Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
బిర్లా సంస్థల్లో ఇంజినీరింగ్‌కు బిట్‌శాట్‌

- బిట్‌శాట్‌-2017 ప్రక‌ట‌న విడుద‌ల‌

ఇంజినీరింగ్ విద్యలో ఐఐటీల త‌ర్వాత ప్రముఖంగా చెప్పుకునేది బిర్లా సంస్థల గురించే. ఎలాంటి రిజ‌ర్వేష‌న్లూ లేకుండా కేవ‌లం ప‌రీక్షలో సాధించిన మార్కుల‌ మెరిట్ ప్రాతిప‌దిక‌నే సీట్లు కేటాయించ‌డం ఈ సంస్థల ప్రత్యేక‌త‌. అలాగే ఉన్నత ప్రమాణాలు, బోధ‌న‌లో నాణ్యత‌కు బిర్లా సంస్థలు చిరునామాగా నిలుస్తున్నాయి. బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ అండ్ సైన్స్ (బిట్స్‌)కు దేశ‌వ్యాప్తంగా 3 క్యాంప‌స్‌లు పిలానీ, గోవా, హైద‌రాబాద్‌ల్లో ఉన్నాయి. ఇవి ఇంజినీరింగ్‌లో ప‌లు బ్రాంచీల్లో బీఈ కోర్సుల‌తోపాటు బీఫార్మసీ, అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సులు అందిస్తున్నాయి. కంప్యూట‌ర్ బేస్డ్ ఆన్‌లైన్ ప‌రీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ కోర్సుల్లో ప్రవేశానికి బిట్‌శాట్‌-2017 ప్రక‌ట‌న వెలువ‌డింది. ఆ వివ‌రాలు చూద్దాం...

క్యాంప‌స్‌ల వారీ కోర్సుల వివ‌రాలు..

పిలానీ క్యాంప‌స్‌
బీఈ: కెమిక‌ల్ ఇంజినీరింగ్‌, సివిల్ ఇంజినీరింగ్‌, కంప్యూట‌ర్ సైన్స్‌, ఎల‌క్ట్రిక‌ల్ & ఎల‌క్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌, ఎల‌క్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేష‌న్ ఇంజినీరింగ్‌, మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజినీరింగ్‌.
బీఫార్మసీ
ఎమ్మెస్సీ: బ‌య‌లాజిక‌ల్ సైన్సెస్‌, కెమిస్ట్రీ, ఎక‌నామిక్స్‌, మ్యాథ‌మెటిక్స్‌, ఫిజిక్స్‌, జ‌న‌ర‌ల్ స్టడీస్

గోవా క్యాంప‌స్‌
బీఈ: కెమిక‌ల్‌, కంప్యూట‌ర్ సైన్స్‌, ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్‌, ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్‌, ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌, మెకానిక‌ల్‌
ఎమ్మెస్సీ: బ‌య‌లాజిక‌ల్ సైన్సెస్‌, కెమిస్ట్రీ, ఎక‌నామిక్స్‌, మ్యాథ‌మెటిక్స్‌, ఫిజిక్స్‌.

హైద‌రాబాద్ క్యాంప‌స్‌
బీఈ: కెమిక‌ల్‌, సివిల్‌, కంప్యూట‌ర్ సైన్స్‌, ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్‌, ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్, ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌, మెకానిక‌ల్‌, మ్యానుఫ్యాక్చరింగ్‌.
బీఫార్మసీ
ఎమ్మెస్సీ: బ‌య‌లాజిక‌ల్ సైన్సెస్‌, కెమిస్ట్రీ, ఎక‌నామిక్స్‌, మ్యాథ‌మెటిక్స్‌, ఫిజిక్స్‌.

అర్హత: పై మూడు బిట్స్ కేంద్రాల్లోనూ బీఈ, బీఫార్మసీ, ఎమ్మెస్సీ కోర్సుల‌కు ఎంపీసీ గ్రూప్‌తో ఇంట‌ర్ ఉత్తీర్ణులు, ప్రస్తుతం ద్వితీయ సంవ‌త్సరం ఇంట‌ర్ చ‌దువుతున్నవారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. బైపీసీ విద్యార్థులు బీఫార్మసీ కోర్సుకు అర్హులు. అలాగే ఇంట‌ర్‌లో 75 శాతం మార్కులు సాధించాలి. దీంతోపాటు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌/బ‌యాల‌జీ ప్రతి స‌బ్జెక్టులోనూ క‌నీసం 60 శాతం మార్కులు సాధించ‌డం త‌ప్పనిస‌రి. అలాగే 2016లో ఇంట‌ర్ ఉత్తీర్ణులు, 2017లో ద్వితీయ సంవ‌త్సరం ప‌రీక్షలు రాయ‌బోతున్నవాళ్లు మాత్రమే బిట్‌శాట్‌-2017కి అర్హులు.

ప‌రీక్ష ఇలా..
మూడు గంట‌ల‌పాటు నిర్వహించే ఈ ప‌రీక్షలో 4 విభాగాలు ఉంటాయి. పార్ట్‌-1 ఫిజిక్స్‌, పార్ట్‌-2 కెమిస్ట్రీ, పార్ట్ -3 ఎ) ఇంగ్లిష్ ప్రొఫిషియ‌న్సీ బి) లాజిక‌ల్ రీజ‌నింగ్‌. పార్ట్‌-4 మ్యాథ్స్ (బైపీసీ విద్యార్థుల‌కు బ‌యాల‌జీ)
ప్రశ్నల‌న్నీ ఆబ్జెక్టివ్ త‌ర‌హాలోనే ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 4 ఆప్షన్లు ఇస్తారు. స‌రైన జ‌వాబు గుర్తించిన ప్రతి ప్రశ్నకు 3 మార్కులు కేటాయిస్తారు. త‌ప్పుగా గుర్తించిన ప్రతి స‌మాధానానికీ ఒక మార్కు చొప్పున త‌గ్గిస్తారు. మొత్తం 150 ప్రశ్నలు వ‌స్తాయి. మొత్తం ప్రశ్నప‌త్రానికి 450 మార్కులు. స‌బ్జెక్టుల‌వారీ ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40, ఇంగ్లిష్ ప్రొఫిషియ‌న్సీ 15, లాజిక‌ల్ రీజ‌నింగ్ 10, మ్యాథ్స్‌/ బ‌యాల‌జీ 45 ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నప‌త్రం ఆంగ్లమాధ్యమంలోనే ఉంటుంది. ర‌ఫ్ వ‌ర్క్ కోసం తెల్ల కాగితాలు అందిస్తారు. పెన్ను త‌ప్ప కాలిక్యులేట‌ర్లు ఇత‌ర ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాలు అనుమ‌తించ‌రు. ఎన్‌సీఈఆర్‌టీ 11, 12 త‌ర‌గ‌తుల పాఠ్యపుస్తకాల నుంచే ప్రశ్నలు వ‌స్తాయి. ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్యర్థుల‌కు బిట్‌శాట్‌-2017 వెబ్‌సైట్‌లో న‌మూనా ప్రశ్నప‌త్రం అందుబాటులో ఉంచుతారు.

ముఖ్యమైన తేదీలు...
ద‌ర‌ఖాస్తులు: ఆన్‌లైన్‌లో
ద‌ర‌ఖాస్తు ఫీజు: పురుషుల‌కు రూ.2750, మ‌హిళ‌ల‌కు రూ.2250
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 06.03.2017 (సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు)
రివిజ‌న్‌, ఎడిటింగ్: మార్చి 7 నుంచి 10 వ‌ర‌కు
టెస్టు సెంట‌ర్లు, స్లాట్‌ల ప్రక‌ట‌న: మార్చి 15న
టెస్టు సెంట‌ర్ల ఎంపిక‌: మార్చి 20 నుంచి ఏప్రిల్ 5 వ‌ర‌కు అభ్యర్థులు న‌చ్చిన టెస్టు సెంట‌ర్లు, కోరుకున్న స్లాట్ ఎంచుకోవ‌చ్చు.
హాల్‌టికెట్ డౌన్‌లోడ్ తేది: 15.04.2017 నుంచి 10.05.2017
బిట్‌శాట్ ఆన్‌లైన్ ప‌రీక్ష తేదీలు: 16.05.2017 నుంచి 30.05.2017 (ఈ తేదీల్లో ప్రతి రోజూ ఉద‌యం 9 నుంచి మ‌ధ్యాహ్నం 12 వ‌ర‌కు, మ‌ధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వ‌ర‌కు ప్రతి రోజూ రెండు స్లాట్‌ల్లో ప‌రీక్షలు నిర్వహిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌లైన్ ప‌రీక్ష కేంద్రాలు: హైద‌రాబాద్, రాజ‌మండ్రి, తిరుప‌తి, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం.
ఫ‌లితాల ప్రక‌ట‌న‌: జులై 1
వెబ్‌సైట్‌: www.bitsadmission.com

నోటిఫికేష‌న్‌

సిల‌బ‌స్

బిట్‌శాట్‌ దారి... ఎంసెట్‌పై గురి!

Back..

Posted on 10-01-2017