ఏడాది ఈ ప్రవేశపరీక్షను డిసెంబరులో నిర్వహిస్తున్నారు. కాబట్టి, తుది సంవత్సరం చదువుతున్నవారు సంబంధిత సిలబస్‌కు ప్రణాళికబద్ధంగా టైంటేబుల్‌ను రూపొందించుకోవాలి. రోజుకు కనీసం ఆరు గంటలు కష్టపడి అధ్యయనం చేయాలి. ముఖ్యమైన పాఠ్యాంశాలు, ఫార్ములాలు, జియోలాజికల్‌ నిర్మాణాలను చార్టుల రూపంలో రూపొందించుకోవాలి.

పరీక్ష విధానం
ఆబ్జెక్టివ్‌ విధానం. సమయం- మూడు గంటలు. పరీక్షలో రెండు పార్ట్‌లు (పార్ట్‌- ఎ, బి).

పార్ట్‌-ఎ: దీనిలో ప్రశ్నలన్నీ 10+2 స్థాయి సిలబస్‌ ఆధారంగా అనువర్తిత ధోరణిలో ఉంటాయి. మొత్తం ప్రశ్నలు 60. బయాలజీ, మేథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సిలబస్‌ల ఆధారంగా ప్రశ్నలుంటాయి. అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాయాలి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు. రుణాత్మక మార్కులున్నాయి. కాబట్టి సమాధానం తెలియని ప్రశ్నలను వదిలేయడం మేలు.

పార్ట్‌-బి: బీఎస్‌సీ స్థాయి సిలబస్‌ ఆధారంగా ప్రశ్నలుంటాయి. అనువర్తిత ధోరణిలో 100 ప్రశ్నలను బయాలజీ (బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, జెనెటిక్స్‌, బోటనీ, జువాలజీ, మాలిక్యులార్‌ బయాలజీ) మేథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీల నుంచి రూపొందిస్తారు. ఈ విభాగంలో ఏవేని 60 ప్రశ్నలకు సరైన సమాధానాన్ని గుర్తిస్తే చాలు. అంతకుమించి ఎక్కువ ప్రశ్నలకు సమాధానం రాస్తే మొదటి 60 ప్రశ్నలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు. మొత్తం 180 మార్కులు. రుణాత్మక మార్కులున్నాయి. ప్రతి తప్పు సమాధానానికీ -1 మార్కు ఉంటుంది. రెండు విభాగాలూ కలిపి ప్రశ్నపత్రం మొత్తంగా 240 మార్కులకు ఉంటుంది. సాధారణంగా కటాఫ్‌ మార్కు ప్రశ్నపత్రం ఆధారంగా 140 నుంచి 150 మధ్య ఉంటుంది. రెండు పార్టుల మార్కుల ఆధారంగా ర్యాంకును నిర్ణయిస్తారు.

దేన్ని ఎలా చదవాలి?
బీఎస్‌సీ బయాలజీ ఆప్షన్‌ ఉన్నవారు గత ప్రశ్నపత్రాలను గమనిస్తే.. బయాలజీ విభాగానికి 140 మార్కులు (సుమారుగా పార్ట్‌-ఎ 20, పార్ట్‌-బికి 120 మార్కులు), కెమిస్ట్రీ విభాగానికి 80 మార్కుల (పార్ట్‌-ఎ 20, పార్ట్‌-బి 60) వెయిటేజీతో ప్రశ్నలు ఉంటాయి. అంటే బయాలజీ, కెమిస్ట్రీ కలిపి మొత్తం 240 మార్కుల్లో సుమారుగా 220 మార్కుల వెయిటేజీ ఉండే అవకాశముంది. కాబట్టి, బయాలజీ విద్యార్థులు మొదట బయాలజీ, కెమిస్ట్రీ సిలబస్‌కు అధిక ప్రాముఖ్యమివ్వాలి. తర్వాత ఫిజిక్స్‌, మేథ్స్‌లను అధ్యయనం చేయాలి.
బీఎస్‌సీలో బీజెడ్‌సీ (బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ) గ్రూప్‌ చదివినవారు తమ ఆప్షనల్స్‌తోపాటు ఆధునిక బయాలజీ (బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, జెనెటిక్స్‌, మాలిక్యులార్‌ బయాలజీ)పైనా ఎక్కువ దృష్టి పెట్టాలి.
బీఎస్‌సీలో ఆధునిక బయాలజీతోపాటు కెమిస్ట్రీనీ కలిగిన విద్యార్థులు తమ ఆప్షనల్స్‌తోపాటు బోటనీ, జువాలజీపైనా ఎక్కువ దృష్టిని కేంద్రీకరించాలి. మేథ్స్‌ ఆప్షన్‌ను కలిగినవారు మేథ్స్‌తోపాటు కెమిస్ట్రీపైనా ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.

అనువర్తనం... అధిక వెయిటేజీ
పరీక్షలో పార్ట్‌-బి ప్రశ్నలకు ఎక్కువ వెయిటేజీ ఉంది. కాబట్టి, ఈ సిలబస్‌ను అనువర్తిత ధోరణిలో చదవాలి. పాతప్రశ్నపత్రాలను సేకరించి ఈ ప్రశ్నలను విశ్లేషించుకుని సబ్జెక్టుపై పట్టు పెంచుకోవాలి. ప్రశ్నపత్రం పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. కాబట్టి ఆ తరహాలోనే ఎక్కువగా సాధన చేయాలి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. తెలుగు మీడియం వారు ఆంగ్ల ప్రశ్నపత్రాలను ఎక్కువగా సాధన చేయడం ద్వారా ర్యాంకు సాధించవచ్చు. ఎంఎస్‌సీ బయోటెక్నాలజీ ఎంట్రన్స్‌లో ఎక్కువ సీట్లను ఎంబైపీసీ విద్యార్థులు కైవసం చేసుకుంటున్నారు. కాబట్టి బైపీసీ విద్యార్థులు బయాలజీ, కెమిస్ట్రీతోపాటు మేథమేటిక్స్‌, ఫిజిక్స్‌లపైనా దృష్టిసారించాలి. బీఎస్‌సీలో బీజెడ్‌సీ గ్రూపు వారు బోటనీ, జువాలజీలతోపాటు బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, జెనెటిక్స్‌, మాలిక్యులార్‌ బయాలజీకి సంబంధించిన సిలబస్‌నూ క్షుణ్ణంగా చదవాలి బీఎస్‌సీలో మోడరన్‌ బయాలజీ గ్రూపువారు బోటనీ, జువాలజీ సిలబస్‌ను కూడా శ్రద్ధగా అధ్యయనం చేయాలి.

ఉపకార వేతనం
ఈ ప్రవేశపరీక్ష ద్వారా జేఎన్‌యూలో బయోటెక్నాలజీలో ప్రవేశం పొందినవారికి నెలకు రూ.3000 ఉపకారవేతనాన్ని (స్కాలర్‌షిప్‌) మొదటి సెమిస్టర్‌ వరకు పొందవచ్చు. మొదటి సెమిస్టర్‌లో సీజీపీఏ 6.00 పొందినవారు చివరి సెమిస్టర్‌ వరకు స్కాలర్‌షిప్‌ పొందడానికి అర్హులు. ఇతర విశ్వవిద్యాలయాలు కొన్ని కూడా ఉపకార వేతనాలను అందిస్తున్నాయి.
బీఎస్‌సీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నవారు కూడా ఈ పరీక్షకు అర్హులు. వీరికి సమయం తక్కువగా ఉంది కాబట్టి, ఏ సబ్జెక్టుకు ఎక్కువ వెయిటేజీ ఉందో గ్రహించి, దాన్నే క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. తుది సంవత్సర విద్యార్థులు మాదిరి పరీక్షలను అనువర్తిత ధోరణిలో సాధన చేయడం మంచిది. బీఎస్‌సీ మొదటి, రెండు సంవత్సరాల విద్యార్థులు ఇప్పటినుంచే సన్నద్ధతను ప్రారంభించడం మేలు.
జేఎన్‌యూలో మంచి ర్యాంకు రానప్పటికీ సన్నద్ధత వృథా కాదు. అదే సిలబస్‌తో ఇతర పోటీపరీక్షలు, ఇంటర్వ్యూల్లో మంచి ఫలితాలను సాధించవచ్చు. పరీక్ష స్థాయి, పోటీ తీవ్రత గురించి ఆలోచించకుండా సానుకూల దృక్పథంతో కృషి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.
గత నాలుగేళ్ల ప్రవేశపరీక్ష ప్రశ్నపత్రాల కోసం www.jnu.ac.in వెబ్‌సైట్‌ను పరిశీలించవచ్చు. జేఎన్‌యూ ఎంఎస్‌సీ కంబైన్డ్‌ బయోటెక్నాలజీతోపాటు ఎంఎస్‌సీ (అగ్రి) ఎంవీఎస్‌సీ బయోటెక్నాలజీ ప్రోగ్రామ్‌, ఎంటెక్‌ బయోటెక్నాలజీ పోగ్రామ్‌లను అందిస్తోంది. ఇతర వివరాలకు జేఎన్‌యూ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
జేఎన్‌యూ విడిగా కూడా ఎంఎస్‌సీ లైఫ్‌ సైన్స్‌ ప్రోగ్రామ్‌ను, ఇతర పీజీ కోర్సులు, పీహెచ్‌డీ పోగ్రామ్‌లను అందిస్తోంది. దీని నోటిఫికేషన్‌ కూడా విడుదలైంది.
తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ప్రవేశపరీక్ష కేంద్రాలు- హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ.

ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: అక్టోబరు 13, 2017
పరీక్ష తేదీ: డిసెంబరు 30, 2017 (ఉదయం 9 గం. నుంచి మధ్యాహ్నం 12 గం. వరకు)
పరీక్ష ఫీజు: జనరల్‌, ఓబీసీ విద్యార్థులకు రూ.1000, ఎస్‌సీ, ఎస్‌టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.500. పరీక్ష ఫీజును జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ, దిల్లీ పేరిట డిమాండ్‌ డ్రాఫ్ట్‌ తీయాల్సి ఉంటుంది.

పార్ట్‌-ఎ తో ప్రారంభిద్దాం
పార్ట్‌-ఎ: ను10+2 సిలబస్‌తో సన్నద్ధతను మొదలుపెట్టడం మేలు. మొదట తెలుగు అకాడమీ, సీబీఎస్‌సీ, ఐసీఎస్‌ఈ పుస్తకాలను రిఫర్‌చేసి ప్రాథమికాంశాలను అభివృద్ధి చేసుకోవాలి. తర్వాత బీఎస్‌సీ సిలబస్‌ను అంశాలవారీగా రిఫరెన్స్‌ పుస్తకాల ద్వారా సబ్జెక్టును సమగ్రంగా చదవాలి. సీబీఎస్‌సీ బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌ పుస్తకాలు, తెలుగు అకాడమీ 10+2 స్థాయి పుస్తకాలపై పట్టు సాధించాలి.

పార్ట్‌-బి: సిలబస్‌ కోసం బీఎస్‌సీ సంబంధిత పుస్తకాలను అనువర్తిత ధోరణిలో చదవాలి.
జేఎన్‌యూ ఎంఎస్‌సీ బయోటెక్నాలజీ ప్రవేశపరీక్షలు రాసేవారు మైక్రోబయాలజీ సిలబస్‌లో బ్యాక్టీరియా, వైరస్‌, ఫంగై, ఇమ్యూన్‌ సిస్టం, సెల్‌ బయాలజీ మొదలైన అంశాలపై ఎక్కువ దృష్టిని కేంద్రీకరించాలి.

ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో జనరల్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, రియాక్షన్‌ మెకానిజం, స్పెక్ట్రోస్కోపీ, నేమ్‌డ్‌ రియాక్షన్స్‌, స్టీరియో కెమిస్ట్రీ మీద ఎక్కువ దృష్టికేంద్రీకరించాలి. ఫిజికల్‌ కెమిస్ట్రీలో మోల్‌ కాన్సెప్ట్స్‌, థర్మోడైనమిక్స్‌, కెమికల్‌ కైనెటిక్స్‌, ఎలక్ట్రోకెమిస్ట్రీ, క్వాంటమ్‌ కెమిస్ట్రీ సంబంధిత అంశాలను అధ్యయనం చేయాలి. ఇనార్గానిక్‌ కెమిస్ట్రీలో సంశ్లిష్ట సమ్మేళనాలు, అనలిటికల్‌ కెమిస్ట్రీ, కెమికల్‌ బాండింగ్‌ మొదలైనవి ముఖ్యం.

ఫిజిక్స్‌లో.. మోడరన్‌ ఫిజిక్స్‌, మెకానిక్స్‌, ఆప్టిక్స్‌, థర్మోడైనమిక్స్‌, హీట్‌, అటామిక్‌ ఫిజిక్స్‌ సబ్జెక్టులు ప్రధానం.

మేథమేటిక్స్‌లో.. కోఆర్డినేట్‌ జామెట్రీ, ట్రిగొనామెట్రీ, వెక్టర్‌, డెరివేటివ్స్‌ కాల్‌క్యులేట్స్‌, మాట్రిక్స్‌లను బాగా సాధన చేయాలి.

సంప్రదించాల్సిన పుస్తకాలు
10+2 సిలబస్‌ కోసం ఎన్‌సీఈఆర్‌టీ బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, మ్యాథమేటిక్స్‌ పుస్తకాలను సమగ్రంగా చదవాలి. బీఎస్‌సీ సిలబస్‌ కోసం పనికొచ్చే రిఫరెన్స్‌ పుస్తకాలు ఇవి-
బయాలజీ
Biochemistry : Voet & Voet; Albert Lehninger, Lubert Stryer
Microbiology : Prescott, Stanier, Anant Narayana
Cellbiololgy : Alberts, Ladish, M.Cooper
lmmueology : Kuby, Roitt
Molecular Biology: Molecular Biology - Weaver, Molecularbiology of the gene - Watson etal;
GenesIX- Lewin, Molecularbiology-David Frefelder; Advanced Molecular Biology - Twymann
Genetics: An introduction to genetic analysis-Griffith, Suzuki; Genetic - Tamarin,
Genetics - Klug & Cummins, Genetics - Snustad
Plant Physiology: Teiz and Zeiger, Park S Nobel , Hess
Animal Physiology: Knut Schindt - Nielsen, Christopher D Moyes, P.S. Verma, B.S. Tyagi, V.K.

కెమిస్ట్రీ
Organic Chemistry by Bruice, Organic Chemistry by Solomons, Organic Chemistry I.L.Finar-1
Physical Chemistry by Puri & Sharma
lnorganic Chemistry by J.D. Lee

Back..

Posted on 09-10-2017