Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
సీఏలకు అదనపు నైపుణ్యాలు!

సీఏ పూర్తి చేసినవారు పోస్ట్‌ క్వాలిఫికేషన్‌, సర్టిఫికేషన్‌ కోర్సులు కూడా చేస్తే ఈ పోటీ ప్రపంచంలో దూసుకువెళ్ళవచ్చు. ప్రపంచస్థాయి ప్రమాణాలకు దీటుగా ఎదగొచ్చు! అందుకే ‘ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా’ ఈ స్వల్పకాలిక కోర్సులను ప్రత్యేకంగా రూపొందించి అందిస్తోంది. ఆసక్తి, అభిరుచిని బట్టి వీటిలో కొన్ని పూర్తిచేసినా ఆ అదనపు అర్హతలూ, నైపుణ్యాలతో వివిధ సంస్థల్లో కీలక పాత్రలను పోషించగలుగుతారు!

ఇటీవలి కాలంలో చాలామంది విద్యార్థులు 21, 22 ఏళ్లకే సీఏ పూర్తిచేస్తున్నారు. వారు కొంత అదనపు సమయాన్ని కేటాయించి అదనపు అర్హతలు సాధించటంపై దృష్టిపెడితే ఎంతో మేలు జరుగుతుంది. ఈ కోర్సులను రెండు విభాగాలుగా అందిస్తున్నారు.
1. పోస్ట్‌ క్వాలిఫికేషన్‌ కోర్సులు,
2. సర్టిఫికేషన్‌ కోర్సులు.
ఈ కోర్సులకు ఏడాది పొడవునా రిజిస్ట్రేషన్‌ చేయించుకునే వీలుంది. నిర్ణీత సంఖ్యలో రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాక ఐసీఏఐ వారి నిర్దేశిత శాఖల్లో శిక్షణకు బ్యాచ్‌లను ప్రారంభిస్తారు. శిక్షణ పూర్తయ్యాక నిర్దేశిత తేదీల్లో పరీక్ష రాయాల్సివుంటుంది. ఉత్తీర్ణులకు సర్టిఫికెట్‌/ డిప్లొమా అందిస్తారు.

పోస్ట్‌ క్వాలిఫికేషన్‌ కోర్సులు
1. ఇన్సూరెన్స్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఆర్‌ఎం): బీమా రంగంలో సీఏలకు ప్రాముఖ్యం ఎక్కువ. ఇన్సూరెన్స్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ వంటి సబ్జెక్టుల పరిజ్ఞానమున్నవారికి బీమా రంగంలో అవకాశాలెక్కువ. పరిశ్రమ నిపుణుల అనుభవాలను తెలుసుకోవడానికి ఈ కోర్సు అనుసంధానకర్తగా వ్యవహరిస్తుంది.
శిక్షణ సమయం: 9 నెలలు.
ఉద్యోగావకాశాలు: కోర్సు పూర్తిచేసినవారికి ఇన్సూరెన్స్‌ బ్రోకింగ్‌, న్యూ ప్రొడక్ట్‌ అండ్‌ సర్వీస్‌ డిపార్ట్‌మెంట్‌, అండర్‌ రైటింగ్‌ సర్వీసెస్‌, క్లెయిమ్స్‌ మేనేజ్‌మెంట్‌, కమర్షియల్‌ రిస్క్స్‌, ఇన్సూరెన్స్‌ లిటిగేషన్‌ కేసెస్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, రీ ఇన్సూరెన్స్‌, క్లెయిమ్స్‌ ఆడిట్‌, ఇన్సూరెన్స్‌ మార్కెటింగ్‌ వంటి రంగాల్లో అవకాశాలుంటాయి.

2. ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ ఆడిటర్‌ (ఐఎస్‌ఏ): వివిధ వ్యాపారాల్లో ఐటీ వినియోగ విస్తృతి కారణంగా ఐఎస్‌ ఆడిట్‌లకు ప్రత్యేకించి స్టాట్యుటరీ ఆడిట్‌, బ్యాంక్‌ ఆడిట్‌, ఇంటర్నల్‌ ఆడిట్‌, కాంప్లియన్స్‌ ఆడిట్‌లకు ప్రాముఖ్యం పెరిగింది. సీఏ కోర్సు ద్వారా అలవడిన నైపుణ్యాలకు ఐటీ పరిజ్ఞానం తోడైతే ఐఎస్‌ ఆడిట్‌లో అన్ని రకాల అవకాశాలను అందుకోవచ్చు. ఉద్యోగంలోకానీ ప్రాక్టీస్‌లోకానీ స్థిరపడాలనుకునేవారు దీన్ని ఎంచుకోవచ్చు.
శిక్షణ సమయం: 6 నెలలు; కంటిన్యువస్‌ ప్రొఫెషనల్‌ ఎడ్యుకేషన్‌ (సీపీఈ)
గంటలు: 25. ఐసీఏఐ సభ్యత్వమున్న సీఏలందరూ ఐసీఏఐ వారు నిర్వహించే సీపీఈ తరగతులకు హాజరుకావాలి. ఈ ఐఎస్‌ఏ కోర్సు తరగతులకు హాజరయ్యేవారికి 25 సీపీఈ గంటలకు క్రెడిట్‌ లభిస్తుంది.
ఉద్యోగావకాశాలు: ఆడిటర్‌ హోదాలో సిస్టమ్‌ ఆడిట్‌, బ్యాంక్‌ ఆడిట్స్‌, కాంప్లియన్స్‌ ఆడిట్స్‌, ఇంటర్నల్‌ ఆడిట్స్‌, స్టేషనరీ ఆడిట్స్‌ చేయొచ్చు.

సర్టిఫికేషన్‌ కోర్సులు
ఆల్టర్నేటివ్‌ డిస్‌ప్యూట్‌ రిజల్యూషన్‌
వ్యాపార సంస్థల్లో ఏవైనా వివాదాలు తలెత్తినపుడు కోర్టులు, న్యాయమూర్తులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా సీఏలే వివాదాలను పరిష్కరిస్తుంటారు. ఈ ఏడీఆర్‌ యంత్రాంగం ద్వారా వివాదాల పరిష్కారం న్యాయస్థానాలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో వేగవంతంగా పూర్తవుతుంది.
శిక్షణ సమయం: 10 రోజులు; సీపీఈ గంటలు: 30.
ఉద్యోగావకాశాలు: సీఏలు తమ పరిజ్ఞానం, నైపుణ్యం, అనుభవం, సమతుల్య ఆలోచనా విధానాలను బట్టి ఆర్బిట్రేటర్లుగా, మీడియేటర్లుగా, కన్సిలియేటర్లుగా ఏడీఆర్‌ యంత్రాంగాన్ని అనుసరించి వివాదాలను పరిష్కరిస్తుంటారు. ఈ విధానాలపరంగా సీఏలకు అనేక ఉద్యోగావకాశాలున్నాయి.

జీఎస్‌టీ
పన్ను విధానంలో వస్తున్న నూతన సంస్కరణలు, ప్రతిపాదనల్లో వస్తున్న మార్పులపట్ల సీఏలకు పరిజ్ఞానాన్ని పెంచాలన్న ఉద్దేశంతో ఐసీఏఐ పరోక్ష పన్నుల కమిటీవారు ఈ సర్టిఫికేషన్‌ కోర్సును ప్రవేశపెట్టారు. పరిశ్రమలో ఉన్న ఐసీఏఐ సభ్యులందరికీ జీఎస్‌టీ విధానాలపట్ల తాజా పరిజ్ఞానం అందించటం దీని ముఖ్యోద్దేశం.
శిక్షణ సమయం: 10 రోజులు; సీపీఈ గంటలు: 30.
ఉద్యోగావకాశాలు: జీఎస్‌టీ స్పెషలిస్టులు, ప్రాక్ట్టీషనర్లుగా చక్కటి అవకాశాలుంటాయి.
ఉద్యోగావకాశాలు: ఆర్థిక సేవ, నిర్వహణ రంగాల్లో అవకాశాలుంటాయి.

- MSN మోహన్‌, మాస్టర్‌మైండ్స్‌

Back..

Posted on 08-10-2018