Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఆర్టికల్‌షిప్‌... ఎందుకు? ఎలా?

సీఏ ఐపీసీసీ ఫలితాలు ఇటీవలే విడుదలయ్యాయి. ఈ కోర్సులో ఉత్తీర్ణత సాధించినవారు సీఏ ఫైనల్‌ కోర్సును నమోదు చేయించుకోవాలంటే మూడేళ్ళ ఆర్టికల్‌షిప్‌ (ప్రాక్టికల్‌ శిక్షణ) చేయాల్సి ఉంటుంది.సీఏ విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యం పెంపొందించడం కోసం ఐసీఏఐ వారు ఈ ఆర్టికల్‌షిప్‌ విధానాన్ని అవలంబిస్తున్నారు. ఐపీసీసీ పూర్తిచేసినవారు ఒక ప్రాక్టీసింగ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్‌ దగ్గర ఆర్టికల్‌షిప్‌కు పేరు నమోదు చేసుకోవాలి; రెండున్నర ఏళ్ళపాటు ప్రాక్టికల్‌ శిక్షణ పూర్తిచేయాలి. తరువాత చివరి ఆరు నెలల్లో సీఏ ఫైనల్‌ పరీక్ష రాయడానికి అనుమతి లభిస్తుంది. అవసరమైన విషయపరిజ్ఞానం, ఎక్స్‌పోజర్‌లతోపాటు సీఏ పాసైన తర్వాత చేయబోయే అన్ని పనులనూ ముందుగానే నేర్చుకునే అవకాశం కల్పించే వేదికే ఈ ఆర్టికల్‌షిప్‌. అందుకే ఈ శిక్షణకు విద్యార్థులు చదువుకు ఇచ్చినంత ప్రాముఖ్యాన్నే ఇవ్వాలి.

గమనించాల్సిన విషయాలు
1. సీఏ ఫైనల్‌ పూర్తిచేసినవారు జీవితంలో స్థిరపడడానికి రెండు దారులున్నాయి. ఒకటి- సొంతంగా ప్రాక్టీస్‌ చేసుకోవచ్చు. ఉద్యోగానికి కూడా వెళ్లవచ్చు. ప్రాక్టీస్‌ పెట్టాలంటే ఈ ఆర్టికల్‌షిప్‌ ప్రాధాన్యం ఇంకా ఎక్కువ పెరుగుతుంది. అదే ఉద్యోగానికి వెళ్లాలంటే ఆర్టికల్‌షిప్‌లో నేర్చుకునే మెలకువలు చేయబోయే ఉద్యోగంలో ఉపయోగపడవచ్చు. కొన్ని సందర్భాల్లో ఉపయోగపడకపోవచ్చు. చాలా సందర్భాల్లో ఉద్యోగానికి వెళ్లినపుడు ఆ ఉద్యోగం ఇచ్చే సంస్థవారే 3- 6 నెలలపాటు శిక్షణనిస్తుంటారు.
2. ఆర్టికల్‌షిప్‌ను ఎలాంటి ఆడిట్‌ సంస్థలో అయినా చేయవచ్చు. ఎంచుకునే ఆడిట్‌ సంస్థనుబట్టి నేర్చుకునే నైపుణ్యం ఆధారపడి ఉంటుంది. చాలామంది పెద్ద ఆడిట్‌ సంస్థల్లో పనిచేస్తే లోకజ్ఞానం వస్తుందని ఆలోచిస్తారు. అది కొంతవరకూ నిజమే అయినప్పటికీ పెద్ద ఆడిట్‌ సంస్థల్లో విద్యార్థులతో అన్నిరకాల ఆడిట్‌లూ చేయించరు. దీనివల్ల అన్ని రకాల ఆడిట్‌ల గురించి తెలుసుకునే వీలుండదు. అదే మధ్యతరహా సంస్థల్లో అయితే అన్నిరకాల ఆడిట్‌లూ చేసే అవకాశాలు ఎక్కువ.
3. చిన్న సంస్థలు/ మధ్యతరహా ఆడిట్‌ సంస్థల్లో ఆర్టికల్‌షిప్‌ చేస్తే ప్రతి విద్యార్థీ అన్ని పనులు, రంగాల్లో అనుభవం సంపాదించే అవకాశముంది. ఆర్టికల్‌షిప్‌లో ఆడిట్‌ సంస్థవారు నేర్పించే దానికంటే కూడా విద్యార్థి మనసుపెట్టి నేర్చుకునేవే ఎక్కువ. ఈ ఆర్టికల్‌షిప్‌ సమయంలో రకరకాల ప్రదేశాలకు వెళ్లి వివిధ సంస్థల ఆడిట్లు చేయవలసి ఉంటుంది. అందుకని...
* ప్రయాణాలు చేయడానికి వెనకాడకూడదు. ఇలా క్లయింట్ల ఆఫీసులకు తిరుగుతూ పనిచేయడం భారంగా భావించకూడదు. చదువుతోపాటు ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ నేర్చుకోవడానికి చక్కని అవకాశంగా భావించాలి.
* దూసుకుపోయే తత్వాన్ని అలవరచుకోవాలి. ఆత్మన్యూనతా భావంతో తమకుతామే తక్కువవాళ్లం అనుకుంటే క్లయింట్‌ ఆఫీసులో ఆడిట్‌ కోసం వెళ్లి చేయాల్సిన రీతిలో చేయలేరు.
‘చదువుతూనే సంపాదన’ అనే సౌలభ్యం ఈ ఆర్టికల్‌షిప్‌లో ఉంటుంది. చేరిన ఆడిట్‌ సంస్థ విద్యార్థికి ఐసీఏఐ నిబంధనల ప్రకారం స్టైపెండ్‌ కూడా ఇస్తుంది. దీని ద్వారా తల్లిదండ్రులపై ఆధారపడకుండా చదువుకునే అవకాశం కలుగుతుంది. అంతేకాదు డబ్బు విలువ కూడా తెలుస్తుంది.

సలహాలు.. సూచనలు
* చాలామంది చేసే పొరపాటు.. ఆర్టికల్‌షిప్‌లోపడి కనీసం పుస్తకాలు తీయరు. ఈ రెండున్నర ఏళ్ళు పూర్తయిన తరువాత చివరి ఆరు నెలల్లో సీఏ ఫైనల్‌ పరీక్ష అవకాశం లభిస్తుంది. అటువంటి సమయంలో సాధారణంగా సీఏ ఫైనల్‌ పరీక్ష రాయకపోవడం, రాసినా విఫలమవడం జరుగుతుంది. అందుకని ఆర్టికల్‌షిప్‌ సమయంలోనే ఉదయం, సాయంత్రాలు తరగతులకు హాజరవుతూ సీఏ ఇన్‌స్టిట్యూట్‌ వారి పుస్తకాలను తీసుకుని పరీక్షకు సన్నద్ధమవాలి. సీఏ ఫైనల్‌ సబ్జెక్టులను ఆర్టికల్‌షిప్‌లోని మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం, చివరి ఆరు నెలల్లో సబ్జెక్టులను విభజించుకోవాలి. ప్రాక్టికల్‌ శిక్షణతోపాటు చదువుకోవడం కూడా పూర్తి చేసుకుంటేనే ఆర్టికల్‌షిప్‌, సీఏ ఫైనల్‌ రెండింటికీ సమాన ప్రాధాన్యం ఇచ్చినట్లవుతుంది. సమయం కూడా కలిసి వస్తుంది.
* కొందరు ఆర్టికల్‌షిప్‌ చేయకుండా తమకు తెలిసిన ఆడిటర్ల చేత చేసినట్లు సర్టిఫికెట్లు తీసుకుని కోర్సు పూర్తిచేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇలాచేస్తే ఆచరణాత్మక సమస్యలు, వాటిని ఎదుర్కొనే ఆలోచనావిధానం తెలియక సీఏ పాసయినా జీవితంలో రాణించే అవకాశం కోల్పోతున్నారు. కాబట్టి చదువుకు ఇచ్చినట్టుగానే ఆర్టికల్‌షిప్‌కీ అంతే ప్రాధాన్యం ఇవ్వాలి.
* ఆడిట్‌ సంస్థల్లో ఉన్న సౌకర్యాలు, భవంతులు, నగిషీలు... ఇలాంటివి చూసి కొంతమంది ఆయా సంస్థల్లో చేరాలని నిర్ణయం తీసుకుంటున్నారు. ఇక్కడ మనకు కావాల్సింది... చక్కగా పని నేర్పించేవారు. క్లయింట్లు, వృత్తి నైపుణ్యం, ఆ సంస్థలో చేరితే వచ్చే ఆడిట్‌ ఎక్స్‌పోజర్‌ ఏంటి అనే అంశాలకు ప్రాధాన్యమిస్తూ ఆడిట్‌ సంస్థను ఎంచుకోవాలి.
* ఏ ఆడిట్‌ సంస్థలో చేరాలనుకున్నారో దానిలోని సీనియర్లు, అప్పటికే ఆర్టికల్‌షిప్‌ చేస్తున్న విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి నిర్ణయం తీసుకోవడం మంచిది.
* ఆర్టికల్‌షిప్‌ కోసం చాలామంది ఇతర రాష్ట్రాలకు వెళ్లడం ఈ మధ్యకాలంలో కనిపిస్తోంది. ఇక్కడే చాలామంది విద్యార్థులు దిశ మరి తప్పటడుగులు వేస్తున్నారని చెప్పవచ్చు. తల్లిదండ్రులు దగ్గర లేకపోవడం, స్వేచ్ఛ లభించడంతో క్రమశిక్షణ తప్పే అవకాశం ఉంది. లక్ష్యం మరచిపోయి బయటి విషయాలకు ఆకర్షితులై చదువుకూ, ఆర్టికల్‌షిప్‌కూ న్యాయం చేయలేకపోతున్నారు.
* ఆర్టికల్‌షిప్‌ చేసే విద్యార్థులు తాము చేరిన ఆడిట్‌ సంస్థ నుంచి వేరే ఆడిట్‌ సంస్థకి మారడం ఒకప్పుడు సులభంగా ఉండేది. ఇప్పుడైతే ఐసీఏఐ కొన్ని నిబంధనలు విధించింది. అందుకే ముందుగానే సరైన సంస్థను ఎన్నుకోవాలి.

ఏయే ఉపయోగాలు?
* అప్పటివరకూ తరగతి గదిలో నేర్చుకున్న సబ్జెక్టు పరిజ్ఞానం ఆచరణాత్మకంగా ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకునే వీలుంటుంది.
* సీఏ కోర్సులోని సబ్జెక్టులపై లోతైన అవగాహన అవసరం. పూర్తి అవగాహన కలిగినవారు మాత్రమే తుది సీఏ ఫైనల్‌ పరీక్షలను చక్కగా రాసే వీలుంటుంది. ఈ ప్రాక్టికల్‌ శిక్షణతో ఈ అవగాహన ఏర్పడుతుంది.
* శిక్షణ తీసుకుంటున్న సంస్థలోని సహ విద్యార్థులు, సీనియర్లు, ప్రభుత్వ అధికారులు, ఆదాయపు పన్ను విభాగంవారు, లీగల్‌ అడ్వైజర్లు.. ఇలా అందరితో కలిసి పనిచేయడం మంచి అనుభవం. భావ వ్యక్తీకరణ నైపుణ్యాలను పెంపొందించుకునే అవకాశం ఉంటుంది.

గుర్తుంచుకోవాల్సినవి
ఆర్టికల్‌షిప్‌ చేసే సమయంలో శిక్షణనిచ్చే సంస్థ/ ఆడిట్‌ ఆఫీసువారు విద్యార్థులతో రకరకాల సంస్థల ఆడిట్‌ వర్క్‌ చేయిస్తారు. అపుడు ఈ అంశాలను నిశితంగా గమనించాలి.
* సంస్థకు సంబంధించిన పుస్తకాలను ఎలా తయారు చేస్తున్నారు?, సంస్థ వ్యాపార లావాదేవీలను ఎలా జరుపుతున్నారు? పరిశీలించాలి.
* వ్యాపార సంస్థకు సంబంధించిన వ్యాపార సూత్రాలు, మెలకువలను, వ్యాపార పద్ధతులను గమనించాలి.
* తయారీ సంస్థలైతే, వస్తు తయారీలోని వివిధ దశల గురించి తెలుసుకోవడం మేలు.
* సీఏ చేసే మొత్తం పని... ఉదా: అకౌంటింగ్‌ స్టాండర్డ్స్‌, ఆడిటింగ్‌ స్టాండర్డ్స్‌, టాక్స్‌ అమెండ్‌మెంట్స్‌ల గురించి అవగాహన పొందాలి.
కొన్ని పెద్ద ఆడిట్‌ సంస్థలు తమవద్ద ఆర్టికల్‌షిప్‌ చేయాలనుకునే విద్యార్థులకు మౌఖిక పరీక్షలను నిర్వహిస్తున్నాయి. అటువంటివాటికి వెళ్లాలనుకునేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
* ఇంటర్వ్యూకు వెళ్లేముందు సీఏ ఐపీసీసీలోని అన్ని సబ్జెక్టులను పునశ్చరణ చేసుకుని వెళ్లాలి.
* ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు సమాధానం తెలియకపోతే నిజాయతీగా తెలియదని చెప్పాలి. ఏదో ఒక సమాధానం చెప్పి మభ్యపెట్టకూడదు.
* ఇంటర్వ్యూకు వెళుతున్న ఆడిట్‌ సంస్థ పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడం మంచిది. ఇంటర్వ్యూలో తమ సంస్థపట్ల అభ్యర్థి అభిప్రాయాన్ని చెప్పమని అడగవచ్చు.
* సమాధానాలు చెప్పేటపుడు పనిచేయాలనుకున్న ఆడిట్‌ సంస్థ నియమ నిబంధనలకు లోబడి పనిచేస్తాననేలా సమాధానాలుండాలి.
గమనిక: సీఏ ఐపీసీసీ పూర్తిచేసిన విద్యార్థులు రెండు సంవత్సరాల ఆర్టికల్‌షిప్‌ పూర్తిచేశాక ఐసీఏఐ వారి గుర్తింపు పొందిన సంస్థల్లో పారిశ్రామిక శిక్షణ తీసుకునే అవకాశముంది.


Back..

Posted on 22-08-2016