Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
బీటెక్‌ బాబు.. చూపొద్దు డాబు!

* కలసాకారం దిశగా తొలి అడుగు వేయాలి
* విజ్ఞానం, నైపుణ్యం కలగలిపితేనే భవిత

ఇంజినీరింగ్‌ యువ విద్యార్థుల కల.. సంప్రదాయ కోర్సుల కంటే సాంకేతిక విద్యపై మమకారం.. నాలుగేళ్ల విద్యార్థి జీవితం. అత్యధికుల్లో యంత్రవిద్య అంటే సరదాలు, షికార్లు, సామాజిక మాధ్యమాలతో కాలక్షేపం అనే భావన ఉంది. తరగతుల బంక్‌.. మిత్ర బృందంతో కబుర్లు. ఉల్లాసం, ఉత్సాహం. ఇదే విధానం చివరి వరకు సాగితే ఫలితం శూన్యం. అందుకే ఉన్నత లక్ష్యం.. సడలని సంకల్పంతో అడుగేయాలి. ఇంజినీరింగ్‌ ప్రవేశాల ప్రక్రియ చివరి దశకు చేరింది. ఎంచుకున్న కళాశాలలో అభిరుచి గల కోర్సులో చేరారు. ఆయా కళాశాలలు నూతన విద్యార్థులకు దిశా నిర్దేశం చేస్తున్నాయి. లక్ష్యం నిర్దేశించుకొని ప్రణాళిక ప్రకారం ముందుకు సాగితే పట్టా కంటే ముందే ఉద్యోగం.. లేదంటే స్టార్టప్‌ స్థాపనకు శ్రీకారం చుట్టడం కష్టమేమి కాదు. వాస్తవ కష్టం ఏమిటంటే సమయం దుర్వినియోగం చేయకుండా ఉండటం, దురలవాట్లకు దూరంగా ఉండటం.. వీటిని జయించాలి. నాలుగేళ్లలో తగిన కృషి చేస్తే 80 వసంతాల జీవితం సాఫల్యం అవుతుంది. అందుకు ఏమి చేయాలంటే..

కొత్త వాతావరణంతో మమేకం
ఇంటర్‌ వాతావరణం వేరు అందుకు పూర్తిగా భిన్నమైనది ఇంజనీరింగ్‌. ఇప్పటి వరకు పంజరంలో చిలక. ఇప్పుడు అందులో నుంచి వచ్చిన స్వేచ్ఛా జీవి. తల్లిదండ్రులు, అధ్యాపకులు కాస్త ఉదారంగా వ్యవహరిస్తారు. అయితే కొత్తగా కళాశాలకు వెళ్లాక కొందరిలో స్వేచ్ఛా భావం.. మరి కొందరిలో భయం. ఈ రెండింటిని సమపాళ్లలో ఉంచితే ఎలాంటి ఇబ్బంది తలెత్తదు. ర్యాగింగ్‌ అనే భయం చాలా మందిలో ఆందోళన కలిగిస్తోంది.. గతంతో పోల్చితే అంతగా లేదు. అయినా ఆత్మస్థైర్యంగా ముందుకు వెళ్లడంతో పాటు పరిచయ కార్యక్రమాల్లో కొంత వరకు సీనియర్ల నుంచి డామినేషన్‌ కనిపిస్తోంది. ఇది సర్వసాధారణం అనే భావనతో నడుచుకుంటే చాలు. ఇవి తాత్కాలిక సాంకేతిక విజ్ఞానాభివృద్ధి కీలకం అనుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. చదువుపై ఏకాగ్రత నిలుస్తుంది. మరొక విషయం.. స్వేచ్ఛ లభిస్తే అధి వ్యక్తి నిర్మాణం, సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడాలని. జీవితానికి మచ్చ తెచ్చేదై ఉండొద్దు..

విభిన్న కోణాల్లో అభ్యసనం
తరగతి గది పాఠ్యాంశాలతో సరి పెట్టడం కాదు. అందులోని సందేహాల నివృత్తి ఆవశ్యకం. ప్రతి చాప్టర్‌పై మెరుగైన అవగాహనకు గ్రంథాలయంలోనే అనుబంధ గ్రంథాల అభ్యసనం అవసరం. అందరి కంటే కొంచెం ఎక్కువే తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రయోగశాలల్లో ప్రతి పరికరం, సాఫ్ట్‌వేర్‌, యంత్రాలు ఏవైనా కోర్సుకు సంబంధించిన వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిందే.. ప్రయోగాత్మక అనుభవం సాధిస్తే ఎలాంటి సందేహాలు ఉండవు. బీటెక్‌ పరీక్షల కోసం ఒక సారి.. ‘గేట్‌’కు మరొకసారి, ఐఈఎస్‌కు ఇంకోసారి చదవాల్సిన అవసరం ఉండకూడదు. ఒక అంశాన్ని నేర్చుకుంటున్న సమయంలో అన్ని కోణాలుగా అభ్యసించాలి. పరీక్ష ఏదైనా.. ఎంత కఠినమైనా సమాధానం నిర్ణీత సమయంలో గుర్తించే నేర్పు సాధించాలి. తరగతులు, గ్రంథాలయం, ప్రయోగశాలతో పాటు ఇంటి వద్ద గత మాదిరి ప్రశ్న పత్రాల సాధన చేయడం మొదటి సంవత్సరం నుంచి అలవాటు చేసుకోవడం తప్పనిసరి.

వాటన్నింటికి దూరంగా
కౌమార దశలోనే బీటెక్‌లో ప్రవేశం.. కొత్తగా.. ప్రత్యేకంగా కనిపించడంతో పాటు ఆకర్షణీయంగా ఉంటాయి కొన్ని. వాటినే దురలవాట్లు అంటారు. ప్రేమ.. ధూమపానం.. మద్యం మత్తు.. సామాజిక మాధ్యమాలు.. వీటన్నింటికి బానిస అయితే ఇక ఏనాడూ ఎదిగే అవకాశం లేకుండా పోతుంది. అనాలోచిత ప్రేమతో కుటుంబాలు.. దురలవాట్లతో జీవితాలు రోడ్డున పడుతుండటం అందరూ గమనిస్తున్న విషయం.. నిజమైన ప్రేమ జీవితంలో స్థిర పడ్డాక చిగురిస్తుంది.. దానికి కావాల్సిన మద్దతు లభిస్తుంది. ఈ నాలుగేళ్లు దాని గురించి ఆలోచించకపోవడం ఎంతో మేలు. కష్టాల నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన వారిని స్ఫూర్తిగా తీసుకుంటే జీవితం సుఖమయం అవుతుంది. అంతర్జాలం అంటే ఆసక్తి. అయితే దాన్ని మీ సబ్జెక్టు పెంచుకునేందుకు వినియోగించాలి.

పాఠ్యాంశాతో పాటు సృజన.. నైపుణ్యం
బట్టీ పట్టి పరీక్ష గట్టెక్కితే సరి పోదు. ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత అవసరం. అయితే చదువు మార్కులు మాత్రమే తెచ్చేది కాకుండా ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాన్నిచ్చేది కావాలి. అందుకు విషయ పరిజ్ఞానంతో పాటు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, సృజన, నైపుణ్యత ఎంతో అవసరం. తొలి ఏడాది నుంచి ఆంగ్లంలో మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. సందేహాల నివృత్తికి అధ్యాపకులతో ఆంగ్లంలో సంభాషణ.. స్నేహితులతో కబుర్లు కూడా ఆంగ్లంలోనే కొనసాగితే భాషా ప్రావీణ్యతకు ప్రత్యేక శిక్షణ అవసరం లేదు. రానున్న నాలుగేళ్లలో కంపెనీల తీరు, మీరు ఎంచుకున్న కోర్సుల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై ఎప్పటికప్పుడు ఒక అవగాహనకు రావాల్సి ఉంటుంది. మనకంటూ ఒక సృజన, నైపుణ్యతతో పాటు వ్యక్తిత్వానికి అనువైన వైఖరి ఉంటే ప్రాంగణ నియామకాల్లో ఉత్తమ కంపెనీలను ఆకర్షించే అవకాశం ఉంటుంది.

నిపుణుల తరగతులపై ప్రత్యేక దృష్టి
ఆయా రంగాల్లోని ప్రముఖలతో ప్రత్యేక తరగతులు నిర్వహించడం చూస్తుంటాం. అప్పుడు విద్యార్థి వాటిపై ఆసక్తి కనబరచాలి. అంతే కాని క్లాస్‌ వినడమే బోరు.. ఇప్పుడు వీళ్లు చెప్పేది వినలా.. వామ్మో. అనుకుంటే ఫలితం ఏమి ఉండదు. ఇంజనీరింగ్‌ పూర్తయ్యేలోగా అనేక మంది మీ కళాశాలలో ప్రత్యేక సెమినార్‌, వర్క్‌షాప్‌, ప్రాజెక్టు వర్క్స్‌ వంటివి నిర్వహిస్తారు. ఆసక్తిగా పాల్గొంటే ప్రతి ఒక ప్రత్యేక తరగతి నుంచి అనేక విషయాలను తెలుసుకోవడం జరుగుతుంది. వాటి ఫలితం జీవితంలో స్థిరపడుతున్న క్రమంలో కనిపిస్తుంది. నైపుణ్యత అందించేందుకు టాస్క్‌ ద్వితీయ సంవత్సరం స్వాగతం పలుకుతుంది. వెంటనే అందులో చేరి మీ కోర్సుకు తగిన నైపుణ్యాన్ని సాధించేందుకు కృషి చేయాలి. ఇలా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఉద్యోగ సాధన సులభం అవుతుందని గ్రహించాలి.

భవిష్యత్‌ను అంచనా వేస్తూ చదవాలి - డాక్టర్‌ ఆర్‌.మార్కండేయ, జేఎన్‌టీయూ మంథని ప్రధానాచార్యులు
ఈసీఈ, సీఎస్‌ఈ, ట్రిపుల్‌ ఈ, ఐటీ కోర్సులను అత్యధికులు ఎంపిక చేసుకుంటున్నారు. ఎక్కువ మంది ఒకే రకమైన కోర్సులను అభ్యసిస్తే పోటీ తీవ్రంగా ఉంటుంది. అయినా ఇష్టమైన కోర్సు వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఎప్పటికప్పుడు అప్లికేషన్స్‌ మారిపోతున్నాయి. రానున్న రోజుల్లో ప్రజలకు ఏది అవసరమో గుర్తించాలంటే ఆలోచన కాలానికి ముందుగా ఉండాలి. అందకు తగ్గట్లు కొత్త ఆవిష్కరణలు చేసే సత్తాను సాధించాలి. కాలక్షేపం చేస్తామంటే నిరుద్యోగులుగా మిగిలిపోతారు. సివిల్‌, మెకానికల్‌ అవేమి తక్కువ కాదు. రాష్ట్రంలో అతి తక్కువ సీట్లు గల మైనింగ్‌ కీలమే. అయితే కోర్సు ఏది అనేది కాదు.. అందులో ఏమేరకు నిష్ణాతులం అనేది ప్రధానం. అర కొర మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే ప్రాంగణ నియామకాలకే అర్హత ఉండదు.

భావనాత్మక అభ్యసనం కీలకం - ఎన్‌.వి రమణ, జేఎన్‌టీయూ కొండగట్టు ప్రధానాచార్యులు
అభిరుచికి తగిన కోర్సులో చేరారు. దానిపై పట్టు సాధించాలి. ప్రతి అంశాన్ని కాన్సెప్టుగా చదవాలి. పాఠ్యాంశాలపై సంపూర్ణ అవగాహనకు ప్రత్యేక కార్యశాల, అంతర్జాల విషయ పరిజ్ఞానం ఆర్జించాలి. అందరిలో ఒకరిగా కాకుండా ప్రత్యేకంగా నిలవాల్సిన ఆవశ్యకత ఉంది. ఆంగ్ల భాషలో ప్రావీణ్యత అనేది గ్లోబల్‌ డిమాండ్‌.. నిర్లక్ష్యం చేయకుండా సాధన చేస్తే ధారాళంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ప్రాంగణ నియామకాల్లో విజేతగా నిలిపేందుకు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ కీలకం.. రోజు వారీ సంభాషణ ఆంగ్లంలో కొనసాగిస్తే మంచి పట్టు లభిస్తుంది. అందరూ ఉద్యోగాలు అనే ఆలోచనతో కాకుండా భిన్నంగా ఆలోచించాలి. స్టార్టప్‌లకు ఎంతో ప్రోత్సాహం లభిస్తుంది. విభిన్న ఆలోచన నుంచి కొత్త ఆవిష్కరణను ఉద్భవిస్తాయి. సమయం, అంతర్జాలం ఈ రెండింటిని సద్వినియోగం చేసుకుంటే జీవితానికి ఒక మార్గం లభిస్తుంది. చెడుకు దూరంగా ఉండాలి. అవి అందరితో సాధ్యం.. విజేతగా నిలబడటం కొందరికే సాధ్యమని గుర్తించాలి.

Back..

Posted on 01-08-2017